Previous Page Next Page 
యువత నవత పేజి 19

 

       ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం ఇప్పించే ప్రయత్నంలో హడావుడిగా తిరుగుతున్నాడు శర్మ.

    "శాలినిగారూ!" అంటూ వచ్చాడు క్లాస్ రూం లోకి "పిల్లలచేత ఈ నాటకం వేయించాలనుకొంటున్నాను. ఇది మీరొకసారి చదివి, పిల్లల్ని ప్రిపేర్ చేయించడంలో మీరునాకు సాయం చేయాలి" అన్నాడు చేతి లోని స్క్రిప్టు కాగితాలు అందిస్తూ.

    "నేనెప్పుడూ నాటకాలు వేయలేదండీ!"

    "నాటకాలు వేయకపోతే ఏమిటండీ! పాత్రకనుగుణంగా డైలాగులు పలకడం చెప్పలేరూ?"

    "మీరొకసారి ఆ డైలాగులు పలికి నాకు చెప్పండి. నేను పదిసార్లు కాకపోతే ఇరవైసార్లు అరిచి వాళ్లచేత ప్రాక్టీసు చేయించగలను."

    "నా డైరెక్షన్ లో మీరు తయారయ్యి తరువాత వాళ్లని తయారు చేస్తారన్నమాట! ఓ. కే . నాకిప్పుడు క్లాసుంది, నాలుగో పీరియడ్  ఖాళీగా వుంటాను. స్టాఫ్ రూమ్ కి రండి. అక్కడ రిహార్సల్స్ మొదలుపెడదాం" చిరునవ్వుతో అని వెళ్ళిపోయాడు శర్మ.
    నాలుగవ పీరియడ్ కి స్టాఫ్ రూమ్ కి వెళ్లింది శాలిని.

    శర్మవచ్చి డైలాగులు చెప్పడం మొదలుపెట్టాడు.

    డైలాగులు పలికేప్పుడు అతడు ముఖంలో వ్యక్తపరిచే హావభావప్రదర్శన చూస్తున్న నెపంతో అతడి ముఖంలోకి తనివితీరా చూడసాగింది శాలిని. చూస్తూ తననితాను మరిచిపోయింది.

    "ఏదీ ఈ డైలుగు చెప్పండి!" అంతకుముందే ఆ డైలాగుని రెండుసార్లు చెప్పిన శర్మ అన్నాడు.

    కళ్లప్పగించి చూస్తున్న శాలినినుంచి డైలాగు యెంతకూ వూడిపడలేదు!

     "శాలినిగారూ! ఏ లోకంలో వున్నారు?"

    శర్మ మందలించేసరికి తృళ్లిపడి ఈ లోకంలోకి వచ్చింది శాలిని.

    "మీరు ఎక్కడో వున్నారు. మనసు పెట్టి వినడంలేదు."

    "ఇక్కడే వున్నాను కనిపిచండంలేదా? అదృశ్యకరిణిలాంటి విద్యలేం రావు నాకు" ఆశ్చర్యం వ్యక్తం చేసింది శాలిని.    

    "వట్టి పరధ్యానం మనుషులు! మీకేం రాదు."

    "మనసుని ఏకాగ్రంచేసి మీముఖంలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్నానండీ? ఏ తెలుగు నటుడికీ తీసిపోని అందం, హావభావ, ప్రదర్శన....... అవునూ, మీరు సినిమాకు యెందుకు ప్రయత్నించకూడదూ?"

    "మొద్దుపిల్ల కారెక్టర్ కి మీరు బాగా సరిపోతారు! మీరెందుకు ట్రై చెయ్యకూడదు?"

    "మొద్దునా? పిల్లనా?" ఉడుక్కుని దెబ్బలాటకి సిద్దపడుతున్నట్టుగా అంది శాలిని.

     "లేకపోతే ఏమిటండీ? ఒకసారి డైలాగులు నా దగ్గరవిని పిల్లలకి నేర్పుతానన్నారు! ఆ సంగతేదో చూచుకోక సినిమాలకు ఎందుకు పోలేదని సలహా ఇస్తారా?"

    "మీ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే స్వేచ్చ మీకెంత వుందో, నా అభిప్రాయాన్ని వ్యక్తంచేసే స్వేచ్చ నా కంతే వుంటుంది."

    "ఏం లేకపోయినా  ఈ స్వతంత్ర పోరాటం ఒకటీ మీ ఆడవాళ్లకు."

    "ఏం తక్కువుందని మీ అభిప్రాయం?" ఇప్పుడు నిజంగా యుద్దానికి సిద్దమైపోయింది శాలిని.

    "ఏం తక్కువలేదు. డాలు, కత్తి, శిరస్త్రాణం, కంచు కవచం అన్నీ వున్నాయి. ఏమీలేని నిరాయుధులం మేమే"

    "అదిగో!మళ్లీ వెటకారం! మీకు స్త్రీలపట్ల చాలా తేలిక భావం వున్నట్టుంది."

    "మీకు పురుషుల పట్ల చాలా వైర భావం వున్నట్టుంది"

    "నాకేం లేదు!"   

    "నాకూ ఏం లేదు."

    ఇధ్దరిమధ్య ఒక నిమిషం మౌనం రాజ్యం చేశాక శర్మ అన్నాడు వుదాశీనంగా "మనం ఈ విషయం మీద పోట్లాడుకుందుకు భార్యభర్తలం కాదు. కనీసం ప్రేయసీ ప్రియులం అయినా కాదు... ఇహ మనం అస్సలు విషయంలోకి వద్దామా?"

    "మంచిది "అంది శాలిని సీరియస్ గా.

    ఈ విధంగా యుద్దం మొదలయ్యీ కాకముందే సంధి జరగడం అసంతృప్తి అనిపించింది శాలినికి. ఇంకాసేపు మాటల బాణాలు విసురుకుంటే బాగుండేది.

    శర్మ డైలాగులు చెప్పసాగాడు.

    శాలిని వింటూంది.

    నాటకం పేరు "కుక్క కాటుకి చెప్పుదెబ్బ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS