ఒక్కొక్క మెట్టే దిగుతున్న రాగిణికి, ఆ ప్రయాణం, తన జీవితంలాగే అనిపించింది. గాలిలో తిప్పి, పైకెగిరి పోతున్నామనే ధీమా, అన్నీ తమకంటే కిందే వున్నాయన్న తృప్తి, ఆ కాస్సేపు విమానం నడుస్తున్నా, మనిషి తనే రెక్కలు కట్టుకుని ఎగురుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు. ఆ తర్వాత, ఒక్కొక్క మెట్టే దిగి, తెలుసుకుంటాడు, తనూ అందరితోపాటే వున్నానని! పైగా గాలిలో ఒంటరిగా తేలిపోవడం కన్నా, ఇలా అందరితోటే వుండడంలో ఎన్నోరెట్లు ఆనందం వుందని! ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకి అంత బాధలోనూ నవ్వొచ్చింది రాగిణికి. హైదరాబాద్ వదలి పెట్టి, రెండేళ్ళు కావొస్తోంది! వెళ్ళి లగేజీ తీసుకుంటూవుంటే తల్లీ తండ్రీ, ఇల్లూ జ్ఞాపకం వచ్చాయి! వాళ్లుండగా, ఇలా జరిగి వచ్చేసినా, ఎంత బాధపడ్డా ఎంత కోప్పడ్డా కన్నతల్లి కడుపులో దాచుకుని కాపాడేది! కానీ ఇవాళ, ఇన్నేళ్ళు తను పుట్టిపెరిగిన ఈ ఊళ్ళో, తన మొహం చూసేదెవరు? తనిప్పుడు ఎక్కడికిపోవాలి? ఎక్కడుండాలి? అంతా చీకటిగానే వుంది.
సామాను తీసుకుని ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. "అమ్మా! సామానుతెమ్మంటారా?" అంటూ ఒక పోర్టర్ నుంచున్నాడు.
"ఊ" అంది!
రెండు సూటుకేసులు పట్టుకుని బయటకొచ్చాడు.
"మోటారొచ్చిందమ్మా?" అన్నాడు. వాడి లెక్కప్రకారం ఫ్లయిట్ లొంచి దిగిన ప్రతివారికీ మోటారొచ్చితీరాలి!
"లేదు! ఆటోలో పెట్టు"
వాడికి డబ్బిచ్చేసి, ఆటోలో కూర్చుంది. "ఎక్కడికి పోవాలి?" ఆటోవాడడిగాడు. అవును! ఎక్కడికిపోవాలి? ఇక్కడెవరున్నారు తనకి? ఒక్కనిమిషం తటపటాయించి, "మారేడ్ పల్లికి పోనీ" అంది కోటయ్యగారింటికి.
"అమ్మా నాన్నలతోపాటు కోటయ్యగారు మద్రాసు వచ్చినప్పుడు. తనని చూశారు. తాగిన నిషాలో ఆ రోజు తనేం మాట్లాడిందో తనకి గుర్తులేదు! తండ్రి తరువాత తండ్రంతటివాడు! తన తండ్రికి బంధువు, మిత్రుడు అంతా అతడే!
ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఆటోవాడు 'ఎటు పోవాలమ్మా' అని అడిగితే చెప్పింది. ఇల్లు దగ్గర పడుతున్నకొద్దీ గుండె దడ దడా కొట్టుకోసాగింది, వేగంగా. ఊరుకాని ఊర్లో మద్రాసులో ఒంటరిగా వుండడానికి ఎంత భయపడిందో, ఇప్పుడు ఉన్న ఊర్లో కాలుపెట్టి, అయినవాళ్ళకి మొహం చూపించడానికి అంతే భయపడుతోంది! విధివిలాసం! "కోటయ్య బాబాయ్!" అంటూ ఛంగుఛంగున పరుగెడుతూ లోపలికెళ్లిపోయేతను, ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ యింట్లో పరాయిదానిలా, ఒక దోషిలా కాలు పెట్టడానికే భయపడుతోంది. ఆ స్థానాన్నీ, ఆ హక్కునీ చేజేతులా తనే పోగొట్టుకుంది.
ఆటో యింటి ముందు ఆగింది. ఆటోవాడికి డబ్బులిచ్చి పంపించేసింది. రెండు సూటుకేసులనీ రెండు చేతులతోటీ పట్టుకుని, అదురుతున్న గుండెలని అణచడానికి ప్రయత్నిస్తూ, అడుగు ముందుకు వేసింది రాగిణి బిక్కుబిక్కుమంటూ!
కోటయ్యగారూ, భార్యా టి.వి. చూస్తూ కూర్చున్నారు. చంద్రశేఖర్ ఇంట్లోలేడు. పూర్ణిమ వంట చేస్తోంది. చంద్రిక చదువుకుంటోంది లోపల. ఆటో చప్పుడు విని ఎవరో వస్తున్నారనుకుని అటు చూశారు, వాళ్ళింటికేనా కాదా అని కోటయ్యగారూ, సూర్యకుమారీ! ఆటోలోంచి పెట్టెలతో సహా దిగుతూంటే ఎవరబ్బా అనుకుంటూ చూస్తున్నారు.
సూటుకేసు పక్కన పెట్టి "బాబాయ్! పిన్నీ!" అంది కళ్ళు తుడుచుకుంటూ మరి మాట్లాడలేని రాగిణి. "నువ్వా?" అన్నారు ఆశ్చర్యంగా కోటయ్యగారు. ఆశ్చర్యంతో సూర్యకుమారి రెప్పవాల్చకుండా చూస్తూండిపోయింది. లోపలినుంచి ఎవరొచ్చారా అని పూర్ణిమ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ హడావుడంతా చూసి పుస్తకాలొదిలేసి చంద్రిక కూడా అక్కడికొచ్చింది. అందరూ తనకేసి అలా చూస్తూవుంటే, వారి చూపులు, గుచ్చుకుంటున్నట్టుగా బాధపడింది రాగిణి. బోనులోనుంచున్న ముద్దాయిలా బాధపడుతూ భోరుమని ఏడ్చేసింది.
రెండు నిముషాలు పోయాక తేరుకుని "సూర్యా! అమ్మాయిని ఓదార్చి లోపలికి తీసుకెళ్ళు!" అన్నారు. అంతదాకా ఏం చెయ్యాలో కూడా బోధపడకుండా కొయ్యబారిపోయి స్థాణువులా రాగిణికేసి చూస్తున్న సూర్యకుమారి, రాగిణి భుజాలమీద చెయ్యివేసి 'రా...... లోపలికి పోదాం' అని గెస్టురూంలోకి దారితీసింది.
"అమ్మాయ్ పూర్ణిమా! రాములుని పిలిచి సూటుకేసులు లోపలపెట్టించు. ఏదో గొడవ జరిగివుంటుంది. పెట్టేబేడాతో సహా ఒచ్చేసింది. కాస్త చూసుకోండి. ఇప్పుడు మనమూ కాదంటే ఎక్కడికి పోతుంది? నింపాదిగా అడుగుదాం ఏం జరిగిందో?" అన్నారు.
కోటయ్యగారి మాట, ఆ యింట్లో అందరికీ ఆర్డర్ తో సమానం. ఎవ్వరూ అతని మాట కాదనరు, జవదాటరు.
పూర్ణిమ రాములుచేత పెట్టెలు లోపల పెట్టించింది. కోటయ్యగారు భార్యని కూడా పిలిచి పూర్ణిమతో చెప్పిన మాటలే చెప్పారు.
"కాఫీ తాగుతావా కొంచెం" అంటూ కాఫీ కప్పు అందించింది. పూర్ణిమ. "ఇప్పుడొద్దొదినా!" అంది రాగిణి. కళ్ళు ఎర్రగా ఉబ్బి వున్నాయి. బాగా ఏడ్చి మొహం వుబ్బి వున్నట్టు తెలుస్తూనే వుంది మొహం చూడగానే.
"పోనీ స్నానం చేసిరా" అంది సూర్యకుమారి. "సరే" నంటూ బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది రాగిణి.
ఈమాత్రం ఆదరణ దొరుకుతుందని ఆశించని రాగిణికి ప్రాణం లేచొచ్చినట్టయింది. జరిగినదంతా చెప్పి, కోటయ్యగారి కాళ్ళమీద పడి 'క్షమాపణ' కోరుకోవాలనుకుంది. కానీ, ఆ పూట ఆ అవకాశం కలిగించలేదు కోటయ్యగారు.
రాగిణి ఏదో చెప్పాలని ఆరాటపడుతోందని తెలిసికూడా ఆమెని మాట్లాడనివ్వకుండా, ఏవో మాటలు మార్చేస్తూ, వేరే కబుర్లలో పెట్టేశారు. రాగిణి భోం చెయ్యనంది ఆ పూట ఆకలిగా లేదని.
సూర్యకుమారి, పూర్ణిమా, కొద్దిగా తినమని బతిమిలాడారు. వాళ్ళచేత అలా బతిమిలాడించుకోవడం మరీ సిగ్గనిపించింది రాగిణికి. అందరితోపాటు కంచం దగ్గర కూర్చుని నాలుగు మెతుకులు గతికింది.
"బాబాయ్! నాకథ వినరూ? నన్ను చూడగానే మీరంతా అసహ్యించుకుంటారనుకున్నాను. మీరు లోపలికి రానివ్వకపోతే ఎక్కడికి పోవాలో తెలీక ఏం చెయ్యాలా అని పిచ్చిదానిలా ఆలోచించిన నాకు మీరు చూపిస్తున్న ప్రేమా అభిమానం, నా మతిని పోగొడుతోంది. ఈ పాపాత్మురాలిని మీరంతా అంత ఆప్యాయంగా పలకరిస్తూవుంటే నామీద నాకే అసహ్యం పుడుతోంది" పసిపిల్లలా కోటయ్యగారి కాళ్ళమీద పడి ఏడ్చేసింది.
సూర్యకుమారి రాగిణి భుజాలు పట్టుకుని లేవనెత్తి "ఊరుకో! ఏడవకు" అంది ఓదారుస్తూ.
"పిన్నీ మీరందరూ మనుష్యులు కారు దేవతలు! ఇటువంటి పవిత్ర దేవాలయంలో, నాకు స్థానంలేదు. నావల్ల మీ ఇల్లు కలుషితం కాకూడదు. నేను పాపిని!" మోకాళ్ల మధ్య తలపెట్టుకుని భోరుమని ఏడుస్తున్న రాగిణిని ఎలా ఓదార్చాలో తెలీలేదు, ఆ ఇంటిల్లిపాదికీ.
ఏడ్చి ఏడ్చి అలసిపోయిన రాగిణిని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది సూర్యకుమారి. "అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో. జరిగిందంతా ఓ పీడకల అనుకో. పొద్దున్న మాట్లాడుకుందాం పడుకో!" అని పడుకోబెట్టి, దుప్పటికప్పి వెళ్లింది. పూర్ణిమ కూడ ఊరడించింది. వాళ్ళందరి మధ్యా హాయిగా నిద్రపోయింది ఆ రాత్రి, సముద్రాన్ని ఈది వడ్డుకు చేరుకున్న వ్యక్తి అలసిపోయి ఆదమరచి నిద్రపోయినట్లు!
