ఫొటోస్ కడిగించాక తెలిసింది తొంభై తొమ్మిది శాతం ఫొటోస్ పాడయ్యాయని. లైటింగ్ సమస్యో, లెన్స్ కి వేలు అడ్డం పెట్టో ఉన్నాయి దాదాపు అన్ని ఫొటోస్ లోనూ. ఆ రోజు కార్తీక్ లతని తెగ ఏడిపించాడు. చదువెటూ రాదు. ఇది కూడా రాదా అని.
లత ఉడుక్కుంటే బాగా నవ్వుకున్నారు తాము ముగ్గురూ.
ఒకే ఒక్క ఫొటో మాత్రం కాస్త బాగా వచ్చింది.
బృంద, తను, కార్తీక్ ముగ్గురూ ఉన్న ఫొటో అది!
***
మర్నాడు తను బృంద ని కలవటానికి వెళ్లేసరికి ఆమె ఏదో పుస్తకం పట్టుకుని చాలా దీక్షగా చదువుతోంది. తనని చూసి ఆమె కళ్ళు తళుక్కుమని మెరిసాయి. లేదా తనలా అనుకున్నాడో...
కాసేపు మాట్లాడాక బృంద ని ఆమె తల్లి పిలిచేసరికి లోపలికి వెళ్ళింది. లత స్నేహితురాలి ఇంటికి వెళ్లిందట. కార్తీక్ ఏవో పరీక్షలు అని ఆ రోజు రాలేదు. ఒక్కడే కూర్చున్నాడు తను. బోర్ కొడుతోంది అతనికి. బృంద ఎంతకీ బయటకి రాకపోవటం తో ఆమె చదువుతూ పక్కన పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు.
ఆధ్యాత్మికత కు సంబంధించిన పుస్తకం అది. ఎంత వోపిక ఈమె కి ఇటువంటివి చదవటానికి. పుస్తకం పక్కన పెట్టెయ్యబోతుండగా కనపడింది అతనికి. కార్తీక్ ఫొటో. తాము ముగ్గురూ దిగిన ఫొటో లో కార్తీక్ వరకూ కట్ చేసి పెట్టుకున్నట్లుంది బుక్ లో.
ఏదో శ్రద్ధగా చదువుకుంటోంది అనుకున్నాడు, ఇదన్నమాట ఆమె చేస్తున్నది!
అతని అహం ఆ రోజు దెబ్బ తిన్నంతగా మరే రోజూ తినలేదు. తన మీద తనకి ఏ మాత్రం నమ్మకం, ఏ మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నా దానిని కోల్పోయిన రోజది.
బృంద ప్రేమిస్తున్నది కార్తీక్ నా? తనని కాదన్న మాట. విలవిలలాడి పోయాడు ఆ రోజు. తమ్ముడి మీద ఈర్ష్య తో రగిలిపోయాడు. ప్రతి చోటా ఈ వెధవ తనకి అడ్డమే. తన మీద తనకి చాలా తక్కువ అభిప్రాయం కలిగిన రోజది.
నాలుగు రోజులు తన గది నుంచి బయటకి రాలేకపోయాడు. మెల్లగా కోలుకుని బయటకి వచ్చాక అతను తన దృష్టి అంతా కెరీర్ మీద పెట్టాడు. బృంద తాతగారిని అంటి పెట్టుకొని తిరగటం మొదలెట్టాడు.
అతనికి రాజకీయాల మీదున్న శ్రద్ధ గ్రహించి ఆయన సుధీర్ ని తనకి తెలిసిన వాళ్ళకి పరిచయాలు చేసాడు. అతను ఉన్న ఊళ్లో నాయకత్వ లేమి కారణంగా తొందరలోనే అతను పైకి రావటం జరిగింది.
రాజకీయాల్లో అతను పైకి రావటం చూసి బృంద కుటుంబం ఆమెని అతనికి ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డారు. బృంద వద్దని గొడవ చేస్తుందని అనుకున్నాడు సుధీర్. కానీ అలా జరగలేదు. తమ పెళ్లికి ఆమె ఎందుకు వొప్పుకుందో, ఎలా వొప్పుకుందో అతనికి ఇప్పటికీ అర్థం కాని విషయం.
***
తన ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న ఆ సంఘటన ఇన్నాళ్ళకి మళ్లీ గుర్తుకొచ్చేసరికి గుండె బరువెక్కింది. గట్టిగా నిట్టూర్చాడు.
అంతలోనే ఇప్పుడు తనున్న పరిస్థితి గుర్తొచ్చింది. కొన్నాళ్లుగా నిద్రనేది లేదు. కాసేపు పడుకుంటే కానీ తిన్నగా ఆలోచించలేడు.
ఆలోచనలన్నీ కట్టిపెట్టి విశ్రాంతి గా మంచం మీద వాలిపోయాడు.
***
సాయంత్రం ఏడవుతుండగా సుధీర్ కి మెలకువ వచ్చింది.
అప్పుడే ఏడయిందా? ఏదో తప్పు చేసిన భావన. ఏమేమి పనులు ఆలస్యం అయిపోయాయో ఈ నిద్ర వల్ల. ఏవైనా మీటింగ్స్ ఉన్నాయా? ఏదైనా కార్యక్రమంలో మాట్లాడటానికి నోట్స్ చూసుకోవాలా?
ఉలిక్కిపడి లేచాడు. అతనికి కాసేపు ఎక్కడున్నదీ అర్థం కాలేదు. హడావిడిగా లేచేసరికి సన్నగా వొణుకు వస్తోంది అతని శరీరం నుంచి.
మళ్లీ మంచం మీద వాలిపోయాడు. రెండు చేతులూ తలమీద పెట్టుకుని వెల్లకిలా పడుకుని ఆలోచించసాగాడు.
ప్రస్తుత సంఘటనలు అన్నీ రీల్ లాగా కళ్ల ముందు కదులుతున్నాయి.
ఇప్పుడు తను అర్జెంట్ గా ఏ పనీ చేయాల్సిన అవసరం లేదని తల్చుకోగానే అతనికి మనసంతా ప్రశాంతంగా అనిపించింది. ఎవరికీ జవాబు చెప్పక్కర్లేదు. అసిస్టెంట్లు రాసి ఇచ్చే నోట్స్ చదివి ఉపన్యాసాలు దంచాల్సిన అవసరం లేదు.
పదవిలో ఇంత వొత్తిడి ఉంటుందా? తనకే విరక్తి పుట్టి పారిపోయి విశ్రాంతి తీసుకోవాలనిపించేట్లు ఉంటే ఇక వేరే వాళ్లేం తట్టుకుంటారు.
మళ్లీ ఆలోచనలు మారాయి.
తను చేసిన పని మంచిదేనా? ఒకవేళ పదవి నుంచి రాజీనామా చేసి ఉంటే పోయేదా? లేదు...లేదు...అసలది సాధ్యం కాదు. తను పదవి నుంచి తప్పుకున్న మరుక్షణం అంతకు ముందు తన వల్ల కానీ, తన అనుచరుల వల్ల కానీ నష్టపోయిన వాళ్ళు తనని ముప్పతిప్పలు పెడతారు.
పోనీ కొన్నాళ్ళు విశ్రాంతి కోసమని చెప్పి సెలవు పెట్టాలన్నా ఈ పదవిలో ఉండగా జరిగే పని కాదు. తను ఎక్కడున్నా ప్రెస్ వాళ్ళు వేటాడతారు. పైగా తాము పెడుతున్న వొత్తిడి పని చేస్తున్నదని తెలిస్తే ప్రతిపక్షాల వాళ్ళు ఊరుకుంటారా? మరింత వొత్తిడిని పెంచుతారు. రాజకీయాల్లో మన బలహీనతల్ని అవతలి వాళ్ళకి తెలియనిచ్చిన మరుక్షణం మన పతనం ప్రారంభమవుతుంది.
తన నిర్ణయం మంచిదే అనిపించింది. బృంద తెలివైనది. ఏదోలా ముందుకు నడిపిస్తుంది. తనతో మాట్లాడుతున్నట్లయితే ఇక్కడికి వచ్చే ముందే ఆమె సలహా తీసుకునేవాడు. అడిగినా ఆమె సహాయం చేస్తుందనే నమ్మకం లేదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.
ఇంతలోనే ఒక ఆలోచన వచ్చింది...
ఇలా కనపడకుండా పోయినందువల్ల ఆ ఆందోళన లో అయినా బృంద తనతో మాట్లాడుతుందేమో.
తను కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండదల్చుకున్నాననీ, ఆమెనే ఏదోలా మేనేజ్ చేయమనీ బృంద కి మెసేజ్ చేసాడు.
