ఆపదల కోసం దాచుకున్న డబ్బు అది.
"ఇంకేమీ లేవా?"
"ఇచ్చినంతవరకూ చాల్లే వెళ్లిరా!"
అతడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. హోటల్స్ తెరిచే ఉన్నాయి. షాపులు ఇంకా తెరుస్తున్నారు.
హోటల్ కి వెళ్ళి టిఫిన్ పూర్తీ చేశాడు. పదిహేను రూపాయలు మిగిలాయి. ఓ సిగరెట్ పాకెట్ కొన్నాడు.
పాన్ షాపులో పాడ్ మీద వరుసగా క్లిప్ చేసి ఉన్న టికెట్స్ నవవదువుల్లా కన్పించాయి. కన్ను గీటి ఆహ్వానిస్తున్నాయి.
అందంగా క్రొత్తవిగా మెరిసిపోతున్న ఆ టికెట్స్ చూసి అతనికి మతిపోయింది. ఒంటి మీద తెలివి తప్పింది.
అతని చూపులు వాటి మీదికి పోవటం గమనించాడు షాప్ వాలా!
"తీసుకోండి సార్! రాజస్థాన్ లాటరీ! ఫేప్టీ ప్రయిజ్స్ పెంచారు. రెండు లక్షలు! ఈ వారంలోనే డ్రా!"
"ప్రయిజ్ ఎంత , రెండు లక్షలా! ఎన్ని సిరీస్!"
"పది సిరీస్! ప్రయిజ్ లు దగ్గరలో వాళ్ళకి రావు సార్! దూరం వాళ్ళకే వస్తాయి. రాజస్థాన్ మనకి దూరం కదా!"
"అవును . దూరం దూరం. చాలా దూరం! మూడు టికెట్లివ్వు"
పది రూపాయల నోటు అందించాడు. మూడు టికెట్స్ మరో రూపాయి తిరిగి యిచ్చాడు షాపు వాలా.
తీసుకోకపొతే ఎలా? ఈ వారం చివరలో డ్రా! ఈలోగా జీతం రాదు. చేస్తోంది ఎస్.బి. ఐ లో అటెండరు ఉద్యోగం అయినా కనీసం నెలకి అయిదు వందలు టికెట్స్ తీసుకోవటానికే కావాలి.
ఏమో! కొంటూ ఉంటె ఎప్పటికో అదృష్టం కలసి రావచ్చు. అప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళందరూ నోళ్ళు తెరుస్తారు.
కార్లు, బంగ్లాలు , విమానాలు! ఈ అటెండర్ ఉద్యోగంలో యిలా మగ్గిపోవటం ఎన్నాళ్ళు? ఎందుకు ప్రయత్నించకూడదు.
అదృష్టాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదు.
మళ్ళీ రోడ్ మీదికి వచ్చాడు. తన దగ్గర రెండు రూపాయలు మాత్రం మిగిలాయి. వీటితో ఏం చెయ్యాలి?
పాలు చాలని పాపాయి గుక్కపెట్టి రోదించటం చెవుల్లో మార్మోగుతోంది.
లాటరీ టికెట్స్ కొన్న తరువాత అతనికి జీవితంలో అవసరాలన్నీ తీరినట్లుగా తృప్తిగా వుంది.
మెదడు పని చేస్తోంది. తన తోటి అటెండరు నెలకి ఎనిమిది వందల రూపాయలు లాటరీ టికెట్స్ కొంటున్నాడు. తను కొంటోంది అయిదు వందలే! అతనికి ముందుగా వస్తుందా లాటరీ?!
ఏమో! త్వరత్వరగా నడుస్తున్నాడు.
పాలడబ్బా కొనేందుకు డబ్బు ఎలా? అతని మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. యా వైపుగా నడిచాడు.
ఖరీదయిన షాంపుతో తలంటుకుని కొత్త చీర కట్టుకుని ఫాన్ కింద కూర్చుని ఉంది షీనా!
ఆమె కన్నులు కడిగిన ముత్యాల్లా ఉన్నాయి. ముఖం వికసించిన మందారంలా ఉంది. టి.వి లో వస్తున్న ప్రోగ్రాం వంక విసుగ్గా చూసింది.
వి.సి.పి అన్ చేసి బ్రేక్ డాన్స్ పెట్టుకుంది.
ఆ డాన్సు ఎంత బాగుటుందో! వాళ్ళ ఎముకలు రబ్బరతో తయారవుతాయా? అలా డాన్సు చేయటం పస్తే ఎంత బావుండును ఎందుకు చేయకూడదు. ట్రై చేస్తే ఏమయినా చెయ్యొచ్చు.
తనకి యిలా బ్యాంక్ లో ఉద్యోగం వస్తుందని ఎవరయినా కలగన్నారా?
ఆ యింటి కంతటికీ ఒంటరి ప్రాణి! బ్రహ్మచారిణి! ఉద్యోగిని ఉదయం సమయాన్ని ఊహల్లో తెల్చేస్తోంది.
మద్య మధ్య తల ఎత్తి సోఫాకి ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని యిష్టంగా చూసుకుంటోంది.
అందంగా పుట్టటం ఓ అదృష్టం . అది అందరికీ వస్తుందా!
ఊహల డోలికల్లో తేలిపోతోంది షీనా.
"అమ్మాయిగారూ నమస్కారం" అంటూ వచ్చాడు అటెండర్.
"ఇవాళ పెందలాడే దయ చేశారేంటి?" ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటూ ఆరిపోయిన జుట్టుకి అందంగా పిన్నులు అమర్చుతోంది.
"మీతో పనుండే వచ్చానండీ"
"నావల్ల అయ్యే పనులే మున్నాయి"
"అదేంటండీ . అలాగంటారెంటి."
"ఆడపిల్లని కదా. ఒంటరిదాన్ని. నేనేం చెయ్యగలనంటావు."
"అలాగనకూడదమ్మాయి గారూ. ఆడోళ్ళదే కదండీ రాజ్యమంతా మగాళ్ళ పెత్తనం చేసే రోజులు కావు కదా."
"ఎంతయినా మగవాళ్ళు బలవంతులు కదా"
"మా బలం మీకుంటే మీ బలం మీకుంటుందండీ. ఆడాళ్ళు ఎదురు తిరిగితే మగాళ్ళు గెలవలేరు కదండీ. మీరు రాజ్యాలు చేస్తున్నారు. కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లున్నారు.
అన్నిట్లినూ ఆడాళ్ళే కదా ఫస్టు." భార్య దగ్గర యిచ్చిన స్టేట్ మెంట్ కి పూర్తిగా నెగటివ్ యిచ్చాడు . అవసరం అలాంటిది.
షీనాకి ఈ మాటలు బాగా నచ్చాయి. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పొగిడేవాళ్ళు కావాలి.
అటెండర్ వస్తూనే పొగడ్తలు ప్రారంభించటంతో మరింత సంతోషంగా వుంది. లేచి నిలబడి మరోసారి తన అందాన్ని అద్దంలో చూచుకుంది. యింత అందాన్ని అనుభవించబోయే రాజకుమారుడు ఎవరో! అనుకుంది.
"కూర్చో టిఫిన్ చేశాను. తిందువు కాని" అంది.
గాలి అనుకూలంగానే ఉందని గ్రహించాడు అటెండరు!
"టిఫిన్ చేశానండీ"
"కాఫీ యివ్వనా?"
"అది కూడా పూర్తయిందండీ"
"ఇంటి దగ్గర పనులేమీ లేవా?"
"ఎందుకు లేవండి. నిద్రలేచింది మొదలు ఆఫీసుకు రాబోయే వరకూ చాకిరీ చేస్తానండి! మళ్ళీ ఆఫీసు నించి పోయాక రాత్రి తొమ్మిది అయిందాకా చాకిరీయే కదండీ"
"ఏం చేస్తావు అంతసేపూ!"
"యింటి పనులూ బయట పనులూ ఊపిరాడవండీ"
"జీతం వస్తోంది కదా! అంత కష్టపడటం ఎందుకు? బీరువా తెరిచి నక్లెస్ తీసుకుంది.
"ఎందుకేటండీ! మీకు తెలియదు కాని సంసారం అన్నాక యెన్ని భాధలు?"
"ఎంతమంది పిల్లలు? అద్దంలో చూచుకుంటూ నెక్లెస్ మెడకు అమర్చుకుంది. మెడ త్రిప్పుతూ అన్ని యాంగిల్స్ లో చూచుకుంది.
"ఒకటే నలుసు! పాలు తాగుతుంది."
"మరి అంత ఖర్చులేమున్నాయి"
"మా యింటి ఆడదానికి మొదట్నించి ఖర్చులు పెట్టటం బాగా అలవాటు. నా జీతం పది రోజులకి రాదు."
"అలాంటి పెళ్ళాంతో యెలా వేగుతున్నావయ్యా బాబూ? యియర్ డ్రాప్స్ అమర్చుకోంటుంది. చూపులు అద్దం మీదే వున్నాయి.
"ఏం చెయ్యనండి. నా అదృష్టం అది. అమ్మాయి గారూ! అనక్లేస్ ఎంతయిందండీ ?" అమాయికంగా అడిగాడు.
"పన్నెండు వేలు ! ఏం మీ ఆవిడకి కొని పెడతావా?"
"దూ! నాయాల్ది! అలాంటి వొస్తువులు మీలాంటి బంగారుబొమ్మ కుండాలి గాని మా కేందుకండి! ఎక్కడుండేది అక్కడుంటనే దాని అందం! ఆ నెక్లెస్ చూడండి! అహ!
మీ మేడలో ఉంటే ఎంత అందంగా ఉందొ! అది నా పెళ్ళాం మెడలో ఉంటే దానందం కూడా తీసికట్టే కదండీ!" అన్నాడు.
షీనా చాల అనుగ్రహంతో అందంగా చూచింది.
