"ఛటచ్ఛటా శబ్దమేమి
చక్రాలకి రక్తమేమి
ఏం లోకం తల్లీ - యిట
కనుపించడు కాలనేమి?"
"ఆవులించు యంత్రశాల
చక్రంలో చిక్కుపడ్డ
మనిషి గుండె ఏడ్చిందట!
కనుపించడు అబ్బీ - యిట
తెరలోపలి కాలనేమి."
"దారిపొడుగు జనశవాలు
జారిపడే చేయికాలు
ఏ లోకం తల్లీ - యిట
ఎగిరిపడే రాబందులు?"
"వంగదేశ క్షామం యిది
వ్యంగ్యభాష క్షేమం యిది
పర ప్రభుత్వ దానం యిది
ధనికలోక ధర్మం యిది
కాలు కడుపు యిమ్మన్నది
గాజుమేడ లేదన్నది
అన్నపూర్ణ కంటిముందు
కనపడినది రక్తబిందు
ఇది కలికాలం అబ్బీ -
కళ్ళులేని పాపం యిది"
"ఒకే రకపు తోలుబొమ్మ
లొకేవైపు ఒకే నడక
ఎక్కడికే తల్లీ - యిట
ఏదో కత్తుల నది"
"మృత్యువనే మైదానం
శత్రువనే అజ్ఞానం
యీర్ష్యలోని ఒక దాహం
సంధ్యలాంటి సందేహం
పిలిచికొన్న ఒక సైన్యం
తిరిగిరాని ఒక దైన్యం
ఒక యుద్ధం అబ్బీ - యిపు
వీరికి మిగిలే దొక బాష్పం"
