"ఉహూ! ఇది సమయం కాదు. అవసరం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది! అంది.
"అంతవరకూ సస్పెన్స్ తప్పదంటావా?"
" నువ్వెలా అనుకున్నా ఫర్వాలేదు" నువ్వు నామాట విననా?" అడిగింది.
"రేపు ఉదయం చెప్తాను" అన్నాడతను ఏదో ఆలోచిస్తున్నట్టుగా
ఆమె ఆశగా చూసిందతనికేసి.
" నా మాట కాదనవన్న నమ్మకం నాకుంది రాం! అంది నందిని."
" చూద్దాం!" అతను అదోలా నవ్వాడు.
"థాంక్యూ, పద ఆకలి వేస్తోంది. భోజనం చేద్దాం!"
"ఒద్దు! ఆకలిమీద పడుకుంటే ఆలోచనలు చురుగ్గా పనిచేస్తాయి. ఇక నువ్వేళ్ళచ్చు మేడం!" అన్నాడు పరుశురాం.
"వెళతాను. లేకపోతే మంచాన్ని షేర్ చేసి నీ పక్కన పడుకొంటాననుకొన్నావా?" అని మంచం దిగి అతని చెంపల్ని సవరదీసి-
" గుడ్ నైట్!" అని వెళ్ళిపోయింది. ఆమె, ఒయ్యారంగా కదిలి వెళుతుంటే ఎలాగో కదులుతున్న ఆమె పిరుదుల కేసి చూస్తూ సిగరెట్ వెలిగించాడు పరుశురాం.
8
నందిని బెడ్ రూంలో కొచ్చాడు పరుశురాం.
డ్రసింగ్ టేబుల్ ముందు కూర్చుని మేకప్ చేసుకుంటోంది నందిని.
" మేడం! నేను వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను అన్నాడు."
పెదిమలకి లిప్ స్టిక్ వేసుకొంటున్న ఆమె గిర్రున వెనక్కి తిరిగింది.
పరుశురాం తిరిగి అన్నాడు.
"మన మధ్య ఏనాడో వున్న రుణం మనల్ని ఇలా కలిపింది మేడం!
బహూశా రుణం తీరిపోయిందనుకుంటాను."
ఆమె దిగులుగా చూసింది.
"ఎక్కడి కెళతావ్ రాం?" ఆమె గొంతు జీరపోయింది.
"గమ్యం తెలీదు.ఎక్కడికో....?"
అతని దగ్గరకొచ్చి భుజాలని గుచ్చి పట్టుకుంది నందిని.
"ఈ జనారణ్యం ఎంత భయంకరమైనదో నీకింకా తెలీదు రాం.
ఏ మనిషి అండలేకుండా తెలీని ఈ మహానగంరోల నువ్వు ఎలా బతగ్గలవ్?"
అతను బరువుగా నవ్వాడు.
"చదువుకున్న వాడిని. నేనే భయపడితే ఏమి లేని అనాధల సంగతి ఏమిటి మేడం?
అయినా నేనెవరో , నా వ్యక్తి గత జీవితం ఎలాంటితో తెలీక పోయినా ఆశ్రయమిచ్చి ఆదరించావు. సర్వభోగాలనీ రుచి చూపించావు.ఇదే జీవితాన్ని ,ఇవే భోగాలనీ నేను కోరుకోవడం లేదు. నేను నేనుగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను."
" కానీ ఈ సమాజంనిన్ను నిన్నుగా బతకనివ్వదు రాం."
" ఎందుకని? సమాజం అంత భయంకరమైనదా?"
" ఆమె పేలవంగా నవ్వింది.
"అనుభవంతో చెప్తున్నాను. వైకుంఠ పాళిలో సర్పాలు పావుల్ని మింగినట్టే నీలాంటి మనిషి వేసే ప్రతి ముందు అడుగు ఓ సుడిగుండాన్ని సృష్టిస్తుంది సమాజం.
ఆ సుడిగుండాలని నిన్ను కాపాడుకోవలేవు రాం!"
అతను పిచ్చివాడిలా నవ్వాడు.
"ఇల్లు విడిచిపోతున్న ఆడపిల్లని హెచ్చరించినట్టు హెచ్చరిస్తున్నావు మేడం. నేను ఆడపిల్లను కాను."
కానీ-
నేను ఎప్పుడో ఊహిలో కూరుకుపోయాను.
ఆ ఊబిలోంచి బయటపడతానో లేదో నాకు తెలీదు.
అయినా దేవుడు నాకు మొండి ధైర్యాన్ని చ్చాడు.
ధైర్య సాహసాలున్న వాడికి దేవుడి సాయం ఎప్పుడూ ఉంటుందని నా నమ్మకం.
సెలవు వెలతాను. మేడం!" అన్నాడతను.
అతని గొంతు బొంగురుపోయింది.
" వెళ్ళొస్తాను అనాలి రాం!"
అతను తలఅడ్డంగా వూపాడు.
"రాను" అని గబగబ అడుగులు బయటికి వేశాడు పరుశురాం.
గుమ్మంలో నిలబడి తోటలోనుంచి అతను వెళ్ళిపోతున్న వేపు దిగులుగా చూస్తోంది నందిని.
ఆమె కళ్ళని కారుమేఘాలు ఆవహిచగా నీరు సుడులు తరిగుతుండగా అతనొక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడని ఆశపడిందామె.
కానీ పరుశురాం వెనక్కి తిరిగి చూడలేదు.
అతను కాంపౌండ్ వాల్ గేటు దాటి బయటకు వెళ్ళిపోయాడు.
9
జేబులో కొద్ది డబ్బు మాత్రమే వుంది.
ఆడబ్బు రెండు రోజులు సరిపోవచ్చు. ఆతర్వాత?"
ఎవరూ తెలీని ఈ మహానగరంలో బతకాలంటే చిన్న పని ఏదన్నా దొరకాలి.ఎవరిస్తారు?
తనకెవరు తెలుసు?
ఎలాంటి పని తను చేయగలడు?
డిగ్రీ పూర్తికాలేదే తప్ప బొత్తిగా చదువులేనివాడు కాదు తను.
ఇరానీ హోటల్లో టీ త్రాగి ఇందిరా పార్కులోకి నడిచాడు.
