Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 20


    మంచిగా వుండి పని చక్కబెట్టుకొని చక్కాపోవడం శ్రేయస్కరం!

    ఈ ఆలోచన వచ్చాక క్షణంకూడా ఆలస్యం చేయలేదు "నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం! ప్రొఫెసర్ గారివంటి మహానుభావుడు ఇంతకుముందు పుట్టలేదు ఇహ పుట్టబోడు ఆయన్ని తలచుకుంటేనే భక్తిశ్రద్ధలతో దుఃఖం వచ్చేస్తుంది నాకు!" అన్నాడు. దీపిక వదనం కాంతి వంతం అయింది.

    'నాకు తెలుసు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు మీరు చాలా మంచివారు ఆయన అంచనా  ఎప్పుడూ తప్పదు" అంది చిరునవ్వుతో.

    ఇద్దరూ పృధ్విగారింటికి చేరారు. దీపికని చూడగానే ఇంతమొహం చేసుకొని ఎదురొచ్చారు ప్రొఫెసర్ గారు "విష్ యూ మెనీ హేపీ రిటన్స్ ఆఫ్ ది దీపికా!" అని విష్ చేశారు.

    "థాంక్యూసార్! థాంక్యూ వెరీమచ్!" అంటూ తను తెచ్చిన స్వీట్ అందించింది. తను తీసుకొని "నువ్వు తీసుకోవమ్మా" అని తెల్లమొహం వేసుకొని చూస్తున్న మోహన్ కి ఇచ్చారు "ఇవ్వాళ దీప పుట్టినరోజు" అని చెప్పారు.

    స్వీటు అందుకుని మనస్ఫూర్తిగా విష్ చేశాడు మోహన్. ముందే తెలిస్తే ఏదయినా ప్రజంట్ తెచ్చేవాడినని బాధపడ్డాడు.

    "నేను ఎంతో ఆశపడ్డాను మోహన్ దీపికకు పుట్టిన రోజు బహుమతిగా లంకెబిందెలు ఇద్దామనుకున్నాను. కానీ ప్చ్! వీలుకాలేదు" అన్నాడు బాథగా.

    "మరేం ఫర్వాలేదు సార్! ఈ బర్త్ డేకి కాకపోతే వచ్చే బర్త్ డే ఇద్దురుగాని" దైర్యం చెప్పింది దీపిక.

    దాంతో ప్రొఫెసర్ గారికి హుషారెక్కువై లోపలి కెళ్ళి ఇనుప రాక్ లోంచి ఓ పెద్ద ఫైల్ బయటికిలాగా దాని మీద దుమ్ముదులిపి దానిమీద "విత్ హార్టీ బ్లేసింగ్స్ టు దీపిక ఆన్ హర్ బర్త్ డే" అని రాసి సంతకం పెట్టేసి ఇచ్చేశాడు.

    "ఏమిటి సార్ ఇది?" అడిగింది దీప.

    "సౌరశక్తి తో పనిచేసే కూరగాయాలు తరిగే మెషిన్ ఒకటి కనిపెట్టనమ్మా దాని వీవరాలు అన్నీ ఈ ఫైల్ లో వున్నాయి. ఇది నీకు నా పుట్టినారోజు ప్రజంట్ తీసుకో" అన్నాడు భక్తితో అందుకుంది దీప వాళ్ళిద్దర్నీ చూస్తుంటే చిరాకేసింది మోహన్ కి.

    ఇంకానయం చంద్రశక్తితో  ఇల్లు చిమ్మే యంత్రం ఫైల్ ఇచ్చావు కాదు నీ బుర్ర, అని విసుక్కున్నాడు.

    "ఈ పూటకి నువ్వు సెలవు తీసుకోమ్మా!" అన్నారు ప్రొఫెసర్ గారు. ఎంతమాత్రమూ అంగీకరించలేదు దీపిక "ఉహు! సెలవొద్దు సార్! ఇవ్వాళ నా పుట్టినరోజు కాబట్టి ఇంకా ఎక్కువ పని చేస్తాను" అంది. మరింత సంతోషించారాయన. "వెరీగుడ్" అని మెచ్చుకొని కొంత రిటెన్ వర్కు ఇచ్చారు.

    మోహన్ ని  మళ్ళీ తన లేబొరేటరీలోకి తీసికెళ్ళి నిన్న చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పనారంభించారు. గ్రహాలు తొమ్మిదిలేవు అన్నారు. ఆరే వున్నాయి అన్నారు. భూమ్యాకర్షణ సిద్దాంతంకూడా శుద్ధ తప్పు అని గట్టిగా చెప్పారు. అసలు అమెరికావాళ్ళు రాకెట్లని అలా నించోబెట్టి వదలాల్సిన అవసరం అంతగా లేదన్నారు. పడుకో బెట్టి పెల్చేసినా పెద్ద తేడా వుండదు అన్నారు వర్షం గురించి వాటర్ సైకిల్ గురించికూడా తను పరిశోధన చేస్తున్నా ముందుగానే చెప్పారు.

    కాసేపు ఆయన చెప్పినది ఏమిటని శ్రద్ధగా విన్న మోహన్ కి బుర్ర వేడెక్కి పోయింది. ఇలా ఆయన చెప్పిందల్లా వింటూపోతే తనకికూడా ఈయనలాగే పిచ్చిపట్టి తను కూడా కనిపించినవాళ్ళనల్లా ఇలాగే కరిచేస్తాడేమో అని భయంకూడా వేసింది.

    అందుకే ఆయన చెప్పింది ఈ చెవిన  విని ఆ చెవినవదిలేస్తూ దీపని తల్చుకుంటూ హాయిగా  కూర్చున్నాడు. తను చెప్పాల్సింది చెప్పేశాక "ఇదీ మోహన్ సంగతి" అని ముగించారు పృధ్వి.

    "ఇది చాలా  సీక్రెట్. ఎవరితోనూ  అనకు మోహన్!" అని వార్నింగ్ ఇచ్చారు.

    "అమ్మమ్మ! ఎంతమాట మీరు నాకు చెప్పిన  విషయాలు నేనింకొకరితో చెప్పను. మీమీద ఒట్టు!" మాటచ్చేసాడు మోహన్.

    లంచ్ టైంకి మళ్ళీ ఇద్దరూ కలిసి బస్టాండ్ కి వచ్చారు కలసి బస్ ఎక్కారు. జంక్షను దగ్గర  దిగి కలసి నడుచుకుంటూ ఇంటికి వచ్చారు.

    ఆ రోజెంతో తృప్తిగా అనిపించింది మోహన్ కి. "ఫర్వాలేదు పరిచయం కాస్తా స్నేహంలోకి మారింది. ఆ స్నేహం ప్రణయంలోకి మారాలి! అనుకున్నాడు.

    మర్నాడు వేళ్ళుతూ దీపకోసం మంచి డెకరేషన్ పీస్ బహుమానంగా కొన్నాడు. ప్రొఫెసరుగారింటికి వెళ్ళగానే "నిన్న మీ పుట్టినరోజని నాకు తెలియదు అందుకే ఈ పూట యిస్తున్నాను. తీసుకోండి" అంటూ దీపకి అందించాడు.

    "వద్దు యిలా ప్రజంట్సు తీసుకోవడం నాకిష్టం వుండదు!" అంది దీప సీరియాద్ గా.

    "ఫర్వలేదమ్మా తీసుకో. అయినా అతనేం పరాయివాడుకాడు మనవాడే. అందులోనూ చాలా మంచివాడు. తీసుకో!" అన్నారు ప్రొఫెసర్ గారు.

    "మీరుచెప్పాక ఎలా కాదంటాను!" వెంటనే అందుకుంది దీప.

    "థాంక్స్" కూడా చెప్పింది. వాళ్ళిద్దరివంకా కొరకొరా చూశాడు మోహన్.

    అతను బదులుగా విష్ చెయ్యలేదుకదా, విరుచుకుపడ్డాడు. "మీకేం పూలరంగడిలావున్నారు. నాపనే అధ్వానంగా వుంది!" అన్నాడు. ఏమిటి? ఏమైంది? నవ్వుతూనే అడిగాడు మోహన్.

    "ఇంకేం కావాలి? మంచి రూమ్ దొరక్క చచ్చిపోతున్నాను. ఇప్పుడుంటున్న రూమ్ లో రాత్రిళ్ళు లైట్లు వెలగవు. పగలు నీళ్ళుండవు. గాలీ, వెల్తురు రెండుపూటలూ వుండవు. తెల్లారుఝామున లేచి వీధి కుళాయిదగ్గరికి పరిగెట్టి కురుక్షేత్రం సంగ్రామంచేస్తే ఏడింటికి ఓ బక్కెట్ నీళ్ళు దొరుకుతాయి. రోజల్లా తాగినా తందనాలాడినా, స్నానం చేసినా, సంధ్యవార్చినా ఆ బకెట్ నీళ్ళే గతి.

    తెల్లారుగట్టే లేవాలికదా అని పెందలాడే పడుకుందామంటే దోమలు పీకేస్తాయి. అప్పోసప్పో చేసి ఓ టేబుల్ ఫ్యాను కొనుక్కుందాం అనుకుంటే సూర్యస్తమయం కాగానే మెయిన్ ఆఫ్ చేసేస్తాడు ఇంటాయన. ఏం చెయ్యను చావనా?

    పోనీ మరోగది వెతుక్కుందామని వారం రోజులుగా సినిమాలూ, షికార్లూ మానేసి  కాళ్ళుపీకేసేలా ఊరంతా తిరుగుతున్నాను. కానీ  ఎక్కడా రూమ్ దొరకడం లేదు.

    వెళ్ళీ వెళ్ళగానే ముందు అడిగే ప్రశ్ననీకు పెళ్ళయిందా? కాలేదు, అని మనమాట మన నోట్లో వుండగానే పెద్దపులినో, పిశాచాన్నో చూసినట్లు దడుచుకుని ధడాల్న తలుపు వేసేసుకుంటారు.

    పెళ్ళి కాకపోతే మాత్రం మనం కరుస్తామా అసలైనా వీళ్ళిచ్చే ఓ గడికోసం ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళేలా చేసుకుంటాం? ఏమిటో సమస్యల మారి జీవితం అయిపోయింది.

    మీకేం? పెట్టివుట్టారు. స్వంత ఇల్లున్న బంధువులు వున్నారు. దర్జాగా వాళ్ళింట్లోకి జేరి అల్లుడి మర్యాదలు జరిపించుకుంటున్నారు. నా విషయం చీమకుట్టినట్లయినా వుందా మీకు? పోనీ ఈ ఫ్రండుకోసం ఓ గది వెతికి పెడదాం అనే సదుద్దేశ్యం ఏమైనావుందా?" తన కష్టాలు చెప్పుకుని నిష్ఠూరాలు ఆడాడు శ్యామ్.

    అంతా విని తేలిగ్గా నవ్వేశాడు మోహన్. "సర్లెండి పీత కష్టాలు పీతవి. నా సమస్యలేవో నాకున్నాయి. పోతే రూమ్ విషయం ఇప్పుడేగా నాతో చెపుతున్నారు చూస్తాను" అన్నాడు.

    ఆ సాయంత్రం భారతి యిచ్చిన ఆంధ్రజ్యోతి అనసూయమ్మగారింట్లో ఇచ్చేసి ఆవిడ ఇచ్చిన అంధ్రభూమి అరవిందగారికి ఇచ్చే నిమిత్తం వెళ్తూవుండగా వాళ్ళవీధిలో చివర యింటిముందు "టు లెట్" బోర్డు కనిపించింది. ఈ  విషయం రేపొద్దున శ్యామ్ కి చెప్పాలి అనుకున్నాడు.

    మర్నాడు ప్రొద్దునే లేచి మామయ్యతో ఆసనాలు వేసి భారతితో కబుర్లాడి ఎనిమిది అయ్యేసరికల్లా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు. ఇతన్ని చూడగానే "కమాన్ మై బాయ్ టుడే వుయ్ హేవ్ లాట్ ఆఫ్ వర్కు" అని చెయ్యి పుచ్చుకుని లాక్కెళ్ళారు పృధ్విగారు.

    తిన్నగా పెరట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఓ బండెడు ఇసుక గుట్టగాపోసి వుంది. దాని పక్కన ఓ పెద్ద ఇనుప జల్లెడ వుంది.

    "మోహన్! ఇటుచూడు. యిది ఇసుక. ఇది జల్లెడ యిప్పుడు నువ్వేం చెయ్యాలంటే ఈ ఇసుకని జల్లెడలో పోసి జల్లించాలి. ఆ జల్లించే సమయంలో  ఇసుక అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు ఎన్నిసార్లు వెళుతుందో లెక్కపెట్టి యిదుగో ఈ పేపరుమీద రాయాలి. అలా ఈ ఇసుకంతా జల్లించాలి!" ఇన్ స్ట్రక్షన్స్ యిచ్చాడాయన.

    బుర్రగోక్కున్నాడు మోహన్. "ఎందుకుసార్ యిదంతా?" కొంచెం అనుమానంగా, మరికొంత విసుగ్గా అడిగాడు.

    "ఎందుకేంటి నామొహం ఈ జల్లెడ సముద్రమనుకో, యిసుకభూమి, యిలా చెయ్యడంవల్ల భూమి యొక్క  కదలికలు తెలుస్తాయి. భూగర్భ సంపదలు గురించి తెలుసుకోగలుగుతాం!" వివరించి విసుగ్గా వెళ్ళిపోయారు.

    ఒళ్ళు మండిపోయింది మోహన్ కి. అయినా ఓర్పు తెచ్చుకుని బూట్లువిప్పి ఆ ఇసుక కుప్పమీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఓసారి జల్లించేసరికి విసుగేసింది అతనికి. వెంటనే ఆ పేపరుమీద చేతికొచ్చిన అంకెలు వేసేసి హాయిగా ఓ మూలకి వెళ్ళికూర్చున్నాడు.

    తను రాసేసుకున్నదంతా బరబరా రాసేసుకున్నాక "ఏం మోహన్! అయిందా" అని కేకేశాడు ఆయన.

    కూర్చుని కునికిపాట్లుపడుతూ కలలుగంటున్న మోహన్ ఉలిక్కిపడి లేచి "అయిపోయింది సార్  వస్తున్నా!" అంటూ  లోపలికి పరిగెట్టాడు. తన దగ్గరున్న కాగితం ఆయన చేతికిచ్చాడు.

    అది ఎగాదిగాచూసి లబలబలాడాడు ప్రొఫెసర్ గారు "ఇదేమిటయ్యా! ఈ  నెంబరులేమిటిలా వున్నాయి. ఓ దానికి మరో దానికి సంబంధంలేదు?" అన్నారు.

    "నన్ను ఏం చెయ్యమంటారుసార్! వున్నది వున్నట్లు వేశాను." దబాయించేశాడు మోహన్. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS