Previous Page Next Page 
యువత నవత పేజి 21

   
    "గొప్ప అభిప్రాయం బంగారంలాంటిది ఫ్రేం కట్టించి దాచుకొంటాను. శర్మ తొణక్కుండా చిరునవ్వుతో అన్నాడు.

    ఆ చిరునవ్వుకు ఇంకా కంపరమెత్తింది శాలినికి.

    "తరతరాలుగా ఆడదాన్ని అవిద్యలో! అంధకారంలో ఉంచి ఆమెని ఆమె కట్టుబానిసనుచేసి  ఆధిపత్యం చెలాయించారండీ మీమగవాళ్లు. ఆమెను ఎంత దారుణంగా అణచివేశారంటే మగడు పుటుక్కున ఛస్తే, మగడులేని జీవితం ఓ జీవితమేనా, అని, అతడితోపాటు చితిలోపడి తగలబడిపోతే సతి జన్మ తరిస్తుంది అనుకొనేంతగా అణచివేశారు. ఇప్పుడిప్పుడే ఆ చీకటి  తెరలు చీల్చుకొని బయటికి  వచ్చేస్తూంది. ఇదేమిటని అడుగడుగునా మిమ్మల్ని ప్రశ్నిస్తూంది. నిలవేస్తూంది. చైతన్యపు వెల్లువతో ఆదిశక్తిలా విరుచుకుపడుతున్న ఆమెనుచూసి మీ కోట బీటలు వారుతున్నదని బెంబేలు అయిపోతున్నారు. ఆమె మేథస్సునూ; తెలివితేటలనూ, చదువు సంధ్యలనూ ఒప్పకోడానికి ఇష్టం లేదు. అందుకే ఈ సంకుచితమైన విమర్శలు.    

    పెద్ద చప్పట్లవర్షం కురిసింది.

    ఆవేశంతో తనను తను మరిచి. కంఠస్వరం హెచ్చింది మాట్లాడుతున్న శాలిని చప్పట్ల చప్పుడికి ఉలిక్కిపడి చూసింది.

    స్టాఫ్ రూం అంతా టీచర్సుతో నిండిపోయివుంది.

    "శాలిని టీచరు శానా గరమ్ అయిపోయినార్ ఏమిటి?" అన్నాడు పి. టి. సారుఖాదర్ ఖాన్.

    "ఆడపిల్లలు రెవికల చాటున, కొంగుల చాటున చీటీలు పెట్టుకువచ్చి పరీక్షల్లో నఖల్ నడుపుతారని అన్నారు శర్మ సార్. ఇంకేముంది? యుద్దభేరి మ్రోగింది. ధనధనా బాణవర్షం కురిపించేసింది. బాణవర్షమా అది! బాంబులవర్షం!" చమత్కారంగా చెప్పాడు హరిగోపాల్.

    అందరూ ముసిముసిగా నవ్వారు తప్పఎవరూ ఎవరినిసైడ్ చేయలేదు.

    శర్మ అంటే చెప్పలేనంత కోపం నింపుకొంది శాలిని.

    ఇంటికి వచ్చాక సుధతో అంది. "మనిషి ఎంత అందంగా, హుందాగా వుంటే ఏం?" మనసు పట్టి సంకుచితం, పై మెరుగులు చూసి భ్రమిశాను. ఇవాళ నా భ్రమ తొలగిపోయింది."

    "ఎవరి సంగతి నువ్వు మాట్లాడేది?"

    "ఇంకెవరు? ఆ శర్మగాడే."

    "బాబోయ్! ఒక్కసారే అతడు "గాడ్" ఎలా అయ్యాడు?"

    "గాడ్ కాదు "గాడు" కసిగా ఒత్తి పలికింది గాడును,"

    "ఆటగాడు వేటగాడు పాడగాడన్నట్టు శర్మగాడన్నమాట."

    "హాస్యం చేయకు. నాకిప్పటికే ఒళ్లు మండిపోతూంది."

    "ఏదీ? ఎక్కడ? ఒక నిప్పురవ్వగాని, పిసరంత పొగగానీ కనిపించడంలేదు" శాలిని ఒంట్లో వెతుకుతున్నట్టుగా, చేతుల్తో తడమసాగింది.    

    "నిన్ను తంతాను."

    "ఇంతకీ ఏం జరిగింది భామామణీ!"

    "ఈ సంగతి విన్నావంటే ఇప్పుడే నువ్వు యుద్దానికి తయారైపోతావు. మన ఆడవాళ్లందరికీ పరువు నష్టం కలిగించే మాటన్నాడు." శర్మ ఏమన్నాడో చెప్పింది.

    "అంత మాటన్నాడా నీ హీరో? అయితే అతడిపని పట్టాల్సిందేయ వదలకూడదు నాలుగు రోజుల్లో ఆ ఊరు టూర్ ప్రోగ్రాం వేసుకువస్తాను, ఇద్దరం కలిసి అతడిని ఒక పట్టు పడదాం ఏం?"సుధ చిటికెవేస్తూ అంది.

        *    *    *    *    *
   
    తనని చూడగానే ముఖంలో అదోలాంటి మెరుపు నిండిపోగా చిరునవ్వుతో విష్ చేసే శాలిని నిన్నటి సంఘటన తరువాత కోపం, ఏవగింపు లాంటి భావం కళ్లలో కస్సుమన్నట్టుకాగా, విసురుగా ముఖం త్రిప్పేసుకొంటుంటే శర్మ మనసు చివుక్కుమంది. సరదాకి అంటే ఆవిడంత సీరియస్ గా తీసుకొంటుందనుకోలేదు.

    క్లాస్ లో పాఠం చెబుతున్నా మనసు శాలిని కోపాన్నే గుర్తు తెచ్చుకొని క్రుంగిపోతూంది. "ఉహూఁ!" లాభంలేదు. ఆవిడకు సారీ చెప్పి ఆవిడ ప్రసన్న వదనం చూసేదాకా ఈ  చింత దూరంకాదు! అనుకొన్నాడు.

    సాయంత్రం దాకా శాలిని ఒంటరిగా కలుసుకునేందుకు వీలుకాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS