Previous Page Next Page 
నా కథవింటావా పేజి 19


    "ఇదంతా మీరెందుకు  చెబుతున్నారో  నాకర్ధం కావడంలేదు. మాదీ  సంప్రదాయమైన  కుటుంబమే. నా పిల్లలూ ఒక క్రమశిక్షణతోటీ, నీతినియమాలతోటీ  పెరిగారు".
    "కానీ మీ అమ్మాయి పద్ధతి  మాకేమీ నచ్చలేదు. పెద్దవాళ్లం, పిల్లాడి తండ్రీతల్లీ  ఇక్కడే వున్నాం. మీరూ, బాబూవున్నారు. అందరిమధ్య నుంచీ లేచి, 'నేను మాట్లాడాలి అబ్బాయితో!" అంటూ ఆ అమ్మాయి అడగడం, చాలా అసభ్యంగానూ, అసహ్యంగానూ  అనిపించింది. ఇప్పుడే ఇలా బరి తెగించి అడిగితే ,రేపు వాణ్ణి గుప్పిట్లో పెట్టుకుని ఓ ఆట ఆడిస్తుంది. వెళ్ళొస్తాం! ఏమీ అనుకోకండి! మీ అన్నయ్యగారు  మాకు స్నేహం. అతని తాలూక  సంబంధం అని తెలిసి  సంతోషంగా వొచ్చాం! వెళ్ళొస్తాం" అంటూ లేచారు వీరభద్రరావుగారు, సీతాదేవితో చెప్పి.
    ఆమె నోటంట  మాట రావడం లేదు. కళ్ళంట  నీళ్ళు కారుతున్నాయి.
    "ఎన్నడూ కన్నెత్తయినా  సరిగ్గా చూడనిది, ఎందుకిలా  చేసింది కావ్యా ? ఇంటికొచ్చిన సంబంధాన్ని చేజేతులా ఎందుకు  పాడుచేసుకుంది?" క్రాంతీ! ఇంకెలాగరా దీనిపెళ్ళి ? భగవంతుడు దీని నుదుట, కళ్యాణగీత రాయలేదేమో!" కుర్చీలో కుప్పలా  కూలబడిపోయి  గొల్లుమంది సీతాదేవి!
    తల్లిని ఓదార్చాడు  క్రాంతి. మెల్లగా  కావ్య దగ్గరి కెళ్ళాడు. "ఎందుకలా చేశావ్ ? అలా అడిగి నువ్వు సాధించినదేమిటి ? నీ బాగోగులు మా కన్నా  నీకే బాగా తెలుసనుకున్నావా ?" అడిగాడు.
    ఆశ్చర్యంగా  అతనికేసి  చూస్తూ "అన్నయ్యా!....నువ్వు కూడా నేను చేసింది తప్పేనంటున్నావా ? అన్నీ కుదిరాయని  చెప్పడం, పిల్ల నచ్చిందని చెప్పడం, ఆ తరువాత, ఈ వార్త విన్నాం, ఆ వార్త విన్నాం అంటూ, అసలు సంగతేమిటో తెలుసుకోకుండా, పెళ్ళి కాన్సిల్ చెయ్యడం. ఇదంతా ఇక నావల్ల కాదన్నయ్యా. వాళ్ళకి ముందుగానే, నా సంగతంతా  చెప్పెయ్యాలి! అది విని అర్ధం చేసుకున్నవాళ్ళే మనకి బంధువులవుతారు. లేదా అందరిలాగానే  వీళ్ళూ నేను చెడిపోయినదాన్నని నమ్మితే, ఇప్పుడే ఈ సంబంధం ఒద్దనుకుంటారు. అంతేకానీ, అన్నీ సిద్దమయ్యాక, కాన్సిల్ అయిందని  బాధపడడం  కన్నా ఇదే మేలు. అందుకే  జరిగినదంతా  చెప్పాలనే  ఆ అబ్బాయితో మాట్లాడాలన్నాను".
    క్రాంతి బాధగా నిట్టూర్చాడు !
    "నే చేసింది తప్పా అన్నయ్యా? తప్పయితే నన్ను  దండించు. శిక్షించు" అంటూ చేతుల్లో తలపెట్టుకుని ఏడ్చింది కావ్య.
    "నువ్వు చెప్పేదీ, చేసిందీ కరెక్టేనమ్మా. కానీ, ఈ సమాజం మనం చేసే కొత్త మార్పులను హర్షించదు. కొత్త పద్ధతులను ఒప్పుకోదు. నీ మనసులో వున్న ప్రశ్నలన్నీ నాకు చెబితే ,నేను చెప్పేవాణ్ణి కదా, ఈ సంగతులతనికి!" అన్నాడు జాలిగా!
    "నీ పెళ్ళిచూసి  కళ్ళుమూసే భాగ్యం  నాకులేదే! దేముడెందుకో నామీదిలా పగతీర్చుకుంటున్నాడు". వెక్కి వెక్కి ఏడుస్తున్న  తల్లిని ఓదార్చే శక్తి తనకి లేదనిపించింది.
    "తను ఒకటనుకుంటే  ఒకటయింది. ఏమిటో తన బ్రతుకు. మంచి చెయ్యాలనుకుంటే చెడు ఎదురై ప్రాణం తీస్తోంది. చివరికి ఎవరినీ  కష్టపెట్టకుండా  ప్రాణాలు తీసుకోవాలనుకుంటే, అదీ ఎదురు తిరిగింది!
    గతం నిందలతో  నిండిపోయింది!
    భవిష్యత్తు  చీకటితో  మిగిలిపోయింది!
    కన్నవాళ్ళకి  భారమై  బ్రతుకునీడ్చడం  ఒక్కటే  మార్గంగా వుండిపోయింది! చావడానికి గూడా  హక్కులేని బతుకు తనది. బతక లేక చావలేక ,అడుగడుగునా  ఛస్తూ బతికే  జాబితాలోకి పడింది తను. తనమీద తనకే అసహ్యం పుడుతోంది. టేబిల్ మీద  తల పెట్టుకుని  ఎంతసేపు ఏడ్చిందో ? తల్లి భోజనాలకి కంచాలు పెడుతూంటేగానీ తెలీలేదు కావ్యకి!
    ఈ మధ్యన సంతోషంగా, ప్రశాంతంగా  సాగిపోతూన్న  సమయంలో, అనవసరంగా మళ్ళీ ఈ గోల ఒచ్చిపడి, అందరి మనసుల్నీ పాడుచేసింది!" అనుకుంటూ, కాస్సేపటికి  ఏదో నిర్ణయానికొచ్చిన  దానిలా లేచి వెళ్ళి బట్టలు మార్చుకుని, మొహం కడుక్కుని  ఒచ్చింది.
    ఎవరి ఆలోచనల్లో  వాళ్ళుండి  మౌనంగా  భోజనాలు పూర్తి చేశారు ముగ్గురూ! 
                                        13
    కావ్యలో మునపటి ఉత్సాహం లేదు! ఏ పని చేసినా ఏదో ఆలోచిస్తూ యాంత్రికంగా  చేసుకుపోతోంది. ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్పడం, లేకపోతే ఒకమూల కూర్చొని ఏదో  ఆలోచనలో  పడి వుండడమో, లేకపోతే పడుకోవదమో చేస్తూ వుంది!
    "అస్తమానం ఇంట్లో వుండి  అలా వుందేమో!" అనుకుంది సీతాదేవి.
    "అన్నయ్యతో కలిసి అలా  తిరిగిరా అమ్మా!"
    "ఊహూఁ...."
    "పోనీ నువ్వూ అన్నయ్యా ఏదైనా సినిమాకి వెళ్ళిరండి"
    "ఊహూఁ...."
    కల్యాణింటికి వెళ్ళొస్తావా ?"
    "ఒద్దు!"
    "మరి ?"
    "ఏం లేదు." వెళ్ళి మంచంమీద వాలిపోయింది కావ్య!
    కావ్యని చూస్తూంటే ఏదో దిగులుగావుంది సీతాదేవికి. రోజురోజుకీ మనిషి చిక్కిపోతోంది. గూడుకట్టుకున్న నిరాశ ఆమె  మొహంలో స్పష్టంగా  కనిపిస్తోంది.
    "క్రాంతీ! ఏదైనా  మంచి డాక్టరు  దగ్గరకి తీసికెళ్ళి  టానిక్కేమయినా  రాసివ్వమనురా! రోజు రోజుకీ పుల్లలా అయిపోతోంది  కావ్య!
    "నాకేమయిందనీ  డాక్టరు దగ్గరకి  వెళ్ళడానికి ? నేను వెళ్ళను" అంది.
    క్రాంతికి కూడా ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు. ఆమెని సంతోషపెట్టడానికి  ఏం చెయ్యాలో తోచడంలేదు. ఏ విషయంలోనూ ఆసక్తి చూపించడంలేదు కావ్య!
    "ఇంతవరకూ  జరిగిన సంఘటనలే  అందుకు  కారణమనీ, పెళ్ళొక్కటే ఈ సమస్యకి పరిష్కారమనీ" తీర్పు చెప్పింది సీతాదేవి.    
    క్రాంతికూడా అలాగే అనుకున్నాడు. కానీ ఒక్క  సంబంధమూ  కలిసిరావడం లేదు.
    ఉన్నట్టుండి  ఒకరోజు  సీతాదేవి పెద్దన్నయ్య  దిగాడు బెంగుళూరు నుంచి. సీతాదేవికీ, కావ్యకీ చీరలూ ,క్రాంతికి రిస్ట్ వాచీ, ఏవేవో పట్టుకొచ్చాడు.
    పెద్దమామయ్య చూపిస్తున్న  ఆప్యాయతకి ఆశ్చర్యపోయాడు క్రాంతి!
    "ఏదో వుంది. లేకపోతే  పెద్దమామయ్య జన్మలో పుట్టింరోజుకి కూడా పదిరూపాయలు తియ్యలేదు ఎప్పుడూ. అటువంటిది ఇవన్నీ  పట్టుకుని  దిగాడంటే ఏదో వుంది" అన్నాడు క్రాంతి. 
    "పోనీలేరా ఏదో, ఇవ్వాలనిపించి తెచ్చుంటాడు. ఎంతైనా ప్రేమ లెక్కడికి పోతాయ్ ?" అంది.
    ఆరోజు రాత్రి భోంచేస్తూ "సీతా! నీ ఆరోగ్యమూ బాగులేదు. గబగబా రెండు పెళ్ళిళ్ళూ చేసేసి ,హాయిగా రెస్టు తీసుకో" అన్నాడు.
    "నాకూ అలానే వుందన్నయ్యా! ఇద్దరికీ సంబంధాలు చూడు. కలిసొస్తే రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారే చేసేద్దాం" అంది సీతాదేవి.
    "మా అమ్మాయి శోభనని  క్రాంతికి చేసుకో! కావ్యకి  సంబంధం వెతుకుదాం" అన్నాడు.
    సీతాదేవికి అప్పుడర్ధమయింది  అన్నయ్య కార్యార్దియై  వొచ్చాడని.
    "ఏంటమ్మా  ఆలోచిస్తున్నావ్ ? శోభన నీ కోడలవడం  నీ కిష్టం లేదా ?"
    "అడికాదన్నయ్యా! వొదిన నడిగావా ?"
    "వొదిన నడక్కుండా  వొస్తావా అమ్మా! శోభనకి  ఈ సంవత్సరంతో బి,కాం. అయిపోతుంది. క్రాంతికీ, తనకీ ఈడూ, జోడూ, వరసా వావీ కరెక్టుగా  కుదురుతుంది. కట్నకానుకలు, నువ్వేం కోరుకుంటావో చెప్పు. రేపు మాఘమాసంలో ముహూర్తాలు  పెట్టుకుందాం. క్రాంతికి ఉద్యోగం ఒచ్చింది. ఏమంటావ్ ?
    "వాణ్నే  అడుగు, ఇక్కడే వున్నాడుగా."
    "ఏం బాబూ ఏమంటావ్ ?"
    "ముందు కావ్య పెళ్ళి కావాలి. నా కప్పుడే ఏం తొందరొచ్చింది ?"
    "ఎవ్వరూ నాకు తొందరగా వుంది పెళ్ళి చెయ్యమని అడగరు. పిల్లలు మీకేం తెలుసు. ఎప్పుడైనా మీరిలాగే అంటారు. నీకూ ,కావ్యకీ పెళ్ళయిపోతే, అమ్మ దిగులు చిటికెలో  పోతుంది  ఆరోగ్యవంతురాలవుతుంది. కాదనకు. ఇదుగో  శోభన  ఫోటో  చూస్తావా ?" సీతాదేవి  కందించాడు ఫోటో.
    కావ్య కూడా వెళ్లి తల్లి వెనకాల నంచోని చూసింది  ఫోటోని.
    "చాలాబాగుంది. శోభన ఎంత మారిపోయిందో" అంది తల్లి చేతిలోంచి  ఫోటో తీసుకుని చూస్తూ.
    "అన్నయ్యా! శోభనని నా కోడలు చేసుకోవడానికి నాకే అభ్యంతరమూ లేదు. ముందు కావ్యకి సంబంధం చూడు."
    "సీతా! ఇవ్వాళ్టి  నుంచే కావ్యకి సంబంధాలు  చూస్తాను! కుదరడం కాస్త వెనకాముందూ అయినా, అబ్బాయి పెళ్ళి ఆపోద్దని నా మనవి. రెండింటికీ ముడిపెట్టి కూర్చోవడం కన్నా, ఏది ముందయితే అది చేసెయ్యడమే మంచింది. ఒకవేళ కావ్యకి కుదిరిన సంబంధం ముందే  చెయ్యమని తొందరపడ్డారనుకో, కావ్య పెళ్ళయ్యాకే క్రాంతికి ముహూర్తాలు పెట్టుకుందాం! అసలు నన్నడిగితే రెండు పెళ్ళిళ్ళూ  ఒక్కసారి చేస్తే కష్టమై పోతుంది. పిల్లలిద్దరూ  పీటలమీద కూర్చుంటే నీకు ప్రాబ్లం కాదూ! ముందు కోడలొస్తే, కావ్య పెళ్ళికి హెల్ప్ ఫుల్ గా వుంటుంది. లేదా ముందు అల్లుడొస్తే  క్రాంతి పెళ్ళికి హెల్ప్ ఫుల్ గా వుంటాడు" అన్నాడు.
    ఆ సలహా చాలా నచ్చింది సీతాదేవికి.
    ఆ రాత్రి భోంచేసి  మామయ్య  నిద్ర పోతూండడం చూసి, క్రాంతి తల్లి గదిలో కెళ్ళి  ఆమె మంచం మీద కూర్చున్నాడు.
    "ఏం బాబూ ఇలా ఒచ్చావ్ ?" అంది సీతాదేవి.
    "అమ్మా! ఇన్నాళ్ళూ మనం ఎలా వున్నామో, ఏం తిన్నామో, పట్టించుకున్నాడా ఈ మామయ్య. మన ఖర్మకి మననొదిలేశాడు. ఈ రోజున మనం బాగుండడం చూసి, నాకు ఉద్యోగం దొరికింది కనుక, పిల్ల నిస్తానని ఒచ్చాడు. ఎంత స్వార్ధపరుడమ్మా...." అన్నాడు తల్లి నడుంచుట్టూ చెయ్యేసి క్రాంతి.
    క్రాంతి గొంతు విని కావ్యకూడా లేచి కూర్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS