Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 20

 

    "సాగర్! ఏమిట్రా అలా వున్నావ్?" తండ్రి కంఠం వణికింది.
    సాగర్ గుండె బ్రద్దలై పోయినట్టయింది. తన తండ్రేనా ఇలా మాట్లాడుతున్నాడు. తండ్రి కంఠంలో తొణికిన , ఆరాటమూ , ఆవేదనా నేరుగా సాగర్ గుండెను తాకాయి.    
    "నాన్నా' ఇంకా ఏదో అనాలనుకున్నాడు. కాని మాటలు దొరకలేదు. పసివాడిలా తండ్రి కేసి నిస్సహాయంగా చూశాడు సాగర్. తండ్రి కొడుకు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. తండ్రి కళ్ళు అర్ద్రమైనాయి. సాంబశివరావు తనలో కలిగిన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అంతలోనే ముఖం గంబీరంగా మారిపోయింది. సాగర్ మీద నుంచి దృష్టి మరలించాడు. డాక్టర్ కేసి చూశాడు.
    సాగర్ తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు.
    మౌనంగా తండ్రిని, డాక్టర్ని మర్చి మార్చి చూడసాగాడు.
    డాక్టర్ మార్తి కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి పైప్ వెలిగించాడు. గుప్పు గుప్పున పొగ వదులుతూ యస్పీ సాంబశివరావుకేసి అర్ధయుక్తంగా చూశాడు. "ఊ! కానియ్!' అన్నట్టు సాంబశివరావు చూపులతోనే సమాధానం చెప్పాడు.
    "వెల్! మిస్టర్ సాగర్!" డాక్టర్ మొదలు పెట్టాడు.
    "నేనూ , మీ నాన్న చాలా అలోచించి ఓ నిర్ణయాని కొచ్చాం."
    "దేన్నీ గురించీ?" సాగర్ అడిగాడు.
    "నీ పెళ్ళి గురించే!"
    "నా పెళ్ళి గురించా?" సాగర్ కలవరపడుతూ అన్నాడు.
    "అవును, నీ పెళ్ళి గురించేరా?" తండ్రి స్వరం తీవ్రంగా వున్నది.
    'అంత తొందరే మొచ్చింది?"
    "పరిస్థితులు అలా వున్నాయి! దానికి మేమవరం బాధ్యులం కాము!"
    "ఏమిటి డాక్టర్ గారూ మీరనేది? నాకేం అర్ధం కావటం లేదు!" సాగర్ అయోమయంలో పడిపోయాడు.
    "అర్ధం చేసుకునే వయసున్నా , ఆ ఆలోచనా శక్తి నీకు లేదు. అందుకే మేము చెప్పాల్సి వస్తున్నది!" సాంబశివరావు మధ్యలో అందుకొని కటువుగా అన్నాడు.
    సాగర్ కి మాడు మీద సుత్తితో బాది నట్టయింది.
    "ఏమిటి డాక్టర్ గారూ! అమ్మ కేలా వున్నది?" సాగర్ కంఠం వణికింది.
    "ఆమె ఇంకెంతో కాలం బ్రతకదు! ఒకటి లేక రెండు నెలలు!"
    "డాక్టర్!' సాగర్ రెండు చేతులతో తల పట్టుకున్నాడు.
    "బాధ పడి నువ్వు చేయ గలిగిందేమీ లేదు. ఆమె అంతిమ దశలో నువ్వు ఆమెకు అందించగలిగిన అనందం ఒక్కటే! నువ్వు తీర్చగల ఆమె ఆఖరి కోరిక కూడా అ ఒక్కటే!"
    "డాక్టర్ గారూ! ప్లీజ్! మా అమ్మకు ఏమయిందో చెప్పరా? ఇంత హటాత్తుగా మా అమ్మ ఆరోగ్యం ఎందుకు దెబ్బతిన్నది? ఆమెకు ఎన్నో ఏళ్ళుగా వున్నది ఉబ్బసమేగా? దాని వల్ల ప్రాణాపాయం ఉండదంటారు కదా?" సాగర్ కళ్ళల్లో నీరు తిరిగింది.
    "సాగర్! అస్తమా వల్ల ప్రమాద మేమీ వుండదు. అవస్థ పడటం తప్ప! కాని మీ తల్లిగారి కిప్పుడు - డాక్టర్ పైప్ యష్ ట్రేలో దులపసాగాడు. సాగర్ డాక్టర్ ముఖం లోకి ఆదుర్దాగా చూశాడు. పైప్ శుభ్రం చేసుకొంటూ డాక్టర్ సూటిగా సాగర్ కళ్ళలోకి చూశాడు.
    "మీక్ అమ్మగారికి కాన్సర్! లంగ్ కాన్సర్  బయాప్సీ పాజిటివ్ రిజల్టు వచ్చింది.

    "మూర్తిగారూ !' సాగర్ గొంతు లోతైన నూతిలో నుంచి వచ్చినట్టుంది.
    'చాలా అడ్వాన్స్ డ్ స్టేజి! సెకండరీ కూడా మొదలయినాయి" పైపు బల్ల మీద మెల్లగా కొడుతూ అన్నాడు డాక్టరు.
    "ఓ మైగాడ్!' సాగర్ కు అగాధంలోకి విసిరేసినట్టయి పోయింది. కళ్ళముందు చీకట్లు కమ్మాయి.
    "సాగర్! బీ బోల్డు! ధైర్యంగా ఉండాలి. మనం చేయగలిగిందేమీ లేదు."
    "డాక్టర్ గారూ మా అమ్మను....." సాగర్ గొంతు పూడిపోయింది. దుఖం పొర్లుకు వస్తుంది.
    "సాగర్ ! ఓ మై చైల్డ్!  చదువుకున్న వాడివి, అన్నీ తెలిసినవాడివి నువ్వే ఇలా అయిపోయే ఎలా?" డాక్టర్ మూర్తి లేచి సాగర్ పక్కన కూర్చున్నాడు. భుజం తడుతూ సాగర్ ను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు.
    "కాన్సర్ అంటే ఏమిటో నీకు తెలుసు! నువ్వు చదివే వుంటావు. ప్రపంచ విఖ్యాత శాస్త్రజ్ఞుడు హల్టేన్ తన అంతిమ సందేశంగా ఏమన్నాడో తెలుసా! తన సర్వస్వాన్ని ఆఖరి పైసా కూడా కాన్సర్ రిసెర్చికి ఖర్చు పెట్టమన్నాడు. కాన్సర్ వ్యాధినివారణకు ఖర్చు చేయవద్దన్నాడు. ఎందుకో తెలుసా? కాన్సర్ వ్యాధిని నయం చేయడం అసంభవం, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాన్సర్ క్యూర్ హాస్పిటల్స్ కట్టించడం వృధా అన్నాడు. మహామేధావి, మానవతావాదిం నిజం ఎంత బాధాకరమైనదైనా ఎంత నిర్మొహమాటంగా సూటిగా చెప్పాడో చూశావా? ప్రాణం మీది తీపితో మానవ మాత్రులు ఎన్నో చేస్తాం. కాన్సర్ వ్యాధి గ్రస్తుడికి చికిత్స చేయడమంటే అతడి శారీరక బాధను పోదిగించాటమే! దాంతో పాటు రోగి మానసిక క్షోభను ఇనుమడింప చేయకుండా జరుగుతుంది. అంతేకాదు అయినవాళ్ళకూం ఆత్మీయులకు నిత్యం మృత్యువును చూస్తున్నప్పుడు కలిగే ఆవేదన కలుగుతుంది?" డాక్టర్ మూర్తి చెప్పుకుపోతున్నాడు. సాంబశివరావు ఒక్క సారిగా లేచి నిలబడ్డాడు. తడబడుతున్న అడుగులతో భార్య గది కేసి నడిచాడు.
    "సాగర్! చూడు! పులి లాంటి మీనాన్నే నిన్ను చూసి కరిగిపోతున్నాడు. నిన్ను చూస్తూ నీ ఎదురుగా కూర్చోలేక పోయాడు. ఇంకా అయన కేవరున్నారు. నువ్వు తప్ప . ధైర్యంగా వుండాలి" డాక్టర్ సాగర్ తల నిమురుతూ అన్నాడు.
    సాగర్ కళ్ళు తుడుచుకొని, తలెత్తి డాక్టర్ ముఖంలోకి చూశాడు.
    "డాక్టర్ గారూ! మీరు మా నాన్నగారికి ఆత్మీయులు. అయన నిండు కుండ తొణకదు. మిన్ను విరిగి మీద పడ్డా చలించని స్వభావం ఆయనది. అలాంటి ఆయనను ఇప్పుడు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అమ్మను ఎటు తిరిగి దక్కించుకోలేని దురదృష్టవంతుడిని  . మా తండ్రి నైనా....' సాగర్ డాక్టర్ రెండు చేతులూ పట్టుకున్నాడు. గొంతు పూడిపోయి ఆపైన మాటలు పెగల్లేదు.
    "మీ నాన్న నాకు ఆత్మీయుడే కాదు, అన్న లాంటి వాడు కోడాను. నా అర్ధ ప్రాణం. ఆయన్ను రక్షించుకోవడం నా బాధ్యత. నా కర్తవ్యం. అందుకు నీ సహకారం కావాలి. నవమాసాలు మోసి , రక్తం పంచి ఇచ్చిన తల్లి రుణం తీర్చుకో! మీ తల్లి గారి కడసారి కోరిక చెల్లించి ఆమె ఆత్మకు శాంతి కలిగించు! మీ తండ్రికి మనశ్శాంతి ని చేకూర్చు. తనయుడిగా, నీ బాధ్యతను నెరవేర్చు." డాక్టర్ మూర్తి కంఠం గంభీరంగా సాగిపోతున్నది. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మలా కనిపించాడు ఆ సమయంలో డాక్టర్ సాగర్ కు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS