జాన్ స్మిత్ కు ఆ అమ్మాయి బాగా నచ్చింది. అప్పటికే అతని పేరెంట్స్ జాన్ స్మిత్ కు మరో సంబంధం చూశారు. తను కలలో చూసిన అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టాడు. కలలో కనిపించిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని, అతని పేరెంట్స్ వాదన. అయినా మొండిగా కలలో కనిపించిన అమ్మాయి కోసం అన్వేషణ సాగించాడు.
ఆమెను అన్వేషిస్తూనే ఆ ప్రయత్నంలో ఎదురుగా వస్తోన్న కారును గమనించకుండా ఏక్సిడెంట్ చేసాడు. అతని తలకు తీవ్రమైన గాయం తగిలింది. అతన్ని హాస్పటల్ లో జాయిన్ చేశారు.
ఇదంతా కలలో కనిపించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ పరాకుగా డ్రైవ్ చేయడంవల్లే జరిగిందని అతని పేరెంట్స్ నిందించారు. అయినా జాన్ స్మిత్ లెక్క చేయలేదు. అతనికి డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన నర్స్ ని చూసి షాకయ్యాడు.
తన కలలో కనిపించిన అమ్మాయే ఆ నర్స్...
వెంటనే ఆ అమ్మాయికి తన కల గురించి తను ఆమె గురించి అన్వేషించడం గురించి చెప్పాడు. ఆ అమ్మాయి అతని మాటలు నమ్మలేదు.
అయినా జాన్ స్మిత్ పట్టువదలకుండా ఆమె వెంట పడ్డాడు. చివరికి ఆమె నిర్ణయం మారదని, అతనిని పెళ్లి చేసుకోదని తెలిసి తనసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నాడు.
పదిహేను రోజులపాటు ఆ అమ్మాయికి కనిపించలేదు. ఎప్పుడైతే అతను కనిపించలేదో ఆ అమ్మాయిలో దిగులు మొదలైంది.పదిహేనురోజులుగా దాదాపు పిచ్చిదానిలా మారి, తనే జాన్ స్మిత్ ని వెతుక్కుంటూ వెళ్లి 'ఐ లవ్ యూ' అని చెప్పి అతడ్ని పెళ్లి చేసుకుంది.
విచిత్రమేమిటంటే పెళ్లయిన ముప్పయ్యేళ్ల తర్వాత ఇద్దరూ ఒకేరోజు ఇంచుమించు ఒకేరోజు ఇంచుమించు ఒకే సమయంలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు" అని చెప్పడం ఆపి ఫ్రొఫెసర్ పరమహంస వాళ్లవైపు చూసి, "ఇప్పుడు చెప్పండి...దీనికేం లాజిక్ చెబుతారు..." అని అడిగాడు.
అందరూ మొహమొహాలు చూసుకున్నారు.
* * *
బాదం చెట్టు కింద ఒక్కర్తే కూచుంది తరళ.
ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వచ్చాక,ప్రొఫెసర్ తన లాబ్ లోకి వెళ్లాడు. తరళ బాదం చెట్టు కింద ఆలోచిస్తూ కూచుండిపోయింది.
ఒక్కో సంఘటన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నచికేత పెయింటింగ్స్ లో తను చోటు చేసుకోవడం విచిత్రంగా అనిపించింది.
తను సింగపూర్ నుంచి ఇండియా రావడం, పరమహంస చిరునామా అతి కష్టం మీద తెలుసుకుని అతడికి తన తండ్రి గురించి చెప్పడం, అతను తన దగ్గరే ఉండమనటం...అన్నీ గుర్తుకొచ్చాయి.
ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం...పీటర్సన్...
ఆ హంతకుడు పీటర్సన్ ఎక్కడున్నా తను 'ట్రేస్' చేయాలి. పోలీసాఫీసర్ రాబర్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఆ పీటర్సన్ ఇండియా వచ్చాడు.
అతనెక్కడున్నా అతడిని చంపి తన పగతీర్చుకోవాలి. తన తండ్రి మరణం కళ్లముందు నుంచి చేదిరిపోలేదు. ఎంత బాధ అనుభవించి చనిపోయాడో...
