Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 21

   
                                 *    *    *


    వైజాగ్ సిటీ-------!
    పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయం.
    ఆ గదిలో ఇరువురు వ్యక్తులు మాత్రమే వున్నారు.
    వాళ్ళు వైజాగ్ సిటీ అసిస్టెంట్ కమీషనర్, నెంబర్ వన్ ........ విజయవాడ రైల్వే ఇన్ స్పెక్టర్ ధీరజ.
    "మిస్ ధీరజా! ఈ లెటర్ చదవండి. విషయం మీకే బోధపడుతుంది."
    ఏ.సి.పి. నుంచి లెటర్ తీసుకున్నది ధీరజ.
    గౌరవనీయులైన సిటీ పోలీస్ కమీషనర్ గార్కి-------
    ఈ ఉత్తరం మీ చేతిలో వున్నది అంటే నేను ప్రాణాలతో లేనట్టు లెక్క. ఎందుకంటే నేను ఏ సందర్భాలో నయినా, ఎప్పుడయినా చనిపోవడం కానీ, చంపబడడం కానీ, జరిగితేనే ఈ ఉత్తరాన్ని మీకు పోస్ట్ చేయమని నా సహద్యోగి కిశోర్ కు చెప్పి అందజేశాను కాబట్టి -----అతను అలానే చేస్తాడనే నమ్మకం వుంది.
    నా ప్రాణాలు ఆపదలో వున్నాయి. నా భార్య చేతిలో ఎప్పటి కయినా చావు రాసి వుందేమోనని భయం వేస్తుంది. అలా అని అది చంపుతుందని కాదు. దాని మాట వినకపోతే చంపిస్తుందని అలా చేస్తే నా పిల్లలు దిక్కు లేని అనాధలు అవుతారు. నేను చనిపోయిన తరువాత నాకు వచ్చే డబ్బు ఏదయినా నా రెండవ భార్య రాదా దేవికి మాత్రమే చెందాలి.
    రెండవ పెళ్ళి చట్ట విరుద్దమే కావచ్చు కానీ నేనే లేనప్పుడు ఇంకా నాకు శిక్షతో పనేమిటి? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్క కూడదు. హైదరాబాద్ లోని నా బంధువులకు నా ఆస్థి వివరాలు తెలుసు. నన్ను నమ్ముకున్న రాధాదేవికి అన్యాయం జరగకూడదు.
    నా మొదటి భార్య లలిత రౌడిలతో స్నేహం చేస్తుంది. వాళ్ళతో కలిసి తాగుతుంది, తిరుగుతుంది. అదేమంటే ఎన్నోసార్లు నాపై తిరగబడింది కూడా. అందుకే ముందు జాగ్రత్తగా ఏ క్షణంలో నా ప్రాణాలు పోతాయోననే భయంతో ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను.
    ఈ ఉత్తరంలో ఏముందో కిశోర్ కు తెలియదు. అతనిని అనుమానించి వేదించకండి. మీకు చేతనయితే ఆ రాక్షసిని శిక్షించి నా పిల్లలను కాపాడండి.

                                                                                                       --"సీతాపతి'
    
    ధీరజ లెటర్ పూర్తిగా చదివాక ఆమె వైపు చూశాడు ఏ.సి.పి .
    "సర్.......! దీనిని బట్టి లలితను అనుమానించవచ్చు. ఆమె తన భర్తను చంపించింది అనడానికి ఈ సాక్ష్యం చాలు -------" అన్నది ధీరజ.
    "కావచ్చు .......! నిజానికి ఏ భార్య ఇంత తెలివితక్కువగా ప్రవర్తించదు. ఎందుకంటె తమ మధ్య సఖ్యత లేదని ఎవరిని అడిగినా ఇరుగు పొరుగు వాళ్ళూ పోలీసులకు నిజం చెబుతారు. భర్త అనుమానాస్పదంగా చనిపోతే అలాంటప్పుడు ముందుగా అనుమానించేది తననేనని తెలియని అమాయకురాలు కాదు లలిత. కాబట్టి ఇంకెవరో ఎందుకు చేసి వుండకూడదు? ఆ భార్య భర్త ల మనస్పర్ధలను ఆసరాగా తీసుకుని మరొకరెవరో సీతాపతిని మర్డర్ చేయడానికి కూడా అవకాశం వుంది కదా" అన్నాడు ఏ.సి.పి. గంభీరంగా.
    "అంటే భర్తను చంపించడంలో లలిత పాత్ర లేదని మీ అభిప్రాయమా?"
    "నో....నో..... అలా అని కాదు.... ఒకే కోణంలో అలోచించి ఒపీనియన్ ఫామ్ చేసుకోవద్దని చెప్పడానికి అలా అన్నాను.....ఎనీహౌ .... ఇప్పుడెం చేద్దామంటారు?
    ఆమె జవాబు కోసం అన్నట్టు కమీషనర్ ఒక్క క్షణం ఆగాడు.
    "ముందు కిశోర్ ను కలుసుకుంటే కొంత ఇన్ ఫర్ మేషన్ లభించవచ్చు. సీతాపతిని గురించి చెప్పగలిగినవాడు అతను మాత్రమేనని నా అభిప్రాయం. వాళ్ళ ఫామిలీ విషయాలు కరెక్టుగా తెలుసుకోగలిగితే నేరస్థుడు ఎవరో తేలిగ్గా ట్రేస్ చేయవచ్చు. ఒక కోణంలో నుంచి ఆలోచిస్తే లలిత మాత్రమే కాకుండా రాధాదేవి కూడా ఈ హత్యతో భాగం వుండి వుండవచ్చుననిపిస్తుంది. అలానే లలితతో పరిచయం వున్న మగస్నేహితులు ఎవరో తెలుసుకోవాలి....." అని చెప్పింది ధీరజ.
    "మీ ఎనలైజేషన్ బాగుంది. అలానే చేయండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మా ఇన్ స్పెక్టర్ కిరణ్ అందిస్తాడు. సిటీలో దర్యాప్తు చేసే విషయంలో అతని అవసరం మీకు తప్పనిసరిగా వుంటుందని నా అభిప్రాయం." కరచాలనం చేస్తూ అన్నాడు ఏ.సి.పి . నెంబర్ వన్.
    "థాంక్యు సర్"
    ఇన్ స్పెక్టర్ ధీరజ బయటకు వెళ్ళిపోయింది.

    
                                                             *    *    *

    బిజినెస్ మగ్నయిట్ గోవిందరావు గారి ఇల్లు అది.
    "ఏమోయ్ మంగళా, ఏమిటీ ఈరోజు కొత్త పెళ్ళి కూతురిలా తయారు అవుతున్నావు.... సరిగ్గా నేను ఆఫీసు కు వెళ్ళే సమయానికి ఇంత అందంగా అలంకరించు కుంటున్నావు. ఇప్పుడు నాకు మూడ్ లేదోయ్..... నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి....." అన్నాడు గోవిందరావు.
    "మీకు యెప్పుడు మూడ్ వుంటుందిలెండి.....' ఇప్పుడు వుండడానికి!"
    "ఆ ....ఏమిటి?"
    "ఏమీ లేదు.... ఇప్పుడు యెందుకుంటుంది మూడ్, భార్య కన్నా మీకు బిజినెస్ ముఖ్యం కదా అంటున్నాను. నేను ఏమయినా తప్పుగా అన్నానా?"
    "నెవ్వర్....." అంటూ దగ్గరకు వచ్చి ఆమె నుదుట చింబించాడు.
    మంగళ ఆత్రంగా అతనిని కౌగలించుకున్నది.
    "నో .... నో .....నాట్ నౌ డార్లింగ్...." అంటూ విడిపించుకున్నాడతను.
    ఆమె ముఖంలో అసంతృప్తి స్పష్టంగా తొంగిచుస్తున్న అదేమీ గమనించే స్థితిలో లేడు.
    "ఇంతకూ నీ సింగారానికి కారణం చెప్పనేలేదు సుమా....
    "పక్కింటి పిన్నిగారు సింహాచలం వెళుతున్నారు. చాలాకాలం నుండి నేను కూడా సింహాచలం చూడాలనుకుంటున్న విషయం మీకు తెలుసు కదా..... మీరు ఎటూ తీసుకు వెళ్ళరు. పెళ్ళాన్ని తీసుకెళ్ళే సమయం మీకు వుండదాయే..... ఆమెతో నయినా వెళితే దైవదర్శనం చేసుకుని వద్దామని"
    "నువ్వు ఎక్కడకు వెళితే మాత్రం నేను ఎప్పుడయినా వద్దని వారించానా/ అలాగే వెళ్ళిరా"
    "రాత్రి పొద్దు పోతుందేమో తిరిగిరావడానికి ---- మీరు బయటే భోజనం చేసిరండి"
    "ఒకే .......ఒకే ........' అంటూ వెళ్ళిపోయాడు గోవిందరావు.
    అయన వెళ్ళిన వెంటనే ఫోన్ చేసింది మంగళ.
    వెంటనే లైన్ దొరికింది....
    "హాయ్ మంగళా...... నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను ...... నువ్వు చెప్పినట్టే హోటల్ మారుపేరుతో రూమ్ బుక్ చేసి వుంచాను, ఇక నువ్వు రావడమే ఆలస్యం....."
    అవతల వైపు నుండి వినిపించింది.
    "ఇదిగో .......ఇప్పుడే బయలుదేరుతున్నాను డియర్..... పదినిమిషాల్లో నీముందు వుంటాను, సరేనా?"
    ఫోన్ పెట్టేసి ఆనందంగా బయటకు నడిచింది.
    ఎన్నాళ్ళ నుండో ఆ ఇంటిని కనిపెట్టి వున్న పనిమనిషి రంగమ్మ చూపులు నిశితంగా మంగళని గమనిస్తూనే వున్నాయి.
    "రంగమ్మా నేను రాత్రి పొద్దుపోయి వస్తాను. జాగ్రత్తగా తలుపులు వేసుకో"
    అమ్మగారు ఎక్కడకు వెళుతున్నదో తనకు తెలిసిందే కాబట్టి ఆమె పెద్దగా పట్టించుకోలేదు.
    పదినిమిషాలు కూడా గడవకముందే మంగళ డ్రయివ్ చేస్తున్న కారు హోటల్ దసపల్లా పార్కింగ్ లో ఆగింది.
    వాచ్ మెన్ వినయంగా సెల్యూట్ చేశాడు.
    కారును పార్క్ చేసి మంగళ డోర్ తెరిచి కిందకు దిగింది.
    వాచ్ మెన్ వింతగా ఆమె వైపు చూశాడు.
    కారణం .....అంత ఖరీదు అయిన కారులో నుంచి ఏ గొప్పింటి యువతి దిగుతుందో అని వూహించిన వాచ్ మెన్ కంటికి నిలువెల్లా నల్లని ఖురఖా కప్పుకున్న ముస్లిమ్ యువతి కనిపించింది.
    అతని ముఖంలో కనిపిస్తున్న ఆశ్చర్యానికి తనలో తనే నవ్వుకుంటూ బురఖాలో వున్న మంగళ హోటల్ వైపు నడిచింది.
    తనను ఎవరూ గుర్తుపట్టే అవకాశం లేకుండా బురఖా చాలా ఉపయోగికరంగా వుందని అనుకుంటూ లిప్ట్ లో ప్రవేశించింది.
    ఆమెకు అవసరమయిన ఫ్లోర్ లో లిప్ట్ తెరచుకుని కారిడార్ లో అడుగుపెట్టిన వెంటనే లిప్ట్ పైకి వెళ్ళిపోయింది.
    రూమ్ నంబర్లను చూసుకుంటూ ఒక గది దగ్గర ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది.
    ఆ మరుక్షణం లోనే తలుపు తెరుచుకోవడం ....అమాంతం ఆమెను లోపలకు విసురుగా లాగుకోవడం వెను వెంటనే తలుపు మూసుకుపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
    "అబ్బ సునీల్.....ఉండు.....ఈ బురఖా తీయనివ్వు .....మన మధ్యలో ఇది ఎందుకు అడ్డం....?"
    చిరుకోపంతో విసుక్కుంది మంగళ"
    "ఒక్క బురఖా ఏమిటి డార్లింగ్ ..... మొత్తం వంటిమీద ఉన్న దుస్తులన్నీ అడ్డమేగా..... వాటిని ఏం చేస్తావు .....' చిలిపిగా గిలిగింతలు పెడుతూ అన్నాడు అతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS