"మరి భార్యపిల్లలు."
"వున్నారు భార్య, కొడుకు వున్నారు. ఆ కొడుకు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి తల్లినీ తండ్రినీ పిలిపించుకున్నాడు. వెళ్ళినవాడు తిన్నగా వుండచ్చుకదా ఈ అమెరికా వాళ్ళంతా బుర్రలేని వెధవలు. వీళ్ళకేం తెలీదు నన్నోసారి ఎవరైనా సైంటిస్టు దగ్గరకు తీసికెళ్ళు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాలి" అంటూ గొడవ మొదలు పెట్టాడు.
ఆ కొడుక్కి చిరాకు వేసింది. "ఎందుకొచ్చిన తాపత్రయం మీకు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతాడు మీరు సుఖంగా ఏ భగవద్గీతో ఉపనిషత్తులో చదువుకుంటూ కూర్చోరాదా!" అని విసుక్కున్నాడుట. దాంతో ఆయనకి కోపం వచ్చి నీ దగ్గర వుండను అని తిరుగు ప్రయాణం కట్టాడుట. ఈయన భార్య మాత్రం రానందిట పాపం ఆవిడ ప్రాణం విసిగిపోయింది. వంటరిగానే వచ్చేశాడు. కొడుకు డబ్బు పంపిస్తాడు స్వంత ఇల్లుంది ఆయన దారిన ఆయమంటాడు ఎవరింటికీ రాడు ఎవర్నీ దగ్గిరికి రానివ్వడు. ఏమిటో జిహ్వకోరుచి వుర్రెకోబుద్ది" అంటూ ప్రొఫెసర్ గారి గురించి చెప్పేసి వెళ్ళిపోయాడాయన.
మోహన్ కూడా బయలుదేరాడు ప్రొఫెసర్ గార్న తల్చుకుంటూ వుంటే చచ్చేంత నవ్వు వచ్చింది అతనికి ఆపుకోవాలని ప్రయత్నించాడు గానీ సాధ్యంకాలేదు.
రోడ్డుమీద నడుస్తున్న వాళ్ళు ఒక్కడే నవ్వుకుంటూ వెళ్ళడం విచిత్రంగా చూశారు నవ్వుకున్నారు.
* * *
మర్నాడు ఉదయం యధాప్రకారం తయారై ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. బస్టాప్ కి వెళ్ళాడు జనం ఎక్కువగానే వున్నారు బస్ కోసం వెయిట్ చేస్తుండగా మల్లెపూల పరిమళం, దగ్గరగా ఎవరో వచ్చిన అలికిడి. పక్కకు తిరిగిపోయి మరీ చూశాడు. ఇంకెవరోకాదు. తన హృదయరాణి దీపిక.
"బస్ ఇంకా రాలేదా?" అడిగింది.
రాలేదు సమాధానం చెప్పాడు. జేబు తడుముకుని నిట్టూర్చాడు చిరాకేసిందతనికి అంతలోనే బస్ వచ్చేసింది గబగబా ఎక్కేశారు. దీపికకి రెండుసీట్ల వెనక సీట్లో కూర్చున్నాడు మోహన్. ఇద్దరికీ కలిపి తానేటికెట్లు తీసుకుందా మనుకున్నాడు. కానీ ముందుగా దీపికకి టికెట్ ఇచ్చాకే అతని దగ్గరకు వచ్చాడు కండక్టర్ లోలోపల తిట్టుకుంటూనే టికెట్ తీసుకున్నాడు.
బస్ గమ్యం చేరగానే, యిద్దరూ దిగారు. దీపికే మళ్ళీ పలకరించింది "మీరు ప్రొఫెసర్ గారి ఇంటికేనా?" అడిగింది.
"అవును" సమాధానం చెప్పాడు మోహన్.
"నేనూ అక్కడికే పదండి" అంది ఇద్దరూ నడక మొదలు పెట్టారు.
"ప్రొఫెసర్ గారు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు" హఠత్తుగా చెప్పింది దీపిక.
"ఏం చెప్పారు?"
"మీరు చాలా మంచి వారనీ, మర్యాదస్థూలనీ మీలాటివారు చాలా అరుదుగా వుంటారని చెప్పారు ఏమో అనుకున్నాను. ఆయన చెప్పింది అక్షరాలా నిజమే"
"ఎలా?"
"ఇవాళ చూశానుగా! మనిద్దరం బస్టాప్ లో నిలబడ్డాం మీలాటి మగవాళ్ళు అలా పక్కన ఆడపిల్ల వుంటే ఓర చూపులూ కోరచూపూలూ చూసి వెకిలిగా నవ్వుతారు. కానీ మీరు అలాటి పన్లు చెయ్యలేదు. అసలు తల తిప్పి చూడనే లేదు!" అంది.
"ఎలా చూస్తాను? మావయ్య తెల్లారుజామున సర్వంగాసనం వేయించాడు. మెడ పట్టేసింది తిన్నగా చూడ్డం తప్ప పక్క చూపులు చూళ్ళేను" అనుకున్నాడు మోహన్.
"మరొకరైతే కాఫీ తాగుదాం రండి అని హొటల్ లాక్కేళ్ళేవాళ్ళే. కానీ మీరలా చెయ్యలేదు. మర్యాదగా వూరుకున్నారు."
"శభాష్, ఇంటినించి వస్తుంటే భారతి సగందారిలో ఎదురై కొత్తనవల రిలీజైంది. ఎప్పుడూ వుండే అతను లేడు షాపులో వున్న అతనికి నేనెవరో తెలీదు. డిపాజిట్ కట్టాలి. అనేసి పర్సులో డబ్బంతా లాక్కుపోయింది. ఓ రెండ్రూ రూపాయలు మాత్రం బస్ కోసం యిచ్చింది. జేబులో డబ్బులే లేవు కాబట్టి కాఫీ తాగుదాం అన్లేదు నేను" అనుకున్నాడు.
"తరువాత బస్ లో కూడా నా టికెట్ మీరే కొనేసి నన్ను యిబ్బంది పెట్టెయ్యలేడు యింకెవరైనా అయితే నేనిస్తా నేనిస్తా అని వెంటపడేవాళ్ళే" అంది.
'దిస్ క్రెడిట్ గోస్ టూ కండక్టర్ " సిన్సియర్ గా అంగీకరించాడు.
"మీకు ప్రొఫెసర్ గారంటే గౌరవమా?" హఠాత్తుగా అడిగాడు.
"ఆ మహానుభావుడిని చూస్తె యెవరికి గౌరవం కళ కదూ? ఏం మీకు లేదా?" ఎదురు ప్రశ్నవేసింది.
ఏం చెప్పాలో తోచలేదు మోహన్ కి. "ఆయన పరిశోధన గురించి తెలుసా మీకు?" అడిగాడు.
"తెలుసు" అంది దీపిక గర్వంగా.
"తమాషాగా లేదూ"
తారాజువ్వలా లేచింది దీపిక. "తమాషా ఏముంది ఇందు?లో"
స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన కొత్తల్లో ఈ ఇనుపబండి గుర్రం కంటే స్పీడుగా పరిగెట్టగలదా అని పడి పడి నవ్వార్ట జనం.
ఎలక్ట్రికల్ బల్బ్ కనిపెట్టిన కొత్తల్లో యింత పరిశోధన చేసి ఆ దీపం కనిపెట్టకపోతే ఏం? యిప్పుడున్న చమురు దీపం చాలదా? అని హేళన చేసిందట ఓ మునలమ్మ.
కొత్త విషయం కనిపెట్టిన వాళ్ళని యెగతాళి చెయ్యడం మనకేం కొత్తగాదు. అనాదిగా వున్న సంప్రదాయమే.
ఇక మన తెలుగు వాళ్ళ విషయం చెప్పనే అక్కర్లేదు. మనవాళ్లు యెంత గొపవాళ్త్ళెనా మనకంటికి పనికి రాని వాళ్ళు గానే కనిపిస్తారు. అసలు ఈ ఇండియాలో అందులోనూ అంధ్రుడుగా పుట్టడం ఆయన బేడ్ లక్. ఇటు వంటి సైంటిస్టు యింకే దేశంలోనైనా వుంటే ఈ పాటికి ఆయనకి బ్రహ్మరథం పట్టేవారు. మన వాళ్ళు ఆయన ప్రతి భను గుర్తించలేక ఎగతాళి చేసి ఆటలు పట్టిస్తున్నారు. అలాంటివాళ్ళును చూస్తే లాగి లెంపకాయ వెయ్యాలనిపిస్తుంది నాకు" అంది ఆవేశంగా.
తలొంచుకుని ఆలోచనలో పడ్డాడు మోహన్. అసలు యింటినుంచి బయలుదేరేటప్పుడు అతని ఉద్దేశం వేరు. ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళి 'చూడండి సుబ్బారావు గారు! భూమి గుండ్రంగానే వుంది. మీరు 30 ఏళ్ళనుంచి పరిశోధించి మరో30 ఏళ్ళు పరిశోధన సాగించినా అది బల్ల పరువుగా మారదు. ఊరికే హైరానా పడకండి' అని దెబ్బలాడదామనుకున్నాడు.
కానీ దారిలో దీపిక కనబడింది కాకతాళీయంగా! దీపికంటే ఎవరు? తొలిచూపులోనే తన మనసు దొచుకుని తనని ఫకీరుని చేసేసిన సుందరాంగి. అసలా దీపకోసమే తను ప్రొఫెసర్ గారితో పరిచయం చేసుకుంది. దీపకు ప్రొఫెసర్ గారిపట్ల బోలెడంత గౌరవం వుందనే విషయం నిర్వివాదాంశం. ప్రొఫెసర్ గారికి తనంటే మంచి అభిప్రాయం ఉంది. అంతే కాదు తద్వారా దీప కూడా తను మంచివాడిననే నమ్ముతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ గారితో దెబ్బలాట వేసుకుంటే ఏ మాత్రం లాభంలేదు సరికదా బోలెడంత నష్టం కాబట్టి దీక్షతో తందానా అవటమే సేఫ్.
పోతే పృధ్విగారు ఎవరిపిచ్చి వాళ్ళకి ఆనందం. ఆయనైనా దేశద్రోహికాడు. ఆయన పరిశోధనవల్ల దేశానికి, ప్రజలకువచ్చే నష్టం ఏమీలేదు. కాకపోతే భూమి గుండ్రముగా లేదు అంటున్నాడు బల్లపరువుగా వుందంటున్నాడు. పోనీ అననిస్తేసరి బల్లపరుపుకాదు బోర్నవిటా డబ్బా షేపులో వుందన్నా, కాదు కాఫీ కాచుకునే కాడగిన్నెలా వుందనా తనకొచ్చిన నష్టం ఏమీలేదు.
