ప్రొఫెసర్!' సాగర్ బిగ్గరగా అరిచాడు. చంద్రశేఖర్ తొట్రుపాటు పడ్డాడు.
"ఏమైంది , సాగర్!' భుజం పట్టుకొని ఊపుతూ అన్నాడు.
"నా బుర్ర తిరిగిపోతున్నది. నాకేలాగో అనిపిస్తుంది!"
"ప్లీజ్ రిలాక్స్! మిస్టర్ సాగర్ టేకిట్ ఈజీ యూ ఆర్ అల్ రైట్!"
"నేను బాగానే ఉన్నాను. కాని మాధవి ....నా మాధవి ----తలచుకుంటేనే నా గుండె బ్రద్దలవుతుంది ప్రొఫెసర్!"
"మాధవికి అలాంటి ప్రమాదమేమీ లేదు. మాధవిని ఓసారి నా దగ్గరకు తీసుకురా/ లేట్ మీ ఎగ్జామిన్ హర్!"
"రేపు తీసుకు రమ్మంటారా?"
"రేపు కాదు! నువ్వు ఇచ్చిన డేటా అంతా నేను ఎనలైజ్ చేయాలి. కనీసం నాకు ఇరవై నాలుగు గంటలయినా కావాలి. మాధవిని ఎల్లుండి తీసుకురా! ఎల్లుండి సాయంత్రం అయితే నేను ఫ్రీగా ఉంటాను."
"అలాగే ప్రొఫెసర్!' సాగర్ ప్రొఫెసర్ చంద్ర శేఖరం దగ్గర శెలవు తీసుకొని బయలుదేరాడు.
సాగర్ అటు వెళ్ళగానే ప్రొఫెసర్ టేప్ అన్ చేసి వినసాగాడు. విన్న కొద్దీ ప్రొఫెసర్ ఆలోచనలు పరుగులు తీయసాగాయి. అసలు ఈ సాగర్ చెప్పిన దానిలో నిజమెంత? కల్పన ఎంత? ఇతని మానసిక స్థితి ఎలాంటి దశలో ఉన్నది? తనకు తెలుసు మానసిక శ్రాస్త్రం అధ్యయనం చేసే విద్యార్ధులు కొందరు ఏదో రకమయిన మానసిక రుగ్మతకు గురి కావడం - సాగర్ ఆ కోవలోకి వస్తాడా?
టేపు ఆగిపోయింది. ప్రొఫెసర్ తలెత్తి చూసాడు. ప్రొఫెసర్ గారి భార్య టేప్ రికార్డర్ మీద నుంచి చెయ్యి తీసి భర్త కేసి చూసింది.
"ఇహ నా వల్ల కాదు!" రుస రుస లాడింది ఆమె.
"ఏమిటి?" అడిగాడు అతడు.
'అదే?"
"నాతొ కాపరం చేయడమా?" ముసి ముసి నవ్వులు నవ్వాడు ప్రొఫెసర్.
"అవును! నేను కావాలో ఆ వంటవాడు కావాలో ముందు తేల్చుకోండి!"
"వంటవాడితో కాపరం చెయ్యమంటావా!" పకపక నవ్వాడు భర్త.
"వాడూ మీరూ కట్టకట్టుకొని గంగలో దూకండి! నాకెందుకు! నేను వెళ్ళి పోతున్నాను!"
"ఎక్కడికి?"
"ఏట్లోకి!" ప్లవర్ వాజ్ తీసి కిటికిలో నుంచి బయటికి విసిరింది.
"కల్యాణి ఏమిటది?" భర్త గొంతు తీవ్రంగా ఉన్నది.
"అదే మీకు అర్ధమయ్యే బాష! సైక్రాతటి ప్రొఫెసర్ వి! మాములు మాటల్లో చెప్తే మీకు ఆర్షం కాదు , పిచ్చి వేషాలు వేసి చేతికి అందినవి పగలకోడ్తే గాని మీకు అర్ధం గాదు. అప్పుడు గాని మీరు ఆలోచించరు!" కల్యాణి కి ఏడుపు ముంచు కు వస్తున్నది."
"మళ్ళీ ఏమైంది కల్యాణి?" ప్రొఫెసర్ భార్య చేతులు పట్టుకొని ప్రాధేయ పడ్డాడు.
"మళ్ళీ మాములు పాటే!' ఎన్నిసార్లు చెప్పాలి.
"ఏదీ మళ్ళీ వంటవాడి గొడవేనా?"
"దొంగ వెధవ! వాడు కావాలనే చేస్తున్నాడు. కొత్త ప్రెషర్ కుక్కర్ నాశనం చేశాడు. పోయిన వారం వైట్ పెట్టాక ఫేం తగ్గించలేదు. వాల్వు ఎగిరిపోయింది! ఈ రోజు గాస్కెట్ పెట్టకుండా కుక్కర్ పొయ్యి మీద పెట్టాడు. వాడు రాస్కెల్ వాడ్ని పంపించి వేయండి!"
"అలాగే కల్యాణి!" భార్యను అనునయించాడు. "కట్టెల పొయ్యి మీద వంట చేసేవాడ్ని తీసుకొచ్చి గ్యాస్ స్టీవ్ మీద - కుక్కర్ తో వంట చేయమంటే వాడి వల్లే మవుతుంది? నేను ముందే చెప్పానుగా!"
"వాడికి నెలరోజుల్నించి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను! కాని వాడు కావాలనే ఇలా చేస్తున్నాడు. ఒక్క నిముషం వాడు నా యింట్లో వుండటానికి వీల్లేదు." ఖచ్చితంగా చెప్పింది ప్రొఫెసర్ గారి భార్య.
ప్రొఫెసర్ ఆలోచనలో పడ్డాడు.
ప్రెషర్ కుక్కరు- వంటవాడు - వెరీ ఇన్ టరెస్టింగ్ - మాధవీ - ప్రెషర్ కుక్కర్ డాక్టర్ - వంటవాడు- కల్యాణి - ప్రొఫెసర్ బుర్రలో తిరగసాగారు.
9
సాగర్ ప్రొఫెసర్ చంద్ర శేకారాన్ని చూసి ఇంటికి తిరిగి వచ్చేసరికీ, డాక్టర్ మూర్తి, సాంబశివరావు డ్రాయింగ్ రూంలో కూర్చొని కాఫీ తాగుతున్నారు. వాళ్ళను చూసీ, చూడనట్లే ముందుకు పోతున్న సాగర్ ను తండ్రి పిలిచాడు. వున్న చోటే నిలబడి తండ్రి కేసి చూశాడు.
"ఇలా వచ్చి కూర్చో!" సాంబశివరావు మృదువుగా పిలిచాడు. తండ్రి మెత్తగా మాట్లాడాడంటే ఏదో ప్రమాదం ముంచు కొచ్చిందనే అభిప్రాయం కొడుక్కు వున్నది.
తండ్రి మీద నుంచి దృష్టి మళ్ళించి డాక్టర్ కేసి చూశాడు. డాక్టర్ మూర్తి గంభీరంగా ఉన్నాడు. ఏదో తీవ్రమైన చర్చలోనే డాక్టర్ మూర్తి , సాంబశివరావు వున్నట్టు గ్రహించాడు.
"సాగర్ నిన్నే! ఏమిటలా నిలబడ్డావ్/ నీతో మాట్లాడాలి! ఇలా వచ్చి కూర్చో!' సాంబశివరావు గొంతు ఇంకా మృదువుగానే ఉన్నది. సాగర్ కు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. ఈపాటికీ ఇంటి కప్పు లేచిపోవాల్సింది. అయినా తండ్రి ఇంకా మెత్తగా మాట్లాడుతునండు. పోలీసువాడి ఎత్తుగడలు! ఎవడినన్నా ఊబిలో దించాలను కొన్నప్పుడు వేసే ఎత్తుగడ ఇది! పోలీసు వాడి వ్యూహం , ఎత్తుగడలు అన్నీ తనకు తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రిని చూస్తూనే ఉన్నాడు. అవతల వాళ్ళను ఎలా ఉచ్చులలో బిగించాలో ఆయనకు తెలుసు. ఉద్యోగ రిత్యా అలవర్చుకొన్న ప్రవర్తనా, నియమావళి , వ్యూహం , తంత్రాలూ, కుతంత్రాలు అయన నరనరానా జీర్ణించుకొనిపోయాయి. అయిన వాళ్ళూ, కాని వాళ్ళూ , ఇంట్లో - బయటా తన - పరా విచాక్షణేమీ లేదు. సాగర్ కు అలోచించిన కొద్ది తండ్రి మీద అనుమానం , భయమూ పెరగసాగాయి! అంతరాంతరాల్లో తండ్రి పట్ల ఏహ్య భావం మొలకెత్త సాగింది.
