Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 21

"కూడులోని లోకం యిది
గుండెలోతు తాపం యిది
సోమయాజి శాపం యిది
పెద్దలున్న మిద్దెలున్న పాపం యిది;
అడుగునున్న అడుసుతిన్న లోకం యిది.
ఇది భూలోకం అబ్బీ - యిట
అస్థిమూల పంజరాలు
ఆర్తరావ మందిరాలు
పలుకలేని గులకరాళ్లు!"

    *    *    *   
                    ---1945

*బెంగాల్ లో 1941 నుంచి అనావృష్టి, తుఫానులు, యుద్ధంవల్ల క్రమంగా కరువు పరిస్థితి తీవ్రం అవుతూ 1943 నుంచి భయంకరమైన కరువు, అంటు వ్యాధులు బెంగాల్ ని మృత్యు ముఖంలోకి నెట్టాయి. 10 లక్షల మందికి పైగా మరణించారు. 1945 దాటాక గాని పరిస్థితి మెరుగపడింది కాదు.

యుగళ గీతిక

కిటికీ అవతల
కుండులోని పూలమొక్కలు
పచ్చని ఆకుల పచ్చివాసనలు;
ఆకాశపు వంపువద్ద
తెలిమబ్బుల వలయంలో
మెరుస్తూన్న ఆర్దృ;
నలిగిన కిటికీ
రంగుచారల తెరల సందులనుండి
వీచేగాలులు చల్లని కన్ను రెప్పల కదలికలు;
గోడమీద భారంగా
వంగిన పటాలు;
పేజీలు ముడుచుకొని పడుకొన్న
బీరువాలోని పుస్తకాలు;
కుర్చీ, గుండ్రబల్ల, యిస్త్రీ మడతల దుస్తులు
సగం తెరిచిన సూటూకేసు;
ఒలికిన అత్తరు సుతారపు సువాసన;
గదిలో చీకటిలో
చిటిలిన తారలట్లు
సగం కాలిన అగరువత్తుల కొసలు;


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS