భార్గవ మీద అతని భార్య సుమ వేసిన కేసులో తన భర్తకి రాగిణి అనే నర్తకితో సంబంధం వుందనీ, సినిమా పేరుతో ఆ అమ్మాయికి మద్రాసులో ఇల్లు కుదిర్చిపెట్టి, ఆమెతో కాపురం చేస్తున్నాడు కాబట్టి తనకీ తమ పిల్లలకీ అతను అన్యాయం చేస్తున్నాడు కనుక సినిమాకోసం నేను నా ఆస్తిలోంచి నాలుగు లక్షలు ఇచ్చిన డబ్బుని, అతని ప్రవర్తన మారడం వల్ల ఇప్పుడు రిలీజ్ అయిన పిక్చరు ద్వారా తనకు చెల్లించి న్యాయం చేకూర్చమని విజ్ఞప్తి చేసుకుంటున్నాననీ, రాసింది.
ఆ వుత్తరాన్ని యధాతథంగా సినీ పత్రికలు ప్రకటించాయి.
భార్గవకి మతిపోయినట్టయింది. భార్య ఎన్ని గొడవలు చేసినా భరించాడు కాని, పైనొచ్చే డబ్బంతా ఆమెకే చెందాలన్న పిటీషన్ను చూసి కంగారుపడిపోయిడు. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా "డబ్బు ఆమెదే అయినప్పుడు - అందులోనూ స్పష్టంగా ఆమె దగ్గర మీరు తీసుకున్నట్టు కాగితం ఆమె వద్ద వున్నప్పుడు - అసలు ఆస్తంతా ఆమెదె అయినప్పుడు ఆమె కోరిక నెరవేరుతుంది" అన్నారు.
కొందరు మిత్రులు రకరకాల సలహాలిచ్చారు. "ఏమయ్యా! ఇన్నాళ్ళూ అనుభవించావుగా? చాలదా? కట్టుకున్న భార్యతో కయ్యానికి దిగి, అందులోనూ లక్షలకి వారసురాలైన భార్యతో దెబ్బలాడుతూ, పైసాకి గతి లేనిదాన్ని చేసుకుంటావేమిటయ్యా తన్నితగలెయ్యక! డబ్బుంటే గప్ చుప్ గా ఏడాదికోదాన్ని మార్చుకోవచ్చు."
ఈ మాటలు మంత్రంలా పనిచేశాయి భార్గవపైన. ఒక శుభోదయాన మూటాముళ్ళు కట్టి చెప్పాచెయ్యకుండా త్రివేండ్రం వెళ్ళిపోయాడు మగువ మధువు మత్తును వదిలి.
నౌకరు వచ్చి భార్గవ అందించిన డబ్బు మిగిలిన అయిదు వేలూ చేతిలో పెట్టాడు! భార్గవగారు త్రివేండ్రం వెళ్ళిపోయారు. "మిమ్మల్ని ఈ యిల్లు ఖాళీచేసి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చునన్నారు" అని చెప్పాడు.
అంతవరకు మరో ప్రపంచంలో ప్రయాణం చేస్తున్న రాగిణికి దిమ్మదిరిగినట్టయింది. కళ్ళు బైర్లుకమ్మాయి. కాళ్ళకింద భూమి బద్దలయి తాను పాతాళంలోకి కూరుకుపోతున్నట్టనిపించింది.
"రెండుమూడురోజుల్లో ఖాళీ చెయ్యమ్మా, నేను కూడా ఊరికి పోయేదుంది" అన్నాడు వాడు.
టెలిఫోను మోగింది. ఎందుకో ఫోను తియ్యాలన్నా ఒంటరిగా ఆ ఇంట్లో వుండాలన్నా భయం వేసింది. మెల్లగా వెళ్ళి "హాల్లో" అంది.
"హల్లో! రాగిణి అమ్మగారా? భార్గవ వున్నాడా?" బొంగురు గొంతుకతో ఎవరిదో ఒక మొగ కంఠం.
రాగిణికి ఏదో పిరికితనం, ఏదో భయం, తనని ఎవరో ఏదో చేస్తున్నట్లు అనిపించింది!
చెమటలు పట్టాయి. చివరికి నౌకర్ని చూసినా భయమేస్తోంది!"
రాగిణి ఏ సమాధానం చెప్పకపోయేసరికి అవతలివారు "హల్లో హల్లో" అంటూ అరుస్తున్నారు. ఫోను పెట్టేసింది నౌకరు ఇదంతా చూస్తున్నట్టుగా అనుమానం కలిగింది. వెంటనే చేతికున్న గడియారం చూసుకుంది. హైదరాబాదు ఫ్లయిటుకి ఇంకా టైముంది. గబ గబా బట్టలు సర్దేసుకుంది. నౌకర్ని పిలిచి టాక్సీ తెమ్మంది. "రెండు మూడు రోజులుండి వెళ్ళండి! ఎందుకింత కంగారు పడతారు?" అన్నాడు వాడు. వాడలా అడిగితే వాడిమీద అనుమానం మరీ ఎక్కువయింది. 'వాడు గబుక్కున తలుపుమూసేసి, తనని రేప్ చేస్తాడేమో! లేకపోతే గొంతు నులిమేసి ఈ డబ్బూ వస్తువులూ తీసుకుపోతాడేమో!' వెన్నులోంచీ చలిలా వొణుకు పుట్టుకొచ్చింది. వాడికి సమాధానం చెప్పకుండానే, సూట్ కేసులు రెండు చేత్తో పట్టుకుని, అడుగులు తడబడుతుంటే, బయటకు వచ్చింది. కొంచెం భయం తగ్గింది! నౌకరు టాక్సీని పిల్చాడు. "ఏర్ పోర్టుకు పోనీ" అంటూ ఎక్కింది.
నౌకరు ఇంటికి తాళం పెడుతూ వుంటే టాక్సీ కదిలింది. "హమ్మయ్య! అంటూ నిట్టూర్చింది. కారు కదలికకు వీచే గాలికి, వంటికి పట్టిన చెమటలు తగ్గాయి.
తిన్నగా టిక్కెట్ కౌంటర్ వద్దకు వెళ్లింది. "వన్ టికెట్ ప్లీజ్" అంది.
"యూ ఆర్ లక్కీ! ఇందాకే ఒక టిక్కెట్ కాన్సిలయ్యింది. లేకపోతే దొరికేది కాదు" అన్నాడు టిక్కెట్టు కొనడానికి రాగిణి డబ్బులిస్తుంటే.
రాగిణి తృప్తిగా నిట్టూర్చింది. ఈ ఫ్లయిట్ లో టికెట్ దొరక్కపోతే ఎక్కడుండాలి ఈ రాత్రికి? మరీ అటువంటి సమస్య వస్తే రిటైరింగ్ రూంలో వుండొచ్చనుకుంది. కానీ అదిమాత్రం దొరకొద్దూ? ఇటువంటి ఆలోచనలతో పిచ్చెక్కిపోతూవుంటే టిక్కెట్టు వుందన్న మాట మండుతున్న గుండెమీద చల్లటి పన్నీరు జల్లినట్టనిపించింది. టిక్కెట్టు తీసుకుని వెనక్కి తిరిగిందో లేదో హైదరాబాద్ ఫ్లయిట్ కి సంబంధించిన పాసింజరులని సెక్యూరిటీ చెక్ కి వెళ్ళమని ప్రకటనొచ్చింది. "క్యూలో నుంచుని సెక్యూరిటీ చెక్ కి వెళ్లింది. రాగిణిని చూసి ఆ ఫ్లయిట్ లోనే ప్రయాణం చేస్తున్నవారు అదోలా నవ్వారు. ఆమెని నటిగా గుర్తుపట్టినవారు ఇంకోలా నవ్వారు. అన్నింటినీ భరించి వెళ్ళి ప్లెయిన్ లో కూర్చుంది.
'ఎక్కడికి వెళ్ళాలి?' ఒక్కసారిగా, అమ్మా...... నాన్నా..... భరణీ..... శిల్పా..... అంతా సినిమారీళ్ళలా ఒక్కొక్కరే కళ్లముందు కదిలారు. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి! తను ఎందుకిలా మారిపోయింది? భరణి పెళ్ళికి గానీ, శిల్ప సెలవులలో ఇంటికొచ్చినప్పుడుగానీ, చివరికి తల్లీ తండ్రీ, ఈ దేశాన్నొదలిపెట్టి అమెరికా వెళ్లిపోతున్నప్పుడు కానీ, ఒక్కసారైనా హైదరాబాద్ కి రాలేదు. భార్గవ మద్రాసుకి వెళ్ళగానే తనని మార్చేశాడు. తీరా తను మారాకా, తానే మారిపోయి, చెప్పకుండా వెళ్లిపోయాడు! ఇది మోసం! దగా! అయితే తన జీవితం ఎందుకిలా అయిపోయింది? "రాజేష్! భార్గవ!" ఇద్దరూ తన బతుకులో అడుగుపెట్టి ఆశలు రేపి అదృశ్యమయిపోయారు. తనకి పెళ్లిగీత లేదా? సంసారం చేసుకునే యోగ్యత లేదా? ఎడతెగని ఆలోచనలతో ఊపిరాడకుండా వుంది. ఎయిర్ హోస్టస్ ఇచ్చే టీ, కాఫీ ఫలహారం ఒద్దంది. ఆలోచనతో బుఱ్ఱ వేడెక్కిపోతోంది. కిటికీలోంచి కిందికి చూస్తూ కూర్చుంది.
"ఎక్స్యూజుమీ!" అనే గొంతు విని తిరిగిచూసింది రాగిణి.
"మీరు రాగిణి..... కొత్త యాక్ట్రస్ కదూ! అనుకున్నది సాధిస్తా సినిమాలో నటించారు కదా?"
"ఆ......! అవును" తడబడింది.
"మీరు ఇంత బాగున్నారు. సినిమాలో అదోలా ఎందుకున్నారండీ?"
"..... ..... ......??"
"నేనూ, మా తమ్ముడూ బెట్ కట్టుకున్నాం. నేనేమో, మీరు రాగిణిగారనీ, వాడేమో కాదనీ!"
"..........." నవ్వింది రాగిణి మెల్లగా!
"మేడమ్! ఇంకా వేటిల్లో వస్తున్నారండి?"
"ప్రస్తుతం ఏమీ లేవు!" ఆ అమ్మాయి వెళ్లిపోయింది. రాగిణి ఆలోచిస్తోంది! నిజానికి భార్గవ ఆ సినిమా పూర్తి చెయ్యకమునుపే కొందరు మంచి మంచి పేరున్న ప్రొడ్యూసర్లు కూడా సినిమాలలో నటించమని అడిగారు. భార్గవ దేనికీ ఒప్పుకోనివ్వలేదు! కొందరు భార్గవనే అడిగినా, "తరువాత చూద్దాం" అనేసి పంపించేశాడు! తనని పెళ్లిచేసుకుంటానని అతడు అన్నాక, అన్ని విషయాలు పూర్తిగా భార్గవకే వదిలివేసింది తను! ఏమీ పట్టించుకోలేదు. పెద్ద పెద్ద పేరున్న హీరోల సరసన నటించడానికి అవకాశమొచ్చినప్పుడు ఒద్దన్నదని కొందరికి కోపం కూడా వచ్చింది. "ఆమెకి చాలా గర్వం" అని దుష్ప్రచారం చేశారు కొందరు. భార్గవకోసం అన్నీ భరించింది! అన్నీ పోగొట్టుకుంది! అయినవాళ్ళందరికీ దూరమైంది! కన్నబిడ్డని సయితం కన్నెత్తి చూడలేదు. భార్గవతోటే లోకం అనుకుంది! భార్గవే సర్వస్వం అనుకుంది! ఎందుకిలా మాయలో పడిపోయిందో తన ఆలోచనా శక్తీ, సంస్కారం, మమకారం, అన్నీ ఏమయిపోయాయా! అర్థం కాలేదు. కంటికి పొరలు కమ్మినట్టు, మనసుని ఏదో సమ్మోహనపు పొరలు. మంత్రమేసినట్లు తనకి వేరే ప్రపంచమే కనిపించలేదు. ఒక్కమాటైనా తనతో చెప్పకుండా, అలా దొంగలా తప్పించుకు వెళ్లిపోయాడు. ఎన్నిమాటలు చెప్పి మోసం చేశాడు! దుఃఖం ముంచుకొచ్చింది. చెంపలమీదుగా కారుతున్న కన్నీటిని ఎవరూ చూడకుండా కర్చీఫ్ తో తుడుచుకుంది. ఫ్లయిట్ లాండ్ అవుతోంది. ఫాన్ బెల్డ్ బిగించుకోమని వచ్చిన ప్రకటన విని, ఫాన్ బెల్ట్ బిగించుకుని కూర్చుంది.
