Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 20

 

వెంటనే బృంద నుంచి ఫోన్ వచ్చింది. ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు. ఒక నెలన్నా విశ్రాంతి తీసుకోవాలి. 

లేచి హాల్లో కి వచ్చాడు. వస్తూనే అక్కడున్న ఆకారాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు.

"సార్, లతమ్మ మీకు ఇచ్చి రమ్మంది" అక్కడ ఫ్లాస్క్ లో ఉంచిన కాఫీ, టిఫిన్ ప్లేట్ చూపిస్తూ అందా ఆకారం. 

"లోపలకి ఎట్లా వచ్చావ్" అనుమానంగా అడిగాడు.

"లతమ్మ దగ్గర ఇంకో తాళంచెవి ఉంది. వారానికి ఒకసారి ఈ ఇల్లు నేనే శుభ్రం చేస్తాను. నా పేరు వల్లి" చెప్పిందామె.

తలూపాడు.

ప్రస్తుతం తనకి ఒక కప్ టీ చాలా అవసరం.

ఆమె వెళ్ళిన కాసేపటికి లతతో కలిసి మళ్లీ తిరిగి వచ్చింది.

"ఏంటి సుధీర్ సడెన్ గా వచ్చావ్? కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అడగొచ్చని ఇందాక ఎక్కువ మాట్లాడించలేదు. ఇప్పుడు చెప్పు" కూర్చుంటూ అంది లత.

క్షణం పాటు మనసు చివుక్కుమంది అతనికి. 

తనని ఏ రోజూ వరస పెట్టి గౌరవంగా ' అని పిలవదు. అదే మాట పైకి అడగాలంటే ఏమి జవాబు వినాల్సొస్తుందో అని భయం. .

లత తో పాటు వచ్చిన వల్లి వైపు చూసాడు. 

"లోపలికెళ్లి వంట చేయి" లత ఆమెకు పురమాయించింది.

ఆమె అవతలికి వెళ్ళగానే కుతూహలంగా అడిగాడు.

"ఆమె అట్లా ఉందేమిటి?"

"ఒక సారి వంట చేస్తుంటే కుక్కర్ పేలిపోయిందట. మొహం, మెడ అన్నీ కాలిపోయి అలా అయింది. భర్త వదిలేశాడు. నా దగ్గరే ఉంటోంది" క్లుప్తంగా చెప్పింది.

"సంఘసేవ" వెటకారంగా అనుకున్నాడు  సుధీర్. వీటికేమి కొదవ లేదు అక్కాచెల్లెళ్లకి.

"నువ్వు చెప్పు సుధీర్" అందామె. 

"ఏమి చెప్పను?" ఆలోచిస్తున్నాడు సుధీర్.

"నేను కొన్ని సమస్యల్లో ఉన్నాను. కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వచ్చాను" జాగ్రత్తగా ఆచితూచి చెప్పాడు.

తల ఊపిందామె. ఇంకేదైనా చెప్తాడేమో అని కొద్ది సెకన్లు మౌనం వహించింది. అతనేమీ మాట్లాడేలా కనపడలేదు.

"మా అక్కకి ఏమీ ఆపద లేదు కదా?" సడన్ గా అడిగింది.

అందరికీ బృంద అంటే ఇష్టం. ప్రతి వాళ్ళూ ఆమె గురించి ఆందోళన చెందేవాళ్లే!!

ఆలోచిస్తూనే లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు.

"మంచి ఊరునే ఎన్నుకున్నావ్.  ఇక్కడ నిన్నెవరూ గుర్తు పట్టరులే సుధీర్" అందామె.

"ముఖ్యమంత్రిని గుర్తు పట్టరా?" ఆశ్చర్యంగా చూసాడు సుధీర్.

"ఇక్కడ మిగిలిపోయిన జనాల సంగతి నీకు తెలీదు సుధీర్. వాళ్ళ పేర్లే వాళ్ళకి గుర్తుండవు. అంతా మొద్దు జనం" తల్లి తన బిడ్డలు అమాయకులని మురిపెంగా చెప్పినట్లుగా చెప్తోంది లత.

"ఈవిడ టీచర్ అంటే ఇక జనాలు మొద్దుల్లా తయారవటం లో పెద్ద ఆశ్చర్యం ఏముంది" అనుకున్నాడు సుధీర్.

"పాత వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు ఊరంతా వెతికినా పది మంది కన్నా ఎక్కువ ఉండరు. వాళ్లు కూడా నిన్ను కార్తీక్ అనుకుంటారులే. నువ్వు కంగారు పడి మరీ తలుపులేసుకుని ఇంట్లో వుండక్కర్లేదు. బయట తిరగొచ్చు." అంది లత.

తల ఊపాడు.

"నీకు వంటకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని వల్లి చేస్తుంది" చెప్పి లేచింది లత.

"లతా, ఒక్క మాట" ఆమెను ఆపుతూ అన్నాడు సుధీర్.

తలుపు వరకూ వెళ్ళిన ఆమె వెనక్కి తిరిగి చూసింది.

"నేను ఇక్కడ ఉన్న విషయం మీ అక్కతో కూడా అనకు. బృంద ఫోన్ టాప్ అయిఉంటుంది. అవసరం అయినప్పుడు తనకి నేనే చెప్తాను" అన్నాడు.

విచిత్రంగా చూసింది ఆమె. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది.

వల్లి వంట బాగానే చేసింది కానీ బృంద వంటలా లేదు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేప్పుడు అనుకున్నాడు సుధీర్. 

తను అనవసరంగా ఇక్కడికి వచ్చాడా? మాటిమాటికీ బృంద గుర్తొస్తోందేమిటి?? 

***

మర్నాడు పొద్దున అలవాటు కొద్దీ ఆరింటికే మెలకువ వచ్చింది సుధీర్ కి. కాసేపటికి వల్లి వచ్చి పనులు మొదలెట్టింది.

తోచక టీవీ పెట్టాడు.

ప్రతిపక్ష నాయకుడు తనకంటే ముందే లేచి ఇంటర్వ్యూ మొదలెట్టాడో, అంతకు ముందు రోజు తీసుకున్నారో తెలీదు.

"సుధీర్ అన్ని విధాలా ముఖ్యమంత్రిగా  ఫెయిల్ అయ్యాడు. రాజీనామా చేయాల్సిందే. అసెంబ్లీ లో అన్నీ అడుగుతాం, కడిగి పారేస్తాం. రాజీనామా చేయించి తీరుతాం" చూపుడు వేలు చూపిస్తూ అంటున్నాడు. పక్కనే తను తల వంచుకుని నిలబడ్డ ఫొటో చూపిస్తున్నారు. చూసేవాళ్ళకి పార్థు తిడుతుంటే తను తప్పు వొప్పుకొని తల వంచుకుని నిల్చున్నట్లు కనబడుతుంది.

"వాడొక్క సారి అంటే వీళ్ళు వంద సార్లు చూపిస్తారు" చిరాగ్గా అనుకున్నాడు సుధీర్.  
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS