Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 21

    జానకమ్మగారూ....నేను  నీ ఇంటి పనిమనిషికాదు. నీ ఇష్టం వోచ్చినట్లుమాట్లాడ్డానికి. సుమతమ్మ మొహం చూసి ఊరుకుంటున్నాను కానీ, లేకపోతే, ఈ  పాటికి నీ బండారం, నీ బిడ్డ బండారం ఎప్పుడో బయటపాడేది" దుఃఖం ముంచుకోస్తూంటే కసిగా అంది ఆయమ్మ.
    "చూశావా బాబూ! దానిపొగరు. అది పనిమనిషా? ఇంటి మనిషికి మొగుడు."
    "పిన్నిగారూ అనవసరంగా మాటలెందుకు? డబ్బుదొరికింది కదా, ఇటివండి" అంది సుమతి.
    "అంటే నీ ఉద్దేశం, నీ మనిషి తప్పుచెయ్యలేదనా? దొంగ కాదనా? నీ వాలకం చూస్తే, ఆ డబ్బు నేనే తీశాననేటట్టున్నావ్" కళ్లంట నీళ్లు పెట్టుకుంది జానకమ్మ.
    "అవును, ఆ పని మీరే చేశారు. అది నాకు తెలుసు" అంది ఆయమ్మ.
    "చూశావా. బోడి పని మనిషి, చిన్నా పెద్దా లేకుండా ఎంతలేసి మాటలంటోందో? అయినా  నిన్ననేం లాభం? అది నీ ఏజంటేనాయ్."
    "పిన్నీ" బాధగా అరిచంది సుమతి.
    "ఇంతా ఏం పిన్నీ. నా అన్నయ్యా, ఒదినా ఎప్పుడైతే అడ్డం పడ్డారో, అప్పుడే నేనిక్కడే పరాయిదానితో సమానం. బాబూ గోవిందూ! ఏదో బుద్ది తక్కువయి నేనూ, నాబిడ్డా ఇక్కడున్నాం. తగిన శాస్తి జరిగింది. ఇక పోతాం" విసురుగా వెళ్ళబోయింది.
    "అత్తయ్యా! మీరున్నది నాన్నగారి ఆజ్ఞవల్ల. ఒక పని మనిషి మూలంగా, మీరు ఇల్లు విడిచి వెళ్లిపోవడం ఎవరైనా వింటే నవ్వుతారు. ఆయమ్మనే పంపించేస్తాను. మీరూ, సుబ్బలక్ష్మి ఇక్కడే వుండండి."
    "ఏమండీ!' ' మతిపోయిన దానిలా  అరిచింది సుమతి.
    కళ్లంట నీళ్ళు జల జలా రాలాయి.
    "సుమ్మీ! నువ్వూరుకో.....నాకు బండి టైమవుతోంది. కన్నీళ్ళతోనా నన్ను పంపడం. ఊరుకో....!" కళ్ళు తుడిచాడు గోవింద్. ఈసారి ఏర్ ఫోర్టుకి డే ఒక్కడే వెళ్లాడు. పాపకి కొంచెం జలుబుగా వుండడంవల్ల సుమతి ప్రయాణంకాలేదు.
    తన పెట్టె, బెడ్డింగూ పట్టుకుని బయలుదేరింది ఆయమ్మ. "ఆయమ్మా!...." అంటూ ఆయమ్మని కౌగలించుకుని, గుండెబద్దలయ్యేలా ఏడ్చింది సుమతి.
    "నువ్వు దొంగనికావు ఆయమ్మా....దోంగవికావు. నన్ను కన్నతల్లిలా పెంచి, కంటి రెప్పలా కాపాడుతూ వచ్చిన నువ్వు, నా దగ్గర డబ్బు దొంగిలిస్తావంటే చస్తే నమ్మను. నీ మనసు నాకు తెలుసు. నీకు డబ్బే కావలిస్తే, నాన్నగారి దగ్గర ఎంతైనా తీసుకు నుండే దానివి. నాకు తెలుసు ఆయమ్మా నువ్వు దొంగని కావని."
    "కానీ, ప్రపంచం సాక్ష్యాలనే నమ్ముతుందమ్మా. నా భయమల్లా తల్లీ, తండ్రీలేని నువ్వు, భర్తకీ దూరంగా వుండి, రాక్షసు ల్లాంటి ఈ మనుష్యుల మధ్య ఏలా బతుకుతావోననేనమ్మా." వల వలా  ఏడ్చింది ఆయమ్మ.
    "ఆయమ్మా నువ్వెళ్ళకు."
    "ఒద్దమ్మా. డబ్బు పోయినచోట, ఎలాగో అలాగ బతకొచ్చు. కానీ, పరువుపోయిన చోట, తలెత్తుకు తిరగడం కష్టమమ్మా. నన్ను పోనివ్వు పోయేముందు ఒక్కమాట. నీ ఆరోగ్యం జాగ్రత్తమా. నీ అలవాట్లను మార్చుకో తాగుడు మంచిదికాదు."
    అయిదొందలు  తెచ్చి ఆయమ్మ చేతిలో పెట్టింది సుమతి.
    "ఒద్దమ్మా....ఒద్దు. ఒక వంద ఇవ్వు చాలు. నేను మా అన్నయ్య ఊరికి వెళ్ళిపోతాను."
    "కాదు. ఈ అయిదోందలూ వుంచుకో" అని బలవంతం చేసింది సుమతి. కొన్ని చీరలూ రవికలూ ఇచ్చింది. కనుమరుగయ్యేదాకా చెయ్యూపుతూ సాగనంపింది.  "ఈ  బుణానుబంధం ఇంతవరకేనేమో" నని తలుచుకుని తలుచుకుని, పిచ్చిదానిలా ఏడ్చింది. తండ్రిపోయాక అత్తగారూ, ఆయమ్మ రెండు కళ్ళలా కాపాడారు. ఇప్పుడు ఇద్దరూ దూరమై పోయారు. కామాక్షమ్మ గారికి మామూలు లోకంతో సంబంధం లేకుండా మత్తుమందులే.
    విస్కీ సీసా తెరిచింది గ్లాసు నోటిముందు పెట్టుకోబోతూంటే ఆయమ్మ మాటలే జ్ఞాపకం వచ్చాయి. మానేసింది. వంటరిగా ఎంతసేపో కూర్చుంది. గంటలు గడచి పోతున్నాభోజనానికైనా రమ్మనమని పిలిచేవాళ్లు కరువైపోయారు. మనస్సు కలవర పడుతుంది. ఏడుపు ముంచుకోస్తోంది. తనివితీరా ఏడ్చించిది. ఆయమ్మమాటలు వినపడకుండా చెవులకి మనసు  నడ్డంపెట్టి గుటుక్కున మింగేసింది రెండుగుక్కలవిస్కీ. అంతే! అంతా మరచిపోయింది. పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. సుబ్బలక్ష్మి వచ్చి పిల్లల్ని తీసికెళ్ళింది.
                            *        *        *
    కాలచక్రం తిరుగుతోంది. కాలెండర్లో మరో ఆరు పేజీలు తిరిగిపోయాయి. నరసింహరావుగారి గాయాలు మారిపోయినా  ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. పైగా  మానసికంగా బాగా కృంగిపోయారు. సుమతిని చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఆ యమ్మపైన దొంగతనం కట్టి, తరిమే శారన్న వార్తా ఆయన్ని కలవరపచింది. జానకమ్మ పెత్తనం, మిగతావారి ప్రవర్తనా కొద్ది కొద్దిగా అర్ధమవుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్ధితిలో వున్నారాయన. గోవిందా దగ్గరలేడు. సుమతికూడా మనోవ్యాధితో కృంగిపోతుంది. చుట్టూ వున్నవాళ్ళు డబ్బు మనుష్యులు. ఆలోచనలతో కృంగిపోతున్నారాయన. మానసికాందోళనతో హృద్రోగం పట్టుకుంది. మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి, నిద్ర మాత్రలే మార్గదర్శకం. కామాక్షమ్మగారికి సరేసరి భోజనం  పెట్టకపోయినా భాదలేదేమోకానీ, నిద్దర మాత్రలు లేకపోతే భరించలేదు.
    రోజూ భోజనం కాగానే, తలకింద సీసాలోంచి ఒక మాత్రతీసి వేసుకోవడం గమనించిన చింటూ రాత్రి అన్నంతినగానే ఒక  రోజున ఆ సీసాలోంచి మాత్ర తీసి వేసుకోవడం చూసిన సుమతి అదిరిపోయింది. సీసా ఆమె తలక్రిందనుంచి తీసేసి బీరువాలో పెట్టింది.
    "తెలివైన పిల్లలు ఎప్పుడూ పెద్దల ననుసరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి, పెద్దలే మార్గ దర్శకులు" అని ఆయమ్మ చెప్పినమాటలు గుర్తుకొచ్చాయి సుమతికి. పాపకూడా మెల్లగా గోడలుపట్టుకు నడుస్తోంది. చిన్న మాటలు కూడా మాట్లాడుతోంది.

    డే తల్లితండ్రులు సుబ్బలక్ష్మిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. డే రిజిష్టరు పెళ్లి చేసుకుంటానన్నాడు. సుబ్బలక్ష్మి సరేనంది నరసింహారావుగారు అసలు మచందిగి నడిచే పరిస్ధితిలో లేరు. అందుకని రిజిష్ట్రారు ముందు దండలు మార్చిడీలతో పెళ్లికానిచ్చుకున్నారు. సుబ్బలక్ష్మి అన్నలూ  వదినలూ వచ్చారు. అన్నాలు సాక్షినంతకాలు పెట్టారు.

    "ఏమిటో! ఎంతో ఇదిగా చేద్దామనుకున్న పెళ్లి ఈ రకంగా జరిగిపోయింది." కంటతడి పెట్టింది జానకమ్మ. సుబ్బలక్ష్మి తనకి కావలసిన బట్టలూ, నగలూ ఎప్పుడో కోనేసుకుంది. నరసింహారావుగారి ఆస్తి మూడొంతులు కరిగిపోయింది సుమతి పెళ్ళినాటికీ నేటికీ పోల్చిచూస్తే పదహారురోజుల పండుగదాక వుండి జానకమ్మ కొడుకులూ, కోడళ్ళు వెళ్ళిపోయారు. మనమలు మనమరాళ్ళ దగ్గరనుంచీ బట్టలు పెట్టి పంపించింది జానకమ్మ.
    డేకి సుబ్బలక్ష్మి అన్నలతో బంధుత్వం అని చెప్పుకోవడం కంటే నరసింహారావుగారి అల్లుడినని చెప్పుకోవడంలో తృప్తి పడుతున్నాడు. ఇల్లరికపుట్టల్లుడిలా ఇక్కడే వుండి పోయాడు. పెళ్ళయ్యాక, తండ్రి దగ్గర నుంచి దమ్మిడీ రాకపోవడం కూడా అందుకుకారణమే.
    సినిమాలు కావాలి. తాగుడుకావాలి. సరదాలు తీరాలంటే సుమతినీ కలుపుకోవాలి.  బలవంతంగానైనా సుమతినీ సినిమాలకి లాగడం, అందరూ కలసి తాగటానికి కూర్చోటం జరుగుతోంది. మనశ్శాంతి కరువై, బతుకే బరువైన సుమతి అన్నిటికీ తలోగ్గుతోంది. ఏదైనా విసుగుతో పిల్లల్ని కసురుకుంటే, వెంటనే  సుబ్బలక్ష్మి వాళ్ళని అవతలకి తీసికెళ్ళి మరిపించి నిద్ర పుచ్చుతోంది. పిల్లలల్లరి చేస్తూంటే "సుబ్బలక్ష్మి వీళ్లు చూడు" అనగానే పిల్లలు అక్కడికి వెళ్ళీపోతున్నారు. డే సుబ్బలక్ష్మి పైన లియరు పరీక్షలు ప్యాసయ్యామనిపించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS