Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 20

 

    ఒక్క క్షణం ఆయాసంతో వగరుస్తూ ఆగిపోయాడు రాంప్రసాద్.
    అతనిలోనూ మానవత్వం ఇంకా దాగివుందనే నిదర్శనంగా అతని కళ్ళలో నీళ్ళు సుడులు , తిరుగుతున్నాయి.
    ధీరజ ఆశ్చర్యపోయింది.
    అంత పైశాచికంగా ప్రవర్తించే మగవానిలోనూ కన్నీరు ఇంకా వున్నదంటే తను చేస్తున్నది తప్పు అని అతని అంతరంగానికి తెలిసి వుండాలి.
    అలాంటప్పుడు అతని అపోహలను తొలగించ గలిగితే అతని కాపురం చక్కబడడానికి అవకాశం వుంటుంది."
    అందుకే ఆ ప్రయత్నం చేయాలనుకున్నది ధీరజ.
    "నీ భార్య పేరు ....."
    "సుశీల....!"
    ఈసారి షాక్ తినడం ధీరజ వంతయింది.
    కొన్ని రోజుల క్రితం కన్నీటితో వచ్చి తన భర్తను గురించి తన దగ్గర మొర పెట్టుకుని వెళ్ళిన సుశీల గుర్తుకు వచ్చింది.
    ఆ శాడిస్ట్ భర్త ఈ రాం ప్రసాదే నన్నమాట.
    తన ఉద్యోగ ధర్మంలో పడి ఆమె వెళ్ళిన తరువాత ఆమె సంగతే తానూ పూర్తిగా మరచిపోయింది. కాకతాళీయంగా అతనే దోషిలా తారసపడ్డారన్న మాట!
    అతనే సుశీల భర్త అని తెలియడంతో ఆమెను అంతగా హింసించే రాక్షసునిలా చీదరించుకోవాలో..... భార్య ప్రవర్తనను అనుమానిస్తూ శాడుస్ట్ గా మరీనా అమాయకునిలా సానుభూతి చూపాలో ధీరజకు ఒక పట్టాన అంతు బట్టలేదు.
    "మేడమ్ ....."
    అతని పిలుపుకి ఉలిక్కిపడుతూ వాస్తవానికి వచ్చిందామే.
    "ఎస్.....! మీ విషయమే ఆలోచిస్తున్నాను."
    "నా గురించా...?"
    అతను  ఆశ్చర్యంతో తల మునకలై పోయాడు.
    అ'అవును ! మీ గురించే అంటే.....నీ భార్య సుశీల గురించి కూడా."
    రాంప్రసాద్ కు ఆమె మాటలలోని అర్ధం భోధపడలేదు.
    "అంటే.....?"
    "నీకన్నా ముందే నీ భార్య నాకు తెలుసు.....! కానీ సుశీలే నీ భార్య అని ఇంతవరకూ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది."
    ఆ మాట వినడంతో రాంప్రసాద్ నిటారుగా అయ్యాడు.
    "మీకు నా భార్య తెలుసా?"
    "తెలుసు...." ఎలా తెలుసు అని అడగవద్దు. కానీ మీరు చాలా విలువయిన జీవితాన్ని పోగొట్టుకున్నారని మాత్రం చెప్పగలను."
    "అదేమిటి మేడమ్! అలా అంటారు.?"
    "ఎస్....! నా మాటమీద నమ్మకం వుంటే ఇప్పుడే వెళ్ళు నీ భార్యను నిలదీయి. మీ అనుమాన్నాన్ని చెప్పండి. పాపం ఆమాయకురాలికి తన భర్త అనుమానిస్తున్నాడనే విషయమే ఇంతవరకూ తెలియదంటే మీకు ఆశ్చర్యంగా వుండవచ్చు. కానీ అది నిజం. అర్ధం లేని అనుమానంతో అందమయిన సంసారాన్ని నరకప్రాయం చేసుకున్నావు నువ్వు."
    "మీరు చెప్పేది నమ్మలేక పోతున్నాను."
    "నిజమే .....? మీకు అలానే వుంటుంది. ఎందుకంటె అనుమాన బీజం అంటూ పడనే కూడదు? పడిందంటే మహా వృక్షమై వేళ్ళతో సహా బలంగా పాతుకుపోతుంది. మీ సంసారంలో కూడా అదే జరిగిందనుకుంటున్నాను. మీరు ఏ మాత్రమయినా ఆమె దగ్గర ఎప్పుడో ఒకసారి ప్రస్తావించి వుంటే ఇంతకాలం మీ జీవితాలు ఇలా చీకటిలో మ్రాగ్గిపోయేవి కావు. మీరు అనుకున్నది నిజమేనని మీరూ -- తనను తన భర్త ఎందుకు నరకయాతన పెడుతున్నాడో అర్ధం చేసుకోలేక నీ భార్య ----- ఇద్దరూ మూర్ఖంగానే ప్రవర్తించారు తప్ప. ఇద్దరిలో ఎవరూ ఒకరినొకరు ప్రశ్నించుకోలేదు. అలా జరిగి వుంటే మీ మధ్య ఏర్పడిన పొరలు ఎప్పుడో తొలగిపోయి వుండేవి."
    ధీరజ చెప్పే మాటలలో నిజం వుందని అప్పుడు అనిపిస్తుందతనికి.
    "మిస్టర్ రాంప్రసాద్ .....! మీ వైఫ్ పార్టనర్ మీ జీవితంలో ప్రవేశించిన తొలిరాత్రే మీరు ఆమెకు నరకం చూపెట్టారు. ఈ విషయం నాకు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోకండి. నీ భార్యే చెప్పింది. అంత రాక్షసంగా ప్రవర్తించడానికి కారణం ఆమె మీద మీకు వున్న అనుమానమే కానీ పిచ్చి పిల్ల మీ ప్రవర్తన ఎందుకలా ఉన్నదో నని మధన పడుతుందే తప్ప మీ అంతర్యాన్ని గ్రహించలేకపోయింది. తాడు తెగేదాకా లాగడం మంచిది కాదు. సంసార స్త్రీని పట్టుకుని కులటని అభాండాలు వేసి మానసికంగా హింసిస్తే నిజంగానే ఆమెకు అలాంటి వూహలు పుట్టవచ్చు...."
    "ఏమిటి మేడమ్ .....మీరంటున్నది"
    "నిజమే చెబుతున్నాను. ప్రేమ, పెళ్లి అనే పదాలు మీలాంటి వారి దృష్టిలో జడపదార్దాల్లా మారిపోతున్నాయి. నిజానికి ఆలుమగల మధ్య వుండేది పరస్పర ఆకర్షణ, శారీరక సుఖాలు మాత్రమే కాదు అంతర్లీనంగా వుండే ప్రేమానుభూతులు అవి కోరవడినప్పుడు వాళ్ళ జీవితం అల్లరిపాలు అవుతుంది. ఆ జీవితాన్ని మలుచుకోవడం ఇంటి ఇల్లాలి చేతిలోనే వుంటుంది. కానీ ఆమెకు ఆ వకాశాన్ని ఇవ్వకుండా మీలోకంలో మీరే వుంటూ మీ అనుమానమే నిజమని భ్రమిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ సుఖ సంతోషాలకు దూరమై పోయారు. అవునో కాదో ఒక్కసారి వెనుదిరిగి చూసుకోండి. నిజమేదో మీకే తెలుస్తుంది."
    రాంప్రసాద్ లో అంతర్మధనం ప్రారంభమైంది.
    "నిజానికి మీరు పెట్టిన బాధలకు ఇంకొకరయినట్టయితే ఇంతకాలం భరించేవాళ్ళు కాదు. అతనేవరితోనో సుశీలకు సంబంధం వున్నది వాస్తవమయితే మీరు అందించే నరకాన్ని వదిలి అతనితో వెళ్ళిపోవడానికే సిద్దపడి వుండేది. అలా చేయలేదంటే మీ అనుమానం వొట్టి అపోహ అనే అర్ధం అవుతుంది. క్షణక్షణం జీవచ్చవంలా బ్రతికేకన్నా అవకాశం వస్తే ప్రేమించిన ప్రియుడితోనే వెళ్ళిపోయి చావో బ్రతుకో తేల్చుకోవడానికే ఆడది తాపత్రయపడుతుంది.
    "ఆ అవకాశం లేనప్పుడు, పెళ్ళయిన తరువాత మాజీ ప్రియుడు ..... స్నేహితుడుగానే మిగిలిపోవచ్చు. ఇతను అభిమానంతోనో, అనురాగం వలనో - తన చెల్లెలిని చూడడానికి ఇంటికి వచ్చి వుండవచ్చు. ఒకప్పడు వింత గాడంగా ప్ర్రేమించుకున్నప్పటికి సమాజం విధించిన కట్టుబాట్లకు తలవంచవలసిందే. మరొకరితో పెళ్ళి కావడంతోనే ప్రియుని ఊహాలను, ఆ బంధాన్ని సమాధి చేసుకుని భర్త సేవలకే అంకితమై పోతుంది స్త్రీ. అది తెలుసుకోలేక అపార్ధాలతో ముళ్ళబాట సృష్టించుకోవడమే తప్ప మీలాంటి వాళ్ళు వాస్తవాన్ని జీర్ణించుకోలేరు...."
    రాంప్రసాద్ లో తొలిసారిగా పశ్చాత్తాపం తొంగి చూస్తుంది.
    తను ఇంతకాలం చేస్తున్నది తప్పు అయివుంటుందేమోననే అనుమానం మెల్లమెల్లగా పెద్దది కాసాగింది.....
