సీతాదేవికిప్పుడు అంతా బాగానే వుంది కానీ, కావ్యని గురించిన బెంగమాత్రం ఆమెకి నిజమైన ప్రశాంతతని ఇవ్వడంలేదు. దానికితోడు ఆమె ఆవేదన చెప్పుకోవాలన్నా, వినాలన్నా కూడా ఎవ్వరూ లేరు. కావ్య ముందు మునపటిలాగా ఈ విషయాలు తప్ప ఇంకేదైనా మాట్లాడమనే సరికి, ఏమీ చెప్పలేకపోతోంది సీతాదేవి.
కాలం గడిచిపోతోంది! ఇంజనీయరింగ్ ఫైనలియర్ పరీక్షలు మొదలయ్యాయి. తెల్లవార్లూ కష్టపడి చదివి పరీక్షలు రాసి వస్తున్నాడు. రాత్రంతా మేలుకుని చదవడానికి, టీ కలిపి ప్లాస్కులో పోసి గంట గంటకీ అందిస్తోంది కావ్య. తనే పరీక్ష రాస్తున్నట్టుగా. అతనితోపాటు మేలుకునుంటోంది ఏదో ఒక పుస్తకం చదువుతూ!
పరీక్షలయిపోయాయి. బాగానే రాశానన్నాడు క్రాంతి.
కావ్య సంతోషానికి అవధుల్లేవు!
సీతాదేవి తృప్తిగా నిట్టూర్చింది!
తప్పకుండా మంచి మార్కులతో పాసవ్వగలడని ప్రొఫెసర్లు కూడా అన్నారు.
రిజల్స్ వస్తాయనగానే, ఎన్నో చోట్లకి అప్లికేషన్లు పంపించాడు క్రాంతి.
రెండు మూడు ప్రయివేటు కంపెనీల నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది క్రాంతికి. కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా పిలుపును పంపించాయి! అన్ని చోట్లకీ ఇంటర్వ్యూలకి వెళ్ళొచ్చాడు క్రాంతి.
కొన్ని చోట్ల నుంచి సమాధానాలు రాలేదు. కొందరు సమయం చూసి ఖాళీలొచ్చినప్పుడు పిలుస్తామన్నారు.
బంజారాహిల్స్ నుంచి ప్రతి చిన్న పనికీ ఏది కావాలన్నా బస్సులో వెళ్ళడం, బస్సు కోసం గంటల నిలబడి తపస్సు చెయ్యడం, కొంచెం కష్టంగానే వుంది క్రాంతికి.
స్కూటర్ కొనుక్కోమని ఎంతో చెప్పింది కావ్య! ఒద్దన్నాడు క్రాంతి.
"అమ్మా! అన్నయ్యలాగే అంటాడు, అతడెంత కష్టపడుతున్నాడో తెలుసా. ఇక్కడ బస్సుకోసం ముందు నాలుగు ఫర్లాంగులు నడవాలి. అక్కడో రెండు గంటలు నిలబడాలి. బస్సు దిగాక కాలేజీ కెళ్ళడానికి మరో నాలుగు ఫర్లాంగులు నడవాలి. ఇంకెక్కడి కెళ్ళాలన్నా ఇంతే. ఇంకా అప్పుడప్పుడు వినోద్ లిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి సరిపోయింది. అమ్మా! నువ్వు గట్టిగా చెబితే వింటాడు" అంది కావ్య తల్లితో. సీతాదేవికి నిజమేననిపించింది. రోజూ గోల పెట్టడం మొదలెట్టింది.
ఎవరో బుక్ చేసి తీరా కొనడం మానేశాట్ట చివరి నిమిషంలో డబ్బుల్లేవని! వినోద్ చెప్పాడు! సీతమ్మ డబ్బిచ్చింది. ఆ రోజు సాయంత్రాని కల్లా స్కూటరు ఇంటి కొచ్చింది.
పసుపు, కుంకం పెట్టి పూజచేసి, నిమ్మకాయలు తొక్కించి పారేసి, కొబ్బరికాయలు కొట్టింది కావ్య!
కావ్య నెక్కించుకుని, జూబిలీహిల్స్ వరకు డ్రైవ్ కి తీసికెళ్ళాడు క్రాంతి!
తల్లిని కూడా మెల్లగా కూర్చోబెట్టుకుని కాస్త దూరం తీసికెళ్ళాడు. ఆమె భయపడుతూ క్రాంతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. నాగార్జునా స్టీల్స్ నుంచి ఇంటర్వ్యూలో సెలక్టయినట్టు ఉత్తరం వొచ్చింది క్రాంతికి! సంతోషంతో తల్లిని పట్టుకుని చుట్టేశాడు క్రాంతి!
కావ్యకి జీవితంలో ఎన్నడూ అనుభవించలేనంత సంతోషం. ఆ రోజు ఆ ఇంట్లో అందరికీ పండగ. ఉద్యోగం గురించీ జీతం గురించీ, అన్నీ తీయని ఊహలు!
నాలుగు రోజుల్లో జాయినవ్వాలి!
కావ్య పోరుపడలేక నాలుగు జతల బట్టలు కట్టించుకున్నాడు.
మొదటిసారిగా 'టై' కట్టుకుని, స్కూటర్ మీద వెళుతూంటే, ఏదో అనుభూతి! ఎంతో సంతోషం!
'దేముడికి దండం పెట్టుకుని వెళ్ళు బాబూ!" అంది తల్లి.
కావ్య ప్రసాదం తెచ్చి నోట్లో వేసింది, పటిక బెల్లం!
గేటుదాకా వొచ్చి, తల్లీ చెల్లెలూ ఇద్దరూ 'టాటా' చెబుతూంటే, తన్మయుడై స్కూటర్ మీద బయలుదేరాడు. క్రాంతి ఉద్యోగానికి!
క్రాంతి ఉదయం తొమ్మిదిగంటల కల్లా భోంచేసే వెళ్ళిపోతే సాయంత్రం ఆరూ, ఏడూ అవుతుంది ఇంటి కొచ్చేసరికి. పగలంతా ఒక్కర్తే ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది కావ్యకి. అక్కడ దగ్గరలో వున్న స్కూల్లో ఏవైనా ఖాళీలున్నాయేమో, చిన్నపిల్లలకి పాఠాలు చెప్పి వొచ్చెయ్యొచ్చు. కనుక్కోనా?" అడిగింది తల్లిని.
"ఎందుకమ్మా! ఈ మధ్య ఏ గొడవలూ లేకుండా హాయిగా సాగిపోతోంది బతుకు. మళ్ళా నువ్వు బయటి కెళితే, ఏ ఉపద్రవం ఒచ్చిపడుతుందో ఏమో! ఒద్దులే తల్లి. ప్రైవేటుగా ఎమ్.ఏ. రాద్దామనుకుని పుస్తకాలు తెప్పించుకున్నావుగా. చదువుకో!" అంది.
"పరీక్ష రాయడానికైనా బయటి కెళ్ళాలి కదమ్మా!"
"ఆ నాలుగు రోజులూ, అన్నయ్య తీసికెళ్లి, తీసుకొస్తాడు" అంది.
"అంటే, తోడు లేనిదీ తను ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళకూడదన్న మాట! అసలు ఎక్కడికీ వెళ్ళకుండా వుంటే మరీ మంచిది. మైగాడ్! పంజరంలో పక్షిలాగా వుంది నా బ్రతుకు. స్వేచ్చ కోసం తపించే నాకు, ఇంత కన్నా ఘోరమైన శిక్షేముంది?" అనుకుని నిట్టూర్చింది.
కూతురి మనసు తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుంది సీతాదేవి .జాలిపడడం తప్ప ఏం చేస్తుంది ?
ఆ రోజు సీతాదేవి చిన్నన్నయ్య ఉత్తరం రాశాడు. "హైదరాబాదులోనే చిక్కడపల్లిలో ఎవరో వున్నారట. ఆ అబ్బాయీ ఏదో గవర్నమెంటు ఆఫీసులోనే టైపిస్టట. పెద్దగా వున్న కుటుంబంకాదుగానీ, మంచి కుటుంబం, మీరు సరేనంటే వాళ్ళకి రాస్తాను." అంటూ.
సీతాదేవి సంతోషానికి అంతులేదు. వెంటనే కావ్యనీ క్రాంతినీ ఎవ్వరినీ అడక్కుండానే సమాధానం రాసి పడేసింది, ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చెయ్యమని.
ఒకరోజు సాయంత్రం వీరభద్రరావుగారూ వాళ్ళబ్బాయి గోపాల్రావూ, వీరభద్రరావుగారి భార్య కమలమ్మా వొచ్చారు.
ఆ అబ్బాయే పెళ్ళికొడుకనీ, చిన్నన్నయ్య చెప్పిన సంబంధం ఇదేననీ తెలుసుకుని, కావ్యని తీసుకెళ్ళి చూపించారు.
ఉప్మా, కాఫీ సిద్ధం చేసిపెట్టింది సీతాదేవి. మాటల్లో పిల్లనచ్చినట్టుగానే చెప్పారు వీరభద్రరావుగారు. అయితే కావ్య మనసులో మాత్రం ఏదో ఆవేదనా, ఆందోళనా చోటుచేసుకున్నాయి.
"అబ్బాయి! నువ్వేమైనా అడుగుతావా అమ్మాయిని ?" అడిగారు వీరభద్రరావుగారు.
"ఏం లేదు" అన్నాడు గోపాల్రావు.
కావ్యకి ఒళ్ళు మండింది.
"ఒకళ్ళతో ఒకళ్లు పరిచయం చేసుకోవడానికీ, మాట్లాడుకావడానికీ ఇదొక్కటే మార్గం, ఈ రకమైన పెళ్ళిళ్ళలో! పురుషాధిపత్యమైన ఈ వ్యవస్థలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా ఆ అవకాశం మగాడికే ఇస్తారు తప్ప, "అమ్మాయి నువ్వేమయినా మాట్లాడాలా, అబ్బాయితో ?" అని అడగరు. అమ్మాయికి మాత్రం, తాను చేసుకోబోయే అబ్బాయిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఉండదా ? తెలుసుకోకూడదా ?" ఆలోచిస్తూ ఉంది కావ్య.
"విజయవాడ సంబంధంకూడా, ఇలాగే ముహూర్తాల వరకూ ఒచ్చాక ఆగిపోయింది అ అనుభవంవల్ల అన్నయ్యైనా అన్ని విషయాలూ ముందే చెప్పాలి. లేదా, తను మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎందుకిస్తాడు ? అన్నయ్య కూడా మగాడేగా!" అనుకుంటూ, "నేను మాట్లాడాలి అతనితో విడిగా ,మీకెవరికీ అభ్యంతరం లేకపోతే" అంది కావ్య వీరభద్రరావుగారినుద్దేశించి.
ఒక్క నిమిషం అందరూ ఆశ్చర్యంగా ఆమె కేసి చూశారు. ఆమేదో అడగరానిది అడిగినట్టూ, అనరానిది అన్నట్టూ, మొహంపెట్టి.
"అలాగే!" అన్నారాయన.
తండ్రి అనుమతి పుచ్చుకుని కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు గోపాల్రావు.
"ఏమడుగుతుందో ఏమిటో ?" సీతాదేవి కంగారుపడుతూంది. కావ్య ఇంతకు మునుపు తనకు వొచ్చిపోయిన సంబంధాల గురించీ ,వాటికి కారణాలూ చెప్పి ,తనపైన అన్యాయంగా ఎలా నిందలు మోసబడ్డాయో చెప్పి, "ఇవన్నీ మీకు తెలీడం మంచిది. ఆ తరవాత గూడా మీరు నా మాట నమ్మి నన్ను చేసుకోవడానికి ముందుకొస్తే, మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అంతేకానీ, అన్నీ మాట్లాడుకుని, చివరికి ఈ విషయాలు తెలిసి ,లేనిపోని అనుమానాలతో పెళ్లి రద్దుచేసుకుని రచ్చకెక్కడం కన్న ఈ పద్ధతి మేలనుకుని, ధైర్యం చేసి ఇలా అడిగాను క్షమించండి" ఏదో చెప్పబోయింది కావ్యా.
"గోపాల్!....గోపాల్ !" వీరభాద్రరావుగారు పిలిచారు.
వెంటనే లేచి వెళ్ళిపోయాడు గోపాల్రావు.
కావ్య అక్కడే కూర్చునుంది.
వీరభద్రరావుగారు చెప్పే మాటలు స్పష్టంగా వినిపించాయి కావ్యకి. "చూడండి క్రాంతికుమార్ గారూ! మాకు కట్న కానుకలమీద పెద్దగా ఆశ లేదు కట్నం పుచ్చుకోవడం లాంఛనం కాబట్టి పుచ్చుకుంటున్నాంగానీ లేకపోతే ఏముందండీ కట్నంలో! మీరిచ్చే ముప్పై, నలభై వేలూ అలా వుండిపోతాయా ఏమిటి ? అవీ వీళ్లకే ఖర్చయిపోతాయి. కాకపోతే అదో వేడుక అంతే!
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మాకు ఆచారాలూ., అలవాట్లు సంప్రదాయం, వీటిమీద పట్టింపెక్కువ. వాటికోసం ప్రాణాలయినా ఇస్తాం! అటువంటి కుటుంబం మాది.
