ఆరిపోయిన హరికేన్ లాంతరు
దీపపు వత్తి చివర నిద్రపోయే నిప్పునలుసు
మరువం, దవనం
మల్లెచెండ్లు మేల్కొల్పిన
వెచ్చని తొలివేసివ జాగృతి;
పందిరి మంచంపైన
ఆమె చిరునవ్వులో
కవిత్వంలాంటి కొత్తదనం మెరిసింది
ప్రేమవంటి
స్నేహంవంటి
ఆమె కన్తుదల జాలివంటి ఆనందంవంటి
ముగ్ధమైన స్నిగ్ధమైన
ఆకర్షణ;
కామంవంటి
కైపువంటి
అనాది అనాది కాంక్షా తప్తమైన
నెత్తుటిలో ఒక తొందర;
కౌగిలి ఒదిగిన పెదిగిన ఒక నిట్టూర్పు
గడియారపు డయల్ మీది
రేడియమ్ అంకెలు
చీకటి మార్జాలపు పచ్చని కళ్ళు!
కిటికీ అవతల
ఒక వెన్నెల బిందువు
కొబ్బరి మొవ్వులోనికి జారినట్లు
వినపడీ వినపడని చప్పుడు!
* * *
---1955
ఆ రోజులు
ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా
ఆనందంలాంటి విచారం కలుగుతుంది
నేటి హేమంత శిధిల పత్రాలమధ్య నిలచి
నాటి వాసంత సమీర ప్రసారాల తలచి
ఇంతేగదా జీవితం అన్న చింత
ఇంతలోనే ముగిసిందన్న వంత
చెమ్మగిలే నా కళ్ళని ఎవరైనా చూస్తారేమో అని
చెదిరిన మనస్సుతో యిటు తిప్పుకుంటాను
