Previous Page Next Page 
ప్రార్థన పేజి 21


    "ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు వచ్చి పలకరించిన పాపాన పోలేదు".

 

    వసుమతి ఇరుకునబడ్డట్టూ "ఎ.... ఎలా వుంది?" అని అడిగింది.

 

    "బ్రతకడమ్మా, వాడు బ్రతకడు. ఈ ముసలితనంలో నన్ను ఒంటరి దానిగానే బ్రతకమని వ్రాసిపెట్టాడా ప్రభువు".

 

    "ఇంత సీరియస్ గా వుందని నాకు తెలీదు" నెమ్మదిగా అంది వసుమతి.

 

    ఈ లోపులో ఆ ముసలామె కాస్త తమాయించుకుంది. "బైబిల్ లో ప్రభువు చెప్పాడమ్మా. మనం మనచుట్టూ మనని ఓదార్చే జనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటామో, అప్పుడే ఒక్కరూ దిగ్గిరకు రారట".

 

    ఆమె మరో పది నిముషాలు మాట్లాడింది. వసుమతి ఆమె దగ్గిర శలవు తీసుకుని వచ్చేస్తూంటే, "నా కొడుకని చెప్పటం కాదుగానీ అమ్మా వాడు రత్నం. నిజంగా రత్నమే. అటువంటి వాడిని తన దగ్గిరకి ఇంత చిన్న వయసులో పిలిపించుకోవటానికి ఆ ప్రభువుకి మనసెలా వొప్పిందో' అంది గద్గదమైన కంఠంతో... వసుమతి ఏమీ మాట్లాడలేకపోయింది.

 

    దోమతెర లోపల ఆ కుర్రవాడు వీళ్ళవైపు చూడటంలేదు. ఒక అతీతమైన స్థితిలో మెలకువగావుండే, పైకప్పుకేసి చూస్తున్నాడు. ఆమెకి మాటిమాటికీ అతడే గుర్తొస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఆర్తి, ఆ మొహంలో దీనత్వం... దేముడు అతడిని తక్కువకులంలో పుట్టించాడు. సమాజం బీదవాడుగా నొక్కి పెట్టింది. ఆ ఇరుకు సందుల్లోంచి, చదువు అనే ఆయుధంతో బయటికి రాబోతున్న ఆ బ్రైట్ స్టూడెంటుని- ఆ అమాయకపు కుర్రవాణ్ణీ విధి ఎంత కర్కశంగా తన బాహువుల్లోకి లాక్కోబోతూంది? పేరు కూడా మంచిదే పెట్టారు లింఫోబ్లాస్టిక్ లుకేమియా.

 

    ఆమె అక్కడ మరి వుండలేక ఆమె దగ్గిర శలవు తీసుకుని వచ్చేసింది.

 

    ఆస్పత్రి అంటే ఆమెకు అసహ్యం పుడుతూంది. ఆమె దగ్గర్నుంచి అందర్నీ వరుసగా లాక్కుంటూనే వుంది. తల్లినీ, తండ్రినీ, చెల్లినీ, తమ్ముణ్ణీ.

 

                                        *    *    *

 

    ఆమె తిరిగి పేథాలజీ డిపార్టుమెంట్ దగ్గిరకు వచ్చేసరికి మొత్తం నలభై నిముషాలయింది. ఆలస్యం అయిందని కంగారుపడుతూ బైట సిస్టర్ ని అడిగింది.

 

    "ప్రార్థన అనే పాప తల్లి మీరేనా?"

 

    "అవును".

 

    "మీ కోసమే డాక్టరుగారు చూస్తున్నారు, వెళ్ళండి".

 

    ఆలస్యం అయినందుకు తనని తాను తిట్టుకుంటూ వసుమతి తలుపు తోసుకుని లోపలకు ప్రవేశించింది. లోపల డాక్టరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.

 

    ప్రార్థన గదిలో లేదు.

 

    వసుమతి విస్మయంతో చుట్టూ చూసింది. అన్నాజీరావు కూర్చోమని చేత్తో సైగచేసి, మరో రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసేడు. ఆ డాక్టరు మొహంలో మునుపటి ఉత్సాహం, హుషారు లేకపోవటాన్ని ఆమె గమనించింది. అతడి నుదుటిమీద ముడుత ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తూంది. ముఖ్యంగా ఆమెని చూసి అతడు మునుపటిలా నవ్వలేదు. ఆమె వళ్ళు అకారణంగా జలదరించింది.

 

    "మిసెస్ భార్గవా" అన్నాడు. "ఒక పరీక్ష చెయ్యడానికి మీ అనుమతి కావాలి".

 

    "అంతా... అంతా బాగానే వుందికదా" కంఠాన్ని ఎంత మామూలుగా వుంచుకోవటానికి ప్రయత్నించినా అందులో ఆతృత ధ్వనించింది.

 

    "అంతా బాగానే వుంది మిసెస్ భార్గవా" అంటూ డెస్క్ మీద నుంచి ఒక కాగితం ఆమె ముందుకు తోశ్డు. దీనిమీద మీ సంతకం కావాలి. ఒక స్పెషల్ పరీక్ష నిర్వహించటానికి-"

 

    ఆమె కాగితాన్ని చేతుల్లోకి తీసుకోకుండా "ప్రార్థన ఎక్కడుంది?" అని అడిగింది.

 

    "లోపల రూమ్ లో.... మీరు కావాలంటే చూడవచ్చు. కానీ ఈ ఒక్క పరీక్ష చేస్తేనే అంతా పూర్తవుతుంది. ఈ పరీక్షకి మాత్రం మీ సంతకం కావాలి" అంటూ కాగితాన్ని మరింత ముందుకు తోసేడు.

 

    ఆమె మొహం పాలిపోయింది. మామూలు పరీక్షలకోసం ఈ సంతకాలు తీసుకోరని తెలుసు- ఆ కాగితం అందుకోవటానికి బలం చాలలేదు. "ఏ పరీక్షకోసం ఈ సంతకం?" అని మాత్రం ఎలానో అనగలిగింది.

 

    "బోన్ మారో టెస్ట్... ఎముక లోపలి మూలగని పరీక్ష చెయ్యాలి".

 

    ఆమె ఒక్కసారిగా బల్లమీద తూలింది. తిరిగే గోళాలు సమస్తం ఆగిపోయినట్టూ- భూమి అగ్ని గోళమై పేలిపోయినట్టూ వణికిపోయింది.

 

    గది గోడలు గిర్రున తిరగసాగేయి. మూసిన కళ్ళముందు ఓ దృశ్యం కదలాడింది. ఇంద్రధనుస్సు ఛాయలో ఏడు గుర్రాలు పూన్చిన రథంలో దేవదూతల మధ్య ఇద్దరు పిల్లలు కూర్చుని వున్నారు. వాళ్ళ తలమీద బంగారు కిరీటాలు ధగ ధగమంటున్నాయి. రథం మేఘాల మధ్య నుంచి సాగి అదృశ్యమైపోయింది.

 

                                                             *    *    *

 

    ఇంతలో డాక్టర్ అన్నాజీరావు భుజంతో తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. తడు తన శరీరానికి చేతులు దూరంగా వుంచుకున్నాడు. అతడి వెనుకే ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. ఒకామె లావుగా భయంకరంగా వుంది. ఒకామె మొహంలో మాత్రం చిరునవ్వు, కాస్త దయ కనబడుతున్నాయి.

 

    వాళ్ళని చూడగానే ప్రార్థన కళ్ళలో భయం కొట్టిచ్చినట్టు కనపడింది. నర్సు అందించిన టవల్ తో చేతులు తుడుచుకున్నాక, అతిజాగ్రత్తగా గ్లౌస్ తొడుక్కున్నాడు డాక్టరు. ప్రార్థన కన్నార్పకుండా అతడి చర్యలే చూస్తుంది. ఆ పాపకి ఎందుకో అంతకు ముందురోజు జరిగినట్టే తల్లో తండ్రో వచ్చి దొంగతనంగా ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లిపోతే బావుణ్ణు అనిపించింది. ఈ లోపులో నర్సు ట్రే దగ్గిరకి జరిపింది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. లైట్ల కాంతి ఆ స్టెయిన్ లెస్ స్టీల్ పరికరాలమీద వికృతంగా మెరుస్తుంది.   

 

    ఆ ట్రే దగ్గిరకి వస్తుంటే ప్రార్థన పక్కమీద లేచి కూర్చొబోయింది. కానీ అంతలోనే ఒక లావుపాటి చెయ్యివచ్చి ఆమెని వెనక్కి నొక్కి పెట్టింది.

 

    "ప్లీజ్..." అన్నాడు డాక్టరు. కానీ అతడికంఠంలో అభ్యర్థన కన్నా ఆజ్ఞే ఎక్కువగా వుంది.

 

    "నాకు ... నాకు నాన్న కావాలి" అంది నిస్సహాయంగా.

 

    అతడు దాన్ని వినిపించుకోకుండా "కాల్ అనదర్ సిస్టర్..." అన్నాడు. లావుపాటి నర్సువెళ్ళి ఇంకొకామెతో తిరిగి వచ్చింది.

 

    అన్నాజీరావు ప్రార్థనవేపు తిరిగి నవ్వేడు. ప్రార్థన కళ్ళలో భయం కొట్టిచ్చినట్టు కనబడింది. "మీరేంచేస్తారిప్పుడు" అని అడిగింది.

 

    అదే నవ్వుతో "ఒక్క నిమిషం ఓపికపట్టమ్మా, అయిపోతూంది" అన్నాడు డాక్టరు వంగుతూ. ఆమె గింజుకుంటూ "ఊహు, నేను వెళ్లిపోతాను- నేను వెళ్ళిపోతాను" అన్నది.

 

    "ప్రార్థనా- చిన్నపిల్లలా బిహేవ్ చేయకు".

 

    ఆమె కంటివెంట నీరు జలజలరాలింది. మేక కసాయివాడి వంక చూసినట్టు చూసింది. ఇది మామూలు సూదిగుచ్చటం కాదని ఆమెకి తెలుసిపోయింది. తను మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నానని అనుకుందిగానీ- భయం ఆ భావాన్ని డామినేట్ చేస్తుంది. ముఖ్యంగా ఆమెచేతులు (సూదులు గుచ్చటంవల్ల) నొప్పిగా వున్నాయి. ఇప్పుడిక ఎక్కడేం చేస్తారో తెలియటంలేదు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS