Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 21

 

    "డాక్టర్ గారూ! మా తల్లి గారి కోరిక నెరవేర్చడానికి నేను సిద్దంగా ఉన్నాను." సాగర్ మంత్ర ముగ్దుడిలా డాక్టర్ ముందు నిలబడి అన్నాడు.
    "వెల్! ఐ యామ్ గ్లాడ్! ఆ మాట మీ నాన్నగారితో చెప్పు. అయన ఆనందిస్తాడు" అంటూ డాక్టర్ సుభద్రమ్మ గదిలోకి దారి తీశాడు. అతడి వెనకే సాగర్ నడిచాడు. సుభద్రమ్మ మంచం మీద కళ్ళు అరమూతలు వేసి పడుకొని ఉన్నది. తల దగ్గర సాంబశివరావు కుర్చుని ఉన్నాడు.
    "అమ్మా!" అంటూ సాగర్ తల్లి ముఖంలోకి వంగి చూశాడు.
    "సాగర్! డోంట్ డిస్టర్బ్ హర్! ఇంతకూ ముందే మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. ఆమెను నిద్రపోనీ" అన్నాడు డాక్టర్. సాంబశివరావుని చూసి "మీరు కూడా బయటకు రండి!" అన్నాడు. డాక్టర్ తో పాటు తండ్రీ కొడుకు లిద్దరూ గదిలో నుంచి బయటకీ వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు.
    "సాగర్ ఊ నీ నిర్ణయమేమిటో మీ నాన్నగారితో చెప్పు! ఇంకా ఆలస్యమెందుకు?" అన్నాడు డాక్టర్.
    "మీ ఇష్ట ప్రకారమే కానియ్యండి! కానీ ......." సాగర్ నీళ్ళు నములుతున్నాడు .
    "కానీ అంటున్నావ్? ఏమిటి సందేహం?" డాక్టర్ సాగర్ ను అడిగాడు.
    "మాధవి ఆరోగ్యం బాగోలేదు , డాక్టర్! ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా?"
    "మాధవి ఆరోగ్యానికి నీ పెళ్ళికి సంబంధం ఏమిటి?" సాంబశివరావు కొడుకు ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
    "పెళ్ళంటూ చేసుకోవడం జరిగితే మాధవినే చేసుకుంటాను నేను మాధవిని ప్రేమిస్తున్నాను." ఖచ్చితంగా చెప్పాడు సాగర్.
    డాక్టర్ నెత్తిన పిడుగు పడినట్టయింది! సాంబశివరావుకు కళ్ళెర్ర బడ్డాయి.
    "నీ పెళ్ళి జరిగేది డాక్టర్ గారమ్మయి సుజాత తో - కానీ ఆ పిచ్చిదానితో కాదు!"
    "నాన్నా!"
    "మనం డాక్టర్ గారికి ఏంతో రుణపడి వుంటాం! మనతో సంబంధం కలుపుకోవడానికి అయన అంగీకరించారు. అది మన అదృష్టం. మా ఇద్దరి నిర్ణయం అయిపొయింది. మీ అమ్మ బ్రతికుండగానే యీ పెళ్ళి జరగాలి! వారం పదిరోజుల్లోపున అయిపోవాలి! దీనికి తిరుగు లేదు తెలిసిందా?"
    "నాన్నా నే చెప్పేది కూడా కొంచెం వినండి."
    "నువ్వు  చెప్పవలసిందేమీ లేదు! నేను వినవలసిందంతకన్నా లేదు" సాంబశివరావు మాటల్లో వాడీ వేడీ వుంది.
    "నాన్నా! నా ఇష్టా , ఇష్టాలతో మీకు సంబంధం లేదా? పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నేను! నా అభిప్రాయం తెలుసుకోకుండా మీరెలా నిర్ణయిస్తారు? ఇది దారుణం." ఇలాంటి మాటలు సినిమాల్లో విన్నాడు. నవలలో చదివాడు కానీ ఒక్క మాట కూడా అనలేకపోయాడు సాగర్. విసురుగా లేచాడు. బయటికి వెళ్ళి పోతుండగా , తండ్రి అడ్డుకొని "సాగర్! అగు!" అంటూ గట్టిగా అరిచాడు. ఆగి నిలిచాడు సాగర్. వెనక్కు తిరక్కుండా అలాగే తండ్రికి వీపు చూపిస్తూ నిలిచాడు. సాంబశివరావు మాట పడిపోయినట్టయింది. కోపంతో ఊగిపోతూ నిలబడ్డాడు. తండ్రి నుంచి ఏ మాట రాకపోయేసరికి సాగర్ అడుగు ముందుకు వేశాడు.
    "సాగర్! అగు!" ఇది తండ్రి గొంతు కాదు. డాక్టర్ మూర్తిది. సాగర్ గిర్రున డాక్టర్ వైపు తిరిగాడు.
    "మీ తల్లి గారి కోరిక?"
    "తప్పకుండా తీరుస్తాను! ఆమె బ్రతికుండగానే పెళ్ళి చేసుకుంటాను."
    "ఎవరిని? మాధవినా?" తండ్రి నిప్పులు కురిపించాడు.
    "అవును, మాధవినే! ఆ పిచ్చిదాన్నే పెళ్ళి చేసుకుంటాను!" సాగర్ అన్నాడు.
    "అందుకు జడ్జి రామనాధంగారు ఒప్పుకొవాలిగా?" బయటికి కనపడని పక్కవాటు పోలీసు దెబ్బ తీసాడు తండ్రి.
    "ఒప్పించగలను!" గుండెల మీద తన్ని నట్లన్నాడు తనయుడు.
    "అయన ఒప్పుకోకపోతే ?" డాక్టర్ మధ్యలో అందుకున్నాడు.
    "మరీ మంచిది! మా పెళ్ళికి ఎవరి అంగీకారమూ అవసరం లేదు. మైనారిటీ తీరినవాళ్ళం. మాకు పూర్తి స్వేచ్చ వున్నదని న్యాయమూర్తి రామానాధం గారికి, పోలీసు ఆఫీసర్ సాంబశివరావు గారికి తెలుసు. మా పెళ్ళిని ఆపే అధికారం వాళ్ళకు లేదని తెలుసు. డాక్టరు గారికి బహుశ తెలియదేమో?"
    "డాక్టరుగా నాకు తెలిసింది చెప్పమంటావా? మతి చలించిన మనిషి మైనర్ అయినా మేజర్ అయినా ఒకటే! మాధవికి మతి చలించిందని సర్టిఫికేట్ ఇచ్చేది నేను. కేసు పెట్టేది డి.యస్పి. సాంబశివరావు. విచారణ జరిపేది జడ్జి రామనాధం గారూ! ఇప్పుడు చెప్పు మాధవిని ఎలా పెళ్ళి చేసుకుంటావో?"
    డాక్టర్ మూర్తి మాటలు తొలకరి ఉరుముల్లా సాగర్ బుర్రలో మ్రోగాయి.
    సాగర్ కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. ఏమిటీ ఘోరం? జిల్లా మెడికల్ ఆఫీసర్, జిల్లా పోలీసు అధికారి , జిల్లా జడ్జి త్రిముర్తుల్లా ప్రజా క్షేమాన్ని చూడవలసిన వాళ్ళు ఇలా తయారయ్యారేం? జిల్లా జడ్జి రామనాధం గారు వీళ్ళతో చేతులు కలుపుతాడా? అసంభవం. తన కూతురు మాధవి శ్రేయస్సు కోసం అయిన వీళ్ళను ఎదిరించడా? డాక్టర్ అలా మాట్లాడుతుంటే తన తండ్రి బెల్లం కొట్టిన రాయిలా నోరు మెదపడెం? తన మీద ప్రోసిక్యుషన్ నడిపిస్తాడా? ఆయనకు కావలసింది త్వరలో తను పెళ్ళి చేసుకోవడమే కదా? మాధవిని చేసుకోవద్దనే అభ్యంతరం కానీ, సుజాతను చేసుకోవాలనే పట్టుదల కాని ఇంతవరకు ఆయనకు లేవు. కానీ ఈ డాక్టరే -- ఆలోచించిన కొద్ది చిక్కిన ఈగలా అయిపోయాడు. అతని చూపులు తెలిపోసాగాయి. తండ్రి కేసి నిస్సహాయంగా చూశాడు.
    "సాగర్! డాక్టరు గారు నీ మేలు కోరే చెబుతున్నారు. మన కుటుంబ శ్రేయోభిలాషి కాబట్టి ఇంత చొరవ తీసుకున్నాడు. సుజాతను నీ కివ్వటానికి అయన అంగీకరించడానికి కారణం కూడా మా స్నేహాన్ని బంధుత్వంగా పెంచుకోవాలనే ఉద్దేశ్యం'తోనే. మాధవి మాములు పిల్లయితే నువ్వు వివాహం చేసుకోవటానికి మాకెవ్వరికీ అభ్యంతరం లేదు. నిన్నటివరకూ ఆయనకు ఆ ఉద్దేశ్యమే లేదు. నేనే వారిని ప్రాధేయపడ్డాను. ఆ పిచ్చిదాని మైకంలో పడి నువ్వు ఇప్పటికే సగం పిచ్చి వాడివయ్యావు. మాకు నిన్ను దక్కించమని డాక్టరు గార్ని అర్ధించాను. డాక్టర్ ఎంతో త్యాగం చేస్తున్నారనే చెప్పాలి. నాకోసం, మన కుటుంబం కోసం సుజాతను నీకివ్వటానికి అంగీకరించారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయ్. మాధవిని నువ్వు పెళ్ళి చేసుకోవడం అసంభవం. ఆ సంగతి తెలియజేయడానికే డాక్టరు గారు కొంచెం కటువుగా చెప్పారు. సుజాతను చేసుకుంటావో లేదో తేల్చి చెప్పు. చావుబ్రతుల మధ్య ఉన్న నీ తల్లి ముఖం చూసి చెప్పు!" సాంబశివరావు కోపంతో వణికిపోతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS