"ఎవరు చెప్పారు?"
"రచ్చబండ దగ్గర అందరూ అనుకుంటున్నారు"
"ఉండండి చూస్తాను" అని పెరటివైపుకి తిరిగి "వెంకూ!" అంది మంగమాంబ.
"వస్తున్నా!" అంటూ పూలబుట్టతో లోపలికి వచ్చింది వెంకమాంబ.
కృష్ణయార్యుడు నివ్వెరపోయాడు. ఊళ్ళోవాళ్ళంతా అబద్ధాలాడారా? అబద్దాలాడటానికి వాళ్ళకేంపని
"ఎందుకమ్మా పిలిచావు?" ఎంతో వినయంగా అడిగింది.
"ఊరికే! ఏం చేస్తున్నావో?" అని.
"నీకు తెలుసుగా! పూలుకోస్తున్నానని. వెడతాను, ఇంకా ఉన్నాయి" తుర్రుమంది తోటలోకి.
"మీ అనుమానం తీరిందా?" అంటూ వంటింట్లోకి వెళ్ళింది మంగమాంబ.
ఆ సమయానికి -
"ఆడెనే! కృష్ణుఁ - డాడెనే!
పాడుచు నా గో - పకులందరు తన
వేడుక చూడగ - వింతగ నగుచూ ||ఆడెనే||
తతకిట తకఝుం - తధిమిధిమిత యని
గతులు చొల్లు లతు - లితముగ మెఱయా ||ఆడెనే||
అలరుచు చిరుగ - గజ్జెలు, నూపురములు
ఘలు ఘలు ఘలు ఘలు - ఘ ల్లని మ్రోయా ||ఆడెనే||
ధాణు ధణం ధణు - ధణిత యనుచు గీ
ర్వాణులు నభమున - వరుసగఁ బొగడా || ఆడెనే||
మణిభూషణములు - మఱి మఱి కదలగ
ఘణ ఘణ యని మొల - ఘంటలు మొరయా ||ఆడెనే||
తారి తాకిణ ఝం - తకకిణ తక ఝం
తారి తకిట తక - తాతై యనుచూ ||ఆడెనే||
వర తరిగొండ ని - వాసుడు వేంకట
గిరి నిలయుండగు - కృష్ణుఁడు చెలఁగీ ||ఆడెనే||
అంటూ గుడిలో నృత్యం చేస్తున్న వెంకమాంబకి, తన నృత్యాన్ని చూస్తూ మధ్యమధ్యలో తనతో అడుగులు వేసే తన మిత్రుడు కనపడలేదు. అంతే! నృత్యం చేయాలనిపించలేదు. ఆపి ఇంటి ముఖం పట్టింది. మొగసాల దగ్గిరే వెంకమాంబకి తనలాగే ఉన్న అమ్మాయి కనిపించి "త్వరగా ఇంటికి వెళ్ళు మిత్రమా! అమ్మా నాన్న నీ కోసం కంగారు పడుతుంటే నీ బదులు నేను వెళ్ళి పూలుకోస్తున్నావని చెప్పాను. పూలు ఇవిగో!" అంది. గొంతువిని గుర్తుపట్టింది తన స్నేహితుడిని. "ఇందుకా అక్కడ మాయమయ్యావు?" అంటూ పూలబుట్ట తీసుకుని లోపలికి వెళ్ళింది.
కృష్ణయ్యకి మనసులో సందేహం అలాగే ఉంది. అందరూ ఎందుకు అబద్ధం చెపుతారు? అని, మళ్ళీ రచ్చబండ దగ్గిరికి వెళ్ళాడు. ప్రత్యేకంగా అడిగినట్టుకాక యథాలాపంగా మాటలలో రాబట్టిన విషయం - వెంకమాంబ నరసింహస్వామి గుడిలో నృత్యం చేసిందనే. సీత కనబడితే అడిగాడు,
"ఎక్కడినుంచి?" అని
"గుడినుంచి" అంది సీత
"అక్కడ మా వెంకుఉందా?" అడిగాడు.
"ఉంది. ఎంత బాగా నాట్యం చేస్తోందో తెలుసా! నువ్వూవెళ్ళి చూడు మామయ్యా!" అంది సీత.
"నిజంగా?" అడిగాడు కృష్ణయ్య.
"నిజ్జంగా! ఒట్టు! ఎంతబాగా నాట్యం చేస్తుందో?"
"సరేలే! నువ్వెళ్ళు" అని ఇంటిముఖం పట్టాడు.
ఇంట్లో పూలుమాల కడుతూ తాతగారితో ముచ్చటలాడుతోంది వెంకమాంబ.
* * *
సీత పెద్దక్కకి పురుడొచ్చి ఇరవై రోజులైంది. ఇరవై ఒకటో రోజు బారసాల అనుకుంటున్నారు. హఠాత్తుగా పసిబిడ్డ బిర్రబిగిసి పోయాడుట. అందరూ కంగారు పడుతున్నారు. పూజారిగారిని నరసింహస్వామిని అర్చించి, తీర్థం ఇయ్యమని అడగటానికి సీతని గుడికి పంపారు. పూజారితో సీత మాట్లాడం విన్న వెంకమాంబ
"సీతా! కొడుకు పుడితే స్వామి పేరు పెట్టుకుంటామని మొక్కుకుని, ఇప్పుడు ఇంకెవరి పేరో పెడదామనుకుంటున్నారు. తప్పుకి క్షమాపణ అడిగి, స్వామి పేరు పెట్టుకుంటామని ముడుపు కట్టమని చెప్పు. పసివాడు బాగుపడతాడు" అంది సీతతో.
పూజారికి కోపంవచ్చి "పిచ్చిమాటలు మాట్లాడకు" అన్నాడు.
"సీతా నేను చెప్పింది మరిచిపోకే!" అంది తీర్థం తీసుకుని వెడుతున్న సీతతో.
సీత ఇంటికి వెళ్ళి తీర్థం ఇచ్చి వెంకమాంబ చెప్పినమాట చెప్పింది. సీత అక్కకి, బావకి ఆశ్చర్యం - వాళ్ళిద్దరే అనుకున్నమాట, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియనిది వెంకమాంబకెట్లా తెలిసింది? అని. వెంటనే ఇద్దరూ కాళ్ళూచేతులూ కడుక్కుని, చేతులు జోడించి తరిగొండ నరసింహస్వామికి నమస్కరించి తమ బిడ్డకి ఆయన పేరే పెట్టుకుంటామని మొక్కుకున్నారు. కళ్ళు తెరిచేసరికి పొత్తిళ్ళలో బిడ్డ కేరు మన్నాడు. సీత అక్క మామగారు తనపేరు పెట్టమని పట్టిన పంతం వదలి నరసింహస్వామి అనే పేరు పెట్టటానికి అంగీకరించాడు.
ఆ మర్నాడు సీత వెంకమాంబని రహస్యంగా అడిగింది "నీకెట్లా తెలుసు?" అని.
"ఏమో! నాకేం తెలుసు. వాడు చెప్పింది చెప్పాను అంతే!" అంది.
* * *
సోమయాజిగారింట్లో పాడిఆవు కనిపించటంలేదు. పాలేర్లు అందరూ పొలాల్లోనూ, గట్లవెంట, పొదల్లోను వెదుకుతున్నారు. "పాడునూతిలో పడ్డదాన్ని అడవుల్లో వెదికితే దొరుకుతుందా తాతా!" అంది వెంకమాంబ గుడినుండి ఇంటికి వెడుతూ.
పిచ్చిదాని మాట వినేదేమిటి? అనుకున్నా ఏ పుట్టలో ఏ పాముందోనని ఊరిచివర ఉన్నపాడుబడ్డ బావిలో చూశారు. అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలమీద సొమ్మసిల్లి పడిఉంది సోమయాజిగారి ఆవు. నలుగురు దిగి కాళ్ళకి తాడుకట్టి పైకి తీశారు దాన్ని. ఆవు దొరికింది. గోహత్యాపాతకం తప్పింది అన్న సంతోషంకన్నా ఈ సంఘటనతో వెంకమాంబముందు తాను ఓడిపోయానన్న బాధ ఎక్కువ గలిగింది సోమయాజికి. వెంకమాంబకి ఎట్లాగైనా అణచాలని నిశ్చయించుకున్నాడు. ఇటువంటి ప్రతి సంఘటనా ఆయనలో వెంకమాంబపై ఉన్న శత్రు భావనని పెంపొందించిందేగాని తగ్గించలేదు.
రుక్మిణి తండ్రి దర్భ ఉంగరం, తాయారు కాలి మువ్వల పట్టీలు, పారిజాత కొడుకు మామిడిపిందల మొలతాడు ఇలా ఎన్నో! పారేసుకున్నవీ, దొంగిలించినవీ వెంకమాంబ యథాలాపంగా అన్న మాటల బట్టి దొరికాయి. దొరికిన వారికి సంతోషమైనా, దొంగలకి మాత్రం వెంకమాంబ అంటే పీకలదాకా కోపం. రానురానూ ఊళ్ళో అందరికీ ఏదైనా పోయినా, రోగాలు నొప్పులూ వచ్చినా వెంకమాంబని అడగటం అలవాటయ్యింది. పట్టుబడ్డవాళ్ళతోపాటు, లబ్ధి పొందినవాళ్ళకి కూడా ఏదో వ్యతిరేక భావమే. మన సాటి మనిషి, ... అందులోనూ ముక్కుపచ్చలారని పిల్ల, పైగా ఆడది, ...మనకన్నా ఎక్కువస్థితిలో ఉంది అంటే ...భరించటం ఎంత కష్టం? అందులోనూ మగమహారాజులకి తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందోననే భయం, రకరకాల కుట్రలకి కారణం అయింది. ఆడవాళ్ళకి తాము పొందలేనిది ఏదో పొందిందన్న అసూయ ఇచ్చకాలకి కావలసినంత ఆహారం కల్పించింది. వీరిలో ఎవ్వరూ తమకి అవసరం వచ్చినప్పుడు సహాయం అర్థించటానికి వెనకాడినవారు కారు. సోమయాజి కుట్రలకి, కుతంత్రాలకి సాయపడటం మాననివారూ కాదు.
* * *
