ఆ మాటలతో అర్చన మనసు తేలిక పడింది. రామకృష్ణ పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చాడు. అతను నివసించే ఇల్లు చిన్నది, ముగ్గురు మనుషులు గల కుటుంభానికి సరిపోతుంది. రెండు గదులు, వెనుక ప్రక్క పెరడు ఉన్నాయి. దాని యజమాని ఉద్యోగరీత్యా భువనేశ్వర్ లో ఉంటున్నారు. ఇంటిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఇవ్వాలనుకోవడం వల్ల తక్కువ అద్దెకు వినాయకరావు ద్వారా రామకృష్ణకి దొరికింది.
ఇంతలో శివరావు లోపలకు వచ్చాడు. అర్చనని చూడగానే వాళ్ళకి అతని మొహం వికసించింది. శివరావు తలపై నుంచి కారిన రక్తం చంపాల దగ్గర ఎండిపోయి కనిపిస్తోంది. అధి చూసి అన్నాడు రామకృష్ణ.
"ఈ సందు చివర డాక్టర్ ఉన్నాడు. అతని దగ్గరకు వెళదాం పద..."
"పర్లేదు...."
"మాట్లాడకుండా ముందు నడు...."
శివరావుని తీసుకొని ఆ వీధిలోకి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు రామకృష్ణ. గాయం శుభ్రం చేసి కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చాడు డాక్టర్.
"కొత్తరోడ్డు దగ్గర ఏం జరిగింది?" తిరిగొస్తున్నప్పుడు అడిగాడు రామకృష్ణ.
ఒక ఇంటి అరుగు చూపించి అన్నాడు శివరావు.
"ఇక్కడ కాసేపు కూర్చుందాం..."
ఇద్దరూ అరుగుపైన కూర్చున్న తరువాత శివరావు అంతవరకూ జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు. రామకృష్ణ ఆశ్చర్యంగా విన్నాడు.
"అర్చనని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించారంటే వాళ్ళకి నా ఇల్లు తెలుసుంటుంది. వాళ్ళు అర్చనకోసం మా ఇంటికి తిరిగి వస్తారు. అంతేకాకుండా నా భార్య పుట్టింటి నుంచి నాలుగైదు రోజుల్లో వస్తుంది. అందుకని ఇప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలి...."
"నేను ఏం చెయ్యగలను?" అడిగాడు రామకృష్ణ.
"అర్చనని కొంతకాలం మీ ఇంట్లో ఉండనివ్వు...." ప్రాధేయ పడుతున్నట్టు అడిగాడు.
అంగీకారంగా తలూపాడు రామకృష్ణ.
గుండెల మీద నుంచి కొండంత బరువు తొలగించినట్టు ఊపిరి తీసుకున్నాడు శివరావు.
కొంతమంది జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉంటాయో, ఎంతటి విషాదం నెలకొంటుంధో మొదటిసారి అర్ధమయింది రామకృష్ణకి. అర్చన జీవితంలో జరిగిన సంఘటన్లు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. ఆమె జీవితం నాశనం కావడానికి కారణమైన జనార్దనం ఇప్పుడెక్కడున్నాడు? మనసులో ప్రశ్నించుకున్నాడతను.
* * * *
రామకృష్ణ నివసిస్తున్న ఇంటికి మూడు వందల గజాల దూరంలోని లేబర్ కాలనీకి ఆనుకుని ఉంది ప్రభుత్వసారాయి దుకాణం. ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ దుకాణం తెరిచి ఉంటుంది. దుకాణం చుట్టూ ప్రక్కల పరిసరాలకు సారా వాసన వ్యాపించి, కాలనీలోని మురుగు కాల్వ నుండి వెలువడే దుర్వాసనతో పోటీపడుతుంది.
ఆ దుకాణంలో బల్లపైన ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నరు. వాళ్ళ ముందు ఒక చెక్క టేబుల్ ఉంది. దానిపైన సారా పోసిన రెండు గాజు గ్లాసులు, ఒక ప్లేటులో వేయించి మషాలా దట్టించిన కోడిగుడ్లు, బీడీ కట్ట, అగ్గిపెట్టె ఉన్నాయి.
ఇద్దరిలో నల్లగా ఉన్న వ్యక్తి గ్లాసు తీసుకుని అందులోని సారా మొత్తం ఒకే గుక్కలో తాగేసి ఖాళీగ్లాసు టేబుల్ మీద పెట్టి చొక్కాలో మూతి తుడుచుకున్నాడు. కోడిగుడ్డు అందుకుని దానిని కొరక్కుండా గొంతులోకి తోసి నమిలేశాడు. వేలితో మషాళా తీసి నాలిక మీద రాసుకుని వేలిని బల్లకి తుడిచి బీడీ వెలిగించుకుని గుండెల నిండా పొగ పీల్చాడు.
అతనిలో సారా కొట్టుకి రావడం క్రొత్త కాకపోయినా రెండో వ్యక్తి మొదటిసారి చూస్తున్నట్టుగా అతని కదలికల్ని గమనించాడు.
కుర్రాడు సారా ప్యాకెట్ తెచ్చి దానికి కన్నం పెట్టి గ్లాసులో పోశాడు. సోడా కొట్టి దానిలో కలిపాడు.
"ఇప్పుడేం చేద్దాం?" అడిగాడు రెండోవ్యక్తి.
"దాన్ని ఎలాగైనా తిరిగి పట్టుకోవాలి...." చివరికంటా కాలిన బీడీని వదిలేసి చెప్పాడు. మరో గుడ్డు అందుకున్నాడు.
తను కొంచెం ఆలస్యం చేస్తే గ్రుడ్డు మొత్తం అతనే తినేస్తాడని గ్రహించాడు రెండో వ్యక్తి. తన భావాలు కనిపించకుండా జాగ్ర్తత్తపడుతూ గ్లాసులోని ద్రవం కొద్దిగా త్రాగాడు.
"మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. మనకంటే ముందు వాడొచ్చి సందులో కాశి దానిని తీసుకెళ్ళడం ఎలా జరిగిందో నాకింత వరకూ అర్ధం కాలేదు."
"కంచరపాలెం దగ్గర రైల్వేగేటు వేసి ఉండడం వల్ల మనం అక్కడ ఆగాం. ఈలోపు వాడు చుట్టూ తిరిగొచ్చి ఉంటాడు. అది సరే....మనం రాజమ్మ కంపెనీకి తీసుకెళ్తామని వాడికెలా తెలిసింది?" అన్నాడు మొదటి వ్యక్తి.
ఇద్దరూ కొద్దిసేపు దాని గురించి చర్చించుకున్నారు.
"మళ్ళీ మనకి దొరకదంటావా?" ప్రశ్నించాడు రెండో వ్యక్తి.
"ఎందుకు దొరకదు. దానితోపాటు ఉన్నవాడి ఇంటి దగ్గర రెండు రోజులు కాపు వేద్దాం." రెండో వ్యక్తి నవ్వాడు అర్ధమయినట్లు.
"అందుకేనా ధైర్యంగా ఖర్చుపెడుతున్నావ్?"
మొదటి వ్యక్తి మాట్లాడకుండా గ్లాసులోని సారా త్రాగాడు. ప్లేట్ లోని గుడ్డు అందుకున్నాడు. సారా తాలూకు మత్తు మెదడ్ని ఆవరించింది. ఆ మత్తులో కూడా అతని మెదడు ఆలోచిస్తోంది.
ఆరునెలల క్రితం ఇంపోర్టెడ్ స్కాచ్ త్రాగేవాడు. డబ్బాల్లో నిల్వ చెయ్యబడ్డ మాంసం తినేవాడు. స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్లు కాల్చేవాడు. హఠాత్తుగా ప్రభుత్వ సారాయి దుకాణంలో సారాత్రాగి, బీడీలు కాల్చదానికి కారణమైన 'సంఘటన' ఒకటి జరిగింది.
ఆరునెలల క్రితం నగరానికి క్రొత్త పోలీస్ కమీషనర్ వచ్చాడు. ఆ వార్త పేపరులో పడినా ఎవరూ పట్టించుకోలేదు. అతను చార్జ్ తీసుకున్న మరునాడు నగరంలోని వ్యభిచారులకు, ఓనర్లకు మొదటి వార్నింగ్ అందింది. ఎక్కువ మంది దానిని పట్టించుకోలేదు.
మూడోరోజున హఠాత్తుగా రైయిడ్స్ జరిగాయి. కమీషనర్ స్వయంగా రైయిడ్స్ లో పాల్గొనడం వల్ల తప్పించుకోవడం సాధ్యం కాలేదు. నాలుగు వందల మందిని కోర్టులో హాజరు పెట్టారు. ఎప్పుడూ యాభై రూపాయలకు మించి ఫైన్ వెయ్యని మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి ఐదువందలు వేశాడు. రెండో రోజు కూడా రైయిడ్స్ జరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్ కి పూనకం వచ్చినట్టు వ్యభిచారుల మీద విరుచుకుపడ్డారు. రహస్యంగా వృత్తి చేసేవాళ్ళని కూడా వదల్లేదు. చాలా మంది వలస పోయారు.
ఎంతో పకడ్బందీగా వ్యాపారం చేసే కంపెనీలు కూడా మూత పడ్డాయి. రాజమ్మ కూడా తన కంపెనీని మూసేసింది. అందులో పనిచేసే అతను రోడ్డుమీద పడ్డాడు. హార్బరు దగ్గర తిరుగుతూ విదేశీయులను ఆకట్టుకుని వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేసేవాడు. రాజమ్మ అతనికి పదిశాతం కమీషన్ ఇచ్చేది. అతను విదేశీయులతో కలిసి మందుత్రాగేవాడు
అతనికి చీకటి పడిన మరుక్షణం మందు కావాలి. ఆ తరువాత ఆడదాని పొందు కావాలి.
ఆరునెలల కాలం ఎంతో దుర్భరంగా గడిచింది. చీకటి సందులో ఐదు రూపాయలకు శరీరం అప్పగించే రోగిష్టి వ్యభిచారులు కూడా కనిపించటం లేదు. అటువంటి సమయంలో పోలీస్ కమీషనర్ కి ట్రాన్స్ ఫర్ అయిందని వార్త గుప్పుమంది. అతను ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా రాజమ్మని కలుసుకున్నాడు. అమ్మాయిల్ని తీసుకొచ్చే పని అప్పగించి కొంత సొమ్ము ఇచ్చిందామె.
పోలీస్ కమీషనర్ బంగళాలో సిబ్బంది అతని సామానులు ప్యాక్ చేస్తున్న సమయంలో వ్యభిచార గృహాల యజమానులు తమ వ్యాపారానీఇ అవసరమైన మనుషుల్ని సిద్దం చెయ్యసాగారు.
అమ్మాయిల్ని తీసుకొచ్చే పనిలో ఉండగా బస్సు ఎక్కుతున్న అర్చనని గుర్తుపట్టి అనుసరించాడు. కొత్తరోడ్డు దగ్గర బస్సు దిగిందామె. ఆమెతో ఎవరోవ్యక్తి ఉండటం గమనించాడు. వాళ్ళు తిన్నగా ఒక ఇంటికి వెళ్ళారు. అర్చన గురించి పట్టించుకునేవాళ్ళు లేరని అతనికి తెలుసు. ఆ రోజంతా చూసినా వాళ్ళు బయటకు రాలేదు. శివరావు గురించి కొంత సమాచారం సేకరించాడు. మరునాడు రాత్రి ఇంటి దగ్గరకు వెళ్ళి కిటికీ ప్రక్కన నిలబడ్డాడు. వాళ్ళు బయటకు వెళ్ళడం గురించి విని సెంటర్ కి వచ్చి ఆటో సిద్దం చేసాడు.
ఆమె దొరికినట్టే దొరికి తప్పించుకుంది.
7
"అలా ఉన్నావేం?" అడిగాడు రామకృష్ణ.
ఎప్పుడు ఉత్సాహంగా కనిపించే టీ అమ్మే కుర్రవాడి మొహం ఆ రోజు దిగులుగా ఉంది. నిద్ర లేనట్టు కళ్ళు లోతుకు పోయాయి.
"శనివారం రాత్రి మా అక్కయ్య పెళ్ళి..." చెప్పాడు విచారంగా.
"అక్కయ్య పెళ్ళయితే గంతులు వెయ్యాలి. పెళ్ళిసందడి అంతా నీదే...." టీ తీసుకుని అన్నాడు.
