సీతాదేవి పకపకా నవ్వింది. క్రాంతి అర్ధంకాక తల్లివైపు చూశాడు.
"స్వార్ధం లేనిదెవరికి బాబూ ఈ ప్రపంచంలో! ఎంత చెడ్డా రక్తసంబంధం. తిట్టుకున్నా తిమ్ముకున్నా మళ్ళీ కలుసుకున్నా, ఇటు అన్నా చెల్లెళ్ళం. మీరు బావామరదళ్ళూ! పైగా పై పిల్లకి ఆ మాత్రం ప్రేమా ఆదరణా వుంటుందో వుండదో ? అయిన సంబంధం అయితే, కావ్యనీ సరిగ్గా చూసుకుంటారు. "తల్లి తరవాత మేనమామ" అన్నారు. కావ్య సంగతులు కడుపులో పెట్టుకుంటారు. పరాయి పిల్లకి కావ్యమీద అభిమానం ఎందుకుంటుంది బాబూ! పై పెచ్చు దెప్పుళ్ళూ, సాధింపులు అయితే, అది భరించలేదు. నా తరవాత కూడా చెల్లాయి, ఈ ఇంటిని తన ఇంటిగానే భావించాలంటే, మనింటికొచ్చే పిల్ల పరాయిపిల్ల కాకూడదు. "ఈ మాటలు చెబుతూ వుంటే, ఆమెలోని సంఘర్షణా, దూరదృష్టి అర్ధంచేసుకున్నాడు" క్రాంతి.
"బాబూ !"
"ఊ !"
"ఒకవేళ నీకు శోభన నచ్చకపోతే చెప్పు. ఈ పెళ్ళి మానుకుందాం. అంతేకానీ మామయ్య మాటలూ, చేతలూ, మనసులో పెట్టుకుని మాత్రం ఈ సంబంధం ఒద్దనకు! వాడెలా స్వార్ధంకోసం నా ఇంటికొచ్చి నా కొడుకుని అడుగ్తున్నాడో, నేనూ నా బిడ్డనీ, నిన్నూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ స్వార్ధంతోనే ఔనంటున్నాను. అయితే ఒక్కటి గుర్తించుకో! పిల్ల నీకు ఇష్టంలేకపోతే మట్టుకు, ఈ సంబంధం చేసుకోవద్దు. తల్లి మాటలు నచ్చాయి క్రాంతికి. "కావ్యని బయటిపిల్ల అయితే ఎగతాళి చెయ్యొచ్చు. శోభనయితే, బాగా చూసుకుంటుంది. పైగా శోభన బాగానే వుంది." అనుకుంటూ, "సరేనమ్మా నీయిష్టం! శోభనని చేసుకోవడానికి, నాకే అభ్యంతరమూ లేదు" అన్నాడు. క్రాంతిని అభినందిస్తూ ఆప్యాయంగా రెండు చేతులతోటీ, అతని తల పట్టుకుని, నుదుట మీద ముద్దు పెట్టుకుంది.
క్రాంతి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు!
తెల్లవారి లేచి పేపర్ చదువుతున్న మామయ్య "క్రాంతీ!" అంటూ పెట్టిన కేకకి పరుగెత్తు కెళ్ళాడు."ఇదుగో ఇటు చూడు! ఎన్ని వివాహ ప్రకటనలో!" అంటూ మెట్రిమోనియల్ కాలమ్ ని చూపించాడు.
అందులో కొన్ని బాగానే వున్నాయనిపించింది. మామయ్య సలహా ప్రకారం కొన్నింటికి అప్లై చేశాడు క్రాంతి.
ఆ తరువాత కూర్చుని క్రాంతి పెళ్ళికి కట్న కానుకల గురించి మాట్లాడుకున్నారు. "ముఫ్ఫై వేలు కట్నం ఇస్తామన్నాడు".
"ఆగాగు మామయ్యా! ఆగూ!" అన్నాడు క్రాంతి.
"ఏం బాబూ అది చాలదా ? దాని వంటిమీద ఒక పదితులాల వరకూ బంగారం వుంది. ఆడబిడ్డకీ అత్తగారికీ లాంఛనాల కింద వెయ్యి నూటపదహార్లు ఇస్తాను. అంతకంటే...."
"మామయ్యా! మీ అమ్మాయికీ, ఈ లాంఛనాలకీ ఏమిస్తావో నాకు తెలీదు. నాకుమాత్రం కట్నంవద్దు."
"క్రాంతీ! అలిగావా ? పోనీ ఎంతివ్వమంటావో నువ్వే చెప్పు" అన్నాడాయన.
సీతాదేవి తలొంచుకుని కూర్చుంది.
"మామయ్యా! కట్నం తీసుకోవడం నాకిష్టం లేదు. అది నా ఫ్రిన్సిపిల్! మిగతా విషయాలు మీరూ అమ్మ మాట్లాడుకోండి."
"క్రాంతీ! రేపు నువ్వు కావ్యకి కట్నం ఇవ్వవలసొస్తే, ఈ డబ్బు పనికొస్తుంది. కాదనకు బాబూ!"
మామయ్యా! కావ్యకి పెళ్ళి చెయ్యడానికి మీకట్నం డబ్బులు అఖ్కర్లేదు. మాకున్నదాన్లో చేస్తాను! నా సంపాదనలో నా చెల్లెలికి పెళ్ళి చేస్తాను. అదే నాకు తృప్తి!"
"బాబూ!....నామాట...."
"పెళ్లి వ్యాపారం కాదు మామయ్యా లెఖ్కలు చూసుకోవడానికీ, నా చెల్లెలు పెళ్ళి నాకు భారం కాదు. ఇంతకీ నా పెళ్లికీ, నా చెల్లెలి పెళ్లికీ ముడిపెట్టి, నా చెల్లెలికి నేను కట్నం ఇవ్వాలి కాబట్టీ, నేను కట్నం తీసుకుంటున్నానని చెప్పుకోవడం నాకు అసహ్యం".
"బా...."
"ప్లీజ్! ఇంకేమీ చెప్పకండి. మీ అమ్మాయికి మీరేమైనా ఇచ్చుకుంటే మీ ఇష్టం. ఇవ్వకపోయినా మీ ఇష్టం. ఇస్తే గిస్తే అది ఆమె పేరు మీదే, ఆమెకే ఇవ్వండి కానీ అందులో చిల్లిగవ్వకూడా నాకొద్దు!"
సీతాదేవి కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. "జ్ఞాపకం వుందా అన్నయ్యా! ఆరోజు మీ బావగారు కూడా ఇలాగే మాట్లాడారు." కళ్ళు తుడుచుకుంటూ అంది.
"అవునమ్మా! సింహం కడుపున సింహమే పుడుతుందికానీ, పిల్లులు పుడతాయా ? నాబిడ్డ అదృష్టవంతురాలు" అన్నాడు.
కాస్సేపు ఈమాటా ఆమాటా మాట్లాడి క్రాంతి ఆఫీసుకెళ్ళి పోయాడు.
"అన్నయ్యా! నువ్వెళ్ళి వదినతో చెప్పి ముహూర్తాలు పెట్టించు. అలాగే కావ్యకి కూడా సంబంధాలు చూడు." అంది సీతాదేవి.
"అలాగేనమ్మా ! అంతా నాకొదిలెయ్" అన్నాడు.
ఆ మర్నాడే ప్రయాణమయ్యాడు బెంగుళూరికి ఆయన.
అతను వెళ్లిపోయాక, తల్లీ కూతుళ్లిద్దరూ క్రాంతి పెళ్లి మాటలే. శోభన గురించీ, మామయ్యల గురించీ, ఏవేవో కబుర్లు. రోజూ ఈ ప్రస్తావన దిన చర్యలో ఒక కార్యక్రమంగా అయిపోయింది.
ఆరోజు పక్కింటి సిందీ ఆవిడ చెప్పింది. ఆ వీధిలో వున్న మాంటిసరీ స్కూల్లో, ఒక టీచరుపోస్టు ఖాళీ అయిందనీ, కావ్యని పంపించమనీ. ఆమె కూడా ఆ స్కూల్లోనే పనిచేస్తోంది.
"ఆంటీ! నేనూ తోడుంటానుకదా! కావ్యని పంపండి. ఇద్దరం కలసివెళ్లి కలిసొస్తాం. మీకేం భయంలేదు. మీరు సరేనంటే రేపు కావ్యని నాతో తీసికెళతాను. డిగ్రీ పాసై ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏంతోస్తుందీ ? బోర్ కొడుతుంది! పెళ్ళయితే అది వేరేసంగతి." అంటూ ఒచ్చీరాని తెలుగులో సీతాదేవితో చెప్పింది. శాంతాకుందన్ లాల్. మరొకప్పుడయితే సీతాదేవి కాదనేదే. కానీ, ఈ మధ్యన కావ్యలోని మార్పుచూసి భయపడింది. పైగా ఇంటికి దగ్గరలోనే వుంటుందట స్కూలు. అదీకాక శాంతకుందన్ లాల్ పనిచేస్తున్న స్కూలే అది. ఇద్దరూ కలిసి వెళతారు కలిసొస్తారు. కావ్యకీ కాలక్షేపంగానూ వుంటుంది. మనస్సుకీ బాగుంటుంది అనుకుంది.
"అలాగే తీసికెళ్ళండి" అంది.
కావ్యకి పట్టలేని సంతోషం కలిగింది.
"అమ్మా! నిజంగా వెళ్ళమంటున్నావా ?" అడిగింది నమ్మలేనట్టుగా.
"నిజంగానే అంటున్నానమ్మా. ఇంట్లో ఊరికే కూర్చుంటే పొద్దుపోవడం కష్టం! పైగా స్కూలు మనింటికి దగ్గరలోనే వుంది. 'మాంటిసరీ' స్కూలంటే ఉదయం పది నుంచి, పన్నెండు దాకానే వుంటుంది. ఒక రెండు గంటలు. ఆంటీతో కలిసివెళ్ళి, కలిసి రావొచ్చు!" అంది.
కావ్య మొహంలో ఆనందరేఖలు ఇంద్రధనుస్సులా మెరిశాయి! పసిపిల్లలా తల్లిని చుట్టేసి "మంచిమమ్మీ" అంటూ ముద్దులు పెట్టుకుంది, అక్కడ శ్రీమతి శాంతాకుందన్ లాల్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి. క్రాంతికూడా ఈ విషయం విని సంతోషించాడు. ముఖ్యంగా స్థబ్దుగా వున్న కావ్య మళ్ళీ చలాకీగా మాట్లాడడం, తిరగడం అతనికి ఆనందాన్నిచ్చింది.
ఆ రాత్రి తృప్తిగా పడుకుంది కావ్య!
ఆ మర్నాడు మామయ్య ఇచ్చిన కొత్త చీరా, కొత్త జాకెట్టూ వేసుకుని, మిసెస్ శాంతతోటి స్కూల్ కి వెళుతూ వుంటే, ఎంతో తృప్తి!
గులాబీ పూలవంటి చిన్నారుల మధ్యన, చిట్టి చిట్టి పలుకులతో మాట్లాడుతూ, ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్పించడం, ఎంతో సంతోషంగా వుంది కావ్యకి!
"టీచర్ !....టీచర్! వాటర్ కావాలి" అని ఒక పిల్ల అడిగితే "వాటర్ కావాలా ? ఇస్తానుండు" అంటూ ఆయాకి చెప్పకుండా తనే వెళ్ళి నీళ్ళు అందించింది కావ్య.
"టీచర్....నా పెన్సిల్ ముల్లు విరిగిపోయింది" అంటే తనే చెక్కిస్తోంది. "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంటూ పిల్లలు చేసే యాక్షన్ కి, తనూ తన్మయత్వంతో యాక్షన్ చేస్తూ, ఒకటికి పదిసార్లు చెబుతూ ,చెప్పిస్తూ వాళ్ళల్లో ఒకర్తెగా అయిపోతోంది .ప్రిన్సిపాల్ కావ్యని ఎంతో మెచ్చుకుంది. 'మాంటిసరీ ట్రైనింగ్ పొందకుండానే ఇంత బాగా నేర్పిస్తున్న కావ్యని అభినందిస్తూ, నెక్ట్స్ యర్ ట్రైనింగ్ కి కావ్య పేరు రికమెండ్ చేసింది.
కావ్య కిప్పుడు ఏ ధ్యాసా లేదు. ఇల్లూ, స్కూలూ, ఈ రెండే ఆమె నిలయాలు !
క్షణంలో దుఃఖం అంతా దూరమైపోయిన ఫీలింగ్!
బళ్ళో అంతా పిల్లలతో ఆటలు!
ఇంట్లో అంతా క్రాంతి పెళ్ళికబుర్లూ, పెళ్ళిపన్లూ!
క్రాంతి పెళ్ళి ముహూర్తం దగ్గర కొచ్చేయడంతో, ఎన్నోపన్లు.
బట్టలు కొనడం, నగలు కొనడం ,ఏవేవో పన్లు.
సిందీ వాళ్లైనా మిసెస్ శాంత ఎంతో సహాయంగా వుంటోంది. కావ్యంటే ఆమెకి ఎంతో ఇష్టం. తెలుగువాళ్ళ చీరలూ, నగలూ, వాళ్ళ అలవాట్లూ అన్నీ అడిగడిగి తెలుసుకుంటోంది. బడి నుంచొచ్చాక సగం టైము శాంతన్నా వీళ్ళింట్లో వుంటుంది, లేకపోతే కావ్య అయినా శాంతా వాళ్ళింట్లో వుంటోంది.
రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి.
ముహూర్తం సమయం రానేవొచ్చేసింది. అందరూ కలిసి బెంగుళూరు బయలుదేరారు పెళ్ళికి. తెలుగువాళ్ళ పెళ్ళి కళ్ళారా చూడాలని శాంతకూడా వీళ్ళతో బయలుదేరింది.
14
ఏ గొడవలూ లేకుండా పెళ్ళి సవ్యంగా జరిగిపోయింది .పెళ్లి తతంగం పూర్తయ్యేదాకా, ప్రతీదీ ఎంతో ఆసక్తితో చూసింది శాంత. తలంబ్రాలు పోసుకోవడం, బిందెలో నుంచి ఉంగరాలు తియ్యడం, ఇవన్నీ ఎంతో సరదాగా చూసింది .పెళ్ళయిన మర్నాడు సత్యన్నారాయణవ్రతం అయిపోయాక, తిరుపతికి అక్కడి నుంచి మద్రాసు, కొడైకెనాలూ వెళ్ళారు క్రాంతీ, శోభనా హనీమూన్ కి!
శోభన తమ్ముడు మనోహర్ ని తీసుకుని సీతాదేవీ, కావ్యా, మిసెస్ శాంతా, మైసూర్ బృందావన్ గార్డెన్స్ కీ, చాముండేశ్వరి దేవాలయానికీ వెళ్లొచ్చారు. ప్రకృతి తన సౌందర్యాన్నంతా మూటగట్టి, అక్కడ పడేసిందా అన్నట్టు బృందావన్ గార్డెన్స్ వెన్నెల వెలుగులో దివ్యలోకాలలో వున్న అనుభూతిని కలుగ జేసింది. పారవశ్యంతో అదంతా చూసి తిరిగొచ్చారు. మన దేవాలయాలూ, ఆ శిల్పసంపదా ఎంతో నచ్చాయి శాంతకి. మనోహర్ సహాయంతోనే హైదరాబాదుకి తిరిగొచ్చారు ముగ్గురూ. కొడైకెనాల్ నుంచి, హైదరాబాదొచ్చేస్తామన్నారు క్రాంతీ, శోభనా!
