Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 19

    "శుభలేఖలు అచ్చు వేయించారంటే పెళ్ళి గురించి నీకు ముందే తెలిసి ఉంటుంది. మరి నాతో చెప్పలేదేం?"
    ఆమె మాట్లాడలేదు.
    అతను పూర్తిగా తేరుకున్నాడు. కొన్ని క్షణాలపాటు ఆమెని తదేకంగా చూశాడు. ఆమె మొహంలో ఎటువంటి దిగులు లేదు. ఎప్పటిలా ఆమె నిన్న రాత్రి కూడా వచ్చింది. ఆమె పెదాలు తన పెదాలని ఆత్రంగా ముద్దేట్టుకున్నాయి. రెండు నిముషాల క్రితం వరకూ ఆమె తన స్వంతమనే భావనలో ఉన్నాడు. ఇప్పుడామె పరాయిసొత్తు, అతని శరీరం జలదరించింది. గాఢమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతను అన్నాడు.
    "రేపు ఎగ్జామ్ ఉంది. చదువుకోవాలి...."
    ఆమె వెనక్కి తిరిగి గబగబా నడిచింది, గుమ్మం వరకూ వెళ్ళిన తరువాత రామకృష్ణ అన్నాడు.
    "ఒక్కమాట."
    ఆమె ఆగింది వెనక్కి తిరక్కుండా.
    "నువ్వు మరో వ్యక్తిని చేసుకోవడానికి కారణం ఏమిటి?" అడిగాడు. అతని గొంతు అతనికే విచిత్రంగా ధ్వనించింది.
    ఆమె రామకృష్ణ వైపు తిరిగి ఒకసారి చూసి గుమ్మందాటి వెళ్ళిపోయింది. రామకృష్ణ ఆమె వెళ్ళినవైపు చీకట్లోకి చూస్తుండిపోయాడు. కత్తితో గుండెల్లో కెలికినట్టు బాధ.
    ఆ రాత్రి మసక వెలుతుర్లో ఎంతసేపు కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. పని నుంచి వచ్చిన తల్లి బొమ్మలా కూర్చున్న కొడుకుని చూసి పలకరించకుండా లోపలకు వెళ్ళింది. కొడుకు అలా ఉండటం ఆమె ఎప్పుడూ చూడలేదు. క్రమంగా క్షణాలు గడుస్తూ నిముషాలుగా మారి గంటలుగా రూపాంతరం చెందుతున్నాయి.
    రాత్రి ఎప్పుడో అతను నెమ్మదిగా కదిలాడు. తెరిచి ఉన్న పుస్తకాన్ని మూసాడు. దీపం తీసుకుని లేచి నిలబడ్డాడు. దీపపు కాంతి అతని మొహం మీద పడుతోంది. మనసులోని ఆవేదన తాలూకు గుర్తులు ఆ మొహంలో ప్రతిఫలిస్తున్నాయి. నెమ్మదిగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. కొడుకు వస్తున్న చప్పుడికి ఆమె లేచి కూర్చుంది.
    "ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా..." అడిగాడు.
    మనసు ఆవేదనతో నిండినప్పుడు ఆకలి వెయ్యదు. ఆకలి గుర్తొచ్చిందంటే దానినుండి బయటపడ్డాడని అర్ధం.
    రామకృష్ణ మరునాడు ఎగ్జామ్ కి హాజరయ్యాడు. అతను ఎగ్జామ్ నుండి తిరిగిచ్చేసరికి వివాహం జరిగిపోయింది. వరుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, ఆమెకు అతను దగ్గర బంధువని తరువాత తెలిసింది.
    "రామకృష్ణా! నీకు ఫోనొచ్చింది..." గుమస్తా వచ్చి చెప్పాడు.
    ఆలోచనల నుండి బయటపడి గుమాస్తావైపు ఆశ్చర్యంగా చూశాడు. గోడౌన్ ఆఫీసులో ఫోన్ ఉన్నా ఆ విషయం తనెప్పుడూ పట్టించుకోలేదు. తనకి ఫోన్ చేసేంత ముఖ్యమైన స్నేహితులు కూడా లేరు. ఆలోచిస్తూనే వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.
    "హల్లో....నేను రామకృష్ణని మాట్లాడుతున్నాను...."
    "నేను శివరావుని, నాకో సాయం చెయ్యాలి...." అటునుంచి కంగారుగా వినిపించింది.
    శివరావు ఎవరో జ్ఞాపకం రావడానికి రెండు క్షణాలు పట్టింది.
    "ఏమిటది?" అడిగాడు.
    బరువుగా ఊపిరి తీసుకున్న చప్పుడు రిసీవర్ లో వినిపించింది.
    "పది నిముషాల క్రితం కొత్తరోడ్డు దగ్గిర నాతో ఉన్న అమ్మాయిని ఎవరో బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. ఆమెని రాజమ్మ కంపెనీకి తీసుకెళతారు. ఎలాగైనా ఆమెను వాళ్ళ చేతుల్లోంచి రక్షించాలి...."
    "రాజమ్మ కంపెనీ...అదెక్కడ?" అడిగాడు.
    "లక్ష్మీటాకీస్ సెంటర్ లో ఉంటుంది. ఎవర్నడిగినా చెబుతారు. వాళ్ళు ఆ కంపెనీకి చేరకముందే ఆమెని విదిపించాలి. ఈపాటికి వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో కంచరపాలెం చేరుకుంటుంది......"
    "ఆటోలో ఎంతమందున్నారు?"
    "డ్రైవర్ కాక మరో అతను ఉన్నాడు."
    "నువ్వెక్కడ నుంచి మాట్లాడుతున్నావ్?"
    "కొత్తరోడ్డులోని రామకృష్ణా బార్ అండ్ రెస్టారెంట్ నుంచి....."
    ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు రామకృష్ణ.
    "నువ్వు రూముకి వచ్చేయి. ఈలోపు నేను ప్రయత్నిస్తాను."
    రిసీవర్ పెట్టేసి అక్కడనుంచి కూలీల దగ్గరకు వచ్చాడు. ఒక కూలీని అడిగి సైకిల్ తీసుకుని సెంటర్ కి చేరాడు. కిళ్ళీషాపు ముందు తాళం వేసి ఒక ఆటో డ్రైవర్ ని పిలిచి రెండు నిముషాలు మాట్లాడాడు. ఆ డ్రైవర్ స్టాండ్ వైపు వెళ్ళి ఇద్దరూ డ్రైవర్లని పిలిచి ఏదో చెప్పాడు. తన ఆటో స్టార్ట్ చేసి రామకృష్ణని ఎక్కించుకుని బయలుదేరాడు. ఖాళీ ఆటోలు రెండు దానిని అనుసరించాయి.
    లక్ష్మీటాకీస్ అక్కడికి దగ్గరే కావటం వాళ్ళ కొన్ని నిముషాల్లో థియేటర్ దాటి ఒక సందులోకి ప్రవేశించి అక్కడ ఆగాయి. ఆ సందు చివర ఉన్న రాజమ్మ కంపెనీని చూపించాడు డ్రైవరు. ఒకవైపుకి మాత్రమే మార్గం గల ఆ సందు ఒక కారు పట్టేంత మాత్రమే ఉంది. రామకృష్ణ సూచన ప్రకారం ఆటోలు రెండూ దారికి అడ్డంగా ఒకదాని ప్రక్కన ఒకటి నిలబెట్టారు డ్రైవర్లు. మూడో ఆటో వెనక్కి తిప్పి ఉంచారు.
    ఆటో డ్రైవర్లతో చిన్నగా చెప్పాడు రామకృష్ణ.
    "కొద్ది సేపటిలో ఒక ఆటో ఈ సందులోకి వస్తుంది. మీ ఆటోలు అడ్డుగా ఉండటం వల్ల ముందుకి వెళ్ళకుండా ఇక్కడ ఆగుతుంది. మీరు ఆ చీకటిలో నిలబడి ఎవరు పిలిచినా పలకొద్దు. నా ఆటో బయలుదేరిన మరుక్షణం మీరు వెళ్లిపోండి..."
    మూడో ఆటో దగ్గరకు వెళ్ళి లోపల కూర్చుని చెప్పాడు.
    "మనకి కావాల్సిన ఆటో ఈ సందులోకి వచ్చిన మరుక్షణం నీ ఆటో స్టార్ట్ చేసి సిద్దంగా ఉంచు."
    ఆ సందు చీకతిగాను, నిర్మానుష్యంగాను ఉంది. అందుచేతనే వాళ్ళ పనుల్ని ఎవరూ గమనించలేదు. ఆ కాస్త సమయంలో అంతకంటే మంచి ఆలోచన తట్టలేదు రామకృష్ణకి. శివరావు చెప్పిన ఆటో రాజమ్మ కంపెనీ చేరకపోతే తన పని తేలిగ్గా పూర్తవుతుంది. ఈపాటికే చేరిపోయి ఉంటె ఏం చెయ్యాలో ఆలోచించలేదు. అసలు ఆలోచించడానికి సమయం ఎక్కడిది?
    రామకృష్ణ ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. సందులోకి ఒక వాహనం ప్రవేశించింది. దానికి ఓకే ఒక్క లైటు వెలుగుతోంది. రామకృష్ణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అడ్డుగా నిలబెట్టిన వాహనాల వరకూ వచ్చి ఆగిపోయింది ఆటో.
    "ఎవర్రా! దారికి అడ్డంగా ఆపింది..." తల బైటకు పెట్టి అరిచాడు దాని డ్రైవరు.
    సమాధానం రాకపోవడంతో వెనుక నుండి ఒకతను క్రిందకు దిగి ఆటోల దగ్గరికి నడిచాడు. రామకృష్ణ  తను కూర్చున్న ఆతోనుంచి దిగి అప్పుడే వచ్చిన ఆటో వెనక్కి వచ్చాడు. లోపల ఎవరూ లేకపోవడంతో తను వచ్చిన ఆటో డ్రైవర్ని పిలిచాడు ఆ వ్యక్తి. డ్రైవర్ ఇంజన్ ఆపి అటువైపు నడిచాడు.
    ఆటోలో కూర్చున్న అమ్మాయికి చెప్పాడు రామకృష్ణ.
    "కంగారు పడకండి, నన్ను శివరావు పంపించాడు. మీరు అతని తాలూకు మనిషి అయితే దిగండి..."
    లోపల కూర్చున్న అమ్మాయి అతని వంక భయంగా చూసింది.
    "ఆలోచించడానికి ఇది సమయం కాదు...." అంటూ చొరవగా ఆమె జబ్బ పట్టుకుని బయటకు లాగాడు, ఆమె చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఉండటం అప్పుడు గమనించాడు. ఆమెను తీసుకెళ్ళి తన ఆటోలో ఎక్కించాడు.
    దారికి అడ్డంగా నిలబెట్టిన ఆటోలు ప్రక్కకులాగి దారి చేశారు వాళ్ళు. అప్పటివరకూ చీకటిలో నిలబెట్టిన ఆటో స్టార్ట్ అయి వెళ్ళడం గమనించారు. తమ ఆటో దగ్గరకు గబగబా వచ్చారు. అదంతా ఓ పథకం ప్రకారం జరిగిందని అప్పటికిగాని అర్ధం కాలేదు. వెంటనే తమ ఆటోలో సందులోంచి వెళ్ళిన ఆటోని అనుసరించారు.
    వాళ్ళ ఆటో అక్కడ నుంచి వెళ్ళిన మరుక్షణం డ్రైవర్లు చీకటి నుంచి బయటకొచ్చి తమ ఆటోలు తీసుకుని స్టాండ్ కి చేరుకున్నారు. పది నిముషాల తరువాత రామకృష్ణని తీసుకెళ్ళిన ఆటో ఖాళీగా స్టాండ్ కి వచ్చింది.
    పెట్రోలు ఖర్చు లేకుండా అరగంట వ్యవధిలో సంపాదించుకున్న డబ్బుని పంచుకోవడానికి హోటల్లోకి వెళ్ళారు.
                             *    *    *    *
    రాజమ్మ కంపెనీ సందు నుండి కుడి వైపుకి తిరిగి వెంటనే ఎడమ ప్రక్కనున్న సందులోకి వెళ్ళింది రామకృష్ణ ఎక్కిన ఆటో. ఆగంతకుల ఆటో  సందు చివరకు వచ్చేసరికి ఆ ప్రక్కనే ఉన్న మరో సందులో రామకృష్ణ ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి అర్చనతో నడవసాగాడు. నాలుగైదు వీధులు దాటి తన రూము చేరుకొని తాళం తీసి లైటు వెలిగించాడు.
    "రండి..." అన్నాడు ఆమెతో.
    అర్చన సంశయిస్తూనే లోపలకు నడిచింది. ఆమెకు అదంతా అయోమయంగా ఉంది. ఆమె మొహంలో కదులుతున్న భావాలు గమనించి అన్నాడు రామకృష్ణ.
    "శివరావు నాకు స్నేహితుడు. మిమ్మల్ని బలవంతంగా తీసుకెళుతున్నట్టు ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు. నేను మీకు సోదరునిలాంటి వాడిని, శివరావు కాసేపట్లో ఇక్కడకు వస్తాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS