నాకు భయం వల్ల కాదు కాని ఎందువల్లనో నిద్రపట్టలేదు. బహుశా ఎన్నడూ నేను ఊహించని క్రొత్త ప్రపంచాన్ని చూచిన థ్రిల్ వల్ల నిద్రపట్ట లేదనుకుంటాను.
సవరల గురించి ఆలోచిస్తూ పడుకున్నాను.
అర్ధరాత్రి అవుతుండగా ఆర్తనాదాలు వినిపించాయి. త్రుళ్ళి పడి లేచాడు దోళ బెహార . తలుపులు తీశాడు. చల్లని గాలి రివ్వున వచ్చి ముఖాన్ని తాకింది.
గాలికన్నా ముందుగా ఒక సవర యువతి దోళబెహరను త్రోసుకుని లోపలకు దూసుకుని వచ్చింది. ఆమె వెనుక చాలామంది సవరలు వచ్చారు అయితే వారంతా వాకిలి దగ్గరే నిలిచిపోయినారు.
లోపలకు వచ్చిన యువతి శరీరం నల్లగా, మొరటుగా వుంది . ఆమె చేతులలో ఒక పసి బిడ్డ కూడా వుంది. అయితే అప్పటికే అది మృతశిశువు. దాని శరీరమంతా రక్తంతో తడిసి ముద్ద అయివుంది.
కాళ్ళ మీదా, లేత తమలపాకులవంటి చేతుల మీదా, పసితనపు నిగారింపుతో మిసమిసలాడుతున్న ముఖం మీద లోతయిన పంటిగాట్లున్నాయి.
ఆ గాయాల నించి లేత రక్తం ఉబికి వొళ్ళంతా తడిసింది.
లోపలకు వచ్చిన యువతి రూపం చాలా భయంకరంగా వుంది. జుట్టు విరియ బోసుకుంది. నడుముకు బిగించిన చిన్ని మలిన వస్త్రం అస్తవ్యస్తమయిపోయింది. వక్షం అనాచ్చాదితంగా వుంది.
ఆమె చేను కట్టు నించి బహుశా బాలెంతరాలు అయి ఉండవచ్చునని నేను ఊహించాను. అయితే మృతశిశువు శరీరం మీది పంటిగాట్లు ఎలా వచ్చినాయి? ఆ యువతి నోరు ఎర్రగా రక్తంతో చారికలు కట్టిన కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
దోళబెహార ఆమె వంక బాధగా చూచినాడు. "కూనా! ఈసారి బిడ్డను కూడా పొట్టన పెట్టుకున్నావా?" అని అడిగాడు.
రక్తంతో అరుణాచింతమయిన నోరు గుహలా తెరచి ఆ యువతి చాలా భయంకరంగా అట్టహాసంగా నవ్వింది. మృత శిశువును మరోమారు పళ్ళతో బిగయపట్టి లాగింది.
శిశువు రోదించలేదు. కారణం అప్పటికే దాని అసువులు ఆ సాంతమయినాయి. ఉసురు లేని లేత పసికందు పాపం!
దొళబెహార తక్షణం తన కర్తవ్యాన్ని స్మరించాడు.
ఆమె చేతుల నించి మృత శిశువును లాగి బయట నిలిచిన సవరల వైపు విసిరేశాడు. వారు దాన్ని అందుకున్నారు.
యువతిని తాళ్ళతో బంధించి పులితోలు మీద విసిరేశాడు. తరువాత ఓ పెద్ద గొంగళీ తెచ్చి దాన్ని ఆమె మీద కప్పాడు.
ఆమె పెద్దగా అరుస్తోంది. అర్ధం లేని ఆర్తనాదాలూ -- పరలోకాల సరిహద్దులు త్రొక్కుతూ తన లోకాన్ని విడవలేని ప్రాణి పడుతున్న ఆర్తి, ఆవేదన నిండిన అరుపులు అవి.
దొళబెహార రవంతయినా లక్ష్య పెట్టలేదు.
"దొరకూనా! ఈరోజే ఇలా జరిగినందుకు నాకు బాధగానే వుంది. ఈ మాయదారి ఈవరకే తన కడుపు చించుకు పుట్టిన బిడ్డల్ని కొరికి చంపుకుంది.
ఆ సమయాల్లో నేను గూడానికి దూరంగా వుండటం నించి చికిత్స చేయలేకపోయాను. ఇప్పుడు సమయం కుదిరింది.
"దీన్ని ఆవేశించిన ప్రేతాత్మను వదిలిస్తాను."
ఈ భీకర దృశ్యాన్ని నీవు చూడలేవు. బయటకు వెళ్ళిపో" అన్నాడతను. నేను సంశయిస్తూ నిలిచాను.
"దొరా! ప్రేతాత్మలు మానవులతో ప్రత్యేక్ష సంబంధాలు లేకుండా విశాల విశ్వంతరాళంలో విహరిస్తాయని నేను విన్నాను. ప్రేతాత్మలను వదిలించే ఈ ప్రయోగం నేను చూడరాదా? అది రహస్యమయిన విషయమయితే నేను బయటకు వెళ్ళిపోతాను." అన్నాను.
అందుకు దొళబెహార రవంత సేపు ఆలోచించాడు. "నీవు చదువుకున్న దొరసానివి. లోకం తెలిసిన ఆడదానివి. యిక్కడే వుండు. తలుపు మాత్రం బిగించు. భయపడవని నాకు మాట ఇవ్వు" అంటూ ఒక చురికను తీశాడు దొళబెహర.
అలాగే అంటూ తలుపులు బిగించి ధైర్యాన్ని కూడదీసుకుని జరుగుతున్నదంతా శ్రద్దగా పరిశీలించసాగాను.
దొళబెహర చురికతో ప్రేతాత్మ ఆవేశించిన సవర యువతి తలపైన మధ్య భాగంలో బహుశా అది సహస్త్రారమని పిలువబడే చోటు అనుకుంటాను , అక్కడ గాయం చేశాడు.
రక్తం చిమ్మింది.
దొళబేహార యిహ నా గురించి రవంతయినా పటించుకోకుండా తన పని తాను చేసుకుకోవటం ప్రారంభించాడు.
తల గాయం మీద యేవో ఆకులూ పసరలు వేసి మర్ధించాడు. మరేవో కొన్ని పసరలు ఆమె చేత బలవంతంగా త్రాగించాడు. పెద్ద పెద్దగా అరుస్తూ ఏవో మంత్రాక్షరాలు వల్లించాడు.
అతడి తతంగం కొంతసేపు కొనసాగిన తరువాత సవర యువతి రెప్పలు బరువుగా వాలినాయి. కన్నులు నల్లపాపలు రెప్పల మాటున ఒదిగిపోయి తెల్ల గ్రుడ్డు మాత్రమే కన్పించింది భయంకరంగా.
ఆమె ఆ స్థితికి వచ్చాక ఆమె అరికాళ్ళలోనూ, అరి చేతుల్లోనూ, గోళ్ళ దగ్గరా సన్నని ఇనుప ఊచల్ని గ్రుచ్చి ఆమె బాధతో మెలికలు తిరిగిపోయేలా చేశాడు దొళబేహార.
ఈ యమ యాతనలన్నీ పడిన తరువాత ఆమె నోటనించి నురుగు రావటం ప్రారంభమయింది. అతని చర్యలను ఆమెలో ప్రతిస్పందన కన్పించటం ఆరంభమయింది.
అతడు వెలుగుతున్న ఆముదం దీపంలో ఒక ఇనుప ఉచాను ఎర్రపడేలా కాల్చాడు. ఆ తరువాత ఆమె కూర్చునేలా చేసి నిండుగా గొంగళి కప్పాడు. ఆ గొంగళి లో తాను కూడా దూరిపోయినాడు. రెండు క్షణాల తరువాత ఆమె కెవ్వుమని అరవటం విన్పించింది. అతడు దుప్పటిని తొలగించినాడు.
యోగశాస్త్ర విషయాలకు మొరటు పద్దతిలో చెప్పిన నిర్వచనం లాంటి చికిత్స అది. మూలాధారం నించి సహస్రారం వరకు షట్చక్రా లుంటాయి. బ్రహ్మనాడికి ఇరువైపులా ఇడపింగళ నాడులుంటాయి. మణిపూర చక్రానికి ప్రాంత దేశంలో అనగా నాభికి పొత్తికడుపుకు మధ్యన సరస్వతీ నాడి వుంటుంది. దానిలో సుప్త సర్పాకృతిలో వుంటుంది కుండలినీ శక్తి.
దాన్ని ప్రేరేపించటం ప్రాణాయామంలో కుంభకం ద్వారా సూక్ష్మికరించిన వాయు శక్తి వల్ల సాధ్యమవుతుంది. కుండలిశక్తి జాగృతం అయాక శరీరానికి, మనసుకు అనేక దైవిక శక్తులు లభిస్తాయి.
క్షుద్రశక్తుల ప్రభావం శరీరాన్ని విడిచి పోతుంది.
యోగ శక్తి ద్వారా మేల్కొల్పవలసిన కుండలినీ శక్తిని ప్రేరేపించి జాగృతి పొందేలా చేయటానికి కొన్ని క్షుద్ర విద్యల సంబంధమయిన అడ్డుదారులున్నాయి.
సహస్రారాన్ని గాయపరచిన దొళబేహార మూలాధారానికి చురక తగిలించినాడని అర్ధమయింది. అంతటితో ఒక లిప్త కాలం పాటు ఆమెలో దైవికమయిన కుండలినీ శక్తి స్పందించింది. రాజబాట లాంటి యోగం ద్వారా దాన్ని జాగృతం చేసి యిష్టం వచ్చిన దిక్కున నడిపిస్తారు. అరుదైన యోగ విద్యావిదులు. వారికి అనంతమయిన శక్తి లభిస్తుంది.
కాని ఈ విద్యలో ప్రయోజనం దానిలో సూక్ష్మతి సూక్ష్మమయిన ఒక అల్పాంశమే! అంత మాత్రానికే ఆమెలోని క్షుద్ర శక్తుల నీడ మటుమాయమయింది.
అ గది అంతా ఒక్కసారిగా కనులు మిరుమిట్లు గొల్పే కాంతితో నిండిపోయిందా అన్న భ్రాంతి కలిగింది. లిప్త లో కొద్ది భాగం భూకంపనం జరిగిందా అన్నట్లూ అనిపించింది.
