Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 20

మీ వెనుకే ఎప్పుడూ మా మనుషులు ఉంటారన్న విషయం మరచిపోవద్దు..."
ప్రభు ఒక్క క్షణం కలవరపడ్డాడు. అది గమనించిన నచికేత ప్రభు చేయినొక్కి "కంగారు పడవద్దని" చెప్పాడు.
"ఈ ఆపరేషన్ ని సింగిల్ పర్సన్ కు హ్యాండోవర్ చేద్దామనుకున్నాను. బట్...మిమ్మల్ని చూశాక జాయింట్ గానే ఈ పని అప్పగించేద్దామనిపిస్తోంది.
మీరు...ఓ అడ్వంచర్ చేయాలి. అయితే ఆ అడ్వంచర్ ఒకే రూట్లో గాకుండా అనేక మార్గాల్లో కూడా చేయొచ్చు...
నేను అనౌన్స్ చేసిన ఆ అమౌంట్ ని అందరూ షేరు చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ గా ఈ పనిని మీరు పూర్తిచేస్తే నేను చెప్పినట్టుగా పాతిక లక్షలే కాకుండా, మరో పాతిక లక్షలు బోనస్ గా ఇస్తాను..."
అమౌంట్ వినగానే విలియమ్స్ కళ్ళు మెరిసాయి. "ఇంతకూ మేము చేయాల్సిన పని ఏమిటి?" నచికేత అడిగాడు...
"మిమ్మల్ని ఓ ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలేస్తాను. అక్కడనుంచి కొన్ని వందల కిలోమీటర్లు చేరుకుని ఓ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లాలి. గెస్ట్ హౌస్ లో ఉన్న నూటయాభై ఏళ్ల క్రితం నాటి ఓ చిత్రపటం తీసుకురావాలి"
"అంతేనా?" తేలిగ్గా అన్నాడు సూర్యనారాయణ.
"నేను మిమ్మల్ని ఒక అడవి దగ్గర వదిలేస్తాను. అది మసుష్యులు సంచరించడానికి నిషేదించబడినది. మీరు వెళ్లగానే, నేను అడవిలోకి వెళ్ళే మార్గానికి ఉన్నకంచెకు తాళం వేస్తాను. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత ఆ లాక్ ఓపెన్ చేస్తారు. ఈలోగా మీరు వెనక్కి తిరిగి వచ్చినా లాభం వుండదు.
అంతకాదు, మరో విషయం, ఈ అడవిలో క్రూర జంతువులు విషసర్పాలు, నరమాంస భక్షకులు కూడా ఉండి ఉండవచ్చు. పదిహేను రోజులు, అంటే మూడు వందల అరవై గంటల్లోగా మీరు అడవి మధ్యలో ఉన్న గెస్ట్ హౌస్ ను చేరుకోవాలి. మీరు ఎటువైపు నుంచి వెళ్లినా ఆ 'చిత్రావతి' అడవి మధ్యలోనే వుంటుంది ఆ గెస్ట్ హౌస్" పీటర్సన్ ఆగాడు.
నచికేత ఉలిక్కి పడ్డాడు...చి..త్రా..వ..తి...అన్న పదం విని...  

                                   13
పీటర్సన్ ఓ మ్యాప్ తీసి టీపాయిమీద పరిచి పాయింటెడ్ స్టిక్ తో ఎక్స్ ప్లయిన్ చేయసాగాడు.
"ఇదే చిత్రావతి...అడవి...చిత్రావతి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తే ఈ అడవి మొదలవుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడో ఊరు ఉండేది. ఆ తర్వాత నరమాంస భక్షకులు ఆ ఊరిమీద పడి, మనుష్యులను తింటున్నారని వూరు పాడుబడిపోయింది. జనం అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
అయినా రైల్వేస్టేషన్ వుంది. ఈ రూట్ లో ప్రతీ పదిహేను రోజులకు ఓసారి ఓ గూడ్సు రైలు వెళ్తుంది. ఆ గూడ్సు రైలో మిమ్మల్ని అక్కడికి చేర్చే పూచి నాది...ఆ తర్వాత నేను పదిహేను రోజులు తర్వాత వస్తాను. ఈలోగా మీరు తలపెట్టిన పని పూర్తి కావాలి.
వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్...
నేను చెప్పిన ఈ ఆపరేషన్ గురించి అనవసర సందేహాలు పెట్టుకోవడంకానీ, డిటెయిల్స్  అడగడం కానీ చేయకూడదు. నాక్కావలసింది మీలో ఎవరో ఒకరు ఆ గెస్ట్ హౌస్ కు వెళ్లి, చిత్రపటం తీసుకురావటమే...మిగతా విషయాలు మీకు అనవసరం...ఐదు లక్షలు అడ్వాన్స్ ఇస్తాను..." అంటూ ఇందాకటి బ్రీఫ్ కేసులో నుంచి పది బండిల్స్ ఐదువందల రూపాయలవి తీసి టీపాయ్ మీద పెట్టాడు.
"ప్రయాణం ఎల్లుండే...బీ రెడీ...ఆల్ ది బెస్ట్...మీరు వెళ్లొచ్చు..." అని ఆగి "అన్నట్టు వెళ్లేంమిటి...ఇంత ధైర్యంగా డబ్బు ఇచ్చారు అనుకోవద్దు...ప్రభుకు వెనుకాముందు ఎవరూ లేరు...విలియమ్స్ డిటో..డిటో...సూర్యనారాయణకు పల్లెటూళ్లో పేరెంట్స్ వున్నారు. సూరజ్ ఏకాకి...నచికేత పేరెంట్స్ ప్రస్తుతం ఇక్కడ లేరు...ఇదీ మీ బ్యాగ్రవుండ్..." అన్నాడు పీటర్సన్..
నచికేత అతని ఫ్రెండ్స్ తోపాటు, డేనియల్ ఆశ్చర్యపోయాడు. ఇంత క్విక్ గా వివరాలు పీటర్సన్ సాధించినందుకు...
నచికేత...ఐదు లక్షలు ఓ కవర్ లో పెట్టుకొని లేచాడు...

                                       * * *
"మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామేమో కదూ..." అన్నాడు డేనియల్.
"ఎందుకు?"
"వాళ్లని అంత ఈజీగా నమ్మడం?"
"నమ్మలేదు...నమ్మినట్టు నటించాను. ఉదయం వాళ్ళు ఇంటర్ వ్యూకు అటెండ్ అయినప్పుడే, అటెండ్ అయినవాళ్ళు, చివరకు మిగిలిన ఈ ఐదుగురి డిటెయిల్సు సేకరించాను. డబ్బుతో కానిపని ఏముంటుంది? అయినా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు వాళ్ల సాయం అవసరం..."
"వీళ్లకు అడ్వంచర్ ఓ గేమ్...అందుకే గెస్ట్ హౌస్ సంబంధించిన భయంకరమైన బిత్రోచి రహస్యం చెప్పలేదు..." అన్నాడు పీటర్సన్.
సరిగ్గా అదే సమయంలో రూమ్ నెంబర్ 114లో ఉన్న తరళ...లేచి నిలబడింది.
ఆ రోజు ఉదయమే పేపర్ లో పడ్డ వార్త చదివింది.
వన్ వన్ త్రీ రూమ్ లో ఉన్న వాళ్లని సీక్రెట్ గా ఫాలో అయ్యింది. వాళ్లని ఫోటో తీసింది.
వాళ్లు పీటర్సన్, డేనియల్ అని తెలుసుకుంది.
(సింగపూర్ లో పోలీసాఫీసర్ రాబర్ట్ ఈ విషయాలను తరళకు గతంలో చెప్పాడు) హోటల్ బాయ్ కు డబ్బు ఇచ్చి మైక్రోఫోన్ అమర్చింది. ఆమెకు సగం అర్ధమయింది.
మరో సగం అర్ధం కావాలంటే...తనేం చేయాలో అర్ధమైంది.
మరో అయిదు నిమిషాల తర్వాత ఆ రూమ్ ఖాళీ చేసింది తరళ.

                                      * * *
"నిజంగా అలా జరిగిందా?" తరళ చెప్పిన దంతా విని ఆశ్చర్యంగా అడిగాడు ప్రొఫెసర్ పరమహంస.
"నిజం అంకుల్...ఈ పీటర్సన్ కోటిమందిలో వున్నా గుర్తుపట్టగలను. సింగపూర్ లో పోలీసు ఆఫీసర్ రాబర్ట్ దగ్గర నేను పీటర్సన్ సంబంధించిన ఫైల్ చూశాను...ఆ డేనియల్ అతనికి రైట్ హ్యాండ్" చెప్పింది తరళ.  
హోటల్ నుంచి రాగానే ప్రొఫెసర్ పరమహంసకు జరిగినదంతా వివరించి చెప్పింది.
"అద్సరే...ఆ యంగ్ బోయ్స్ ఈ పందేనికి ఎందుకు ఒప్పుకున్నట్టు?" నొసలు ముడివేస్తూ అడిగాడు పరమహంస.
"డబ్బు కోసం కావచ్చు. థ్రిల్ కోసం కావచ్చు..." అంది తరళ.
"ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నావు?"
"నేనూ చిత్రావతి అడవికి వెళ్దామని అనుకుంటున్నాను" చెప్పింది తరళ స్థిరంగా.
ఉలిక్కిపడి ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు "ఆర్యూ మ్యాడ్?" చిత్రావతి గురించి నీకేం
తెలుసు...నువ్వొక్కదానివే అక్కడికి వెళ్లి ఏం చేయగలవు?"         
"కేవలం చిత్రావతి అడవిలోకి వెళ్లి ఆ గెస్ట్ హౌస్ కు వెళ్లిరావడం కోసమే అయితే ఆ పీటర్సన్ ఇంత డబ్బు ఆఫర్ చేయడు. నిజానికి ఆ పని పీటర్సనే చేయొచ్చు.ఏ పాతికవేలో ఇస్తే ఎవరైనా ఆ పనిచేసి పెడతారు. ఆ గెస్ట్ హౌస్ వెనుకవున్న రహస్యాన్ని చేదించడానికి వెళ్తాను"
"ఒంటరిగా ఎలా....?"
"అడవిలో ప్రవేశించాక నాతోపాటు ఆ అయిదుగురూ వుంటారు. వాళ్ళు వెళ్ళేరోజే నేనూ వెళ్తాను. అక్కడ వాళ్లను కలుసుకుంటాను. వాళ్లసాయంతో గెస్ట్ హౌస్ రహస్యం చేదిస్తాను..."
"ఏమిటో బేబీ...నువ్వు సినిమాటిక్ గా నీ ప్రయత్నాలు మొదలుపెడ్తున్నట్టు అనిపిస్తోంది. ఏ మాత్రం బెడిసి కొట్టినా..."
"బెడిసికొట్టినా, నా ప్రాణాలు కొడిగట్టినా...నాకు లెక్కలేదు అంకుల్...డాడీ చావుకు కారణమైన వాడిమీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో నాకేమైనా పర్లేదు..."
"వెల్ సెడ్ బేబీ...ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్...ఈరోజే చిత్రావతి అడవికి సంబంధించిన వివరాలు సేకరిస్తాను. నాకు తెలిసి అడవిలోకి ప్రవేశించి ప్రాణాలతో వచ్చినవాళ్ళు లేరు. కానీ ఒక్కరోజు టైం ఇవ్వు..." అన్నాడు.
ఆ రోజే ప్రొఫెసర్ పరమహంస చిత్రావతి అడవికి సంబంధించిన విషయాలు గురించి స్టడీ చేయడానికి పాత పుస్తకాల ర్యాక్ లో ఉన్న పాతకాలంనాటి పుస్తకాలను ముందు వేసుకున్నాడు.

                                        * * *
నచికేత అతని స్నేహితులు లాన్ లో కూచున్నారు.
"మనం తీసుకున్న నిర్ణయం సరైనదేనా?" అడిగాడు ప్రభు మిగతా స్నేహితులను ఉద్దేశించి...
"నీకిప్పుడీ డౌట్ ఎందుకు వచ్చింది? ముందు మన ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి..." సూర్యనారాయణ అన్నాడు.,
"నాకెందుకో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామని అనిపిస్తోంది? ఆ గడ్డపాయన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా వుంది" ప్రభు భయంగా అన్నాడు.
"అనుమాన కణాలు, భయం కణాలు నీ ఒంట్లో ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి" సూరజ్ హేళనగా అన్నాడు.
"ఆ టాపిక్ వదిలేద్దాం...ఓ అడ్వంచర్ చేసే అవకాశం వచ్చింది. ఈ వంకన మనం అడవిని, గెస్ట్ హౌస్ ఇవేనా?
కావా? అన్నది తెల్సుకుందాం...ప్రొఫెసర్ పరమహంస కూడా చిత్రావతి అడవి గురించి చెప్పారు గుర్తుందా?"
"గుర్తుంది. కానీ, మనం చిత్రావతికి వెళ్ళేది ప్రొఫెసర్ తో చెప్పాలా?" సూర్యనారాయణ అడిగాడు.
"చెప్పడమే బెటర్. ఆయన మనకు ఏమైనా గైడెన్స్ ఇవ్వొచ్చు..." ప్రభు అన్నాడు వెంటనే...
"గైడెన్స్ ఇస్తాడో...గంటల తరబడి లెక్చర్ దంచుతాడో...అయినా ప్రొఫెసర్ కు ఎందుకు చెప్పడం?" సూరజ్ అన్నాడు.
"మనం ప్రొఫెసర్ తో చెబితే మనల్ని డిస్కరేజ్ చేసే అవకాశం కూడా వుండొచ్చు. అదీగాక, మనం గెస్ట్ హౌస్ కు వెళ్తొన్న విషయం ఎవరికీ చెప్పొద్దన్న కండిషన్ కూడా వుంది" విలియమ్స్ అన్నాడు.
కాసేపు తర్జన భర్జనలు జరిగేక, ప్రొఫెసర్ కి ఈ విషయం చెప్పద్దని తీర్మానం చేసుకున్నారు. ప్రభు మాత్రం ఆలోచనలో పడిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS