Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 21

 

"అసలీ పార్థు తను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక ముందు నుంచే రాజీనామా చేయాలని గోల మొదలెట్టాడు. తనేమన్నా పిచ్చోడా, కష్టపడి ఈ స్థాయికి చేరుకుని వీళ్ళు రెచ్చగొట్టగానే రాజీనామా చేయటానికి?"

కాఫీ తెచ్చిన వల్లి టీవీ వైపే చూస్తోంది ఆసక్తిగా. 

తనని గుర్తు పట్టిందేమో టీవీలో అని అనుమానం వచ్చింది సుధీర్ కి.

టీవీ ఆఫ్ చేసి ఆమెని అక్కడ నుంచి పంపేశాడు.

ఫోన్ లో నెట్ సర్ఫ్ చెయ్యసాగాడు. తన గురించి ఏమైనా న్యూస్ ఉందా...? ఆసక్తి గా వెతుకుతున్నాడు. 

ఒకసారి పదవి కీ, నలుగురూ తమని గొప్పగా చూడటానికి అలవాటు పడ్డవారు పైకి ఎంత కాదన్నా మంచికో, చెడుకో అందరి నోళ్ళ లో నానటానికే ఇష్టపడతారు.

రోజూ ఉండే న్యూసే. తను ఉన్నా లేకపోయినా ఎవరికీ తేడా రాలేదు. కొద్ది పాటి నిరాశ కలిగింది అతనికి. మళ్లీ సర్దుకున్నాడు. తనేగా కొన్నాళ్ళు గోప్యంగా ఉండాలనుకున్నాడు. ఇదే మంచిది.

***

రెండు రోజులు ఇంట్లో గడిపాక అతనికి విపరీతమైన బోర్ కొట్టసాగింది.  అజ్ఞాతం వీడిన తర్వాత ఏమి చేయాలనే విషయంపై కూడా అతనికి ఆలోచనలు ముందుకు సాగడం లేదు. బ్రెయిన్ డ్రైన్ అయినట్లుగా ఉంది.

కాసేపు బయట చల్లటి గాలిలో తిరిగి రావాలనిపించింది. ఎటూ తనని ఎవరూ గుర్తు పట్టరంది కదా లత.

సాయంత్రం ఆరవుతుండగా తలుపులు వేసి బయటకు నడిచాడు.

జేబుల్లో చేతులు పెట్టుకుని, తల మీదుగా మెడ చుట్టూ మఫ్లర్ వేసుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు.

నాలుగడుగులు వేశాడో లేదో వినిపించింది.

"ఒరేయ్"

"తననేనా?"

తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరీ ఒరేయ్ అని మొహం మీద ఎవరంటారు.

ఇంతలో వీపు మీద ఫెడెల్మని ఒక దెబ్బ పడింది.

వీపు చుర్రుమంటోంది. కోపంగా వెనక్కి తిరిగాడు.

"నేనురా. గుర్తు పట్టలేదా?" గట్టిగా తనని చుట్టుకుపోతున్నాడు ఒక మనిషి. 

గుండె గుభేల్మంది. వీడేవడో తనని గుర్తు పట్టాడా ఏమిటి?

రెండు చేతులతో అతని భుజాలు పట్టుకుని వెనక్కి జరిపి మొహం కేసి చూసాడు.

ఎవరో అర్ధం కాలేదు. 

బాగా అడ్డదిడ్డంగా పెరిగిపోయిన తెల్ల జుట్టు, పెద్ద పొట్ట, జిడ్డొడుతున్న మొహం, బవిరి గడ్డం, కొన్ని గుండీలు లేని షర్ట్, కింద బ్లూ, నలుపు గళ్ళ లుంగీ కట్టుకుని ఉన్నాడు.

తను గుర్తు పట్టలేదని అతను ఒకింత నిరాశ కి గురయినట్లున్నాడు.

"నేను రా కార్తీక్, రాముని. స్కూల్ లో కలిసి చదువుకున్నాం నాలుగేళ్లు. గుర్తు లేదా?" అడిగాడతను.

ఇతను కార్తీక్ వయసు వాడా? అంటే తన కంటే చిన్నవాడు. కానీ తమ కన్నా ఇరవయ్యేళ్లు పెద్దవాడు లా కనపడుతున్నాడు. 

అన్ని సౌకర్యాలు, మంచి ఆహారం, వైద్యం లభించటం తో తమ లాంటి వాళ్ళు ఇంకా చిన్నగా కనపడుతుంటే వీళ్ళు చిన్న వయసులోనే ముసలి వాళ్ళ లా తయారవుతున్నారు.

ఏదైతేనేం తనని గుర్తు పట్టలేదు. కార్తీక్ అనుకుంటున్నాడు. 

"ఇప్పుడు గుర్తొచ్చింది" ఇబ్బంది గా నవ్వి అన్నాడు సుధీర్.

మళ్లీ గట్టిగా మీద పడి కౌగిలించుకున్నాడు అతను. చెమట కంపు...ఏడుపొస్తోంది సుధీర్ కి.

తర్వాత వద్దంటున్నా సుధీర్ ని తన ఇంటికి లాక్కు వెళ్ళాడు రాము.

బయట అరుగు మీద ఒక ముసలావిడ కూర్చుని ఉంది.

"అమ్మా, కార్తీక్ వచ్చాడు" భుజం మీదున్న టవల్ తో మొహం తుడుచుకుంటూ చెప్పాడతను.

తేరిపార చూసిందామె.

"కార్తీక్ అంటే ముఖ్యమంత్రి సుధీర్ తమ్ముడేగా!" అడిగింది.

ఆమె 'ముఖ్యమంత్రి సుధీర్' అన్న మాటలకి అతని మనసు పులకించింది. కాస్త గర్వంగా తలూపాడు. 

"పేరుకి ముఖ్యమంత్రి. మన ఊరికి ఏమన్నా చేశాడా? వొట్టి దగుల్బాజీ వెధవ. ఈ ఊరు పిల్లని వాడికి ఇచ్చి దాని గొంతు కోశారు. నాశనం అవుతాడు వెధవ" ఆమె తిట్లు ప్రవాహం లా మొదలయ్యాయి.

"వీడేమి చేస్తాడమ్మా. వీడిని కూడా వాళ్ళ అన్న కేసుల్లో ఇరికించి నానా ఇబ్బంది పెట్టాదంటారు" ఆమెని ఆపుతూ అన్నాడు రాము.

"నిన్ను కూడానా? ఈ ఊరు పిల్లనిచ్చి దాని గొంతు కోశారు. ఉంచాడో, చంపేశాడో. ఎప్పుడో చిన్నప్పుడు చూసా...పెళ్లయి వెళ్ళాక మళ్లీ ఇంత వరకూ చూడలేదు" కొత్త కోణం తీసుకొచ్చింది ఆవిడ.

షాక్ తిన్నాడు సుధీర్.

"ఎంత క్రియేటివిటీ? క్షణాల్లో కథ అల్లేసింది ముసలావిడ. అమ్మో...ఈ ఊరి ఆడవాళ్ళు తక్కువ వాళ్ళా? చంపితే చావడానికి. గుడినీ, గుళ్ళో లింగాన్ని కలిపి మింగే రకాలు" కసిగా అనుకున్నాడు సుధీర్.

ఇంతలోకి రాము భార్య, పిల్లలు బయటికి రావటంతో ఆమె దండకానికి బ్రేక్ పడింది.

వాళ్ళని పరిచయం చేశాడు రాము అతనికి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS