Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 19

"అవునవును...నన్ను పెళ్లిచేసుకొని ఆరు నెలలు తర్వాత విడాకులు ఇచ్చే హజ్బెండ్ కావలెను"
"మా ఆవిడకు భర్తగా ఆరు నెలల పాటు కాంట్రాక్టు పద్దతిలో కావాలి..."
"నయాగరా జలపాతం ముందు, జలపాతం హోరు కన్నా ఎక్కువగా మాట్లాడగలిగే వ్యక్తి కావలెను..."
"వేగంగా వెళ్తోన్న కారుకు ఎదురుగా వెళ్లే గట్స్ వున్న వ్యక్తి కావాలి..."
"బ్యాంకు దోపిడీకి నిపుణులైన సిద్దహస్తులైన దొంగలు కావలెను"
"ఇలా రకరకాల 'యాడ్స్' నేను చదివాను. ఇందులో కొన్ని ప్రాక్టికల్ జోక్స్ అయితే మరికొన్ని నిజంగానే ఇచ్చారు. మరికొన్ని సీరియస్ గా, ప్రొఫెషనల్ గా చిన్న ఎక్స్ పర్మెంటల్ గా ఇచ్చినవి.
బ్యాంకు దోపిడీకి సిద్దహస్తులైన దొంగలు కావలెను అన్న ప్రకటన చూసి నిజంగానే వెళ్లారనుకో...పోలీసులు ట్రాప్ చేసి పట్టుకుంటారు. అంతక్రితం జరిగిన బ్యాంకు రాబడీలలో వీళ్ళు వున్నారేమో చూస్తారు."
విలియమ్స్ చెప్పుకుపోతూనే వున్నాడు.
నచికేత సీరియస్ గా ఆ ముఖ్యమైన షరతు ఏమిటో చదివాడు బిగ్గరగానే.
"ముఖ్యమైన షరతు..."ఏ బాదరబందీ లేనివారై ఉండాలి. ఆసక్తి, తగిన అర్హతలున్నాయని భావిస్తే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు హోటల్ ఎమరాల్డ్ లో రూమ్ నెంబర్ వన్ వన్ త్రీలో జరిగే ఇంటర్ వ్యూకు హాజరవ్వాలి"
అది చదివి చెప్పాడు నచికేత" మనం వెళ్తున్నాం" అని.

                                       * * *
రెస్టారెంట్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూచున్నారు డేనియల్, పీటర్సన్. రెస్టారెంట్ కు వాళ్ళొచ్చి అరగంట అయ్యింది. పడి నిమిషాలకోసారి, ఏదో ఓ ఐటమ్ తెప్పించుకొని తింటూనే వున్నారు. రిసెప్షన్ కౌంటర్ దగ్గర కొంతమంది జనం గుమిగూడ్డం గమనించాడు పీటర్సన్.
"మనమిప్పుడు ఏం చేయబోతున్నాం?" అడిగాడు డేనియల్ పీటర్సన్ ని.
"వెయిట్ అండ్ సీ" తాపీగా అన్నాడు పీటర్సన్.
"అది కాదు...పదకొండు గంటలకు ఇంటర్ వ్యూ అని చెప్పాం. పదిన్నరకే మనం రెస్టారెంట్ కు వచ్చాం. ఏమిటిదంతా?" డేనియల్ మొహంలో సందేహం.
"ఇంటర్ వ్యూ లో ఓ భాగం ఇది."
"వాట్?"
"యస్...మనం ఇచ్చిన ఇంటర్ వ్యూను ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది మొదటి ఫేజ్...ఈ ఇంటర్ వ్యూ యాడ్ చూసి ఇంటిలిజెన్స్ వాళ్ళు ఏమైనా ఎంక్వయిరీకి వచ్చారా? వాళ్లకు మన కదలికలమీద ఏమైనా డౌట్స్ వచ్చిందా? అన్నది సెకండ్ ఫేజ్...ఇంటర్ వ్యూకు వచ్చిన క్యాండిడేట్స్ తెలివితేటలు, కనీస ఆలోచన ఏ రేంజ్ లో ఉన్నాయన్నది మనం గమనించాలి. ముఖ్యంగా వాళ్లకు వుండే పేషన్స్...ఒక పని కోసం వచ్చినప్పుడు ఎంత సహనం ఉండాలి. ఇవన్నీ గమనించాలంటే మనం ఇక్కడే ఉండి వాచ్ చేయాలి..." చెప్పాడు పీటర్సన్.
"అది సరే...ఇంతకీ రిసెప్షన్ కౌంటర్ లో ఏం చెప్పావు?"
"మనం అర్జంట్ పనిమీద బయటకు వెళ్తున్నామని...రావడానికి ఓ రెండు మూడు గంటలు పట్టవచ్చని, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చెయ్యోచ్చు...లేదంటే రేపు ఉదయం పది గంటలకు రావచ్చు...అన్న మెసేజ్ రిస్పెప్షన్ లో వదిలాం..."
"దీనివలన మనకు లాభమేంటి?"
"ఈ ఛాలెంజ్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వెయిట్ చేస్తారు. సర్లే రేపు వద్దాం...అనుకునేవాళ్ళు మనకు వద్దు. ఏ పనిచేసినా, డెడికేషన్ కావాలి. అలాంటివాళ్ళే మనకి కావాలి" చెప్పాడు పీటర్సన్ రిసెప్షన్ దగ్గర నిలబడ్డ క్యాండిడేట్లను చూస్తూ...
ఓ పాతిక ముప్పయిమంది వరకూ వచ్చారు. రిసెప్షన్ లో ఎంక్వయిరీ చేస్తున్నారు.  రిసెప్షన్ లో పీటర్సన్ వదిలిన మెసేజ్ చూసి నలుగురైదుగురు వెళ్లిపోయారు.
ఓ అరగంట గడిచింది. కొందరూ అటూ, ఇటూ తిరుగుతూ సిగరెట్లు కాలుస్తున్నారు.
ఇంకొందరు గ్రూప్ గా చేరి డిస్కస్ చేసుకుంటున్నారు. పన్నెండు దాటింది. పదిహేనుమంది మిగిలారు. పీటర్సన్, డేనియల్ అలానే రెస్టారెంట్ లో కూచున్నారు. వాళ్లముందు టీ, కాఫీ కప్పులు వున్నాయి.

                                           * * *
ఒంటి గంట...
మరో ఐదుగురు వెళ్లిపోయారు. వాళ్లలో అసహనం. ఒకటిన్నర...మరో ముగ్గురు వెళ్లిపోయారు.
రెండు...రెండున్నర...మూడు...
మరో ఇద్దరు వెళ్లిపోయారు.
అక్కడ ఐదుగురు మాత్రమే మిగిలారు.
ఆ అయిదుగురూ నచికేత, అతని ఫ్రెండ్సూ...

                                        * * *
కోక్ తాగుతూ వాళ్ల వంక పరిశీలనగా చూశాడు పీటర్సన్.
"వాళ్లకు నువ్వు చెప్పిన 'పేషన్స్' చాలా వున్నట్టుంది" నవ్వుతూ అన్నాడు డేనియల్.
"యస్పెస్...అంతేకాదు...పనిపట్ల 'కాన్ సంట్రేషన్' కూడా బాగా ఉన్నట్టుంది. మిగతావాళ్లలాగా అనీజీగా ఫీలవ్వడంలేదు. వీళ్ళు మాత్రం అక్కడ్నుంచి కదలడం లేదు. కనీసం 'లంచ్'కు కూడా వెళ్లడంలేదు..."
"దట్స్ గుడ్" అన్నాడు డేనియల్.
"అంతేకాదు...మనం ఇచ్చిన 'యాడ్'ని ఇంటెలిజెన్స్ వాళ్లు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు.
నేను రూమ్ లోకి వెళ్లిన అరగంట తర్వాత వాళ్లను పంపించు...వెళ్ళేప్పుడు మంకీ క్యాప్ పెట్టుకో...బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకొని వెళ్లు"
"ఎందుకు?"
"వాళ్ళు నిన్ను గుర్తు పట్టకూడదు. ఈ ఆపరేషన్ కు వాళ్ళు ఒప్పుకోకపోయినా రేపు మనల్ని 'ఐడెంటిఫై' చేయకూడదు. నేను కూడా నా గెటప్ మార్చుకుంటాను. అందుకే అరగంట ఆగి పంపించమని చెప్పాను."
మనం ప్రారంభించబోయే ఆపరేషన్ పేరు 'ఆపరేషన్ గెస్ట్ హౌస్' చెప్పాడు పీటర్సన్ లేస్తూ...

                                                   * * *
రూమ్ నెంబర్ వన్ వన్ త్రీ
నచికేత, అతని ఫ్రెండ్సూ ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే డేనియల్ రూమ్ తలుపు క్లోజ్ చేశాడు.
ఎదురుగా కుర్చీలో పీటర్సన్.
ఇప్పుడతని గెటప్ పూర్తిగా మారిపోయింది. తలపాకా ఒత్తయిన గడ్డం, బ్లాక్ కలర్ కళ్లజోడు...
                                        * * *
"వెల్...మా క్కావలసింది ఒకే ఒక వ్యక్తి..." అన్నాడు పీటర్సన్.
వెంటనే నచికేత అన్నాడు "మీరు చెప్పే పని ఐదుగురం కలిసి చేయాలనుకుంటున్నాం...అందుకు మీకేమైనా అభ్యంతరమా?"
భుజాలు ప్రగ్ చేసి "అప్ కోర్స్...అయినా మీరు నేను చెప్పిన పని చేయగలరా?" అన్నాడు పీటర్సన్.
"మీకు మా నుంచి కావల్సిందేమిటి చెప్పనే లేదు" అన్నాడు నచికేత.
"మూడు వందల అరవై గంటల్లో చావడానికి సిద్ధపడాలి. మారి...ఈ 'ఒకేపని' ని ఐదుగురు ఎలా చేయగలరు?" పీటర్సన్ ఎదురు ప్రశ్న వేసేసరికి...నచికేత ఆలోచనలో పడ్డాడు. అయినా వెంటనే తేరుకుని...
"కేవలం మేము చావడం కోసమే...మీరు 'యాడ్'ఇచ్చారని మేము అనుకోవడంలేదు. ఇరవై ఐదు లక్షలు ఇచ్చి, మమ్మల్ని చచ్చిపోవాలని చెప్పడానికి సరైన కారణం లేదు" అన్నాడు నచికేత.
"అఫ్ కోర్స్...మీరు ఖచ్చితంగా చచ్చిపోవాలనే కండిషన్ కాదు...చావవలసి వస్తే...మాత్రం మీ 'చావు' కు కారణం మీరేనని గుర్తించాలి..." అన్నాడు.
పీటర్సన్ మాటలు కన్ ప్యూజింగ్ గా అనిపించాయి.
వెంటనే పీటర్సన్ "ముందు మీకో చిన్న టెస్ట్..." అంటూ డేనియల్ కేసి సైగ చేశాడు.
డేనియల్ ఓ ట్రేలో జ్యూస్ గ్లాసులు తెచ్చాడు. ఫ్రిజ్ లో నుంచి తీసి "హేవిట్..." అన్నాడు ట్రేను టీపాయ్ మీద పెట్టి పీటర్సన్.
వాళ్ళు జ్యూస్ తీసుకోబోతుండగా...
"బట్...రిమెంబర్ వన్ థింగ్..ఈ ఐదింటిలో ఒక గ్లాసులో పాయిజన్...ఐ మీన్...విషం కలిపి వుంది. ఒకరు ఖచ్చితంగా చస్తారు...అలా చచ్చినవారికి పాతిక లక్షలు ఇస్తారు..." అంటూ మంచం మీద వున్న బ్రీప్ కేసు టీపాయిమీద పెట్టి ఓపెన్ చేశాడు.
అందులో అన్ని కొత్త ఐదువందల రూపాయల నోట్లు...
నచికేత జ్యూస్ గ్లాసు తీసుకొని ఫ్రెండ్స్ వైపు చూసి...'చీర్స్' అన్నాడు.
ఐదుగురూ జ్యూస్ తాగారు. పీటర్సన్ ఆశ్చర్యంతో చూస్తుండగానే...ఆ అయిదుగురిలో ఏ రియాక్షన్ లేదు...
"ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇందులో ఏ విషమూ కలుపలేదని తెలుసు...మా నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు. నిజంగా అదే నిజమయితే, మీక్కావలసిన ఓ సాహసవంతుడ్ని...ఇలా చాలా సిల్లీగా జ్యూస్ లో విషం కలిపి తాగమని చెప్పరు..." తాపీగా అన్నాడు నచికేత.
పీటర్సన్ ఒక్కక్షణం కలవరపడిపోయాడు.
"ముసుగులో గుద్దులాట వద్దు, స్ట్రయిట్ గా విషయం చెప్పండి..." విలియమ్స్ సూటిగానే అడిగాడు.
పీటర్సన్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత వాళ్లవైపు చూసి...
"మీధైర్యం, ఐ.క్యూ, ఒకేమాట మీద కలిసి ఉండే గుణం నాకు నచ్చాయి. స్ట్రయిట్ గా విషయానికి వస్తాను. బట్, ఒక్క విషయం...
ఈ డీల్ మీరు చేపట్టకపోయినా మధ్యలో తప్పుకున్నా ఆ విషయాన్ని ఇంతటితో మరిచిపోవాలి. అలా కాకుండా ఆరో వ్యక్తికి తెలిస్తే...అది మీ ప్రాణానికే ప్రమాదం...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS