Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 22


    "శ్రీలక్ష్మీ స్థితాంగ చిద్రూప చిన్మయా శివనుత శుభాంశ
    మేలైన భక్ష్యముల్ చాలతెచ్చినాను రావయ్యా, నీలవర్ణతిని   
    శ్రీ వేంకటేశ్వరా రావయ్యా, పోవయ్యా,
    బ్రహ్మాండ నాయక రావయ్యా"
    రావయ్యా, రావయ్యా - వెంగమాంబ భక్త్యా వేశంతో ఊగిపోయింది.
    ఈ ఊరి ప్రజలంతా వెంగమాంబ మనవాతీతురాలని, దైవశక్తి కలిగినదని విశ్వసించి ఆమెను పూజించడం ప్రారంభించారు. వెంగమాంబ తన బృందావనంలో తిరుగుతోంది. చెట్టుపైన కోయిలమ్మ కూస్తోంది. ఆ  ప్రకృతిలో లీనమయిన వెంగమాంబ లోపలకెళ్ళింది. చిరుచాపపై కూర్చుంది. మనసును స్వామిపై లగ్నం చేసింది.
    "ఈ చిన్న కృతికి ఏం పేరు పెట్టాలో" - ఆ ఆలోచనకి వెంగమాంబకే నవ్వొచ్చింది. తనెవరు పేరు పెట్టడానికి, స్వామి ఏ పేరు పెట్టుకుంటాడో.... మనసు కవితా ఝరిలో పరుగులు తీస్తోంది. భావం ఆవేశంగా ముందుకు దూకుతోంది. కృష్ణ పరమాత్మే కాలి అందెలు ఘల్లు ఘల్లుమంటూ నృత్యమాడుతున్నాడు వెంగమాంబ మనోపథంలో....
    "శ్రీ వేంకటేశ, నా చిత్తంబునందు
    నీపాద యుగళంబము నిల్పవే కృష్ణ
    నన్నేలు తరిగొండ నరహరాకృతిని
    ప్రత్యక్షమై నన్ను పాలింపు కృష్ణా"
    ఆ "పాలింపు కృష్ణా" అనే మాట రాయగానే వెంగమాంబకి "నను పాలింప నడచివచ్చితివో" అనే కీర్తన, త్యాగరాజు గొంతులో కదలిన కదలికే అనుభూతి పొందింది. "నా ప్రాణనాథుడట" - అవును, నా ప్రాణనాథుడే కదా -  వెంగమాంబ కళ్ళలో అశ్రువులు నిండాయి. చేతిలో కలం ఆగలేదు.
    పాపకర్మములు తప్పక చేసి చేసి
    బహుజన్మములనెత్తి బడలితిని కృష్ణ
    ఈ జన్మమందైన నేను నీ మాయా
    గడచెదనన్న శక్యముగాదు కృష్ణ
    హరి, నీ పాదాంబుజం బను నావ నిచ్చి
    యీ యుర్వి దాటించి మనుపవే కృష్ణ-
    కనకరత్న ప్రభా ఖచితమైనట్టి
    సురచిర మకుటుంబు చూపనే కృష్ణా-
    వెంగమాంబ ఆర్తి గ్రహించాడా దేవుడన్నట్లు, స్వామి ఎదురుగా నిల్చినట్లే భావిస్తోంది వెంగమాంబ.
    వెంగమాంబ ఆర్తి గ్రహించాడా దేవుడన్నట్లు, స్వామి ఎదురుగా నిల్చినట్లే భావిస్తోంది వెంగమాంబ.
    వెంగమాంబ ఆర్తి గ్రహించాడా దేవుడన్నట్లు, స్వామి ఎదురుగా నిల్చినట్లే భావిస్తోంది వెంగమాంబ.
    వెంగమాంబ కనులకు ఊర్ధ్వపుండ్రధారి, విశాల పాలభాగం తళుకులీనుతుంటే చిరునవ్వు నవ్వుతూ దర్శనమిచ్చాడు.
    భగవంతుని కన్నులు, నాసిక, దంతాలు, పెదవులు, చెక్కిళ్ళు, మకర కుండలము, చుబుకము, శంఖ చక్రాలతో కూడిన చతుర్భాహువులు, బ్రహ్మాండ ఖండాలున్న ఉదరము, బ్రహ్మసదనమైన నాభికమలము, కనకాంబరముతో కాంతిమయమైన ఊరుయుగ్మం, బ్రహ్మరుద్రాది దిక్పతులు మొక్కేపాదాలు, అష్టభుజాలతో అమృతాభ్ధి మధ్యన  నెలకొన్న దృశ్యం, బాలుడై వటపత్ర శాయిగా ఉన్న దృశ్యం - ఇలా భగవంతుని లీలా విశేషాలను చూపించమంటూ వేడింది వెంగమాంబ.
    వసుధనే గురుకుల వాసంబుసేయ
    శక్తిచాలక నిన్నె శరణంటి కృష్ణ
    కాన నన్నెట్లెన గడతేర్చదగిన
    భారంబు నీకు దప్పదు సుమ్మా కృష్ణ!
    వెంగమాంబ తన భారాన్నంతా స్వామిపైనే వేసింది.
    నీవు నా స్వామి నీ సొత్తు నేను.
    కాన సంబంధ మెక్కడ బోదు కృష్ణ
    వెంగమాంబ "శ్రీకృష్ణ మంజరి"ని రాసుకుంటూ పోతోంది. ఆమె ఆకలిదప్పులను మరచిపోయింది.
    చీకట్లు ముసురుకుంటున్నాయి. దేవాలయంలో గంటలు మోగుతున్నాయి. పక్షులు కిలకిలా రావాలతో గూళ్ళకు చేరుకుంటున్నాయి. తెల్లవారడమే ఆలస్యమన్నట్లు, బృందావనంలో ఓ బండపై పద్మాసనాసీనురాలైన వెంగమాంబ శ్రీ వేంకటేశ్వర పరబ్రహ్మ ధ్యానంలో శరీర స్పృహను మరిచిపోయింది.
    అంతలో, ఓ  పెద్దపాము జరజరా పాకుతూ వస్తోంది. ఆ దారిన పోయేవారు ఆ పెద్ద పామును చూసారు. "అయ్యో! పాము పాము" అంటూ కేకలు పెట్టారు. వెంటనే జనం పోగయ్యారు. అందరూ ఆ పాము వెంగమాంబను కాటేస్తుందేమోనని భయపడ్డారు. కొంతమంది వెంగమాంబతో "అమ్మా... లే..... లే" అంటూ అరిచారు. వెంగమాంబకు ఆ మాటలు వినబడలేదు. కొందరు పెద్ద కర్రలు తీసుకొచ్చారు.
    అంతలో, ఆ పెద్ద పాము గబగబా ముందుకు సాగి, తన పడగను గొడుగులా వెంగమాంబ తలపై నీడనిస్తూ నిల్చుంది. ఆ దృశ్యాన్ని చూసి జనమంతా అవాక్కైపోయారు. అందరూ భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలు అభినందించారన్నట్లుగా పూల వానలు కురిసాయి. వెంగమాంబ తలపై పాము అటు ఇటు  ఊగుతోంది.
    "అమ్మో! బుసలు కొడుతోంది" అంటూ బెదిరిపోతున్నారు జనం. ఆ బుసలు నుంచే "హరిః ఓం" అనే మంత్రం వినిపిస్తోంది. ఆ బుసనుంచి చల్లని గాలి వెంగమాంబను సేదదీరుస్తోంది.
    వెంగమాంబకు పడగపట్టిన పామును గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటూ తరలివస్తున్నారు. వారందరినీ చూస్తూ ఆ పాము బుసలు కొడుతూ, హరినామాన్ని అంతటా వ్యాపింపజేస్తోంటే, చూడవచ్చిన జనం భక్తితో పరవశించి, నాగేంద్రునికి నమస్కరించి,వెంగమంబా పాదాలకు వంగి వంగి నమస్కరిస్తున్నారు.
    కాలం గడుస్తోంది.
    వెంగమాంబ జుట్టు తెల్లగా ముగ్గు బుట్టలా తయారైంది. కళ్ళు జ్యోతిపుంజాలై స్వామిని దర్శిస్తూనే ఉన్నాయి.
    ఆ రాత్రి మాధవుడు వెంగమాంబ ఇంటికి వేంచేసాడు. ఆ పురుషోత్తముని ముఖారవిందాన్ని దర్శిస్తోంది వెంగమాంబ. ఆ దివ్యమంగళ స్వరూపుని చూస్తూ, "స్వామీ! నాపై ఏడుకొండలంత గొప్ప దయ చూపిస్తున్నావు. ఎప్పటికైనా ఈ దేహాన్ని త్యజించక తప్పదు కదా!" వెంగమాంబ మాటలు విననట్లే ఉన్నాడు స్వామి.
    "స్వామీ! నాపేరు నీ కోవెలలో శాశ్వతంగా ఉండే ఏర్పాటు చేయాలి" వెంగమాంబ స్వామి కళ్లలోకి చూసింది. స్వామి మందహాసం చేశాడు.
    "స్వామీ! నా పేరు నీ కోవెలలో శాశ్వతంగా ఉండే ఏర్పాటు చేయాలి". వెంగమాంబ గొంతు వణుకుతోంది. స్వామి మందహాసం చేస్తూ ఆ క్షణాన అదృశ్యమయ్యాడు.
    "అయ్యో! నా స్వామి వెళ్ళిపోయాడు. నా కోరిక తీరదా? నేను దూరశకు పోయానా? ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఎందెందరో భక్తులు లేరూ?! అందుకే స్వామికి నాపై ఆగ్రహం కలిగిందా? స్వామి..... స్వామీ....." అంటూ వెంగమాంబ తలని నేలకేసి బాదుకుంటూ రోదిస్తోంది.
    రోజులాగానే స్వామికి హారతి తీసుకుని ఆలయంలోకి ప్రవేశించింది వెంగమాంబ.
    ఆశ్చర్యం!!
    ఆ హారతిలో శ్రీనివాస పరబ్రహ్మ స్వరూపం ప్రతిబింబమై కనిపించింది. ఆ విరాట్ స్వరూపాన్ని తిలకించిన వెంగమాంబ తన్మయురాలైంది. తన హారతి ప్రతిరోజూ కోవెలకు రావాలి. అది శాశ్వత హారతి కావాలని అర్చకులతో అందామె.
    అర్చకులు ముఖాలు ముడుచుకున్నారు. ఆ రాత్రి, ఆ తరువాత హారతిని అంగీకరించిన స్వామి, అర్చకులకు స్వప్నంలో సాక్షాత్కరించి, హారతి రాకుంటే, కోవెలలో రాత్రి తీర్మానము చేయకూడదని శాసించాడు. అర్చకులకు నోటమాట రాక, ఏం  చేయాలో తెలియక స్వప్నాన్ని కాదనలేక పోయారు.
    వెంగమాంబ బాలవితంతువు కదా! వెంగమాంబ తదనంతరం హారతిని ఎవరు తీసుకొస్తారు? ఆ రామభక్తురాలు తన తదనంతరం కూడా హారతిని, క్రమం తప్పకుండా జరిపించాలని, తన చెల్లెలు కూతురైన మంగమ్మను దత్తత తీసుకుంది. ఆనాటి నుంచి వెంగమాంబ సంతతి వారే శ్రీ వేంకటేశ్వరునికి హారతి తెచ్చే ఏర్పాటైంది.
    అర్చకులకు ఇది పెద్ద సమస్య అయింది. వితంతువు ఇచ్చే హారతిని స్వామి రోజూ తెమ్మని ఆజ్ఞాపించడమా?! ఇంతకన్నా అపరాధం మరేమైనా ఉందా? అయ్యో, ఈ ఊర్లో ధనవంతులు, విద్వాంసులు, భక్తులు మరెవరూ లేరా? ఊరు గొడ్డు పోయిందా? స్వామికి ఈ వితంతువు తెచ్చే హారతి శాశ్వత హారతియా? అర్చకులకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎలాగైనా హారతిని మాన్పించాలని రకరకాల ఉపాయాలు పన్నారు. అందరూ ఒకచోట గుమిగూడి ఓ నిర్ణయానికొచ్చారు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS