శ్రీ వేంకటాచల పురవర్ణనము రసవత్తరంగా సాగిపోతోంది. ఇంతలో వెంగమాంబ ఓ సందేహం! ఈ కావ్యాన్ని ఎవరికి అంకితమివ్వాలి? ఎవరికి?
"స్వామికే!" నంటూ ఆమె అంతరాత్మ చెబుతోంది.
"అతనిపై రమ్య పద కావ్యం బొనర్చి"
శ్రీనివాసునికే సమర్పింపనుంటి - వెంగమాంబ కళ్ళు చెమర్చుతున్నాయి.
"తనెంత? తన పాండిత్యమెంత!"
నా చిన్ననాట నోనామాలునైన నా
చార్యుల చెంతనే జదువలేదు.
ఏ రస ఛందస్సులో బది పద్యములనైన
నిక్కంబుగా నేను నేరలేదు.
లలిత కావ్య నాటకాలంకార శాస్త్రము
వీనులనైనను వినగా లేదు.
పూర్వాతిహాస విస్ఫురితాంధ్ర సత్కృతు
ల్సాధించి వరుసగ జూడలేదు.
వెంగమాంబ ఆగింది. "అయితేనేం? తరిగొండ నారసింహుడు ఆనతిచ్చినట్లుగా ఈ కావ్యాన్ని రచిస్తాను. సంస్కృతంలో కాక్ ఆంధ్ర భాషలో రచన చేస్తాను. ఈ కావ్యాన్ని శ్రీనివాసునికే అంకితమిస్తాను" అని అనుకుంటున్నప్పుడు వెంగమాంబ శరీరం పులకితమైంది. కళ్ళనుండి ఎగతెగకుండా ఆనందభాష్పాలు కురిసాయి.
శ్రీ వేంకటాచలపుర వర్ణన పూర్తయింది. వెంగమాంబ చిరుచాపపై నుంచి లేచింది. ఈ కావ్యానికి పేరు పెట్టాలి!
"వేంకటాచలపతి జీవితం" అంటే......?
కాదు. కాదు "శ్రీదేవి భూదేవుల చరిత్ర" అంటే....?
కాదు ..... కాదు
శ్రీ వేంకటాచల మహాత్మ్యం
శ్రీ వేంకటాచల మహాత్మ్యం
తనెదుట దేవుడున్నట్లే వెంగమాంబ నమస్కరించింది.
వేంకటగిరి నాయకునకు
పంకజ భవ జనకునకును బరమాత్మునకున్
శంకర నారా మిత్రునకు, కలంక విరహితునకు మోక్షలక్ష్మీపతికిన్
వెంగమాంబ తన కావ్యాన్ని ఆ వేంకటేశులని అంకిత మిచ్చేసింది. ఆమె చటుక్కున లేచింది. "అయ్యో! స్వామి హారతికి ఆలస్యమై పోతోంది" అనుకుంటూ గుడికి హారతిని పట్టుకెళ్ళింది వెంగమాంబ. గుడిలో కూర్చున్న వెంగమాంబ మనసు దేవునిపైనే ఉంది. ఒక్క ఉదుటున లేచి ఇంటి కొచ్చింది. మనసు పరుగులు తీస్తోంది. ఆమె కళ్ళముందు మహా నైమిశారణ్యం ప్రత్యక్షమైంది. ఆ నైమిశారణ్య వర్ణన చేస్తూ తన్మయత్వంతో మునిగి పోయిందామె. ఆమె కలం ఆగడం లేదు. రాత్రి అయిపోయింది. వెంకమ్మ కూర్చున్న చోటు నుంచి కదలలేదు.
వెంగమాంబ తన రచనలో నిమగ్నమైంది.
రాత్రి పనులు ముగించుకున్నాక, ఇంటి వెనుక కూర్చుని, తాళములు చేతబట్టి వేంకటేశునిపై మనోహరమైన కీర్తనలు పాడుతోంది. ఆ పాటలు, స్తోత్రాలను వినేందుకు జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. తను రచిస్తోన్న వేంకటాచల మహాత్మ్యాన్ని వినిపిస్తోందామె. భక్తి పరవశులైన జనం తన్మ నయత్వంలో తలలూపుతున్నారు. ఆ కీర్తనలను స్వామి కూడ వచ్చి వింటున్నాడా? అన్న అనుమానం కలుగుతుండేది. ఓసారి స్వామి కీర్తనలను పాడుతున్న వెంగమాంబ నిశ్చల సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో భక్తులు గోవిందనామాలను స్మరిస్తూ కూర్చునేవారు. మరలా కళ్ళు తెరచిన వెంగమాంబ కీర్తనలను ఆలపించేది.
గడిచిన దినాలకన్నా, ఆరోజు వెంగమాంబ చాలా ఉత్సాహంగా కనిపించింది. "అమ్మా! మీరు ఈరోజు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మళ్ళీ ఏమైనా గొప్ప కీర్తనలు రాసారా తల్లీ?!" అని అడిగింది ఓ భక్తురాలు.పాటలా?! ఈ రోజు నా స్వామిని విందుకు పిలుస్తున్నా" అందామె కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జాలువారు తుండగా. "వంటఅయింది. పిండివంట లయ్యాయి ఆస్వామి రావద్దూ?!" అంటూ వెంగమాంబ చిరుచాపపై కూర్చుంది. వెంగమాంబ గొంతు సవరించుకుంది. ఆమె చెవులకు పాదాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఆమె కళ్ళకి శ్రీ వేంకటేశ్వరస్వామి తన పక్కనే వచ్చి కూర్చున్నాడనిపిస్తోంది.
ఓ శ్రావ్యమైన కీర్తనను పాడుతూ లేచిన వెంగమాంబ, ఆనంద పారవశ్యంలో నృత్యం చేయసాగింది. ఆమె పక్కనున్న భక్తులంతా ఆమెతో పాటే నృత్యం చేస్తున్నారు. వారి మధ్య ఎవరివో.... పాదాల గజ్జెల చప్పుళ్ళు.... ఆ క్షణంలో ఆ ప్రాంతమంతా దివ్య సుగంధ పరిమళం వ్యాపించింది.
వెంగమాంబ అలసిపోయింది. భక్తులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అలసిపోయిన వెంగమాంబ శరీరాన్ని నిమురుతోంది ఓ అమృతహస్తం. అభయహస్తం! తెల్లారేవరకూ వెంగమాంబ "గోవిందా"...... బ్రహ్మానందా" అంటూ నృత్యం చేస్తూనే ఉంది.
"దేవాలయం తలుపులు మూసాక, స్వామి వెంగమాంబ ఇంటికొస్తున్నాడటగా?!" అంటూ జనం గుసగుసలుగా చెప్పుకోవడం ప్రారంభించారు. భక్తులు తండోప తండాలుగా వెంగమాంబ ఇంటికొస్తున్నారు. కానీ, ఇవేమీ పట్టని వెంగమాంబ, నిత్యం తులసివనాన్ని ఊడ్చి, ముగ్గులు పెడుతూ, దేవుని పూజకోసం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటూ, తనలో తానే పాటలు పాడుకుంటూ, నవ్వుతూ కనిపిస్తుంటే, ఆమెను పలుకరించే ధైర్యం ఎవరికీ రావడం లేదు.
దేవస్థాన అర్చకులు సన్నిధి ద్వారబంధాలను లక్ష్మీవల్లభుడు అచ్చట నిలిచి యథావిధిగా భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. వెంగమాంబ ఆనందానికి అవధులు లేవు. వెంగమాంబ తన వేంకటాచల మహాత్మ్య రచనకు ఉపక్రమించింది. కావ్యం పెరిగిపోతోంది. షష్ఠాశ్వాసము దాకా వచ్చేసింది. ఆమె తను రాసిన గ్రంథాన్ని మరొకసారి పునఃపరిశీలించింది. ఎన్నెన్ని విశేషాలు?! ఇవన్నీ తను రాసిందా? స్వామి రాయించాడు. స్వామే రాసాడా? అందరూ వేంకటాద్రికి వచ్చారు. బ్రహ్మకు శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దశరథ మహారాజు శ్రీస్వామిని స్తుతించాడు. వైష్ణవ ధర్మాన్ని, అష్టాంగ యోగాన్ని, మంత్రాలయ యోగాన్నీ వివరించడం - నైమిశారణ్యం నుంచి మునులు వేంకటాద్రికి వచ్చారు. వెంగమాంబ ఆ కావ్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ తన్మయత్వం చెందింది. ఈ వ్రేళ్ళేనా ఈ మహాకావ్యాన్ని రాసింది? ఈ మనసేనా ఇన్ని చిత్రాలు చూసింది? ఆహా! నా స్వామి నాచేత ఎంత గొప్ప పని చేయించాడో కదా!
ఇదంతా నేను రాయగలిగానా? నన్ను భక్తురాలిగానే కాక ఓ కవయిత్రిగా మార్చివేసావా స్వామీ! వెంగమాంబ షష్ఠాశ్వాసమును ముగించింది.
"ఇది శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహ కరుణా కటాక్ష కవిత విచిత్ర వసిష్ఠ గోత్ర పవిత్ర కృష్ణ యామత్య తనూభవ వెంకమాంబా ప్రణీతంబైన...." వెంగమాంబ అలా రాస్తూ ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది.
తన కృష్ణయామాత్య తనూభవ-
ఆమెకు కన్నీళ్ళు ఆగలేదు. తన బాల్యం, తరిగొండ దేవాలయం, తన వివాహం- తన తల్లి మంగమాంబ, తనపై వచ్చిన నిందలు ఒకటొకటిగా కళ్ళముందు చక్రాల్లా కదులుతుంటే, మహాభక్తురాలైన వెంగమాంబ భగవంతుని జపిస్తూ కూర్చుంది. ఇహలోక బంధాలు వదులుకోలేనా స్వామి? నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? నన్ను ఆడుకునే నాథులే లేరా? నా నాథుడు నువ్వు కాదా?
"శ్రీ వేంకటాచల మహాత్మ్యం" గ్రంథాన్ని స్వామి పాదాల ముందు ఉంచిందామె. తను మరెన్నో రచనలు చేయాలని స్వామి చెబుతున్నాడు. తన ముందు తరాల వారికి అందించాలట. వెంగమాంబ పెదాలపై చిరునవ్వు కదలాడింది.
కాలం గడుస్తోంది. వెంగమాంబలో భక్తిభావం నానాటికీ వృద్ధి చెందుతోంది. నవవిధ భక్తి మార్గాలు వెంకమ్మలోనే అంతర్గతమయ్యాయి. స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, కీర్తనం.... ఇలా అన్నివిధాలైన భక్తులతో తద్దాత్మ్యం చెందుతోంది మహాభక్తురాలు వెంగమాంబ.
శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తురాలి భక్తిప్రపత్తులకు ప్రసన్నమైనప్పటికీ, ఆమె భక్తిని పరీక్షించాలన్న కోరిక కలిగింది. రాత్రయ్యింది.
అక్కడి గుడి తలుపులు మూయబడిన వెంటనే స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంగమాంబకి అభిముఖంగా నిలుచున్నస్వామి, ఆమె చేస్తున్న స్తోత్రాన్ని వింటూ, ఆనందంతో అర్ధనిమీలిత నేత్రుడై, ఆ భక్తురాలీని నఖశిఖ పర్యంతం గమనిస్తున్నాడు. వెంగమాంబ పరవశంతో ఆడుతోంది. స్వామి నృత్యం చేస్తున్నాడు. స్వామి ధరించిన పుష్పమాలలు ఊగుతున్నాయి. ఆయన మెడలోని నవరత్న హారాల కాంతులు ధగద్ధాయమానకాంతులను నలుదిక్కులా ప్రసరిస్తున్నాయి. ఆ స్వామి ఆడుతున్న ప్రదేశం నీలవర్ణ ఛాయతో నిగనిగలాడుతోంది. ఆ ప్రదేశం వైకుంఠమా అన్న భ్రాంతి కలుగుతోంది.
వెంగమాంబ నిశ్చలంగా నిలబడి స్వామిని తదేకంగా తిలకించింది "నా మనవి ఆలకించవా స్వామి" అంది. స్వామికి సాష్టాంగదండ ప్రణామములర్పించి, తన మనసులోని మాటను చెప్పేయాలనుకుంది వెంగమాంబ, ఇంకెవరికి చెబుతుంది ఆ దేవుడికి కాక?
