Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 21

    అక్కడ దేవాలయంలో అర్చకులు సన్నిధి తలుపులు తెరచుకొని లోనికి ప్రవేశించారు. వారు కళ్ళని  నమ్మలేకున్నారు.... ఇదేమిటీ, ఇదేమిటీ  ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. పట్టు పీతాంబరమూ చిరిగి కనిపిస్తోంది స్వామివారి  పీతాంబరము చినిగిపోవుట ఏమిటో అర్థం కాలేదు. ఎవరైనా స్వామివారి గది తలుపులు తెరుచుకొని వచ్చి  దోచుకున్నారా, ఇంకా ఏమైనా  వస్తువులు పోయాయా అని కంగారుగా, భయంగా గది అంతా కలియచూసారు.
    ఆ విషయం దేవస్థాన అధికారికి తెలియజేశారు.
    ఏ వస్తువూ పోకుండా స్వామివారి పీతాంబరంలో ముక్క ఎలా చినిగిపోతుందీ, ఎవరు చేస్తారీ పనీ - దేవస్థానధికారికి అర్థం  కావటం లేదు. ఎవర్ని ఎలా ప్రశ్నించాలో తెలియటం లేదు. అయితే మహాభక్తులెవరో దొంగతనంగా స్వామివారి వస్త్రాన్ని చించి, దాచుకుని వుంటారు కనక, భక్తుల యిళ్ళన్నీ సోదా చేయాలనీ నిర్ణయించారు. పూజారులకు ఏం చేయాలో తోచటం లేదు. భక్తులు కాని వారెవరూ - ఎందరి ఇళ్ళనో శోధించారు. కానీ స్వామివారి చిరిగిన వస్త్రపు ఎక్కడా కనిపించలేదు.
    ఇలా జరగటం ఎంతో కీడు అన్నారు. జ్యోతిష్కులు - గుడికి మొత్తం పుణ్యాచమనం చేయించాలన్నారు. మంచిరోజు చూసి స్వామివారికి మరో పీతాంబరం కట్టాలన్నారు. ఇలా అందరూ తలో మాట అంటున్నారు.
    "అందరికన్నా భక్తురాలు మన వెంగమాంబ లేదా" అన్నాడొక పూజారి.
    "అయితే, వెంగమాంబ గుడిలోపల కొచ్చి, అర్థరాత్రి తలుపులు విరగ్గొట్టి స్వామివారి వస్త్రాన్ని చింపుకుపోతుందా, ఎవరైనా నమ్ముతారా" అన్నాడు మరొకడు.
    కానీ ఆనాడు రథం వెంగమాంబ ఇంటి ముందు ఆగిపోలేదా, ఆమె వచ్చి కదలిస్తే కానీ కదలకుండా వుండలేదా- ఏమో, వెంగమాంబ ఇలా ఎందుకు సాధంచకూడదు అన్నారు మరొకరు.
    ధైర్యం చేసి వెళ్ళి, వెంగమాంబ ఇల్లు వెతకటానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఆ పూజారులలో పెద్ద, మరికొందరిని వెంటబెట్టుకొని వెంగమాంబ ఇంటికెళ్ళాడు. గ్రంథరచన చేస్తున్న వెంగమాంబ, వారిని లోనికాహ్వానించింది. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఏమీ అడగాలో, ఎలా అడగాలో తెలియక తికమకపడుతున్న పూజారులు, వారితోబాటు వెంట వెళ్లిన ఆ ఊరి ప్రజలు, అటు ఇటూ చూస్తున్నారు. ఈ భక్తురాలి ఇల్లు శోధిస్తే, స్వామి వారికి కోపమొస్తుందేమో!
    అర్చకులు వెంగమాంబకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించారు. అతి వినయంగా జరిగిన విషయం చెప్పారు. వెంటనే వెంగమాంబ. "అదిగో, ఆ  గదిలో వుంది తీసికెళ్ళండ"ని చెప్పింది. అర్చకులు అమితాశ్చర్యంతో! భయంతో గదిలో ప్రవేశించారు. అయితే ఆ పీతాంబరం ముక్కగా లేక, రెండు అంచులతో నిగనిగలాడుతూ ప్రకాశిస్తోంది - అదేమిటి, పీతాంబరం ముక్క కదా కావలసింది అనుకుంటూ పరిశీలిస్తే, అది శ్రీనివాసుని పీతాంబరమే. అర్చకులకు నోటమాట రాలేదు.
    అర్చకులు వేగంగా గుడిలోకెళ్ళారు. స్వామి సన్నిధి ప్రవేశించి చూస్తే, అంతకు ముందున్న పీతాంబరము యొక్క శేషము కనిపించలేదు. అర్చకులకు నోటమాట రాలేదు.
    ఇదేమిటీ -వెంగమాంబకి స్వామివారికి వున్న సంబంధము సామాన్య మానవులకు అర్థం కాదా అని భావిస్తూ. ఆనందబాష్పాలు రాలుస్తూ స్వామిని కీర్తించారు.
    స్వామివారికి, సహస్ర కలశాభిషేకము చేయించి, వెంగమాంబ యింటి నుంచి తెచ్చిన పీతాంబరము ధరింప జేసి, కర్పూర నీరాజనమార్పించి, ఆ నిత్యమంగళ స్వరూపుని తనివితీర దర్శించుకొన్నారు అర్చకులు.
    ఆరోజు నుంచీ వెంగమాంబ యింట భక్తుల సందోహం ఎక్కువై పోయింది. వేంకటేశ్వరస్వామి వెంగమాంబ ఇంటనే శయనిస్తున్నాడని, ఆ  ఇంట అడుగుపెడితేనే పుణ్యమని చెప్పుకుంటూ భక్తులు తండోపతండాలుగా వెంగమాంబ ఇంటిని దర్శిస్తున్నారు.
    వెంగమాంబ  భక్తి దినదినము దివ్యరూపాన్ని పొందుతోంది. శ్రీనివాసునికై భక్ష్య భోజ్యాలు చేసి, వెంకటాచలానికి దగ్గరలో నున్న పాండవ తీర్థానికి వెళ్ళి, ఓ ప్రదేశాన్ని శుభ్రపరచుకుంది వెంగమాంబ. భగవంతుడు తన కోరికను తీర్చలేదనే బాధ వెంగమాంబ మనసునుండి వైదొలగలేదు. తంబుర  మీటుతూ భక్తిరసపూర్ణములైన గానాల్ని ఆలపిస్తోంది వెంగమాంబ. ఆ గాన రసామృతంలో ఓలలాడి అక్కడి చిలుకలు, గోరువంకలు, నెమళ్ళు మొదలైనవి వెంగమాంబ పక్కన చేరి కూర్చున్నాయి. నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తున్నాయి. ప్రకృతి పరమశోభాయమానంగా వుంది.
    వెంగమాంబ రోజూ భక్ష్యాలు, వివిధ పదార్థాలు వండి స్వామికి నైవేద్యం చేస్తూ, తంబురమీటుతూ, మధురంగా గానం చేస్తూ, దైవధ్యానం చేస్తూ వుంది. భగవంతుడు తన కోరిక తీర్చడా, ఆ సమయమెప్పుడో అని ఎదురుచూస్తోంది.
    శ్రీనివాసుడు భక్తురాలిని మళ్ళీ పరీక్షించాలని అనుకున్నాడు. ఈ పాండవ తీర్థంలో వెంగమాంబ ధ్యానంలో కూచోటం స్వామికి అవకాశమనిపించింది. ఆమె గీతాలు శ్రీనివాసుని మనసుని ఆకట్టుకున్నాయి.
    ఓనాడు మద గజం ఘీంకరిస్తూ వెంగమాంబను సమీపించింది. వెంగమాంబ నిశ్చలధ్యానం నుండి కదలలేదు. మరోసారి సింహం గర్జిస్తూ వెంగమాంబ పక్కకొచ్చి నిలబడింది. వెంగమాంబ చలించలేదు.
    వెంగమాంబ నిశ్చలతను ఏమీ చేయలేకపోటంతో శ్రీనివాసుడు మరోవిధంగా ఆమెను పరీక్షించదలచాడు. ఒక పెద్ద పులి గాండ్రిస్తూ వెంగమాంబ మీదికొచ్చింది. ఆమె కూర్చున్న స్థలమంతా తిరుగుతూ, మహాభయంకరంగా మీద పడబోయింది.
    మహాభక్తురాలైన వెంగమాంబ వీటిని లక్ష్యపెడుతుందా - అయినా ఆ జంతువులేవిటో, ఎందుకొస్తున్నాయో ఆమె గ్రహించలేకపోయిందా! వెంగమాంబ మందహాసం చేసింది. ఓ లక్ష్మినాథా నాకు తెలియదా ఇదంతా దేనికో -  నీ రకరకాల ఆకారాలు, గర్జనలు , కూతలు నేను తెలుసుకోలేకపోలేనని తలచితివా స్వామీ - ఆ ఘోరాకారం వదలి, నేను తెచ్చిన ఈ విందు ఆరగించి పొమ్ము, రమ్ము. నా స్వామీ రమ్ము అంటూ ఆ పెద్దపులిని పిలిచింది...... కానీ శ్రీనివాసుడు ఏమీ తెలియనట్లుగ, భయంకరంగా గర్జిస్తూ, నోరు తెరిచి, వెంగమాంబపై పడి చీల్చి చెండాడేట్లుగా సమీపిస్తున్నాడు వ్యాఘ్రాకారంలో.
    వెంగమాంబ కొంచెం కూడా చెదరలేదు. స్వామీ - మీ లీలలు నాకు తెలుసు -  శాంతించి నా భక్ష్య భోజ్య పదార్థాలు ఆరగించండి, మీ వేడుకలు చాలించండి అని చెప్తున్నా, ఆ వ్యాఘ్రం మింగటానికి సిద్ధమైనట్లుగా వెంగమాంబ పైపైకి వస్తోంది.

    ప్రకృతంతా క్షణంలో పరవశించింది. చెట్ల నుండి పూలు జలజల రాలుతున్నాయి. కోయిల కూస్తోంది. చిలుక పలుకుతోంది. నెమలి నృత్యం చేస్తోంది - ఎందుకు ప్రకృతికీ పరవశం

    శంఖ చక్ర సుదర్శన విగ్రహుడైనాడు స్వామి.

    సౌందర్య లీలా విగ్రహుడైనాడు స్వామి.

    అనంత రవితేజ ప్రకాశమానుడైనాడు స్వామి. కరుణా కటాక్ష వీక్షణాలతో వెంగమాంబకి దర్శనమిచ్చాడు శ్రీనివాసులు ఆ పావన తీర్థ ప్రదేశంలో.

    వెంగమాంబ తనువెల్లా పులికితురాలైంది. స్వామికి కర్పూర నీరాజనం పట్టింది. స్వామి! నా కోరిక తీర్చండి" అంటూ అరటి ఆకు తీసి, శుభ్రం చేసింది. పంచభక్ష్య పరమాన్నాలతో విస్తరి నింపింది. స్వామికి తనే తినిపిస్తూ తన్మయత చెందింది వెంగమాంబ.
    జగన్మోహనుడు భోజనంతో తృప్తిపడ్డాక, తాంబూలం అందించింది వెంగమాంబ. తరువాత మంగళ స్తోత్రాలు పాడింది.
    వెంగమాంబ జన్మ ధన్యమయిపోయిందని భావిస్తూ రోజూ స్వామివారికి భక్ష్య భోజ్యాలు పట్టుకు వెళుతూనే వుంది.
    కానీ, రోజూ ఎక్కడికెళుతోంది. ఇవన్నీ ఎవరికిస్తోందీ అనే ప్రశ్న కోవెల అధికారులకి, అర్చకులకి కలిగింది. ఎలా తెలుసుకోవాలని శతవిధాల ఆలోచించి, వెంగమాంబ వెళ్ళే అడవి మార్గం కనిపెట్టి, పక్కదారిన, వారంతా బయలుదేరి వెళ్ళారు.
    కోవెలాధికారులు దూరంగా, రహస్యంగా దాగివున్నారు. వెంగమాంబ ఒక శుభ్రమైన స్థలంలో కూర్చుంది. తంబుర మీటుతోంది. అంతలో ఒక భయంకరమైన పెద్దపులి గాండ్రిస్తూ, అటు ఇటు పరుగెడుతోంది. చెట్టు వెనక దాగిన వారిలో కొందరు భయభ్రాంతులై మూర్చిల్లారు. కొందరు పరుగుతీసారు. ఆ పెద్దపులి వెంగమాంబపై దూకటం చూసారు కొందరు.
    అయ్యో, వెంగమాంబని పులి చంపి వుంటుందనుకుంటున్నారు. భయంతో గజగజవణికి పారిపోతున్నారు. వెంగమాంబ యథాప్రకారం  శ్రీనివాసుకి భోజనం కోసం అరిటాకు పరిచింది. తానే ఆ స్వామికి తినిపించింది. వెంగమాంబ రోజులాగానే ఇల్లు చేరింది.
    ఆ దాగిన జనులు మూర్చనుండి తేరుకున్నారు. ఆ పెద్దపులి వేంకటేశ్వరస్వామి పులి కాదని, వెంగమాంబ భాగ్యమేమని పొగడగలమని పలువిధాలుగా చెప్పుకుంటూ, కారుచీకటిలో వున్న తమను రక్షించి సురక్షితంగా ఇల్లు చేర్చమని, వేంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. వెంగమాంబను రహస్యంగా పరిశోధించటానికి వచ్చిన తమను క్షిమింపుమని కోరి, అపరాధ రుసుము చెల్లిస్తామని ఆ స్వామిని వేడుకొన్నారు.
    వెంగమాంబపై భక్తి శ్రద్ధలు కుదిరాయి కోవెల అధికారులకి. వెంగమాంబ రచనా వ్యాసంగం సాగుతోంది. యక్షగానాలు రచించింది. ఆరోజు రకరకాల ఆకారాలతో తనపైబడిన స్వామిని తల్చుకుంటూ పరశంతో కళ్ళు మూసుకుంది వెంగమాంబ. ఈ చరాచర సృష్టి రహస్యం తెలిసిన నా స్వామి, నన్ను ఎన్నెన్ని పరీక్షలు చేస్తున్నాడో, ఎన్ని పరీక్షలకైనా నిలబడతాను, కానీ నా స్వామిని చూడకుండా వుండగలనా - వెంగమాంబ గోవింద నామాలు జపించింది. వెంగమాంబకి ఆనాడు స్వామికి విందు  ఏర్పాటు చేసిన విషయం  మళ్ళీ మళ్ళీ మనసులో మెదిలింది. నలుగు పాటలు, అలకతీర్చు పాటలు, నిదరబుచ్చు పాటలు, హారతి పాటలు - అబ్బో, తానెన్ని రచించలేదు స్వామిపై, అయినా, ఆ విందుకు పిలిచే పాట - వెంగమాంబ గొంతులో మళ్ళీ మారుమ్రోగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS