వరదరాజులు తనచుట్టూ డ్రమ్స్ పెట్టుకుని వాయిస్తున్నాడు. అతని ఎదురుగా ఆవిడ ప్లూటు వాయిస్తుంది.
"రావోయ్ రా... ఈ సంగీతం మీద మమకారం చంపుకోలేక. నేను ప్లూటు వాయించకూడదు కాబట్టి ఈ డ్రమ్స్ వాయించడం నేర్చుకుంటున్నాను... ఇదైతే ప్రమాదం లేదుకదా?" అన్నాడు వరదరాజులు.
ఇంట్లో ప్లూటుని ఊరికే మూల పడేసి ఉంచడం ఎందుకని అది నేను నేర్చుకుంటున్నాను నాయనా" అంది అతని భార్య.
"కూర్చో ...కాస్సేపు విను...."
"ఢమ ఢమ టక టక టర టర చిక చిక ఢం ఢం ఠక్... కూ...కుకూ....కూ"
నా కళ్ళు తిరిగాయ్... నాకేమౌతుందో నాకే తెలీడంలేదు.
నేనూ - దొంగాడూ
మా ఆఫీసులో వచ్చేవారం డిపార్టుమెంటల్ పరీక్ష ఉంది. ఎక్కౌంటెన్సీ , జనరల్ ఇంగ్లీషు, అర్థమేటిక్ లలో పరీక్ష పెడ్తారు. మొదటి రెండు పరీక్షల్లో ఫరవాలేదుగానీ, అర్థమేటిక్ లోనే నేను చాలా పూర్.
"ఎలా, ఎలా?"
ఏం చెయ్యాలో తోచక బుర్ర గోడకేసి కొట్టుకున్నా.
హఠాత్తుగా ఎవరో నా కాలరు పట్టుకుని బర్రున వెనక్కి లాగేశారు.
వెనక్కి తిరిగి కోపంగా చూశాను.
మా ఇంటి యజమాని ఉన్నాడు.
"ఏమిటి?.... ఏవిటిది అంటున్నా?" చెవులు గండ్లు పడేలా అరిచాడు ఆయన.
"నా బుర్రకాయ్!... నా ఇష్టం!" అన్నాను నేను ఉక్రోషంగా.
"బుర్రకాయ్ నీదేకానీ ఈ ఇల్లు నాది. నువ్విలా నీ తలతో గోడలు బద్దలుకొడ్తే ఊరుకునేదిలేదు. ఇంకోమారిలా చేస్తే ఇల్లు ఖాళీచేయిస్తా" అన్నాడు ముక్కు పొంగిస్తూ.
నా కోపం చప్పున చల్లారిపోయింది.
"క్షమించండి. సార్... నాకు వచ్చే వారం డిపార్టుమెంటల్ ఎగ్జామ్స్ న్నాయ్. అందుకని ....హిహిహి" చేతులు నలుపుకుంటూ అన్నాను.
"పరీక్షలుంటే చక్కగా చదువుకోవాలి గానీ, నిక్షేపంలాంటి గోడలు బద్దలు కొడ్తారటయ్యా.... ఆ!" కళ్ళెగరేశాడాయన.
"అబ్బే... మీ గోడలు బద్దలుకొట్టే ఉద్దేశం నాకే కోశానా లేదండీ.మరేమోనండీ... నేనేమోనండీ... అర్థమేటిక్కులో చాలా పూరండి... ఏం చేయాలో తెలీక గోడకేసి తలకొట్టుకున్నానండీ... హిహిహి" అన్నాను వినయంగా.
"నీ ఫ్రెండ్ చంచల్రావు మాథమాటిక్స్ స్టూడెంట్ కాదయ్యా"అన్నాను.
"హర్రే... ఈ విషయం నాకు తట్టలేదే?" అని నాలుక కరుచుకుని అమాంతము మా ఇంటి యజమానిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను.
ఆయన చొక్కా పైకెత్తి ముఖంమీద కప్పుకుని సిగ్గుపడ్డాడు.
నేను చంచల్రావు ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాను.
"ఓ...దాందేముంది" అన్నాడు.
"మీ ఇంట్లో జనంవుంటారు.... లాభం లేదు. నేను గదిలో ఒంటరిగా వుంటాను కాబట్టి నువ్వు నా గదికి వచ్చి నాకు లెక్కలు చెప్పు... ఈ రాత్రికి నా గదిలో పడుకో"అన్నాను.
చంచల్రావు దానికి సరేనన్నాడు ఇద్దరం నా గదికి వెళ్ళాము.
నా గదిలో నేలమీద చాప పరుచుకుని ఇద్దరం దానిమీద కూర్చున్నాం. నేను ఆర్థమేటిక్ పుస్తకం, నోటు పుస్తకం తెచ్చి పెట్టాను.
"తలుపు ముందునుండి తాళంవేసి వస్తానుండు" అంటూ లేచాను.
"ఎందుకూ?" టి.వి.లో 'చిత్రవిహార్ లో మంచిపాట వచ్చినంత ఆశ్చర్యంగా చూశాడు చంచల్రావు నా వైపు.
"ఎందుకేమిటి... వెధవ డిస్ట్రబ్స్. ముందునుండి తాళంవేసి నేను వెనుకనుండి వస్తాను. అప్పుడెవరైనా వస్తే తాళం చూసి నేను గదిలో లేననుకొని వెళ్ళిపోతారు" అన్నాను.
చంచల్రావు నా తెలివితేటలకి మూర్ఛ పోయాడు.
నేను వాడి ముఖంమీద నీళ్ళుచల్లి "మరేం బెంగపెట్టుకోకు. నాకు అప్పుడప్పుడూ ఇలాంటి ఐడియాలు తడ్తుంటాయ్" అని వాడికి నచ్చజెప్పి కూర్చోబెట్టి ముందువైపునుండి తాళంవేసి వెనక తలుపులేసుకుని గదిలోకొచ్చాను.

ఇంకేం ఉందీ.... చంచల్రావు మళ్ళీ మూర్ఛపోయి ఉన్నాడు.
మళ్ళీ వాడి ముఖాన నీళ్ళుచల్లి లేపి కూర్చోబెట్టాను.
"నీకిందాక చెప్పానా నాకప్పుడప్పుడూ బ్బ్రిలియంట్ ఐడియాలు వస్తాయని... నువ్విలా మాటిమాటికి మూర్ఛపోతే నాకు లెక్కలు చెప్పేదెప్పుడు" అంటూ వాడిమీద కోపగించుకున్నాను.
"ఓకే... ఓకే... ఇంక మూర్ఛపోనుగా" అన్నాడు పిచ్చాడిలా నావంక చూస్తూ.
