మా వరదరాజులు ప్లూటు సాధనా.... నా పరీక్షల గురించి వివరంగా చెప్పాను.
"పోనీ ఈ మూడు వారాలూ రాత్రుళ్ళు మీ యింటికి వచ్చి చదువుకోనా?" ఆశగా అడిగాను.
"అబ్బే, లాభంలేదు... ఇంటినిండా చుట్టాలు, ఇందాక నువ్వు చూశావుగా, నీ చదువు అస్సలు సాగదు... మాపిల్లల గోలకంటే అ ప్లూటు గోలే నయం."
"అయితే మరెలా?"
నిముషం గడిచింది.
హఠాత్తుగా టేబులుమీద ఓ గుద్దు గుద్దాడు చంచల్రావు.
"దొరికింది... మీ ఇంటికి తక్షణం పద, నోరు మూసుకుని జరిగేది చూడు"
మేమిద్దరం ఇంటికి వెళ్లేసరికి వరదరాజులు ప్లూటు వాయిస్తున్నాడు.
"వహ్వ... వహ్వ" చప్పట్లు కొడ్తూ లోపలికి అడుగుపెట్టాడు చంచల్రావు.
"చాలా బాగా వాయిస్తున్నారండీ ...."
నాకు మతిపోయింది. వీడు అతన్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నాడేమిటి?!...
గట్టిగా వెనకనుండి వాడి పీర్రమీద గిల్లేశాను.
"అమ్మో!.... హఠాత్తుగా గిల్లడంవల్ల కంగారుగా అరిచాడు చంచల్రావు.
"ఏమయ్యింది బాబూ?" వరదరాజులు కూడా కంగారుపడ్డాడు.
"అబ్బే... ఇప్పుడు ప్లూటుమీద మీరు వేసిన సంగతులకి సంతోషం పట్టలేక అరిచానండీ..."
మళ్ళీ గిల్లుతానేమోనని చటుక్కున నా వైపు తిరిగి కన్ను కొట్టాడు చంచల్రావు.
"కూర్చోండి కూర్చోండి... ఇంకా వినిపిస్తాను అంటూ ప్లూటు అందుకున్నాడు వరదరాజులు.
ఒక అరగంటపాటు "కూకూ..." అంటూ వాయించాడు.
చంచల్రావు అహా...ఓహో అంటూ ఆ కూతలన్నీ వింటున్నాడు.
వాడు అలా తలూపడం చూసి వరదరాజులు మర్నాటి నుండి తన సంగీత సాధన ఇంకా ఎక్కువ చేస్తాడని భయం వేసింది నాకు.
"ఇప్పుడు ఇంట్రవల్..." అన్నాడు ప్లూట్ ప్రక్కన పెడ్తు.
ఏమేప్ గారు టీలు ఇచ్చారు.
టీలు త్రాగడం అయిన తరువాత చంచల్రావు మొదలు పెట్టాడు.
"అన్నట్టు వరదరాజులుగారూ.... మీకు ఉబ్బసం ఉందికదూ?"
"అవును...ఏం?"
"అయ్యో పాపం...." అన్నాడు చంచల్రావు చాల బాధపడిపోతూ.
"అదేమిటీ?" అంది వరదరాజులు భార్య కంగారుగా.
"సంగీతంపట్ల ఆయనకున్న ఇష్టాన్ని చంపుకోవల్సిందే... ఆయన ప్లూటు వాయించడానికి వీల్లేదు."
"ఎందుకూ?" వరదరాజులు అయోమయంగా చూశాడు.
"మీకు ఉబ్బసం ఉందికదా?.... ప్లూటు వాయించడంవల్ల ఆయాసం మరీ ఎక్కువై ఉబ్బస వ్యాధి ఎక్కువై పోతుంది.
హమ్మ చంచల్రావు... మొత్తానికి కొట్టేవు దెబ్బ.
వరదరాజులు బిక్కముఖం పెట్టాడు.
"ఏం చేస్తాం? ప్లూటు వాయించే యోగం నాకులేదు" అన్నాడు వరదరాజులు దీనంగా.
"చివరిసారిగా... ఒకసారి ఊది మానేస్తాను."
"కూ...."
హృదయ విదాకరంగా ఒకసారి కూత పెట్టి ప్లూటుని పక్కన పెట్టి కళ్ళు తుడుచుకున్నాడు వరదరాజులు.
ఆరోజు చంచల్రావుకి ఓ రెస్టారెంటు లో బ్రహ్మాండమయిన పార్టీ యిచ్చాను.
ఓ నాలుగు రోజులపాటు నా చదువు నిరాటకంగా సాగిపోయింది.
కానీ ఆరోజు-
ఆరోజు మామూలుగా మెస్ కి వెళ్ళి భోజనంచేసి వచ్చి రాత్రి తొమ్మిది గంటలకు ఎక్కౌంటెన్సీ పుస్తకం తెరిచాను.
"కూ...కూ"
ప్లూటు కూత నా చెవులకు భయంకరంగా సోకింది.
వరదరాజులు మళ్ళీ ప్లూటు వాయించడం మొదలు పెట్టాడా? ఆరోగ్యానికేం ఫరవాలేదని ఆయనకు చెప్పారా?
ఇలా నేను ఆలోచిస్తుండగానే...

"ఢం ఢం ఢం ....టక టక ఢమా ఢమా ఠక్ ఠక్"
"కూ....కూ"
చెవులు పగిలేలా మోత!.....
కంగారుగా వరదరాజులు పోర్షనులోకి పరుగెత్తాను.
అక్కడి సీను చూస్తే వేరేవాళ్ళకు నవ్వు వచ్చేదేమోగానీ నాకు మాత్రం ఏడుపు వచ్చింది.
