అయినా తను పదవులు కోరుతోందా? ఐశ్వర్యాలు కోరుతోందా?
స్వామి మందహాసం చేసాడు.
"నాచే వండబడిన పదార్థాలను భుజిస్తూ, నేనున్న చోటనే నివసిస్తూ, నేనెక్కడికి వెళ్తే అక్కడికి సహాయంగా వస్తుండాలి. ఒక్కక్షణమైనా నన్ను విడవక ఉండాలి. సర్వేశ్వరా! నా ఈ కోరిక నీతోకాక మరెవరితో చెబుతాను?" అంది సజల నయనాలతో.
స్వామి మందహాసం చేస్తూ వెంగమాంబ శిరస్సు నిమిరాడు. వీపు తట్టాడు. చేయి పట్టుకున్నాడు. వెంగమాంబ నిలువెల్లా పులకించింది. అంటే, నా స్వామి నాతో ఉంటానంటున్నాడా? ఆహా! ఏమి నా భాగ్యమంటూ పొంగిపోయింది. కానీ, స్వామి వెంగమాంబ వైపు కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరించాడు. చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ ఆ పుణ్యాంగన వైపు చూసాడు.
వెంగమాంబ శరీరం గగుర్పొడిచింది.
నన్ను తలచునట్టి, ధ్యానించునట్టి, వెదకుననట్టి, కొనియాడునట్టి, పిలుచునట్టి, నా ప్రభావాన్ని నిత్యము పొగడునట్టి భక్తజనులు అండపిండ బ్రహ్మాండ భువనాల్లో ఎందరున్నారో ఎలా చెప్పను? నీ వద్దనే నేనుండిపొతే ఆ మహాభక్తులకు బాధ కలుగదా? అంటూ భగవంతుడు నిమీలితనేత్రు డయ్యాడు.
వెంగమాంబ స్వామి పాదాలను పట్టుకుంది. "మీ మాటలు నేనొప్పుకోను. నీవు ఆది మధ్యాంతరహితుడవు కావా? మంగళస్వరూపుడవు నీవు కావా? స్వయంప్రకాశకుడవు నీవు కావా? మంగళస్వరూపుడవు కావా? పరంజ్యోతి నారాయణుడవు నీవు కావా? నా వద్ద ఉన్నా, బ్రహ్మాండభాండము నందు, పరమాణువు నందు నీవు లేవా? నీ మాటలు నేనంగీకరించలేను." అని శ్రీవేంకటేశ్వరుని పాదాలు పట్టుకుని విడువలేదు వెంగమాంబ. ఆమె కన్నీటి ధారలతో స్వామి పాదాలు తడిసిపోయాయి. వెంగమాంబ ఆ పాదాలు వదలలేదు.
"జగన్నాటక సూత్రధారి" నైన నేను, నీవద్దనే ఉండగలనా? అంటూనే స్వామి అంతర్థానమయ్యాడు. వెంగమాంబ నిలువునా కూలబడిపోయింది.
ఆరోజు తులసివనాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టింది వెంగమాంబ. ఈ రోజు ఒక యక్షగానం రాయాలని మనసు ప్రేరేపిస్తోంది.
స్వామి తన కోరిక మన్నించక వెళ్ళిపోవడమే వెంగమాంబ మనసుని వేధిస్తోంది. అయినా మరోమారు, కోరిక కోరుతాను. దీనజన రక్షకుడు ఆర్తత్రాణపరాయణుడు నన్ను మన్నించడా?
వెంగమాంబ చిరుచాపపై కూర్చుంది. భక్తి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. కళ్ళముందు సత్యభామ ప్రత్యక్షమైంది. శ్రీకృష్ణుడు సత్యభామకు స్వర్గం నుండి పారిజాత తరువును తెచ్చి తోటలో నాటుతానని బాసలు చేసాడు కదా! ఆ తరువాత కథ చెబుతాననుకుంది. తను రచించే యక్షగానాన్ని ప్రజలు భక్తితో చదువుతారని ఆమెకు తెలుసు. ఆమె మనసు కథ వైపు మరలింది. ఆమె కళ్ళ ముందు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ గోచరించాడు. స్వామి! నీ అవతారమే లీలామయం. వెంగమాంబ ఈ రచనకు విష్ణుపారి జాతమని పేరు పెట్టలనుకుంది. అలా అనుకున్న మరుక్షణం ఆమెకు నవ్వొచ్చింది.
నందాత్మజ తే నమో నమో
నందహృదయ తే నమో నమో
అంటూ మొదలుపెట్టింది. ఇష్టదేవతలను స్తుతించింది.
ధరణిపై వెలయు సుందరవిగ్రహునకు
అలమేలుమంగ చిత్తాబ్జంబునందు
నిలిచి సత్కృపనేలు నిర్మలాత్మునకు
వేదవేద్యునకు శ్రీవేంకటేశునకు.....
అంటూ విష్ణుపారిజాత యక్షగానాన్ని భక్తితో శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చింది పరమ భక్తురాలు వెంగమాంబ.
"రావె రుక్మిణి రా, జాంబవతి రావె, కాళింది రావె, మిత్రవింద
రావె నాగవతి, రావె భద్ర, రావె లక్షణ, రావె రాధ" ...... వెంగమాంబ కలం ఆగింది.
రావె రాధ..... రాధ ........ ఆ భార్యలు, ప్రేయసీలలో తాను ఒకరు కాకూడదా? వెంగమాంబ మందహాసం పెదాలను దాటి పైకి పొర్లింది.
తరిగొండలో తన స్నేహితురాళ్లతో కలసి ఆడుతూ పాడిన గొబ్బిళ్ళ పాట ఆమె మదిలో మెదిలింది.
"ఆ కృష్ణుడాట్లాడి యలసియున్నాడు చూడరే గొబ్బిళ్ళో....... గొబ్బిళ్ళు
ఆటలు చాలించి వచ్చి హరికి సేవ చేయరే గొబ్బిళ్ళో ..... గొబ్బిళ్ళు
విరుల పరువు పరచి చక్రధరునిచ్చోట నుంచరె గొబ్బిళ్ళో ..... గొబ్బిళ్ళు" వెంగమాంబ గొబ్బిళ్ళ పాటను పూర్తి చేసింది. ఎదురుగా కృష్ణుడన్నాడన్న భావంతో గుండ్రంగా తిరుగుతూ, చప్పట్లు చరుస్తూ,
"శ్రీనివాసుని కౌగిట చేరి ముద్దులియ్యరే గొబ్బిళ్ళు తరిగొండాధిపతిమీద నందరు పాటలు బాడరే" అంటూ తన్మయత్వంలో గొబ్బిళ్ళ పాటలలో కృష్ణలీలలను వర్ణించింది. వెంగమాంబ మనసులో ఆనాటి కోరిక మళ్ళీ మెదలింది. నా స్వామి నా కోరిక తీర్చడా? వెంగమాంబ కళ్ళు ఎర్రబడ్డాయి. ఈ రాత్రి నా స్వామికి పాలు ఇవ్వకూడ దనుకుంది.
రాత్రయింది. ఆమె కంటికి రెప్పవేయకుండా ఎదురుచూస్తోంది. "స్వామి వస్తాడు. వస్తాడు" అంటూ నృత్యం ప్రారంభించింది.
"స్వామి నా కోర్కె మన్నిస్తాడు. తప్పకుండా, ఇక్కడ నా ఇంట్లో ఉండిపోతాడు."
స్వామి వచ్చాడు. వెంగమాంబ దేవదేవుని పాదాలను వదలలేదు. "స్వామీ! ఈరోజు నిన్ను పోనీయను." అంది. తదేకంగా వెంగమాంబని చూస్తున్న స్వామి "అయ్యో! తెల్లవార వస్తోంది." అంటూ పాదాలను వెనక్కి జరిపాడు. కాని, వెంగమాంబ స్వామి పాదాలను వదలలేదు.
"గుడి అర్చకులు తలుపులు తీస్తారు. వెళ్ళనా?" అన్నాడు స్వామి మందహాసం చేస్తూ, "నా గుండె గుడిలో ఉండిపో" అని వెంగమాంబ అంటుండగా, "అఖిలాండ బ్రహ్మాండంలో భక్తులందరి గుండెలు నాకు గుడిలాంటివే" అని అన్నాడు. అయినా వదలని వెంగమాంబ,
"నన్ను వదిలి వెళ్ళనీయను స్వామి. ఈ రాత్రిళ్ళు, పగళ్ళు, మేలు కొలుపులు, పవళింపు సేవలు చేసుకోనివ్వండి. కానీ, మిమ్మల్ని పోనివ్వను." అంటూ వెంగమాంబ స్వామిని కదలనీయడం లేదు. అక్కడ అర్చకులు స్వామికి మేలుకొలుపులు పాడుతున్నారు. "దేవీ మనోల్లాస మేలుకో. శ్రీవేంకటేశ్వరా మేలుకో. వేంకటాద్రి చంద్రా మేలుకో. కాచియున్నామయ్యా మేలుకో" అని పాడుతూ అర్చకులు తలుపులను తెరిచేందుకుద్యుక్తులైనారు.
"నేను వెళ్ళాలి. ప్రపంచజ్ఞులకు దర్శనమివ్వాలి" అని అన్నాడు స్వామి. ఆ లీలమానుష నిగ్రహుడు కట్టిన పట్టుపంచెను లాగింది వెంగమాంబ, పోవద్డంటూ. అదే సమయంలో కోవెల తలుపులు తెరవబడుతున్నాయి. స్వామి వెంకమ్మ ఇంటి నుండి అంతర్థానమయ్యాడు.
కోవెలలో స్వామి దర్శనం కోసం బారుల తీరిన భక్తులు, స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. "ఏడు కొండలవాడా! ఆపదమొక్కులవాడా!" అంటూ ఆ కోవెల ప్రతిధ్వనిస్తోంది.
వెంగమాంబ చేతిలో స్వామి పీతాంబరం అంచుచిక్కి, సగం చిరిగి అంచు మాత్రం ఆమె చేతిలో ఉండిపోయింది. స్వామి తనని వదిలి పోయాడని దుఃఖిస్తూ , తన చేతనున్న పీతాంబరం ముక్కను చూస్తూ, ఇదే స్వామి అనుగ్రహం అని నమస్కరించుకుందామె.
ఆ పీతాంబర శేషాన్ని ఒక చెండుగా చుట్టింది వెంగమాంబ. గదిలో ఓ మూల భద్రపరిచింది. పూలతో, పసుపు కుంకుమలతో, తులసిదళాలతో పూజించింది.
వెంగమాంబ విష్ణు పారిజాత యక్షగానం పూర్తిచేసేయాలనుకుంది ఆ రోజు. నలుగు పాట రాసిన వెంగమాంబ ఒక్కసారి మళ్ళా చూసుకుంది సువ్వాల పాట మనసుని కవ్విస్తోంది.
సువ్వి సువ్వి యదుకులేశ సువ్విశేషాచలేశ
సువ్వి సువ్వి జగదీశ సువ్వి లాలీ
పరమ ధర్మానుగుణ్య భక్త సంతతి శరణ్య
సురుచిరామరాగ్ర గణ్య సువ్వి లాలీ
విమల పరమపదనిహారక వేదవేదాంతసార
సుమహితాంబునిధి గంభీర సువ్వి లాలీ.....
వెంగమాంబ సువ్వి పాట పాడి,
"సువ్వి సువ్వి యదుకులేశ సువ్విలాలీ" అంటూ గొంతెత్తి పాడింది.
అంతలో వెంగమాంబని పూజించే భక్తురాండ్రు వచ్చారు లోపలికి.
"అమ్మా , మంగళహారతి పట్టుకోమా" అంటూ చుట్టూ చేరారు. వెంగమాంబ స్వామి శేష పీతాంబరం దగ్గరకు హారతి తెచ్చింది.
శ్రీ పన్నగాద్రివర శిఖరాద్రివాసునకు
పాపాంధకార ఘన భాస్కరునకు
ఆ పరమాత్మునకు నిత్య సహవాసియైన
మాపాలి యలమేలు మంగమ్మకు |జయమంగళం|
భక్తురాండ్రు వెంగమాంబతో గొంతు కలపి పాడుతున్నారు.
