Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 23


    వెంగమాంబ హారతిని తీసుకురాకముందే, ఆలయంలో తీర్మానాలు చేసి, తలుపులు తాళాలు వేసేయాలి. అలా చేస్తే, వెంగమాంబ క్రమం తప్పకుండా తెచ్చే హారతులు ఆగిపోతాయి. అందరూ ఈ తీర్మానాన్ని ముక్త కంఠంతో అంగీకరించారు. ఈ వితంతువు హారతి ఆగిపోవాలంటే ఇదే మార్గం.
    వెంగమాంబ రాకముందే, గది తలుపులు మూసివేయబడ్డాయి. వెంగమాంబ హారతి తెచ్చేసరికి ఎవరూ లేరు. వెంగమాంబ హారతితో గుడి తలుపుల కెదురుగా, అలాగే నిలబడింది.
    తలుపులు వేసెదెవరు? తీసేదెవరు?
    క్షణాలలో మూసిన తలుపులు తెరచుకున్నాయి. వెంగమాంబ హారతితో లోపలికెళ్ళింది. ఆమె స్వామి కళ్యాణ గుణాలను కీర్తించి, మంగళహారతి నిచ్చింది. గుడి బయటి కొచ్చి, తన నివాసానికెళ్లిపోయింది. అర్చకులు ఆ  విషయాన్ని తెలుసుకుని నిలువెల్లా వణికిపోయారు. స్వామికి తమపై ఆగ్రహం కలిగితే ఎంత ప్రమాదమో అనుకుంటూ, క్షమాభిక్ష కోరి వెంగమాంబ ఇంటికెళ్ళారు. పశ్చాత్తాప హృదయులై వెంగమాంబ కాళ్ళపై బడ్డారు.
    "నీ పిల్లలు తప్పు చేస్తే మన్నించవా తల్లీ. మమ్ములను అలానే క్షమించమ్మా. నిన్ను మేము గోవిందునితో సమానంగా సేవిస్తా" మంటూ ఆమె పాదాలు వదలకుండా విలపించారు అర్చకులు. ఆ దివ్యజనని వారిని దయతలచి ఆశీర్వదించింది. ఆనాటి నుంచి వెంగమాంబ హారతి దేవస్థానానికి రాకపోతే, రాత్రి తీర్మానం జరగడానికి వీల్లేదని స్పష్టమైంది.
    అర్చకులు వెంగమాంబ హారతిని ముత్యాలహారతి అన్నారు. శ్రీ వేంకటేశ్వరుల దశావతారాలలో ఒక్కొక్క రూపంలో రజిత ముత్యాలు తట్టలో అమర్చి వేంకటేశ్వరునికి ఏకాంత సేవ సమయంలో కర్పూర హారతి జరుగుతుంది. ముత్యాల హారతిని స్వీకరిస్తూ కళ్ళకు అద్దుకుంటున్న భక్తుల్ని చూసి వెంగమాంబ చిరునవ్వులు చిందించింది. స్వామి మందహాసం చేశాడు.
    కాలం గడుస్తోంది. వెంగమాంబ స్వామిపై భజనలు చేస్తూ, కీర్తన లాలపిస్తూ, రచనలు చేస్తూ, వృద్ధురాలై, "ఇంకా ఎంతకాలం జన్మ! మోక్షం రాదా?!" అనుకుంటోంది.
    వెంగమాంబ కళ్ళు నిశ్చలంగా భగవద్గీత గ్రంథంపై నిలిచాయి. భక్తియోగాన్ని చదవడం ప్రారంభించింది.
    శ్రీ భగవానువాచ:
    మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే
    శ్రద్ధయాపర యోపేతాస్తే మే యుక్త తమా మతాః
    ఎవరు ఏకనిష్ఠులై పరమ శ్రద్ధతో నా విశ్వరూపాన్ని మనసున నిలిపి, సర్వజ్ఞుడను, పరమేశ్వరుడను అగుచున్న నన్ను భజించుచున్నారో, వారు  శ్రేష్ఠులగు యోగులని నా అభిప్రాయం. అర్జునుడు ప్రశ్నించాడు "యోగి ఎవరు?" అని. దానికే కృష్ణ భగవానుడు సమాధానమిచ్చాడు.
    కృష్ణభగవానుడు ఇంకా ఇలా చెప్పాడు.
    ఏ ప్రాణి యెడల ద్వేషం లేనివాడును, మిత్రభావంతో కూడినవాడు, దయాళువును. మమత్వ బుద్ధి శూన్యుడును, క్షమాశీలుడును సర్వదా సంతోషము కలిగియుండువాడును, అత్యంత భక్తుడునూ, సంయత్ స్వభావుడునూ, మహాబుద్ధులను నాకు అర్పించినవాడగు భక్తుడు నాకు ప్రియుడు.
    వెంగమాంబ భక్తియోగం చదివాక, మోక్ష, సన్యాస యోగాలను చదవడం ప్రారంభించింది. అర్జునుడు శ్రీ కృష్ణునితో, కర్మ, సన్యాస, కర్మఫల త్యాగముల తత్త్వాలను వేర్వేరుగా తెలుసుకొనగోరుచున్నాను" అని అడగ్గా, కృష్టుడు, "స్వర్గాది ఫలములనొసగు కామకర్మముల పరిత్యాగమునే పడింతులు సన్యాసమంటారు. అనుష్టేయములగు నిత్యనైమిత్తికములగు సమస్త కర్మముల ఫలత్యాగాన్ని త్యాగమని అంటారు జ్ఞానులు" అని చెప్పాడు.
    వెంగమాంబ మనసు నిండా ఎన్నెన్నో ప్రశ్నలు. మనసులో ఏదో చింత. ఈ శరీరం వడలిపోతోంది. ఇంకా ఎంతకాలం? ఎంతకాలం? భగవంతునిలో ఐక్యమయ్యే భాగ్యమే లేదా?! వెంగమాంబ తన ఇంట్లో భజన కీర్తనలను ప్రారంభించింది. ఆ భక్తి పారవశ్యానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే దిగివచ్చాడా స్థలానికి.
    "స్వామీ! ఇక ఈ మానవుల కళ్ళపడకుండా, నీ పాదపద్మాలలో ఐక్యం చేసుకో. ఇక శరీరాన్ని మోయలేను. నాకు విముక్తి కలిగించు" అంటూ జగన్నాయకుని పాదాలను పట్టుకుంది. కన్నీటితో పాదాలను కడిగింది.
    "ఇంకా సమయముంది" అన్నారు స్వామి.
    వెంగమాంబ స్వామి పాదాలను వదలలేదు. "ఈ క్షేత్రంలోనే నన్ను ఇంకొంతకాలం ఆరాధించు". స్వామి గొంతులో గాంభీర్యం వెంగమాంబ చెవిని సోకింది.
    కొంత కాలమయ్యాక నిన్ను అక్షయమంగళపదములో చేర్చుకుంటాననగానే వెంగమాంబ, "ఈ మానవుల కళ్ళబడకుండా ఉండే మార్గాన్ని చెప్పండి స్వామి" అంది కళ్ళు తుడుచుకుంటూ.
`    స్వామి తలచుకుంటే చేయలేనిదేముంటుంది?
    వెంటనే వెంగమాంబ చేతిని తన చేత్తో పట్టుకుని, ఇంటి బయటకు పిలుచు కొచ్చాడు స్వామి స్వామి. క్షణంలో ఆమెను పన్నెండు మైళ్ళ దూరంలోనున్న తుంబురు కొన వద్దకు తీసుకొచ్చాడు. ఒక దివ్య ప్రదేశాన్ని చూపించారు స్వామి. భయంకరమైన ధ్వనితో ఒక బిలం ఏర్పడింది. నిర్మానుష్యమైన ఆ బిలద్వారం నుంచి నా సన్నిధికి వచ్చి, నన్నారాధించు. నువ్వు ఎవరి కంట్లో పడవు." స్వామి పలుకులను వింటూ పులకాంకితయైన వెంగమాంబ. "ఇక ఎవరికీ కనబడనా?!" అని అడిగింది.
    "నా భక్తులకు  కనిపిస్తావు". నీ దర్శన భాగ్యంతో వారు కృతార్థులవుతారు.
    వెంగమాంబ అలానే నిలబడింది.
    "అమ్మా, నీ భక్తి చరిత్ర విన్నా, నీ భక్తిని కొనియాదిమా, వారంతా నీలానే నాకు అత్యంత ప్రియమైన వారవుతారు" అంటూ స్వామి అంతర్థానమయ్యారు. అలాంటి భక్తులు ఆ బిలం ద్వారా వేంకటేశ్వరుని పాదపద్మాలను చేరుకుంటారు.
    వెంగమాంబకు ఆ గుహ నిలయమైంది. ఆ ప్రాంతంలో కొండల్లో, కోనల్లో, ఆడుతూ పాడుతూ భగవన్నామాన్ని స్మరిస్తూ కాలం గడుపుతోంది. తాను రచించిన గ్రంథాలను స్మరించుకుంటోంది. వెంగమాంబకు తను రచించిన కృష్ణమంజరి గుర్తుకొచ్చింది. కృష్ణమంజరిలోని పాటలను పాడుకుంటూ, ఆ గుహ ప్రాంతమంతా సంచరిస్తోంది వెంగమాంబ.
    తెల్లవారింది. ఉదయ సంధ్యాకాంతులు వెంగమాంబ ఇంటి కిటికీలో నుంచి లోపలికొచ్చి పడుతున్నాయి. పెరటిలో నున్న ఆవు "అంబారావాలు" చేస్తోంది.
    పక్కింటివాళ్ళు వెంగమాంబ ఇంట్లోకొచ్చారు. తలుపులు తీసు ఉన్నాయి. "అయ్యో! ఇదేమిటి?" అనుకుంటూ "వెంగమాంబా" అని ఒకరు, "అమ్మా" అని మరొకరు అరవడం మొదలెట్టారు. వెంగమాంబ ఎక్కడా లేదు. క్షణంలో ఈ వార్త ఊరంతా పాకింది. జనం తండోపతండాలుగా వెంగమాంబ ఇంటిముందు పోగై, పెద్దగా రోదించడం మొదలెట్టారు.

    "దేవుడమ్మ వెళ్ళిపోయిందమ్మా" అని గొంతెత్తి విలపించారు. "ఒక్క మాటన్నా చెప్పకుండా, అలా మాయమయ్యావా తల్లీ" అని ఏడ్చారు. ఆమె దేవునిలో లీనమైపోయిందనీ, బ్రహ్మైక్యం పొందిందని చెప్పుకున్నారు. అంత గొప్ప భక్తురాలు తమ మధ్యనుంచి వెళ్ళిపోవడం దురదృష్టకరమని వాపోయారు. అందరూ వెంగమాంబ బృందావనానికి ప్రదక్షిణలు చేసారు.
    "అయ్యో, మన తల్లి, మన దేవుడమ్మ లేని ఈ ఊళ్ళో నేనుండనమ్మా" అంటూ ఓ పండుముసలమ్మ కన్నీరు మున్నీరైంది.
    "మనపై కోపగించి వెళ్ళిపోయిందా?" అని చెంపలేసుకున్నారు కొంత మంది.
    నిజంగా బ్రహ్మైక్యం పొందిందా లేక మన ఊరు వదలి వెళ్ళిపోయిందా అంటూ సందేహపడ్డారు కొంతమంది. వెంగమాంబ లేని తులసివనం వెలవెలాబోయింది. వెంగమాంబ లేని ఆ స్థలం చిన్నబోయింది. ఆ ఊరు, ఊరంతా రోజూ వెంగమాంబ బృందావనానికి వచ్చి, దర్శించుకుని వెంగమాంబని చూసిన తృప్తిని పొందుతున్నారు. ఇక మనం ఆమెను చూడలేమనుకుంటూ, ఆ బృందావనాన్ని వదలి కదలలేక పోతున్నారు. అయినా అలా అదృశ్యమవ్వడం సాధ్యమాఅని కొందరు, ఆమె ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, మరలా తిరిగి వస్తుందని మరికొందరు ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. వెంగమాంబ జాడలేదు. బ్రహ్మైక్యం పొందిన పుణ్యాత్మురాలనుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. వెంగమాంబ తుంబుర కోన బిలం నుంచి రోజూ స్వామిని సేవిస్తోంది. అక్కడితో ఆగక వేంకటాచలంలోని దేవాలయానికి తంబురకోన బిలం నుంచి  బయటకు వచ్చి, వెంకటేశ్వరుని పూజిస్తోంది.
    రోజూ ఆమె అడవిమల్లెలతో, అడవిలోని రంగు రంగుల పూలతో మాలలు అల్లుతోంది. రాత్రిపూట అర్చకులు గుడి తలుపులను మూడి వెళ్ళాక, ఆమె గుడిలోనికి ప్రవేశిస్తోంది. స్వామి మెడలోని దండలను తీసేస్తుంది. తను అల్లిన దండలను స్వామి మెడలో వేసి, స్వామిని చూసుకుని మురిసి పోతుంది వెంగమాంబ.
    తెలతెలవారుతుండగా వెంగమాంబ ఆలయాన్ని వదలి బిలంలోకి వెళ్ళిపోతుంది. కానీ, అర్చకులు తలుపులు తెరిచి చూడగానే, రాత్రి అలంకరణలు కనిపించవు. బదులుగా అడవిపూల మాలలు స్వామి మెడలో దర్శనమిస్తాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS