ఆమె మాటలలో తీక్షణత లేదు.
పై ఆఫీసర్ అయినప్పటికీ వాళ్ళు మూర్ఖంగా చేసిన పనులను సున్నితంగా మందలించిందే తప్ప పౌరుషంగా మాట్లాడడం లేదు. అదీ ఇంకొకరయినట్టయితే ఇలాంటి సీన్ క్రియేట్ చేసినందుకు ఎంతో రాద్దాంతం చేసేవారు.
అందుకే స్టాప్ లో పశ్చాత్తాపం తొంగి చూసింది.
"సారీ మేడమ్ .... ఇంకెప్పుడూ ఇలా తొందరపడం!"
"ఇట్స్ అల్ రైట్! ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి. ముందు అతని నిషా దించే ప్రయత్నం చేయండి."
'అలాగే మేడమ్"
"పిచ్చివాడు పసివాడు , తాగుబోతు, నిప్పు తొక్కిన కోతి మనస్తత్వాలలో పెద్ద తేడా వుండదు. అందరినీ ట్రీట్ చేసినట్టుగా వీళ్ళను టాకిల్ చేయలేం. తను ఎక్కడ వున్నాడో , ఏం చేస్తున్నాడో చివరకు తను మాట్లాడుతున్నదేమిటో తెలియని స్థితిలో వుంటాడు పిచ్చివాడు, పసివాడిది అమాయకత్వం ఏం మాట్టాడితే ఏం తప్పో తెలియని తనం, ఇక నిప్పుతోక్కిన కోతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు , తాగుబోతు కూడా అంతే"
అప్పటికే కానిస్టేబుల్ ఒకడు రెండు మజ్జిగ పాకెట్లు తెచ్చాడు.
బలవంతంగా అతని చేత తాగించారు.
పావుగంట తరువాత అతనిని ఇన్ స్పెక్టర్ రూమ్ లో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు.
"మిస్టర్.....నేను ఎవరో నీకు తెలుస్తుందా?" ధీరజ ప్రశ్నించింది.
తెలుసు అన్నట్లు తల వూపాడు అతను.
"నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడ వున్నవో తెలుసా?"
"తెలుసు మేడమ్"
ఈసారి ఆశ్చర్యపోవడం ధీరజ వంతయింది.
తను పోరబడింది. ఎదుటి వ్యక్తికీ అన్ని తెలిసే కావాలని అలా ప్రవర్తించాడన్నా మాట, అదే నిజమయితే ఇతనిని క్షమింఛి వదిలే ప్రసక్తి లేదు.
"నీపేరేమిటి మిస్టర్....."
"రాం ప్రసాద్........"
"లుక్ మిస్టర్ రాం ప్రసాద్.....నీకు పెళ్ళి అయిందనుకుంటాను?"
"అయింది మేడమ్"
"పిల్లలు....."
"లేరు"
"నీ భార్య అందంగానే వుంటుందా?" సంబంధం లేని ప్రశ్న అయినప్పటికి అతని ముఖంలో మారుతున్నా రంగులను గమనిస్తూ ప్రశ్నించింది ధీరజ.
"వూ.....వుంటుంది మేడమ్?" ఆ బ్లడీ బిచ్ వల్లనే నేనిలా తాగుబాతుగా మారాను.
విషయం కొద్దిగా బోధపడిందామెకు.
అలాంటి స్థితిలో అతనిని ఏమి అనకూడదు.
తనంతట తానే చెప్పదలచుకున్నదంతా చెప్పేస్తుంటారు.......ఆ వాక్పప్రవాహానికి అడ్డు పాడడం కంటే మౌనంగా వినడమే అలాంటప్పుడు చేయవలసింది....
"ఎస్, మేడమ్....నన్ను చూసి మీరు ఏ చప్రాసీ వెధవో అనుకుని వుండవచ్చు. బట్ యూనో మేడమ్ ....., ఐ యామ్ ఏ గ్రాడ్యుయేట్ .... రెండు చేతులా సంపాదిస్తున్నాను. అయినా నా అవతారం ఒక బిచ్చగాడి స్థాయికి దిగజారిపోయింది కదూ."
అతని మాటలు వింటున్న ధీరజకు ఏంతో ఆశ్చర్యం వేసింది.
చదువు, సంస్కారాలు వున్నవాడు .....ఉన్నతోద్యోగం, చక్కటి జీతం, అందమయిన భార్య వుండి కూడా ఇలాంటి హీనమయిన స్థితికి ఎందుకు చేరుకున్నాడో ఎలా చేరుకున్నాడో వూహించలేక పోయింది.
"మిస్టర్ ప్రసాద్ .... మీమాటలు నమ్మశక్యం కాకుండా వున్నాయి?"
"నిజమే మేడమ్ ,,, మీరే కాదు , ఎవ్వరూ నమ్మరు కూడా కానీ నాజీవితంలో ఎదురయిన చెదు అనుభవాలే ఈరోజు నేనీ స్థితికి దిగాజారడానికి కారణం...."
'అంటే నీ భార్య...."
"ఎస్.....దానివల్లనే నా వ్యక్తిత్వం చచ్చిపోయింది. సాటి స్నేహితుల ముందు తలవంచుకునేలా తాగుడుకు బానిసై పోయాను. తాగందే ఉండలేని దుస్థికి లొంగిపోయాను."
అతని కంఠంలో చెప్పలేనంత ఆవేదన....
"అసలేమయింది మిస్టర్! మీకు పిల్లలు లేరనే కారణం వల్ల మిమ్మల్ని మీ భార్య చులకనగా చూసిందా? లేక ఏమయినా పోట్లాడుతున్నదా?"
"అదేమీ కాదు మేడమ్ .... చూడగానే ఆమె అందానికి పొంగిపోయి వెంటనే పెళ్ళి చేసుకున్నాను, కానీ పెళ్ళి రోజునే తెలిసింది దానికి ఒక ప్రియుడు వున్నాడని, కాలేజిలో చదువుతున్న రోజుల నుంచీ కలిసిమెలిసి తిరిగారని కులాల పట్టింపు వల్ల అతనిని అల్లుడుగా చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పడం వలన నాకిచ్చి పెళ్ళి చేసారు. ఒక విధంగా తాళి కట్టకుండా కాపురం చేసినవాడు అతను. పరచి వున్న విస్తరిలో అంతకుముందే మరొకరు భోజనం చేశారన్న నిజం తెలిసి నేను అవిస్తారిని ఎలా ముట్టుకోగలను? ఒకవేళ అతనిని గురించి అడిగితే ఏవేవో సంబంధం కధలు చెప్పి లేనిపోని వరాలు కల్పించి అతనితో తనకు యెలాంటి సంబంధం లేదని చెబుతుంది. రంకు నేర్చినది బొంకు నెర్వదా! అందుకే ఆ విషయం నాకు తెలుసున్నట్టు ఆమె దగ్గిర నేను తేలలేదు."
"మిస్టర్ రాం ప్రసాద్! అసలు మీరు ఆ విషయం ఆమె దగ్గర ప్రస్తావించి వుండవలసినది. ఏం చెబుతుందో తేలిపోయేదిగా, ఒక్కోసారి కంటితో చూసినవి , చెవులతో విన్నది అన్నీ నిజాలు అనుకోడానికి వీల్లేదు. నేనేదో స్త్రీ పక్షపాతంతో ఇలా చెబుతున్నాననుకోవద్దు. ఆమె ముఖం మీదే అతనిని గురించి ప్రశ్నించి వుంటే, అదీ నిజమయితే ఆమెలో తత్తరపాటు స్పష్టంగా కనిపిస్తుంది. అది నిజం కాకపోతే ఇంత కాలం నుంచి అర్ధం లేని అనుమానాలతో పండంటి మీ జీవితాన్ని మీరే చేజేతులా జారవిడుచు కున్నట్లు అవుతుంది. మీరు చేసింది తప్పు అనిపిస్తుంది నాకు" నిర్మొహమాటంగా తన మనసులోని మాటను చెప్పింది ధీరజ.
"ఏమో కావచ్చేమో కానీ, ఇప్పుడు మాత్రం దానికి అతనితో సంబంధం వుందని రూడిగా చెప్పగలను. నా దగ్గర కావలసినన్ని సాక్ష్యాలు వున్నాయి. నేను లేనప్పుడు అతను ఎన్నో సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు. నిజంగానే అతనితో ఎలాంటి అక్రమ సంబంధం లేనప్పుడు అతనిని గురించి నాతొ చెప్పవచ్చుగా. అక్కడకూ కావాలనే ఎవరయినా వచ్చారా అని కూడా ప్రశ్నించేవాడిని. మన ఇంటికి ఎవరు వస్తారు? ఎవరూ రాలేదంటూ అబద్దం చెప్పేది. అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి మేడమ్?"
"నిజమే అప్పుడయినా చెప్పి వుండవలసింది. మరి చెప్పలేదూ అంటే ఏదో కారణం వుండి తీరాలి. అసలే తన భర్త తనను అనుమానిస్తున్నాడు కాబట్టి, అలాంటి స్థితిలో తన కాలేజీ మేట్ ఇంటికి వచ్చాడని తెలిస్తే తన కాపురం మరింత నరక ప్రాయం అవుతుందని భావించి చెప్పి ఉండక పోవచ్చు.
లాజికల్ గా ఆలోచిస్తే అలా జరగడానికి అవకాశం వుంది.
ధీరజ అలా ఆలోచనలో వుండగానే రాంప్రసాద్ చెప్పుకు పోతున్నాడు.
"మేడమ్! భార్యపై పేరుకుపోయిన కసిని ఎలా చూపాలో నాకు అర్ధం కాక రాక్షసునిలా ప్రవర్తించేవాడిని. నేను చేసేది తప్పేనని తెలుసు కానీ ఆమెను చూడడంతోనే అందమయిన ఆ శరీరాన్ని మరొకడు నాకన్నా ముందే సొంతం చేసుకున్నాడన్న ఉక్రోషం తో నేనేం చేస్తానో నాకే తెలియకుండా పోతుంది. నా వల్ల ఆమెకు సెక్స్ సుఖం ఆనందంగా లేకపోవచ్చు దానికి నన్ను అసహ్యించుకోవచ్చు. కానీ, నా ఈ ప్రవర్తనకు కారణం తను కాలు జారడమేనని తెలుసు కాబట్టే తను మూగగా పడి వుంటుంది లేకపోతే ఎప్పుడో ఎదురు తిరిగి వుండేది."
అలా ఎందుకనుకోవాలి?
భర్తే దైవమని, తాళి కట్టిన తరువాత పుట్టింటి గడప దాటినది మొదలు కట్టెగా మారేటంతవరకూ భర్త నీడనే ఆడది తలదాచుకోవాలనే ఆర్య సాంప్రదాయం ఏర్పరచిన సంస్కృతీ జీర్ణం చేసుకున్న సగటు భారత స్త్రీ కాబట్టి భర్తను భరిస్తుంది.
ఏం చేస్తున్నా పెదవి విప్పదు. ఏమంటున్నా ఎదురు చెప్పలేదు. ఆ కట్టుబాట్లు వెలుగు నీడలే తన సంసారంగా భావించి మూగ వేదన ననుభవీస్తుంది తప్ప, తను పెట్టె బాధలను ఊరుకుంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఏదో తప్పు చేసివుంటుంది అనే అభిప్రాయానికి రావడం చాలా తప్పు!
తన మనసులో అయితే ఇలా అనుకోగాలిగింది తప్ప రాంప్రసాద్ కు చెప్పినా తన మాటలను కొట్టి పారేస్తాడు అని తెలుసు కాబట్టి అతను చెప్పే మాటలను వినడమే తప్ప , అతనికి నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేయలేదు ధీరజ.
"ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది మేడమ్ ! విడాకులు ఇచ్చేస్తే పోలా అని! కానీ నాలోని పురుష అహంకారం అందుకు ఒప్పుకోవడం లేదు. తప్పంతా ఆమెదే అయినప్పుడు నేనెందుకు ఆ ప్రపోజల్ తీసుకురావాలి? కనీసం ఇంత జరిగిన తరువాతనయినా ఉన్నది ఉన్నట్లు చెప్పి కాళ్ళ పై బడి క్షమాపణ కోరుతుందేమోనని ఎదురుచూసినా ఆ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. చివరకు రానురాను నా ప్రవర్తనపై నాకే అసహ్యం వేస్తుంది. అయినా పడకగదిలో నా భార్యను నగ్నంగా చూసేసరికి నాలోని రాక్షసుడు విజ్రుంభిస్తాడు. నాకన్నా ముందే నా భార్యను మరొకడు అనుభవించాడనే చేదు నిజం నన్ను దుర్మర్గునిలా జేస్తున్నది."
