Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 22

    ఉన్నట్టుండి ఒకరోజున ఒక పిడుగులాంటి వార్తా వచ్చిపడింది. గోవింద్ మెడికల్ గా అన్ఫిట్ అవడం వల్ల మిలటరీ లోంచి తీసేస్తున్నారనీ, ప్రస్తుతం అతను రెండు మాసాలుగా ఆసుపత్రిలో వున్నారనీ, కొన్నాళ్ళు మానసిక చికిత్సకోసం, కొన్నాళ్లు జాండిస్ లివర్ ట్రబుల్ వల్లా, అన్నీ తగ్గినా నరాలబలహీనత తగ్గకుండా నానాటికీ ఎక్కువవడంవల్ల అతన్ని తీసేస్తూన్నట్లు అక్కడినుంచి వచ్చిన మేజర్ సింగ్ చెప్పాడు సుమతితో. మిలటరీ లోంచి వచ్చేస్తూన్నందుకు సంతోషించింది కానీ, అతని ఆరోగ్య విషయాలు విని యమబాధపడింది సుమతి. నెత్తిన పిడుగు పడ్డట్టే అయింది. ఇంటిల్లిపాదీ ఆందోళన చెందారు.
    మరో నెల పోయాక గోవింద్ ఇంటికొచ్చాడు. మనిషిని చూస్తే గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. గుంటలుపడ్డ కళ్ళూ, బక్కచిక్కిన శరీరం, అక్కడక్కడ నెరిసిన జుట్టూ మనిషి రూపమే మారిపోయింది. అతన్ని చూడగానే సుమతి కళ్ళు వర్షించాయి.
    మంచాని కంటుకుపోయున్న, తల్లిదండ్రులని చూసి కుమిలిపోయాడు గోవిందు నవనవలాడే సుమతి, చిలిపితనాల సుమతి కళావిహీనంగా కళ్ళచుట్టూ నల్లటి గుంటలు, పీక్కుపోయిన మొహం జబ్బు మనిషిలా వుంది. గోవిందుకి దుఃఖం  ముంచుకోచ్చింది.
    ఆ రోజు సాయంత్రం విచారంగా కూర్చున్న గోవిందుని భుజంతట్టి లేపాడు డే. డ్రింక్ గ్లాసులో పోసి చేతికిచ్చాడు.
    "ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్లు తాగవద్దన్నారు వద్దు" అంది సుమతి.
    "కొంచెం ఒక్క పెగ్గే.... .... కొంచె 'రిలాక్సింగ్' గా కులాసాగా వుండడంకోసం అంతే కానీ గ్లాసులు తాక్కూడదు" వాదించాడు డే.
    సుమతి వాదించలేకపోయింది. గోవిందు, తాగాలనే కోరికని అణగ దొక్కుకోలేక పోయాడు.
    "గ్లాసులూగ్లాసులూ కలిశాయి. "చియర్స్" గెలిచింది.
    చింటూ, పాప దెబ్బలాడుకున్నారు. చింటూ పాపని రెండు కొట్టాడు చెంపమీద. అది ఏడుపు లకించుకుంది. "అబ్బ.....రాక్షసులు ప్రాణం తీస్తున్నారు" అంటూ లేవబోయిన సుమతిని వారించింది సుబ్బలక్ష్మి, "నే చూస్తాలే నువ్వు కూర్చో" అని. సుమతి కూర్చుంది డే ఏదో చెబుతూంటే వింటూ.
    సిగరెట్టు వెలిగించి, అగ్గిపుల్లలు అయిపోండంవల్ల వంట ఇంట్లోకి అగ్గిపెట్టెకోసం వెడుతూన్న గోవిందు, ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. అడుగు ముందుకు పడడంలేదు కోపంతో అణువణువూ వొణుతోంది. "సుబ్బలక్ష్మి...." వెఱ్ఱివాడిలా అరిచాడు. చెరోగ్లాసుడు విస్కీ ఇద్దరు పిల్లలకీ, గబగబా తాగిస్తూన్న సుబ్బలక్ష్మి ఉలిక్కిపడింది. నోటమాటరాక స్దాణువులా నుంచుండి పోయింది.
    "ఇదా నీ ఊరుకో బెట్టడం. అన్నెంపున్నెం ఎరుగని ఆ పసికూనలని తాగించి పడుకోబెడతావా? నువ్వసలు మనిషివేనా?" అరిచాడు గోవింద్.
    ఆ అరుపులు విని పైకొచ్చారు డే, సుమతి. గడగడా తాగుతూన్న ఆ పిల్లల్ని చూస్తే ఏడుపు ముంచుకొచ్చింది సుమతికి. గబగబావెళ్ళి వాళ్ళ చేతుల్లోని గ్లాసులు తీసేసుకుంది. అప్పుటికె వాళ్ళు గ్లాసు ఖాళీ చేపేశారు. సుమతి షాకు నుంచి తేరుకునే సరికే పిల్లలిద్దరూ నిద్రాదేవి ఒడిలోని వాలిపోయారు. ఇద్దర్నీ తీసికెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, వెక్కివెక్కి ఏడ్చింది సుమతి. 'తన జీవితం ఎందుకిలా మారిపోయింది? ఏ ఆశయాలతో పెరిగిందీ? ఏ ఆశలు పెంచుకుంది?  చివరికి ఈ రకంగా మారిపోయింది. తనుతనేనా?' తలుచుకున్న కొద్దీ, దుఃఖ కట్టతెంచుకు ప్రవహిస్తోంది.
    వెఱ్ఱిఆవేశంతో, గోవిందు గ్లాసులుతీసి అవతల విసిరిపారేశాడు.  గదులోని సోడాసీసాలూ, విస్కీ సీసాలూ, తీసి చెత్తడబ్బాలో కుమ్మరించాడు. నోరు కడుక్కోచ్చి సుమతి పక్కన కూర్చున్నాడు.  అతనివొళ్ళో తలపెట్టుకుని పసిపాపలా ఏడ్చింది సుమతి. "నా కెందుకీ శిక్ష? నా బ్రతుకెందుకిలా నాశన మయింది? చిన్నపుడే తల్లిని పోగొట్టుకున్న అభాగ్యురాలిని కోరుకున్న ఇంటికి కోడలిగావచ్చి, తృప్తిగా  బతుకుదామనుకున్నాను. అమ్మలా, ఆదరించే అత్తయ్యకి కొన్నాళ్ళు దూరంగా వున్నాను. తీరా దగ్గరకొచ్చి వుండే సమయానికి, అనారోగ్యం ఆమెని మంచం ఎక్కించింది ఆస్తి, అయినవాళ్ళూ  అన్నీ వుండగా ఎండమావులని వరించి, మీరు కష్టాలని కోరితెచ్చుకున్నారు. తల్లి ప్రేమకు నోచుకోకపోయినా పెంచి పెద్దచేసిన ఆయమ్మనీ పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని తలీ, తండ్రీ, భర్తా, ఆయమ్మా అందరికీ దూరమై, డబ్బు మనుష్యుల  విషవలయంలో చిక్కుకుని, శ్లేష్మంలో ఈగలాగ కొట్టుమిట్టాడు తున్నాను. దానికితోడు ఈ వ్యసనాలు అంటురోగాల్లా, పీడిస్తున్నాయ్. మీ ఆరోగ్యం పాడాయిపోయింది. దేన్ని చూసి బ్రతకాలి? ఏం చూసి మరవాలి? ఇంతకన్నా చావు నయం. ఛస్తూ బ్రతకడంకన్నా ఒక్కసారి చావడం మేలు." లేచి గోడకేసి తలబాదుకుంది.
    "సుమతీ! నీకు మతిపోయిందా? ఆగు" చెయ్యిపట్టి లాగాడు గోవింద్.
    "ఆపకండి! నన్నాపకండి! నన్ను చావనివ్విండి" చెయ్యి విదిలించుకుని తల కొట్టుకుంది.
    "సుమ్మీ....." భూమిదద్దరిల్లెలా అరిచాడు గోవిందు.
    "ముందు పిల్లల్ని చంపు. ఆ తరువాత నువ్వూ నేనూ కూడా చచ్చిపోదాం. అంతేకానీ, పిల్లల్ని వదలి, నన్ను, వదిలి నువ్వొక్క దానివే చచ్చిపోవాలను కోవడం స్వార్ధం ఊఁ....కానీ, ముందు వీళ్ళని చంపు." నిద్రపోతూన్న పిల్లలమీదకి తోశాడు గోవిందు. అచేతనంగా పడుకుని కడుపు చిరిగేలా ఏడ్చింది సుమతి.
    "సుమ్మీ ..... ఊరుకో ..... నీ అశాంతికీ నీ బాధలకీ అన్నింటికీ మూల కారణం నేను. నీ మాటవినీ, నీ  సలహా పాటించి వుంటే ఈ రోజు మనం ఇలా  వుండే వాళ్ళం కాదు. ఈ అస్తవ్యస్తాలు జరిగేవికావు మనస్తాపం వుండేది కాదు. నన్ను క్షమించు సుమతీ! ఇక నుంచి నీ మాట కాదనను.  నిన్ను పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాను. నువ్వు మామూలు మనిషివికా. మళ్ళీ మన జీవితాల్లో వసంతం కరుస్తుంది. చనిపోయిన ఒక్క మీ నాన్నగారిని తప్ప సర్వసుఖాలూ అందిస్తాను. ఆయమ్మ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మనింట్లో వుంచుతాను, పనికోసం కాదు. పిల్లలకోసం , మన  సుఖం కోసం, ఆమె బుణం తీర్చుకోవడం కోసం." భుజాలైత్తి లేవదీసి, కళ్ళు తుడిచాడు.   
    ఈ గొడవంతా విని, లేవలేక లేవలేక సుమతిగదిలోకి నడిచోస్తూన్న నరసింహారావుగారు కాలుజారి పడిపోయారు. అందరూ అటుకేసి పరుగెత్తేరు.
    నోంట్లోంచి నురగోస్తోంది. కళ్ళు తేలేశారు. గుండె గబగబా కొట్టుకుంటోంది.
    చప్పుడు విని బయటకొచ్చారు సుమతి, గోవిందు. క్రిందపడున్న అతన్ని చూసి కంగారుగా దగ్గరికి పరుగెత్తారు.
    డాక్టరుకి ఫోన్ చేసి వచ్చాడు గోవిందు.
    "ఇలా రండి బాబూ!....గోవింద్ ..... అమ్మా!.....సుమతీ..... నన్ను.... మన్నించండి.... నా వల్లే..... ఇదంతా జరిగింది. చెల్లెలు కదా అని జానకనీ, దాని కూతురు సుబ్బలక్ష్మినీ,.... నమ్మాను. నా కోంపకే..... చిచ్చుపెట్టి, ఆ వేడితో వాళ్ళు వేన్నీళ్ళు.... కాచుకుంటున్నారు....నన్ను.....క్ష....మిం.....చండి...." గోవిందు చేతులు పట్టుకుని సుమతికేసి ప్రాధేయ పూర్వకంగా చూశారు.
    "డా.....డీ!... అలా అనకండి ఇందులో నా తప్పు కూడా వుంది. కన్నవాళ్ళ మాట కాదనీ, నా ఆనందం కోసం, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాను. మీ బాధల్నికానీ బాధ్యతల్నికానీ తెలుసుకోలేక పోయాను నన్ను మన్నించండి డాడీ" తండ్రి చేతుల్లో మొహం పెట్టుకుని వలవలా ఏడ్చాడు గోవిందు.
    "మామయ్యా.....ఎందుకిలా లేచోచ్చారు! ఎంత ఘోరం జరిగిందో చూడండి. నాన్నని పోగొట్టుకున్న నేను, మీలో నాన్నని చూసుకుంటూ బ్రతుకు తున్నానే!  భర్తదూరంగా వున్నా, బాధ్యతలెన్నున్నా, మీలో నాన్నని చూసుకుని తృప్తి పడుతున్నాను. ఎందుకిలా చేశారు?" అతని మీదపడి కుమిలికుమిలి ఏడ్చింది సుమతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS