Previous Page
అశ్రుతర్పణ పేజి 23

    "చాలమ్మా! చాలు. నా కీ అశ్రుతర్పణ చాలు. నా తప్పులు.....మన్నించి.....నా కోసం.... బాధపడే వాళ్ళున్నారన్న....తృప్తితో .....ప్రశాంతంగా పోతాను సుమతి.....మీ అత్తయ్య....గోవిందు.....పిల్లలు .....జా.....జా....గ్రత్త.....మ్మా!"
    "డా.....డీ!"
    "మామయ్యా....."బావురు మన్నారిద్దరూ.
    ఇంతలో డాక్టరోచ్చాడు. తెరచి వున్న కళ్ళని మూసేశాడు. పెదవి విరుస్తూన్న డాక్టర్ని చూసి తలబాదుకు నేడ్చాడు గోవిందు. గుండె బద్దలయ్యేలా ఏడ్చింది సుమతి.
    మంచం దిగలేక, గట్టిగా ఏడవలేక గిలగిల కొట్టుకుంటూన్న కామాక్షమ్మగారికి మత్తు ఇంజక్షన్  ఇచ్చాడు డాక్టరు. బాధ గొంతు దాటి రాకుండా మగతలోకి జారిపోయింది కామాక్షమ్మ.
    షాక్ కొట్టిన వాళ్ళలా మూగగా వుండిపోయారు. సుబ్బలక్ష్మీ, డే, జానకమ్మ.
    పది నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది వార్త. వాసుదేవ లైబ్రరీలో ఆయాగా కుదిరిన ఆయమ్మ పరుగెత్తుకొచ్చింది. అందరూ పోగయ్యాక గట్టిగా శోకాలు మొదలెట్టింది జానకమ్మ. సుబలక్ష్మి కూడా శృతి కలిపింది. నెత్తిమీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు డే.
    సుమతి నీరసంగా పడిపోవడం చూసి మొల్లగాలేపి గోవిందు సహాయంతో మంచంమీద పడుకోబెట్టింది ఆయమ్మ. మంచినీళ్ళు తెచ్చి తాగించింది ఏడవోద్దంటూ సుమతీనీ, గోవిందునీ ఓదార్చింది.
    "దేముడిలాంటి మా అన్నయ్య. ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోతున్నాడే అమ్మో!..... పచ్చటి వాళ్ళ సంసారం.... చూళ్ళేక, ఎవరేంచేసారో నమ్మా....'చెల్లీ'.....అని, ఎంతప్రేమ పెట్టేవాడే తల్లీ!....ఇలా హఠాత్తుగా....ప్రాణాలు పోగొట్టుకున్నాడే నాయనోయ్..... పెద్దగా రాగాలు తీస్తున్న జానకమ్మని చూస్తూన్న కొద్ది, అసహ్యం పుట్టుకొస్తుంది గోవిందుకి. నలుగురిలో ఏమీ అనలేక, ఆమె మాటలు వినలేక, అక్కణ్ణుంచి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు గోవిందు.
    డే టెలిగ్రాం ఇచ్చాడు బావమరదులకి పోలోమంటూ అందరూ వచ్చారు రోడ్డుమీంచే ఏడ్చుకుంటూ. ఇల్లంతా గోలగారోదనతో నిండిపోయింది. మరి కాస్సేపటికి, నరసింహారావుగారి శరీరము మట్టిలో కలిసిపోయింది, భార్యా, కొడుకూ, కోడలూ, ఇల్లూ, వాకిలీ. డబ్బూ, హొదా అనే అన్ని సంకెళ్ళనూ తెంచుకుని. ఇల్లంతా బావురుమంది. ఆ విషాదంలో మమతా, మనసూ. బంధం, ప్రేమా అనే పొరలు ఇంకా ఎక్కడో పోయిన మనిషికి చిహ్నంగా మిగిలిస్తున్నాయి.
    పెద్ద ఎత్తున ఖర్మకాండ జరిపించాలని, కొడుకులను పురమాయించింది జానకమ్మ. బ్రాహ్మణులూ, మంత్రాలూ, తంత్రాలూ, సంతర్పణ చేస్తారు. సానుభూతి ఒలకబోస్తూనే, గోదానానికీ, భూదానానికీ, సువర్ణదానికీ బేరాలు చేస్తారు. మనిషికి మనిషిగా తోడుండలేక, సాయపడలేక మనసునూ, మమతనూ, పంచుకొలక , పెంచుకోలేక, బతికున్నంత సేపూ ఆడిపోసుకునే జనం చచ్చిపోయాక బ్రహ్మరధంపడతారు.
    జానకమ్మనీ, ఆమె కొడుకుల్నీ, సుబ్బలక్ష్మినీ, డేని చూస్తూ వుంటే గోవింద్ కి చిర్రెత్తుతోంది. ఎలాగో పన్నెండు రోజులూ పూర్తయ్యాయి.
    డే, 'ఆంటీ ఆంటీ' అంటూ కామాక్షమ్మ మంచందగ్గరే కూర్చుంటున్నాడు. "ఒదినా.....ఒదినా అన్నం తింటావా.....పాలు తాగుతావా" అంటూ ఎనలేని ప్రేమ ఒలకబోస్తుంది జానకమ్మ. కడుపునిండా తినడం, కళ్ళనీళ్ళు పెట్టుకోవడం- వీళ్ళ ప్రవర్తన భరించలేక పోతున్నాడు గోవింద్.
    ప్రేమ పేరుతో తల్లి దండ్రులను కాదని నరసింహారావుగారి పంచన చేరి, పైలా పచ్చీసుగా తిరుగుతూ, సుబ్బలక్ష్మి నడ్డుగా పెట్టుకుని, సర్వాధికారాలతో, సకల భోగాలను అనుభవిస్తున్న డే అంటే రోత పుట్టింది గోవిందుకి. రక్త సంబంధాన్ని ఎఱగాపెట్టి, తోబుట్టువుకే టోపీపెట్టి. డబ్బుకోసం గడ్డితింటూన్న జానకమ్మ అంటే అసహ్యం ముంచుకొచ్చింది. ఆడపిల్ల అండచూసుకుని, ఆమె పేరుతో , చాటుమాటుగా డబ్బులందుకుంటూన్న సుబ్బలక్ష్మీ సోదరులంటే మొహాన ఉమ్మ బుద్దయింది. ఆమెచేత నాటకమాడిస్తూ ఆ డబ్బుమీద వీళ్ళు బ్రతకడం, హీనాతిహీనంగా అనిపించింది. ఈ డబ్బు మనుష్యులందరినీ ఇంట్లోంచి పంపించేయకపోతే, మన శ్శాంతి కూడా కరువైపోతుందనిపించింది. ఇన్నాళ్ళూ అమ్మా, సుమతీ వీళ్ళ మధ్యన ఎలా బతికేరో తలుచుకుంటే ఏడుపోచ్చింది. వీళ్ళ విషవలయంలో చిక్కుకుని మోసపోయిన తండ్రిని తలుచుకుంటే జాలి ముంచుకొచ్చింది.
    పిచ్చివాడిలా అరిచాడు "అత్తయ్యా....ఇట్రా" అని.
    "పిలిచావా నాయనా" ఆప్యాయత ఒలకబోస్తూ దగ్గర కొచ్చింది జానకమ్మ
    "ఎప్పుడు మీ ప్రయాణం?" కటువుగావుంది గోవిందు గొంతు.
    ఎదురు చూడని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో జానకమ్మకి అర్ధంకాలేదు.
    "వాళ్ళంతా రేపు వెళ్ళిపోతారు. రేపు వుండకూడదుకూడా."
    "మరి మీరూ, సుబ్బలక్ష్మీ, డే....."
    "..... ....."
    "మాట్లాడరేం? ఇంకా ఇక్కడేఉండి మా ప్రాణాలు కూడా తీద్దామను కుంటున్నారా?" మరింత కటువుగా అన్నాడు.
    జానకమ్మకి నోట మాట రాలేదు. ఈ ఐశ్వర్యం, ఈ హొదా అంతా మూన్నాళ్ళ ముచ్చటగా కూలిపోతూన్నట్టనిపించింది. పైగా సుబ్బలక్ష్మి మొగుడికి ఉద్యోగం కూడా లేదు. దద్దమ్మలైన కొడుకులూ, సూర్యకాంతాల్లాంటి కోడళ్ళూ-భావిజీవితం అంతా  అగమ్యగోచరంగా, చీకటి కుప్పలా కనిపించింది. "అల్చుడైన వాని కాలియగుటకన్న అధికుడైన వాని ఇంట దాసి యగుటమేలు" అన్నపద్యం గుర్తుకొచ్చి, ఆ నరకకూపంలోకి తిరిగి పోవడంకన్న, ఇక్కడే వంటపనిచేస్తూవుండిపోతే బాగుండు ననిపించింది. ఆ మాటే మెల్లగా అంది జానకమ్మ.
    "వీల్లేదు. వంట సుమతి చేస్తుంది. అమ్మని చూసుకోవడానికి నర్సుని కుదిర్చాను . పిల్లలు ఆయమ్మతో ఆడుకుంటారు. మీ దయా దాక్షిణ్యాలు మా కఖ్కరలేదు సరికదా, మీ మొహం మాకు చూపించకుండా వుండడానికి మీరేం తీసుకుంటారో చెప్పండి? మీక్కావలసిన డబ్బిస్తాను, తీసుకొండి." అంటూ ఇంక ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు గోవిందు.
    నిశ్చేష్ఠురాలై నిల్చుండిపోయింది జానకమ్మ. మూటా ముల్లేపట్టుకు వెళ్ళిపోతూన్న వాళ్ళకేసి చూసి, తృప్తిగా నిట్టూర్చాడు గోవిందు.
    "వెళ్తానమ్మా....." తయారయింది ఆయమ్మ.
    "ఆయమ్మా! ఎక్కడికెళతావు? ఇది నీ ఇల్లు. నీ జీవితాంతం నువ్వు మాతోనేవుండు నువ్వేపనీ చెయ్యఖ్కరాలేదు. సుమతినీ, పిల్లల్నీ కనిపెట్టుకునుంటే చాలు. ఈ రోజునుంచి నువ్వు పిల్లలకి ఆయమ్మవికాదు. అమ్మమ్మవి" బతిమాలుతూన్నట్టుగావుంది గోవిందు కంఠం.
    "బాబూ!" అవును. నిన్ను నేనుకూడా ఆయమ్మఅనికాక అమ్మా అని పిలుస్తాను అమృతం కురిపించే నీ మనసు అమ్మలాంటిదే ఉండిపో అమ్మా." సంతోషంతో పాదాభివందనం చేసి ఆమె పెట్టె బెడ్డింగూ తీసికెళ్ళి లోపల పెట్టింది సుమతి.
    "చిన్న ఇంట్లో పుట్టినా, పెద్ద ఇంట్లో పెరిగినందుకు నాకు పెద్ద స్దానాన్నే ఇచ్చాడమ్మా భగవంతుడు" అంటూ పిల్లల్ని ఇద్దర్ని చెరో చంకన పెట్టుకుంది ఆయమ్మ. మంచంమీంచి సంభాషణంతా వింటాన్న కామాక్షమ్మ, తేలిగ్గా నిట్టూర్చింది.
    ఒకరోజు సాయంత్రం పిల్లలిద్దరికీ కథలు చెబుతుంది ఆయమ్మ. వసారాలలో కూర్చుని, బజ్జీలు తింటున్నాడు గోవిందు సుమతి వేడివేడిగా అందిస్తుంటే. తల్లి ప్రక్కన కూర్చుని కబుర్లు చెబుతూ చింటూ అడుగు తున్నాడు- "ఆయమ్మ.... .....కాదు అమ్మమ్మా..... పిన్నిచ్చేదే జూసూ అది తాగితే తప్పా...."
    "అవును బాబూ.... అది ఒంటికి మంచిదికాదు." 
    "అయితే మమ్మీ.....డాడీ....పిన్ని.... అంకుల్ వాల్లందరూ.....ఎందుకు తాగేవాల్లూ....."
    "తాగకూడదని తెలీక. డాక్టరుగారు 'తప్పు....ఇది తాగాకూడదు' అని చెప్పాక మానేశారు. చూడు! ఇప్పుడు తాగుతున్నారా?"
    "లేదు చెల్లీ..... ఎప్పుడూ అలా సీసాల్లోని తాగకూడదు. తాగితే జరం ఒత్తుంది. అది విషం అందుకే చేదుగా వుంటుంది కదూ అమ్మమ్మా...."
    "అవును బాబూ! బాగా పాలుతాగాలి పళ్లు తినాలి. అప్పుడు జరం రాదు."
    "నాకు తెలుసు అప్పుడు మమ్మీకి ఊలికే జలం ఒచ్చేది కదూ! అందుకే కొట్టేదికూడా  కోపం ఒత్తే ఇప్పుడు రావట్లా."
    వాళ్ళ సంభాషణ వింటూవుంటే సుమతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ చిన్నారి బుఱ్ఱలు ఇన్ని ఆలోచించగలవని తను ఊహించనైనా లేదు. తన గతం తనకే సిగ్గనిపించింది.
    "ఏడువకు సుమ్మీ! గతం మనకొక పీడకలలాంటిది. మరచిపోక తప్పదు. ఊరుకో....." కళ్లు తుడిచాడు గోవిందు.
    "నా ప్రవర్తన నాకు తెలీకుండానే ఆ పసి హృదయాలను గాయపరిచింది వాళ్ళ చిన్నారి మనసుల్లో సుడిగుండాలను సృష్టించింది. అది  అలాగే కొనసాగివుంటే,....."
    "మరిచిపో సుమ్మీ! పిల్లలేప్పుడూ పెద్దలని అనుకరించడానికి ప్రయత్నిస్తూ వుంటారు. వారి మనోభావాలని గమనిస్తూ వుంటారు అందుకే పిల్లల నెప్పుడూ ఆరోగ్యమైన వాతావరణంలో వుంచాలంటారు. వారి ముందు కీచులాడుకోవడం, అబద్దాలాడడం, దుష్ర్పవర్తన ఏదీ చెయ్య కూడదు. పసిపిల్లల మనస్సు అద్దంలాంటిది. దాట్లో వాళ్ళు మన ప్రతిబింబాలనే చూసుకుంటారు. అందుకు మన ప్రవర్తన బాగా వుండడం ఎంతో అవసరం. అందులో చురుకైన పిల్లలయితే మరీనూ సరే! అయిందేదో అయిపోయింది. ఇప్పు  డావిషయాలన్నీ మరచిపోయి ఇకనుంచి మన పిల్లల్ని బంగారు తల్లులాగా తయారు చేద్దాం. ఏదీ.....నవ్వు.... విచారం నీ మొహంలో ఇంకెప్పుడూ కనబడకూడదు...." సుమతిని దగ్గరకు తీసుకున్నాడు.
    "అత్తయ్య" అంది కంగారుగా సుమతి.
    "అమ్మ పడుకుంది ఏదీ ఇవ్వు" అంటూ మరింత దగ్గరి కొచ్చాడు గోవిందు.
    "ఏమిటి బజ్జీయా?....." జరగబోయింది సుమతి.
    "కాదు ముద్దు."
    "ఛీ.....పోండి" సిగ్గుతో దూరం జరుగుతూన్న సుమతిని చుట్టేసి ముద్దుపెట్టుకున్నాడు గోవిందు.
    "డాడీ...నన్నూ ముద్దుపెట్టుకోండి" అంటూ దగ్గరి కొచ్చింది పాప. ఉలిక్కిపడ్డారు ఇద్దరూ కోపంగా చూసింది సుమతి గోవిందుకేసి.
    నవ్వుతూ "రా....బేబీ...." అంటూ ఎత్తు కున్నాడు గోవిందు.
    "నన్నూ" అంటూ పరుగెత్తుకొచ్చి సుమతిని చుట్టేశాడు చింటూ.
    "ఓ....కే...."అంటూ ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది సుమతి. ఆ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంలో, ఏవో లోకాల్లో తేలిపోయింది.
                            (శుభం)


 Previous Page

WRITERS
PUBLICATIONS