Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 20


    "డాక్టరుగారూ! నాన్నగారికి ప్రాణాపాయం లేదుకదా?" కళ్ళు తుడుచుకుంటూ పసిపిల్లవాడిలా అడిగాడు గోవింద్.
    "పెద్ద వయస్సు కదా చెప్పలేం.  ఇప్పటికి ఫర్వాలేదు. కంటి చూపే నమ్మకంలేదు. మా ప్రయత్నాలు మేము చేశాం చూద్దాం!"
    "డాక్టర్....నో....నో.... అలా అనకండి. ఎంత ఖర్చయినా  సరే, ఆయనికి చూపోచ్చేలా  చెయ్యండి" డాక్టరుగారి  చేతులు పట్టుకుని ప్రాధేయ పడ్డాడు గోవింద్.
    "ఊరుకోండి ప్రయత్నాలు చేద్దాం అదృష్టముంటే ఈ ఆపరేషన్ వల్లే అతనికి చూపు రావచ్చు. గ్లాసుముక్కలు కళ్ళలోకి పోయి. రెటీనా చుట్టూ వున్న రక్తనాళాలు చిట్లిపోయాయి. బాగా డామేజ్ అయ్యాయి."
    నర్సోచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది. నాడి చూసి ఫరవాలేదని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు.
    స్పృహలేకుండా పడివున్న నరసింహారావుగారి దగ్గర కొన్ని గంటలు కూర్చున్నారు ముగ్గురూ.
    "ఇప్పుడప్పుడే స్పృహరాదు. మీరు వెళ్ళి మళ్ళీరండీ" అంది నర్సు.
    "అత్తయ్యెలా వున్నాడో? ఇంటి కెళ్ళి మళ్ళీ పద్దాం" అంది సుమతి.
    కామాక్షమ్మగారు ఇంకా మత్తులోనే వుంది. డే వచ్చాడు. జానకమ్మగారికి టెలిగ్రాం పంపించారు. రాత్రి గోవిందు ఆసుపత్రికెళ్ళాడు. డేని ఇంట్లో వుండ మన్నాడు కాస్త తోడుగా.
    కామాక్షమ్మగారికి తెలివోస్తే గొడవ చేస్తోంది ఆసుపత్రి కోస్తానని. వీలైనంత మటుకు ఏం ఫరవాలేదని ఆమెకి నచ్చచెబుతూ మరీ గోడచేస్తే, మత్తు మందిచ్చి పడుకోబెడుతున్నారు.
    మూడు రోజులు దాటాయి. నరసింహారావుగారికి స్పృహ వచ్చింది. కళ్ళకి మాత్రం పట్టీలింకా విప్పలేదు. పేరు పేరునా అందరి గురించీ అడుగు తున్నారు.
    జానకమ్మ, నలుగురు కొడుకులా వచ్చారు. "ఎంత ఘోరం జరిగి పోయింది." అంటూ శోకాలు ప్రారంభించారు. వాళ్ళ నూరుకొబెట్టే సరికి తల ప్రాణం తోక కొచ్చింది సుమతి స్నాన పానాలయ్యాక ఆసుపత్రికి బయలుదేరారు అందరూ.
    పది రోజులు గడిచాయి. నరసింహారావుగారి కళ్ళ కట్లు విప్పారు. చూపు మందగించింది. మసకమసకగా కనిపిస్తోంది. తల మీద గాయాలు కూడా మాన్సుకొచ్చాయి. మరో పది రోజుల తరవాత ఇంటికొచ్చారు నరసింహరావుగారు. చూపు మాత్రం మసకగానే వుంది. విపరీత మయిన నీరసం "మళ్ళీ ఇల్లు చూస్తానను కోలేదు" అన్నారు. వెక్కివెక్కి ఏడ్చింది కామాక్షమ్మ.
    మనసు బాగాలేదని పిచ్చిగా తాగుతున్నాడు గోవిందు. ఇంట్లోనే 'బార్ ఏర్పాటు చేశారు. దానికోసం ప్రత్యేకం ఒక గది సీసాలతోటీ గ్లాసులతోటీ అమర్చారు. డే, సుబ్బలక్ష్మి, ఆమె అన్నయ్యాలూ, గోవిందూ, సుమతినికూడా లాగడం వల్ల ఆమె వద్దనడం మానేసింది. బాగా తాగితే, హాయిగా ఒళ్లుమరచి నిద్దరపోవచ్చునని ఆమె ఉద్దేశ్యం. ఆ విధంగానైనా బాధల్ని మరచిపోవడానికి ప్రయత్నం చేస్తోంది.
    "ఏం తావు తున్నాలు మీలు నాకూ కావాలి" అంటూ వచ్చాడు చింటూ.
    "ఛీ... ఛీ....ఇది మందు .....చేదుగా వుంటుంది నువ్వు తాగకూడదు" అంది సుమతి.
    "ఊఁ... నాకూ కావాలి....."
    "వద్దమ్మా....మంచిది కాదు. జబ్బుచేస్తుంది."
    "అయితే నువ్వూ, డాడీ, పిన్ని, మామయ్యలూ, అందలూ ఎందుకు తావు తున్నాలు?" వాడిని వద్దని చెప్పి వాళ్ళందరూ ఎందుకు తాగు తున్నారో ఆ చిన్ని బుర్రకి అర్ధంకాలేదు.
    "మేమంటే పెద్దవాళ్ళం."
    "పెద్దవాళ్లు మందు చెంచాల్లోకాక గాచుల్లో తావుతాలా? అయితే నానమ్మ కెందుకు ఇయ్యక చెంచాలో ఇత్తాలు?" వాడు వేసే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో తెలీక సుమతికి వాడిమీద కోపం వస్తోంది.
    "నువ్విక్కణ్ణుంచి  పోరా" కసురుకుంది.
    "మమ్మీ....నేను చెల్లికంటే పెద్దవాన్నిగా నేను తావుతా...." మొండికేసేడు వాడు. లాజీక్ కి, తెలివితేటలకి మరొకప్పుడైతే మురిసి పోయేదే సుమతి. కానీ, ఈ రోజు మనసు చికాకులతో నిండిపోయింది. దేన్నీ చూసి మురిసిపోయే స్ధితిలో లేదు మనసు శాంతికోసం గిలగిలలాడి పోతోంది. ఆ ఆవేదన చల్లారడానికి తనేమైనా చెయ్యడానికి సిద్దంగా వుంది. మంచీ చెడూ ఆలోచించే శక్తి కోల్పోయింది మనసు. ఆలోచిస్తూన్న సుమతి గ్లాసులోని విస్కీ గడగడా తాగుతున్న చింటూని చూసి, గబుక్కున లేచి వాడి చేతిలోని గ్లాసు తీసుకుని, వీపుమీద ఒక్కటి చరిచింది. దాంతో ఏడుపు లంకించుకున్నాడు.
    "ఆయమ్మా....చింటూని అవతలికి తీసికెళ్లు" పిలిచాడు గోవింద్.
    ఆయమ్మెచ్చి చింటూని  తీసుకుని అవతలకి వెళ్లింది. ఏడుస్తూనే వెళ్లాడు వాడు ఆయమ్మతో.
    మరో వారం రోజులుండి సుబ్బలక్ష్మి అన్నదములు వెళ్ళిపోయారు. "దమ్మిడీ చేతిలో లేకుండా వచ్చేశాం ఈ వార్తవినగానే" అంటూ బస్సు ఖర్చులు అవ్వీ తీసుకువెళ్లారు. జానకమ్మని ఇక్కడే వదలిపెట్టి వెళ్లారు నరసింహారావుగారు అడిగిందే తడవుగా.
    నరసింహారావుగారి మందులకీ, కామాక్షమ్మగారి మందులకీ, డాక్టర్ల రాకపోకలకీ! వందలు వందలు ఎగిరిపోతున్నాయ్. ఏదో పలుకుబడి నుపయోగించుకుని, అన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లను కాష్ చేశాడు  గోవింద్ ఇంట్లో సామానులు కొన్నట్టు విస్కీ సీసాలూ వారం వారం కొనడమమవుతోంది. నిద్ర మాత్రలు వేసుకుని కామాక్షమ్మగారూ, నరసింహారావుగారూ నిద్రపోతే, విస్కీ తాగి గోవిందూ సుమతీ వళ్ళు మరచిపోతున్నారు. ఆయమ్మకి ఈ  సంసారం చూస్తూంటే కడుపులో తిప్పుతోంది వాసుదేవరావుగారి మీద గౌరవంతో చిన్నప్పటినుంచి సుమతిని పెంచిన మమకారంతో ఏదో పట్టుకు పాకులాడుతోంది. జానకమ్మ వచ్చినప్పటినుంచీ ఆయమ్మని వంటింట్లో అడుగు పెట్టనివ్వడంలేదు. రెండు మూడు సార్లు పక్కింటి పనిమనిషికి వంటదినుసులు అమ్మడం కళ్లారా చూసింది. కానీ కానకమ్మ నోటిముందు అమ్మడం కళ్లారా చూసింది. కానీ జానకమ్మ నోటిముందు తనమాట విలువెంత? సుమతికి చెబితే ఏమీ పట్టించుకోవడంలేదు. దీనికితోడు అడపా తడపా జానకమ్మ, సూర్యకాతం కోడలు రావడం, చేతి కందింది పట్టుకు పోవడం ఆ అనుమానం ఆయమ్మమీద పెట్టడం కూడా జరిగింది. అయినా సుమతి పెద్దగా పట్టించుకోలేదు. "వాళ్ళన గానే అయిపోయిందా ఊరుకో ఆయమ్మా" అని తన నోరే మూసేది. సుబ్బలక్ష్మి, డే కలసి తెరిగే తిరుగుళ్ళకీ తాగుళ్ళకీ  అంతేలేదు. గోవిందుకి మిలటరీలో చేరినందుకు పశ్చాత్తాపం, ఎలా బయటపడాలా అన్న ఆలోచనాతప్ప, ఇల్లు గుల్లైపోతుందన్న బాధ, దాన్ని సరిదిద్దాలన్న బాధ్యతా రెండూలేవు. సుమతితో కలిగిన విరక్తి నానాటికీ పెరిగి పెద్దదవుతోందేతప్ప, 'ఆశ' అనేది ఏ కోశానా లేకుండాపోయింది.
    ఆ రిజు గోవిందు ప్రయాణం కోపమని వెయ్యిరూపాయలు తెచ్చి సుమతి కిచ్చాడు. తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్ధితి, అమ్మనీ, నాన్ననీ విడచి వెళ్ళోద్దని ఎదురుతిరుగుతూన్న మనసూ గోవిందు చికాగా వున్నాడు. సుమతి అంతకి రెట్టింపు ఆశాంతితో సతమత మౌతోంది. ముందుగానే మత్తుమందుచ్చి పడుకోబెట్టారు నరసింహారావుగారినీ, కామాక్షమ్మగారిని. తీరా బయలుదేరే ముందు సుమతిని డబ్బడిగితే బీరువా అంతా వెతికి బిక్క మొహం పెట్టింది సుమతి డబ్బుకోసం ఇల్లంతా గాలించారు ఇంటిల్లి పాదీ.
    "ఇదుగో ఇక్కడుంది కట్ట. రండి చూడండి" అరిచింది జానకమ్మ అందరూ పరుగెత్తేరు. ఆశ్చర్యంతో నోటమాటరాలేదు. సుమతికి. ఆయమ్మ పిచ్చిదానిలా నోరు తెరిచింది. ఆ డబ్బు తనపెట్లో కెలా వచ్చిందో అర్ధంకాలేదు.  ఆమాటే పైకంది.
    "అవును. ఎలా అర్ధమావుతుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టాలేదని ఎన్నాళ్ళనుంచి చేస్తున్నావో ఈపని ఈనాటికి, నీ పాపం పండింది" నొక్కినొక్కి పలికింది జానకమ్మ.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS