షావుకారు రాజయ్య ఓ పేద కాపుకు పదిహేనురూపాయలు వడ్డీ కిస్తాడు. వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ కట్టి పదిహేను రూపాయలకు 100 రూపాయలుచేస్తాడు. వంద రూపాయల అప్పు క్రిందికి వందరూపాయల విలువచేసే గొర్రెను పేదకాపునుండి వసూలు చేస్తాడు రాజయ్య గొర్రెను వెంటబెట్టుకుని ఇంటికి వెడుతుంటాడు రాజయ్య.
ఆ ఊళ్లో ముగ్గురు తెలివైన వాళ్లు వుంటారు. మోసం, అక్రమం అన్యాయం ఎక్కడ వున్నా బుద్ది చెప్పేవాళ్లు. పదిహేను రూపాయల అప్పు క్రిందికి వందరూపాయల విలువచేసే గొర్రెను పేదరైతునుండి కాజేశాడని తెలిసి, ముగ్గురూ షావుకారికి బుద్ది చెప్పటానికి బయలుదేరతారు.
"ఏం రాజయ్యా? కుక్క మెడకు తాడుకట్టి లాక్కువెడుతున్నావు? అంటాడు మొదటివాడు.
"కుక్క! నీ కళ్లకి కుక్కగా కనిపిస్తుందేమిటిరా? వంద రూపాయలు పోసి కొన్న గొర్రెరా ఇది" కోపంగా అంటాడు షావుకారు రాజయ్య.
"కుక్కని గొర్రెని చెప్పి నిన్ను తేలిగ్గా మోసం చేశాడు ఎవడో!" అని వెళ్ళిపోతాడు మొదటివాడు.
రెండోవాడు వస్తాడు. వాడూ కుక్క అంటాడు. మూడో వాడు కూడా వచ్చి "కుక్క" అని గట్టిగా దభాయించేసరికి, నిజంగామోసపోయి న్నట్టున్నాను! ఛీ ఛీ! కుక్కనువెంటబెట్టుకు వెళ్ళడమేమిటి? అనుకొని, గొర్రె మెడలో తాడు విప్పి రెండు దెబ్బలు వేసి తరిమి వేస్తాడు రాజయ్య.
గొర్రెపిలలను పేదరైతుకు తెచ్చి అప్పగిస్తారు ఆ ముగ్గురూ.
డైలాగులు హాస్యయుతంగా వుండడంవల్ల శాలిని డైలాగు పలికి నప్పుడల్లా ఒకటే నవ్వడం మొదలుపెట్టింది.
"నవ్వితే ఎలా? ఆ డైలాగ్ సీరియస్ గా అనాలి!"
"నవ్వొస్తూంది మరి!"
"మీకు నేర్పడంకంటే ఆ పిల్లలకి చెప్పడమే నయమనిపిస్తూంది!" శర్మ విసుగ్గా అనివెళ్లబోయాడు.
"ఆగండాగండి! ఇహ నవ్వను! సీరియస్ గా, మీరెలా అంటే అలా అంటాను! మక్కీకి మక్కీ! మీరే ఆశ్చర్యపడతారు నాటాలెంట్ చూసి"
"మక్కీకి మక్కీ టాలెంట్ అంటారా? స్వయం ప్రతిభ, అంటే తనదైన ఒక బాణీని టాలెంట్ అంటారు!"
"అతను ఉత్తేజ పరిచినవాళ్లను అనుకరించడం ప్రతీ ఆర్టిస్టు జీవితం ప్రారంభించినప్పుడు తప్పదనుకొంటాను. తరువాత్తరువాత తనదైన బాణి అదే ఏర్పడుతుందని నా అభిప్రాయం"
"సరే! ఈ డైలాగ్ ఒక్కసారి అనండి. డైలాగ్ లోని చమత్కారం ప్రేక్షకుడిని నవ్వించడానికేగాని పాత్రధారిని నవ్వించడానికి కాదని గుర్తుపెట్టుకోవాలి"
తరువాత పదిహేను నిమిషాలు చాలా బుద్దిగా రిహార్సల్ చేసింది శాలిని.
హిస్టరీ టీచర్ హరగోపాల్ వచ్చాడు. "శాలిని టీచర్, మీకు పాటలేమైనా వస్తే పిల్లలకు నేర్పకూడదూ?"
"మనం నేర్పితే తను నేర్చుకొని తరువాత పిల్లలకి నేర్పుతానంటుంది లెండి" శర్మ అన్నాడు.
"పాటల సంగతి ఎత్తితే నేనే మీ గురువునవుతానండోయ్!" అంది శాలిని సగర్వంగా.
"ఆహా?! ఏదీ ఒక పాట!"
'శ్రీరామాచంద్రునికీ నిత్యా జయా మంగళం.... " రాగయుక్తంగా పాడి, ఇది మా అమ్మమ్మ ఎంత బాగా పాడేదనుకొన్నారు? ఏ పేరంటం, ప్రయోజనం అయినా టకీమని ఈపాటే అందుకొనేది మాఅమ్మమ్మ. "
"బడిపిల్లలకి ఈ పాట నేర్పి పాడిస్తే ప్రేక్షకులు స్టేజీకి, స్టేజీ మీదున్న వాళ్లకి మంగళం పాడేస్తారు తల్లీ రాళ్లతో!" అన్నాడు హరగోపాల్, శాలిని పాటకు బెదిరిపోయి.
"మరి ఏం పాడమంటారు?"
"హాస్యం చాలుగాని మీగొంతు బాగుంది. దేశభక్తిగీతం ఏదైనా వస్తే పిల్లలకు నేర్పండి" అన్నాడు శర్మ.
"నిజంగానా నా టోన్ బాగుందా?" శాలిని సంతోషం దాచుకోలేనట్టుగా అడిగింది.
"ఆఁ కోయిల కుహూఁ అన్నంత మధురంగా!"
"అబ్బ!ఒక్క దాంట్లోనైనా మెచ్చుకొన్నారు. అయిదో తరగతి చదివే పిల్లను మందలించినట్టుగా మందలిస్తూంటే ఏడుపు ఒక్కటి తక్కువైంది నాకు!"
"అయిదో తరగతి విద్యార్దికి మించిన జ్ఞానం వున్నట్టు నాకేం కనిపించలేదు మరి."
"బి. ఏ. డిస్టింక్షన్ తో, బి. ఇడి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యానండీ! ఎవరి రికమెండేషన్, నయాపైస ముడుపు లేకుండా నా మెరిట్ తో సంపాదించుకొన్నానండీ ఈ ఉద్యోగం. నాకు అయిదో తరగతి స్టూడెంట్ ని మించిన జ్ఞానం లేదా?" శాలిని దెబ్బలాటకి సిద్దమైపోయింది.
"ఆడపిల్లలు అధికసంఖ్యలో డిస్టింక్షన్ లో ఫస్ట్ క్లాసులతో పాసవుతున్న మాట నిజమేకాని నఖల్ చీటీలకు మీ పమిటలూ, రెవికలూ, చాలా సహాయకారిగా వుంటాయని నా నమ్మకం" శర్మ కవ్వింపుగా అన్నాడు.
"ఎంతటి హేయమైన అభాండం ఆఢపిల్లలమీద ఛీ! ఒళ్ళంతా భగ్గుమన్నట్లుగా అయింది శాలినికి. "వట్టి సంకుచితులు! ఆడదాని అభ్యుదయాన్ని ఒప్పుకోని కుశ్చితులు. మీపెళ్లి ఏ పల్లెటూరి గబ్బిలంతోనో జరగాలి తప్ప కాస్త చదువుకొన్నదీ, ఆలోచించగలిగిందీ అయితే అది అడుగడుగునా మీ కుశ్చితంతో, కుచేష్టలతో అవమానింపబడి, ఆత్మహత్య చేసుకు చావాలి" కసికొద్దీ అంది.