ఆమె కళ్లలో నుండి అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. ఇది తను ఒంటరిగా చేసే పోరాటం కాదు. తన ప్రయత్నంలో తనకో తోడు కావాలి. తనకు మోరల్ సపోర్ట్ కావాలి. ప్రొఫెసర్ పరమహంస తనకు ఆ విధంగా హెల్ప్ చేయలేడు.
అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు...
తన అన్వేషణకు సరైన ముగింపు నచికేత.
కళ్లలో షార్ప్ అయిన చూపు..నిశితమైన చూపు, ఏ విషయాన్నయినా ఖచ్చితంగా మాట్లాడగల నేర్పు...ఆమెలో రకమైన 'పాజిటివ్ ఇంప్రెషన్" కలిగించాయి నచికేతమీద.
డైరెక్టుగా తను ఈ సాయం చేయమని అడిగితే షాక్ అవుతాడేమో? ఎలా అడగాలి...
కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి ఓ నిర్ణయానికి వచ్చింది తరళ చాలా సేపటి తర్వాత.
* * *
"వాటే వండర్...వాటే వండర్..." అన్నాడు విలియమ్స్.
"ఏమిటి?" అడిగాడు ప్రభు.
ఎగ్జిబిషన్ నుంచి ఆ అయిదుగురు బయటకు వచ్చాక డిన్నర్ కు వెళ్లారు. డిన్నర్ పూర్తయ్యాక టాంక్ బండ్ దగ్గరకు వచ్చారు. ఆపి దిగి రెయిలింగ్ కు ఆనుకొని నిలబడ్డారు.
"నచికేత వూహించి వేసిన పెయింటింగ్స్ లోని అమ్మాయి, ఆ తరళ ఒకేలా ఉండడం..." అన్నాడు విలియమ్స్.
"నాకు విచిత్రంగానేవుంది" సూరజ్ అన్నాడు.
సూర్యనారాయణ ఏదో మాట్లాడబోయి నచికేత ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ ఉండడం గమనించి-
ఏంటీ! ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు?" అడిగాడు.
"ఏం లేదు. ప్రొఫెసర్ చెప్పిన చిత్రావతి గురించి. నిజంగా ఆ అడవి గురించి నాకు తెలియదు. పైగా ప్రొఫెసర్ గారు చెప్పాక, బాగా ఆలోచిస్తే...నాకు కలలో కనిపించిన అడవి, నేను పెయింటింగ్ లో వేసిన అడవీ ఒకటేననిపిస్తోంది. ఇదెలా సాధ్యం? తరళను నేను చూడకముందే అదే పోలికలతో ఎలా 'బొమ్మ'గా వేయగాలిగాను?"
"నిజమే?" అన్నాడు నచికేత మాటలతో ఏకీభవిస్తున్నట్టు ప్రభు.
"దీని వెనుక ఏదైనా బ్రహ్మ రహస్యం ఉందేమో..." అన్నాడు సూర్యనారాయణ.
"మనం ఇప్పుడే ఇలా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? ప్రొఫెసర్ గారు రేపు రమ్మన్నారుగా. కొన్ని పుస్తకాలు పరిశీలించి చెబుతానని కూడా అన్నారు. అలాగే చిత్రావతి అడవి గురించి కూడా చెబుతాననలేదు..." విలియమ్స్ అన్నాడు.
"యస్పెస్..." అన్నాడు ప్రభు.
"సో...ఇప్పుడీ టెన్షన్స్ అన్నీ వదిలేసి హాయిగా వెళ్లి పడుకుందాం. రేపు ప్రొఫెసర్ గారింట్లో కలుసుకుని మన అనుమానాలను 'క్లారిఫై' చేసుకుందాం" సూరజ్ అన్నాడు.
నచికేత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"నచికేత...నువ్వింకా మామూలు మూడ్ లోకి రాలేదు...బీ హాపీ..." అన్నాడు విలియమ్స్.
నచికేత నవ్వి 'అలాగేనన్నట్టు' తలూపాడు.
"ప్రభూ...విలియమ్స్...మీరూ నా రూటే కదా...మన ముగ్గురం ఆటోలో వెళుదాం..." అన్నాడు నచికేత.
అలాగేనన్నట్టు తలూపారు ప్రభు, విలియమ్స్. సూరజ్, సూర్యనారాయణ ఓ ఆటోని పిలిచి ఎక్కారు. వాళ్ల ఆటో కదిలాక, మరో ఆటో వచ్చింది అక్కడికి. నచికేత, ప్రభు, విలియమ్స్ ఆటోలో కూర్చున్నాక విలియమ్స్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు, ఆటో ముందుకు కదిలింది.
అదే సమయంలో ఎదురుగా ఓ ఆటో వస్తోంది.
ఆ ఆటోలో రామయ్య ఉన్న విషయం ఎవరూ గమనించలేదు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెండు ఆటోలు క్రాస్ అయ్యాయి.
ఒకవేళ ఆ ఆటోలో ఉన్న రామయ్యను ఆ ముగ్గురిలో ఒక్కరైనా చూసి ఉంటే వాళ్లను పట్టి పీడుస్తున్న చాలా అనుమానాలు నివృత్తి అయ్యేవి.
* * *
నచికేత బద్దకంగా వళ్ళు విరుచుకున్నాడు. టైం చూశాడు. ఏడయింది. గబగబ ఫ్రెషప్ అయ్యాడు.
సరిగ్గా ఎనిమిది గంటలకు సూరజ్, విలియమ్స్, సూర్యనారాయణ, ప్రభు నచికేత ఇంటికి వచ్చారు. ప్రభు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నాడు.
అతని మొహంలో అదోలాంటి యాగ్జయిటీ కనిపిస్తోంది. అతని చేతిలో పేపర్ వుంది.
"ఏంటీ...ఏదైనా విశేషమా?" ప్రభు వాలకం చూసి అడిగాడు నచికేత.
ప్రభు ఆ వేల్టి పేపరు చూపించాడు. ఆ పేపర్ లో ఐదు పేజీలో ఓ కార్నర్ లో ఓ బాక్స్ లో ఐటమ్ పడింది. WANTED
కావలెను
మూడు వందల అరవై గంటల్లో చనిపోవడానికి సిద్దపడే వ్యక్తి కావలెను.
వయస్సు-30-35 మధ్య ఉండాలి.
అనుభవం -అక్కర్లేదు.
అర్హత:చనిపోవడానికి సరిపడా గట్స్ వుండాలి.
ఆఫర్-పాతిక లక్షల నగదు
అడ్వాన్స్:ఐదు లక్షలు
ముఖ్యమైనషరతు??????
12
నచికేత ప్రకటన వంక విచిత్రంగా చూసేడు
"చాలా గమ్మత్తుగా వుంచి కదూ..." అన్నాడు విలియమ్స్.
"గమ్మత్తుగానేకాదు. నాకు ఏదో అనుమానంగా కూడా వుంది" ప్రభు అన్నాడు.
"అనుమానమా...దేనికి?" సూర్యనారాయణ అడిగాడు.
"ఉద్యోగులు కావాలనో, వధువు లేదా వరుడు కావాలనో ప్రకటనలు ఇస్తారు కానీ, ఇలా చనిపోవడానికి సిద్దపడే వ్యక్తి కావాలని ప్రకటన ఇవ్వడమేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్" ప్రభు అన్నాడు.
"ప్రభు మాటల్ని కూడా సీరియస్ గా ఆలోచించాల్సిందే" సూరజ్ అన్నాడు.
వెంటనే విలియమ్స్ అందుకొని..."ఇలాంటి ప్రకటనలు మనకు కొత్త...విదేశాల్లో ఇంతకన్నా విచిత్రమైన ప్రకటనలు కూడా వస్తాయి. కొన్ని మ్యాగజైన్స్ లో చదివిన గుర్తు కూడా..." అన్నాడు.
నచికేత ఒక్కక్షణం ఆలోచనలో పడిపోయాడు.
"ఏంటీ...నీకూ డౌటేనా?" అడిగాడు సూరజ్
"లేదు...విదేశాల్లో ఇలాంటి ప్రకటనలు కొన్ని చూసినట్టు నాకూ జ్ఞాపకం..." అన్నాడు నచికేత.
వెంటనే విలియమ్స్ ఉత్సాహంగా...