    ఒకవేళ నిజంగానే పరాయి పురుషుడితో సంబంధం వుండి వుండడం నిజమయితే తప్పు ఎవరు చేసినా, ఆ దోషం అపరాధం ఆడదానికే అంట కట్టడం ఆనవాయితీ. అలాంటి సందర్భంలో ఆ నీతిమాలిన కార్యానికి పురికొల్పిన వాళ్ళకు ఆత్మహత్య తప్ప మరొక మార్గాంతరం కనిపించదు అది ఒక పిరికిచర్యే అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళలో తప్పు చేశామన్న శూన్యతాభావం తొలిగిపోతుంది. స్త్రీ పురుషుల అక్రమ సంబంధాలకు అదే పరాకాష్ట ! మీ జీవితాలు కూడా అలా అర్ధంతరంగా ముగిసిపోకూడదనే నేను కోరుకుంటున్నాను?" అన్నది ధీరజ.
    ఆమె చెప్పింది అక్షర సత్యమని తెలుసు కాబట్టి సిగ్గుతో తలవంచుకున్నాడు రాంప్రసాద్.
    "మిస్టర్ రాంప్రసాద్ ......పదహారేళ్ళ ప్రాయం వరకూ పుట్టింటిలోనే తన జీవితమంతా అని భావించే ఆడపిల్లలకు తన అభిప్రాయం తప్పు అని అప్పుడు తెలుస్తుంది. తను ఎప్పటికయినా మరొకరి ఇంట చిరుదివ్వెను వెలిగించడానికి వెళ్ళవలసిందేనని. ఆ భర్త తన జీవితాంతం తోడూ నీడా అనే నిజాన్ని జీర్ణించుకుని అతని కోసం తన ఊహలు , కోరికలు , ఆశలు అన్నీ మూటకట్టుకుని ఎదురు చూస్తుంటుంది-----
    "కానీ , తన ఆశల పల్లకి అత్తవారింట అడుగుపెట్టిన వెంటనే శిధిలమై పొతే ఆ ఆడదాని మనస్సు చిన్నాభిన్నం కాక తప్పదు. కొత్త ఆశలతో కొత్త కోరికలతో భర్త ను నమ్మి వచ్చిన ఆడదాన్ని సహృదయంతో పార్టనర్ ఆదరించాలే తప్ప అపనమ్మకంతో నరకప్రాయం చేయకూడదు---
    "లోకం తెలియని సుశీల మనసులో ఎలాంటి కల్మషం లేదు. కేవలం ఆమె ఏదో చేస్తుందనే అపోహతో మీరు -----మీరెందుకలా చేస్తున్నారో తెలుసుకోలేక ఆమె ఇంతవరకూ కన్నీటితో కాపురం చేశారు. ఇకనయినా కళ్ళు తెరచి , ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకుంటే మీ జీవితం ఆనందమయం అవుతుంది." సుదీర్ఘంగా చెప్పింది ధీరజ.
    ఆమె పలికిన ఒక్కొక్క మాటా రాంప్రసాద్ హృదయంలో వాడి ములుకుల్లా దిగబడ్డాయి.
    తను ఇంతకాలం చేసిన పొరపాటు అప్పుడు అర్ధం అయిందతనికి.
    "నా కళ్ళు తెరిపించారు మేడమ్ -------మీరన్నట్టు ఇంతకాలం నేను తెలివితక్కువగానే ప్రవర్తించాను. నా అనుమానాన్ని ఇప్పుడే నా భార్య ముఖాన అడిగేస్తాను. ఇన్నాళ్ళు నా మనోవేదనకు ఈరోజే ఆఖరు కావాలి. నా కర్తవ్యాన్ని గుర్తు చేసిన మీకు రుణపడి వుంటాను. వస్తాను మేడమ్-" అంటూ వెళ్ళిపోయాడు రాంప్రసాద్.
    వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తుండి పోయింది ధీరజ.
    చీకటిలో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న ఆ ఇరువురూ ఇకనైనా తప్పకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుని నిజమయిన పార్టనర్స్ గా మారతారనే నమ్మకం కలిగింది ధీరజకి-------
    విడిపోయిన ఒక జంటను కలిపినందుకు ఎక్కడలేని అనందం ఆమె అంతరంగాన్ని అలుముకోవడంతో ఏ పని చేయడానికీ మనస్కరించక పైల్సు మూసేసి మౌనంగా కూర్చుండిపోయింది.
    అపార్ధాలను వదిలి, అప్యాయతానురాగాలతో ఒక్కటై , గాడ పరిష్వంగంలో మునిగిపోతున్న రాంప్రసాద్, సుశీల జంట ----ధీరజ కళ్ళ ముందు లీలగా మెదలడంతో తనలో తనే నవ్వుకోసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS