Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 19

 పిలుపు

ధాత్రీ జనని గుండె మీది
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీ రెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కోటి కోటి సైనికుల ఊడిపడిన
కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
మీ రెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకొన్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు
మీరెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
మీరెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే
అణచుకొన్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
ప్రభాత విపంచిక పలికిస్తారా?

    *     *     *   
                    ---1944

        భూలోకం

"అస్థిమూల పంజరాలు
ఆర్తరావ మందిరాలు
ఏ లోకం తల్లీ,
ఏవో బాష్పజలాలు?"

"కూడులేని లోకంయిది
గుండెలోతు తాపంయిది
సోమయాజి శాపంయిది
భూమి అడుగు లోకంయిది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS