` సీరియస్ గా ఆలోచించారాయన. "నా అంచనా తప్పింది. మళ్ళీ స్టడీ చెయ్యాలి!" అన్నారు.
ప్రొఫెసర్ గారి దగ్గరనించి యింటికెళ్ళి అక్కడినించి ఆఫీసుకి వెళ్ళాడు మోహన్. అతను వెళ్ళిన పావుగంటకి వచ్చాడు శ్యామ్. మామూలుగా విష్ చేశాడు. దగ్గరికి రమ్మని పిల్చాడు మోహన్.
"నిన్న మీరు రూం విషయం అడిగారు కదూ! మా వీధిలోనే ఓ యింటిముందు టులెట్ బోర్డు చూశాను!" అన్నాడు.
"ఎక్కడ? ఎప్పుడు చూశారు?" భరించలేనంత ఉత్కంఠతో అడిగాడు శ్యామ్.
"నిన్న సాయంత్రం"
"మీ యింటి అడ్రస్?" కంగారుగా అడిగాడు శ్యామ్.
తన అడ్రస్ చెప్పాడు మోహన్. "చార్టయితే చూశానుగానీ అది ఫామిలీపోర్షనో, బ్రహ్మచారులపోర్షనో తెలీదు. సాయంత్రం నాతో రండి. అలా మా యింటికెళ్ళి కాస్త కాఫీ తాగి అటువైపు వెళ్ళి ఆ యింటి విషయం కనుక్కుందాం." తలొంచుకుని ఏవో అనుమానం వచ్చి తల ఎత్తాడు యెదురుగా శ్యామ్ లేడు.
ఏడి? ఏడీయన? ఇంతలోనే ఏమైపోయాడు. అయోమయంగా అటూ-ఇటూ చూశాడు. గజానికో అంగచొప్పున వేసుకుంటూ అప్పుడే రోడ్డెక్కేశాడు శ్యామ్. ఎక్కడికి పోతున్నాడో అనుకున్నాడు మోహన్.
అఘమేఘాలమీద అడ్రస్ ప్రకారం మోహన్ చెప్పిన చోటు చేరుకున్నాడు శ్యామ్.
గేటుమీద టులెట్ బోర్డు అలాగేవుంది. అమ్మయ్య యింకా ఎవరేనా తన్నుకుపోయారేమో అని భయపడ్డాను. ఫర్వాలేదు ఖాళీగానే వుంది. గుండెనిండా ఊపిరి పీల్చుకుని గేటుతీసుకుని లోపలికి వెళ్ళాడు. యెదురుగా తలుపుకి తాళం. హతోస్మి అనుకుని అక్కడే నిలబడ్డాడు. విశ్వనాధం అని రానున్న నేమ్ ప్లేటువంకా తలవులవంకా కిటికీలవంకా చూస్తూ దాదాపు అరగంట గడిపాడు.
కాళ్ళు పీకేయి. విసుగు వేసింది. బయటికొచ్చి ఎదురింట్లోకి వెళ్ళి తలుపు తట్టాడు కాసేపటి తరువాత తలుపు తెరుచుకుంది. ఒక అరవై ఏళ్ళ ఆయన తలుపుతీశాడు.
"ఎవరండీ? యెవరు కావాలి?" యెగాదిగా చూస్తూ అడిగాడు. "యెదురింట్లో అద్దెకిచ్చేగది ఉందని తెలిస్తేనూ వచ్చానండీ! తాళం వేసి ఉంది ఆ యింటి వాళ్ళు యెక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా?" వినయంగా చెప్పాడు శ్యామ్.
"విశ్వనాధంగారు ఆఫీసుకెళ్ళుంటారు! వుట్టి లక్ష్మిగారు పెత్తనాలకి వెళ్ళుంటారు" సమాధానం చెప్పాడు ఆయన.
"ఎప్పుడొస్తారండీ?"
"విశ్వనాధంగారు పావుతక్కువ ఆరుకల్లా వచ్చేస్తారు. యికపోతే వుట్టి లక్ష్మిగారు ఒంటిగంటనుండి ఐదున్నర లోపున ఎప్పుడైనా వస్తారు."
ఉసూరు మన్నాడు శ్యామ్ అతని వంక జాలిగా చూశాడు ఆయన. "పాపం చాలా దూరంనించి వచ్చినట్లున్నారు! అన్నాడు.
"అవునండీ!యెండనపడి వచ్చాను. కానీండి ఏం చేస్తాం మళ్ళీ సాయంత్రం వస్తాను" నీరసంగా చెప్పాడు శ్యామ్.
"పోనీ ఓ పని చెయ్యండి ఈ వీధిన యిళ్ళన్నీ చూసుకుంటూ వెళ్ళండి. యేదో యింట్లోంచి మహిళల మాటలు వినిపిస్తాయి. ఆ యింట్లోకి వెళ్ళి వుట్టి లక్ష్మిగారున్నారా అని అడగండి. ఆవిడ వస్తుంది. ఆవిడతో మాట్లాడండి!" సలహా చెప్పాడాయన.
ప్రాణం లేచి వచ్చింది శ్యామ్ కి. "థాంక్సండీ వెళ్ళొస్తా!" అని చెప్పి బయలుదేరాడు శ్యామ్. ఆయన చెప్పిన ప్రకారం ప్రతి యింటి ముందూ ఆగి చూసుకుంటూ వెళ్తుంటే ఓ యింటికి అంతదూరం నుండే కలకలం వినిపించింది. మెల్లిగా ఆ ఇంటి ముందుకి వెళ్ళాడు వాకిట్లో బోలెడు చెప్పులున్నాయి.
కాస్తసంకోంచించి గేట్లోంచి లోపలికి వెళ్ళి వాకిలి ముందు నిలబడి "ఏమండీ" అని పిలిచాడు. కానీ ఆడాళ్లు వినిపించుకోలేదు. అలా నాలుగైదుసార్లు కేక వేశాక లోపలి నించి వచ్చింది ఆ యింటి యిల్లాలు.
"ఏవరండి! ఏం కావాలీ?" అని అడిగింది.
"వుట్టిలక్ష్మి గారున్నారా అండీ!" అతి వినయంగా అడిగాడు శ్యామ్.
వెంటనే లోపలికెళ్ళి కబురు చెప్పింది ఆవిడ. వెంటనే బయటికొచ్చింది వుట్టిలక్ష్మి. అపరిచితుడి యెగాదిగా చూసి "నేనే వుట్టిలక్ష్మిని! ఏం కావాలి?" అంది.
వినయంగా నమస్కారం పెట్టి తనొచ్చిన పని చెప్పాడు శ్యామ్.
"అలాగా! ఒక్కక్షణం ఆగండి!" అనేసి లోపలికి వెళ్ళిపోయింది.
విషయం చెప్పి వెళ్ళొస్తానర్రా అని వాళ్ళ దగ్గర శలవు తీసుకుని బయలుదేరింది వుట్టిలక్ష్మి.
"మీకు శ్రమ యిచ్చాను!" అని నొచ్చుకున్నాడు. ఆవిడ వెనుక నడుస్తూ "ఆ! ఏం ఫర్వాలేదు. మీకు యిల్లు చూపించి మళ్ళీ వస్తాను" తేలిగ్గా అనేసింది వుట్టిలక్ష్మి.
ఈ వుట్టిలక్ష్మికి యింటిపేరు వుట్టి అని పోరాబడతారు కొత్తవాళ్ళు కానీ కాదు, వాళ్ళింట్లో చిన్నతనంలో ఉమ్మడి కుటుంబంలో నాగలక్ష్మి, రామలక్ష్మి, రాజ్యలక్ష్మి వివిధ లక్ష్ములు ఉండేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్లో క్లాసులో కూడా విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, ప్రసన్న లక్ష్మి, వుత్తలక్ష్మి. నాపేరు లక్ష్మి అనగానే ఏ లక్ష్మి? అనేవాళ్ళు, ఏ లక్ష్మికాదు వుట్టిలక్ష్మి అనేసేది. అది అలా అలా అలవాటు అయిపోయి లక్ష్మి కాస్తా వుట్టి లక్ష్మి అయిపోయింది.
వుట్టిలక్ష్మికి పధ్నాలుగో ఏట బావ విశ్వనాధంతో పెళ్ళైంది. పదిహేను నిండేసరికి ఓ కొడుకు పుట్టాడు. చిన్న పిల్ల దాని మొహం దానికేం తెలుసు పిలాడిని పెంచడం అని వాళ్ళ అత్తగారు కోడలివెంట సాయం వచ్చింది ఆ రావటం రావటం రెండేళ్ళు వుండిపోయింది. ఆ మనవడు కాస్తా ఆవిడకి తెగ చేరిక అయిపోయాడు.
అందుకనే వెళ్తూ వాడిని చంకనేసుకుని చక్కాపోయింది. ఆ వెళ్ళటం ఆ పిల్లాడు మళ్ళీ తల్లిద్రండి దగ్గరకు రాలేదు. నానమ్మ తాతగారి దగ్గరే వుండి అక్కడే చదువుకుని అటునుంచి అటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయాడు అతనికి యిప్పుడు పదిహేడు సంవత్సరాలు.
అంటే వుట్టిలక్ష్మికి ముప్ఫై రెండేళ్ళు అయితే ఆవిడని చూసిన వాళ్ళు ఆవిడ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించినా ఆవిడకి అన్నేళ్ళంటే నమ్మరు.
నాజూగ్గా నవనవ లాడుతూ నవ్వుతూ వుండే వుట్టిలక్ష్మి పాతికేళ్ళపడుచులా ఉంటుంది.
తొలిపరిచయంలోనే ఎవరైనా అడిగే ప్రశ్న మీకెంతమంది పిల్లలు? అని. ఆ ప్రశ్నే వేసేవాళ్ళు వుట్టిలక్ష్మిని.
"మాకు ఒక్కడే అబ్బాయి. పోయినేడే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు" అనేది వుట్టిలక్ష్మి.
వాళ్ళు ఆశ్చర్యంపోయి "ఏమిటి? మీకు అంత పెద్ద కొడుకున్నాడా? మీకింకా కొత్తగా పెళ్ళైందేమో అనుకుంటున్నాం" అంటారు.
తళతళలాడే కళ్ళతో గర్వంగా నవ్వుతుంది వుట్టిలక్ష్మి బాహ్య సౌందర్యానికి తగ్గట్టు అమృతంలాంటి హృదయం. విశ్వనాధంకూడా ఆవిడకి తగిన భర్త.
రోడ్డుమీద అడుగుపెట్టింది మొదలు ఆపకుండా గడగడ మాట్లాడేస్తూ శ్యామ్ సుందర్ వివరాలు అన్నీ రాబట్టే సింది ఆవిడ.
పెళ్ళయిందా అనే ప్రశ్నకు గుండె పీచు పీచు మంటూ సమాధానం చెప్పిన శ్యామ్ అలాగా యిదివరకు మా యింట్లో వుండే అతనికీ పెళ్ళికాలేదు. అని ఆవిడ అనే సరికి తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు.
అమ్మయ్య! అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది లక్ష్మి. తాళంతీసి "రండి" అని ఆహ్వానించింది. కూర్చోపెట్టి చల్లటి నీళ్ళు ఇచ్చింది. "పదండి!" అంటూ తీసుకెళ్ళి గది చూపించింది.
