Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 18


    "అమ్మా......! మళ్ళీ వస్తారా? ఎక్కడ దిగారు?" అడిగింది రాగిణి.
    "ఉడ్ ల్యాండ్స్ లో" అంది సరోజిని.
    "రేపు కలుస్తాను అమ్మా! అందరూ భోజనానికి ఇక్కడికే రండి!...... బై..... బై......" అంది తడబడుతూ రాగిణి.
    ఇన్నాళ్ళు రాగిణిని చూడలేదన్న బెంగ ఒక్కటే వాళ్ళని వేధించేది. కానీ ఇప్పుడు, ఎందుకు చూశామా అన్న బాధ నరాల్ని పిండేస్తుంది. "ఇంత బరితెగించిందని అనుకోలేదు" అంది సరోజిని ఏం చెప్పాలో తెలీక!
    ఎవ్వరూ మాట్లాడలేదు! "చివరికి తాగుడు కూడా అలవాటు చేసుకుందన్న మాట!"
    ఎవరూ సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆడమనసు...... అందులోనూ తల్లి మనస్సు విలవిలలాడిపోతోంది? అందుకే తనలో తనే అనుకుంటున్నట్లు, అన్ని మాటలు పైకే అనేస్తోంది!
    కలతపడిన మనసుతో బాధపడుతూ, ఆలోచనలతో సతమతమవుతూ, ఏ అర్థరాత్రికో నిద్రపోయారు. ఎవరికివారే బాధపడుతూ.
    మర్నాడు పది గంటలకల్లా, వీసా కోసం బయలుదేరి వెళ్ళిపోయారు. అంతవరకు రాగిణి రాలేదు. నిజానికి ఆమె కోసం ఎవ్వరూ ఎదురు చూడలేదు కూడా.
    ఆ మధ్యాహ్నానికి వీసా వచ్చేసింది. ఇంక అక్కడ వుండడం అనవసరమనిపించి, ఆ సాయంత్రం ఫ్లయిట్ కే బయలుదేరారు. మధ్యాహ్నం రాగిణి హోటల్ కి వచ్చి వెళ్ళినట్టు చీటీ రాసిపెట్టి వుంది. ఆమెతో ఫోన్ లో కూడా మాట్లాడాలనిపించలేదు సరోజినికి! గప్ చిప్ గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు.
    కోటయ్యా! ఇంత తొందరగా పన్లయిపోతాయని అనుకోలేదయ్యా!" అన్నారు రామానుజంగారు.
    "కరెక్టే! నేనూ అనుకోలేదు. అంతా టకటకా జరిగిపోయింది. లేకపోతే ఒకొక్కసారి వీసా రావడానికి నెలలు, సంవత్సరాలు దాటుతాయి" అన్నారు కోటయ్యగారు.
    రాగిణిని కళ్లారా చూశాక సరోజిని మనస్సు విరిగినట్టయింది. దాంతో ఆలోచనలన్నీ శిల్ప పైకిపోయాయి. స్కూలుకి ఫోన్ చేసి శిల్పతో మాట్లాడారు సరోజినీ, రామానుజంగారు! సిస్టర్ ఫెర్నాండస్ తో కూడా మాట్లాడారు.
    "కోటయ్యా! మా శిల్పని కూడా మీ అవినాష్ తో పాటు చూసుకో! పిచ్చి తల్లి! దాన్ని తలుచుకుంటే గుండె కోస్తున్నట్టనిపిస్తుంది. "గ్రాండ్ పా...... గ్రాండ్ మా...... విష్ యూ హాపీ జర్నీ......" అంటోంది. "పిన్నినీ, చిన్నాన్ననీ, దీనూనీ, నాకు ఊటీకి ఉత్తరం రాయమని చెప్పండి!" అంటూ ఎంత పెద్ద ఆరిందాలా మాట్లాడుతోందనుకున్నావ్?" గర్వంగా చెబుతున్నారు రామానుజంగారు.
    "దానికి ఎంత బుద్ధీ..... ఎంత శ్రద్ధా...... గ్రాండ్ మా..... నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతోంది!" మురిసిపోతూ చెప్పింది సరోజిని.
    ఇల్లు మొత్తం అద్దెకిచ్చేశారు. అద్దె వసూలు చేసి శిల్ప పేరు మీద బ్యాంకులో వెయ్యమన్నారు కోటయ్యగారిని రామానుజంగారు.
    కొన్ని కొన్ని పాత సామాన్లూ, బట్టలూ, వస్తువులూ, ఇన్నాళ్ళు సరోజినికి సేవ చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వీరమ్మకిచ్చేసింది సరోజిని.
    భరణికోసం కొన్ని పట్టుచీరలూ, దీనూకి, కాశ్యప్ కీ కొన్ని బట్టలూ, మిఠాయిలూ కొని, కోటయ్యగారి కుటుంబానికి ధన్యవాదాలర్పించి సెలవుతీసుకున్నారు సరోజిని, రామానుజంగారు. కోటయ్యగారి కుటుంబం మొత్తం ఏర్ పోర్ట్ కి వచ్చింది. కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పారు. ఫ్లయిట్ వెళ్ళిపోయింది. ఉన్న ఊరును విడిచివెళ్ళిపోతుంటే ఏదో బాధ! బొంబాయి చేరుకుని, ఏర్ ఇండియా ఫ్లయిట్ ఎక్కేంత వరకూ ట్రావెల్ ఏజంటుని వెంట తీసికెళ్లారు రామానుజంగారు. బొంబాయి దాటాక కొత్త ఊహల్లో మునిగిపోయారు సరోజిని, రామానుజంగారు.
                              *      *      *      *
    అమెరికా నుంచి కోటయ్యగారికి ఉత్తరాలొస్తూనే వున్నాయి. భరణీ, కాశ్యప్ ల ప్రేమాభిమానాలతో, దీనూ ఆట పాటలతో టైము ఎలా గడిచిపోతోందో తెలియడం లేదు. శిల్ప గురించే బెంగగా వుందంటూ ఉత్తరాలు రాశారు రామానుజంగారు.
    రాగిణి శిల్పకి రెండు మూడు ఉత్తరాలు రాసింది, సరోజిని. రామానుజంగారు వెళ్ళిపోయాక. శిల్ప సమాధానం రాయలేదు. రాగిణి అమెరికాకి కూడా ఉత్తరాలు రాసింది. భరణి పేరుమీదా, సరోజిని పేరుమీదా. సమాధానం ఎవ్వరి దగ్గరనుంచీ రాలేదు.
    కాలం గడిచిపోతోంది. ఈసారి సెలవులిస్తారనగానే కోటయ్యగారు అవినాష్ కి ఉత్తరం రాశారు. తనతోపాటు శిల్పనీ తీసుకురమ్మని! శిల్పా, అవినాష్ లూ ఫస్టు క్లాసులో పాసయ్యారు. శిల్ప మూడో తరగతి కొచ్చింది. అవినాష్ ఆరో తరగతికెళ్ళాడు.
    "కోటయ్య తాతగారూ! గ్రాండ్ పా, గ్రాండ్ మా లేరుకదా. నేనెవరి దగ్గరుండాలి?" ఏర్ పోర్ట్ లోనే? అడిగింది శిల్ప, కోటయ్యగారిని.
    "ఈ గ్రాండ్ పా దగ్గరుంటావు" అన్నారు తనవైపు చూపించుకుంటూ కోటయ్యగారు.
    "అంటే తాతయ్యా! శిల్ప మనింట్లో వుంటుందా?" అడిగాడు అవినాష్.
    "అవును"
    అవినాష్ మొహంలో సంతోషం విప్పారింది.
    స్కూల్లో కూడా, అవినాష్, శిల్పా ఎంతో సఖ్యంగా వుంటారు. హోం వర్కు గురించీ, పాఠాల గురించీ ఒకరితో ఒకరు చర్చించుకుంటూ వుంటారు.
    శిల్పా, అవినాష్ లూ పాడుకుంటూ  నవ్వుతూ గడిపేస్తున్నారు.
    కోటయ్యగారి పెద్దకొడుకు చంద్రశేఖర్ ఒక ప్రముఖ సిమెంటు కంపెనీలో సేల్సాఫీసరుగా పనిచేస్తున్నారు. అతనికి అవినాష్, చంద్రిక ఇద్దరే పిల్లలు. మంచి చదువు కావాలని అవినాష్ ని ఊటీ స్కూల్లో చేర్పించాడు. చంద్రిక తల్లినొదిలి ఒక్క క్షణం వుండదు. అందుకని చంద్రశేఖర్ భార్య పూర్ణిమ కోరిక ప్రకారం హైదరాబాదులోనే చదువుకుంటోంది. శిల్పా, చంద్రికా, ఇంచుమించు ఒకే వయసుగల వారేమో ఏవేవో ఆటలూ, ఏవేవో మాటలూ రోజుల వారికి తెలీకుండానే దొర్లిపోయాయి.
    రాగిణి కోటయ్యగారికి ఉత్తరం రాసింది. తను రాలేకపోతున్నానని, శిల్పని మద్రాసుకు పంపించమనీ!
    శిల్ప మద్రాసు వెళ్ళమంది. కోటయ్యగారు, చంద్రశేఖర్, పూర్ణిమ ఎవ్వరు చెప్పినా వినలేదు. అంత చిన్న వయస్సులో ఆ పిల్ల పట్టుదల అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన కళ్ళతో మద్రాసులోని వాతావరణాన్ని చూసిన కోటయ్యగారు శిల్పని వెళ్ళమని బలవంతం చెయ్యలేదు.
    శిల్పని మద్రాసు పంపకపోవడం మంచి పని చేశావని రామానుజంగారు ఉత్తరం రాశారు. భరణి శిల్పకీ, చంద్రికకీ కొన్ని బట్టలూ, అవినాష్ కి కొన్ని బట్టలూ, చాక్లెట్లూ పంపించింది. శిల్పకి చిన్న చెల్లెలు పుట్టిందని పేరు 'దివ్య' అని ఫోటో పంపించింది. శిల్ప ఆనందానికి అవధుల్లేవు. ఎన్నిసార్లు ఆ ఫోటో చూసుకుందో మురిసిపోతూ. ఆ పిల్ల సంతోషాన్ని చూస్తూవుంటే జాలిపుట్టింది ఇంటిల్లిపాదికీ. రాగిణంటే అందరికీ అసహ్యం పుట్టుకొచ్చింది.
    రాగిణి శిల్పని తిడుతూ ఉత్తరం రాసింది. "ఎన్నిసార్లు రమ్మన్నా మద్రాసుకి రావెందుకనీ, ఉత్తరాలకి సమాధానం ఎందుకు రాయవనీ" ఏదేదో రాసింది. "పోనీ ఉత్తరం రాయమ్మా" అన్నారు కోటయ్యగారు.
    "కోటయ్య తాతా! అమ్మంటే నాకు అసహ్యం! నేను ఉత్తరం రాయను" అంది.
    ఊరుకున్నారు కోటయ్యగారు. ఈ కాలం పిల్లలకి అన్నీ తెలుసు. వారితో వాదించి లాభంలేదని కూడా తెలుసు.
    సెలవులు పూర్తవగానే అవినాష్, శిల్పా ఊటీకి వెళ్ళిపోయారు. చంద్రిక వాళ్ళు అలా సరదాగా వెళుతుంటే తనకీ వెళ్ళాలని వున్నా తల్లినొదిలి ఒక్క క్షణం వుండలేదు చీకటిపడితే! అందుకే మౌనంగా వుండిపోయింది!
    కేలెండర్లో మరో ఆరు పేజీలు మారాయి. రాగిణి సినిమా పూర్తయి రిలీజ్ తేదీ కూడా పేపర్లో వచ్చింది. భార్గవ మీద భార్య కేసు పెట్టింది. అతికష్టంమీద సినిమా రిలీజు చేశాడు భార్గవ. "చెత్తలా వుంది" అన్నారు సినిమా చూసిన వాళ్ళంతా. రాగిణిని ఎంత నగ్నంగా చూపించాలో అంత నగ్నంగా చూపించారు. "అసలేమిటో చూద్దామని సరదాగా బయలుదేరిన కోటయ్యగారు, భార్యా, కొడుకు, కోడలూ రాగిణికనిపించినప్పుడల్లా సిగ్గుతో తలవంచుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS