"నే కాదండీ పిన్నిగారూ, నేను ఇంగ్లీషు చదువు కొన్నాను, నాకు మంత్రాలూ గింత్రాలూ రావండి పిన్నిగారూ" అన్నాను.
ఆ ఇంగ్లీషు మంత్రాలే ఉపదేశించావుట, లేదంటావేమిటి నువ్వే!...కాంతమ్మ మొగుడని ఆయన చెప్పారు కారూ?" అన్నది.
"మొన్న మీదగ్గరకు రాలేదూ, ఆయనండీ" అని కాంతం ఎక్సుప్లెయిన్ చేసింది.
అప్పుడు నేనన్నాను: "ఓహో, అదా సంగతి? పెద్ద ఉపదేశం ఏమిటిలెండి, ఇంట్లో పోట్లాటలు లేకుండా ఉండటానికి కొన్ని మంచిసంగతులు చెప్పాను. మరేంలేదండీ" అన్నాను సంతోషంగా, పూర్వము. మోస్తరుగా వాళ్ళు పోట్లాడుకోకుండా హాయిగా శాంతంగా జీవిస్తూ ఉంటారు. ఆ విషయమై చెప్పడానికే ఆవిడ వచ్చి ఉంటుంది.
ఇల్లా అనుకొంటూ నంచున్నాను నేను. ఆవిడ నా దగ్గరగా రావటం నేను చూడనేలేదు. వచ్చి ఆమెగారు "నీవు ఉపదేశించిన మంత్రమే బెడిసి కొట్టింది నాయనా" అని రహస్యంగా చెప్పేదానిలాగా చెప్పింది.
"బెడిసి కొట్టటానికి నేనేమీ మంత్రం ఉపదేశించలేదండీ" అని ఆశ్చర్యపోయినాను.
"రాకేం నాయనా, నీకొచ్చిన మంత్రాలు నీకొచ్చు, ఇంగిలీషులోమటుకు మంత్రాలు లేవంటావా?"
కాంతం వేపు తిరిగి "మంత్రాలు రావూ అంటారేమిటి నీ మొగుడు_నేను ఇల్లాగ ఉంటే పిచ్చిది అనుకున్నారు కామాసు, నాకు అన్ని.....తెలుసు నాయనా, కోయ మంత్రాలు లేవమ్మా, అల్లాగే ఇంగ్లీషు మంత్రాలు ఎందుకు ఉండవూ? ఏవమ్మా?" అంది.
"వుండవటండీ! పిన్నిగారూ, ఉంటాయి." అని ఆమెగారి వైపు చూస్తూ "వచ్చునండీ. అబ్బో, ఈయనకు ఇంగ్లీషులో ఎన్నో మంత్రాలు వచ్చు" అని కళ్ళు ఎగరేసింది.
"అయ్యో ఖర్మమా. ఇదేమిటండీ, నాకేం మంత్రాలూరావు ! నేను ఏమీ ఉపదేశమూ చెయ్యనూ లేదు" అన్నాను నేను విచారంగా.
"అల్లా అంచా డేమిషమ్మా నీ మొగుడూ?" అన్నది ఆవిడ, "ఆయనంతే" అన్నది మా ఆవిడ,
ఇద్దరూ ఇల్లాగ అంటూంటే నేనేమీ అనలేకపోయినాను. నన్ను తగలెయ్య నాకిన్ని మంత్రాలు ఎల్లాగువచ్చినయ్యా అని నాలో నాకే ఆశ్చర్యం కలిగింది.
మళ్ళీ ఆ ముసలమ్మ గారు ఇల్లాగ అన్నది "లేదంటావేమిటి నాయనా. మొన్న ఆయన ఇంటికి రావటంతోనే "కాంతం మొగుడిగారివల్ల నేను ఉపదేశం పొందానూ, ఇక నీకూ నాకూ పోట్లాటలుండవు ఆమషా అన్నారు. ఏమిటో అనుకొన్నాను. కృష్ణా రామా అనుకుంటారు కామాలు ననుకొన్నాను. అసలు ఆయన వట్టి పిచ్చిబ్రాహ్మడు అమాయకుడు!"
"అయితే ఇప్పుడు ఏం జరిగిందేమిటండీ ! అన్నాను నేను.
"ఆ రాత్రి, అంటే శుక్రవారం రాత్రినుంచే మొదలు నాయనా, పిచ్చి చూపులూ పిచ్చి మాటలూ" అన్నది విచారంగా.
'నేనేమి పాపం ఎరగనే ఇదెక్కడి అవస్థరా బాబూ' అని నాకూ ఖంగారు పుట్టింది. "అయితే పిన్నిగారూ, ఏమిటి ఆ పిచ్చి మాటలూ" అన్నాను.
అ భాగ్యశాలి నా మాటలు వినిపించుకోకుండానే మా ఆవిడతో యిల్లాగ అంటున్నది. "పిచ్చిమాటలు ఏమిటి కాంతమ్మ తల్లీ చెప్పటానికి వీల్లేదు. అల్లాంటి మాటలు మనం ఎప్పుడూ వినము, నీవైనా చెప్పుతల్లీ నీ మొగుడితో ఆ మంత్రానికి విరుగుడు ఏమైనా చేయమని" అని కాంతాన్ని! కాళ్ళూ వేళ్ళూ పట్టుకొని బ్రతిమిలాడటం సాగించింది.
ఊరుకోండి పిన్నిగారూ, ఉన్న వారు ఊరుకోక ఉపదేశం చేయటం ఎందుకు చెప్పండీ ఈయన? అంటూ మా ఆవిడ ముసలమ్మగారి యందు సానుభూతి చూపటం మొదలెట్టింది అక్కడికి నేను నిజంగా ఏదో మంత్రం ఉపదేశం చేసినట్లు!
మా ఆవిడ కొంటెతనం చూస్తే నాకు కోపం వస్తున్నది. ఆ ముసలమ్మగారిని చూస్తే జాలీ కలుగుతున్నది. ఇంతకూ నాకు అసలు సంగతి ఏమిటో తెలియక "అయితే" పిన్నిగారూ, ఏమిటా పిచ్చిమాటలు, ఎల్లాంటివి? అన్నాను.
ఒక లాంటి వేమిటి నాయనా, చిత్రచిత్రాలుగా మాట్లాడుతున్నారు, అన్నది ఆవిడ.
"ఎవరినైనా తిడతారా, ఏమిటీ సంగతి?" అని మళ్ళీ అడిగానేను.
"తిట్టటమే కానీ, ఎల్లాగయినా అవి పిచ్చిమాటలు మటుకు అవును. మనబోటి సంసారుల కొంపల్లో అనుకునే మాటలుకావు" అంటూ ఆ ముసలమ్మ గారు కళ్ళను పమిట చెంగుతో అద్దుకొంది.
"అది గాదండీ పిన్నిగారూ, ఆయన అన్న మాటలు ఒకటి రెండు చెప్పండి. సంగతేమిటో తెలుస్తుంది" అన్నాను నేను.
"చెప్పండి బామ్మగారూ, చెప్పండి, సంగతేమిటో తెలియొద్దూ! ఆయనకు,విరుగుడు మంత్రం వేయటానికైనా" అన్నది.
"చెప్పాలిసిందేనా కాంతమ్మ తల్లీ! ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్లైంది. నాకర్మం కాలితే నా నోటితోనే అనాలిసొచ్చింది ఆ మాటలు!" అంది ఆవిడ మా ఆవిడతో_ఆ ముసలి కళ్ళలోనుంచి రెండు కన్నీటి చుక్కలు రాలినై.
మా తల్లిలాంటి మనిషి అల్లాగ విచారపడడం చూచి నేనూ ఎంతో కష్టపడ్డాను. అసలు ఆమె కొచ్చిన కష్టం ఏమిటో నాకు బోధపడలేదు. ఏం జెపుతుందో అని ఆ వృద్దురాలివంక చూస్తూ నిలుచు న్నాను.
ఆవిడా కళ్ళ నీళ్ళు తుడుచుకొని రుద్ధకంఠంతో ఇల్లా అన్నది. "నా బతుకంతా కడిగిపోస్తున్నారు నాయనా నా ముఖం...చంద్రుడిలాగ ఉంటున్నదని-" అని ఆవిడ దుఃఖం ఆపుకోలేక భొళ్ళున ఏడ్చింది.
దుఃఖం కొంచెం ఆపుకొని ఇల్లాగ అన్నది మళ్ళీ, జాలిగా చూస్తూ_"నాగొంతు పట్టుకుంచారు నాయినా...
పట్టుకునీ నీ గళం శంఖంలాగ ఉన్నదీ అంటారు, నా గొంతు కొయ్య! ఇదీ వరస ఇల్లా అయింది నా బ్రతుకు" అంటూ ఆ అవ్వగారు మళ్ళీ దుఃఖ పడ్డది.
నేను చెప్పిన నసీహత్ కు యిది ఫలితం కదా అని అప్పటికి నాకు తెలిసొచ్చింది. నిజానికి నవ్వవలసిన విషయమే. కాని ఆమెస్థితికి జూచి మేము యిద్దరం కూడా నవ్వలేక పోయినాము. మా ఉభయులకూ ఆవిడ యందు జాలి కలిగింది. బిక్క ముఖాలతో నుంచున్నాం.
పిన్నిగారు తలుపు దగ్గరే ఒక మూలకు ఒత్తిగిలి "తెలిసిందా నాయినా, ఇదీ వరస, ఇంకా, ఇంకా చందాలపు మాటలు అంటారు బాబూ! కొడుకు లాంటి వాడవు కాబట్టి చెపుతున్నాను. నా జుత్తుషా చమరీ వాలాల్లాగో, ఏదో నా పిండం, అల్లా ఉన్న దట!" అన్నది. ఆ తరువాత ఒక క్షణం ఆమె మాట్లాడలేక పోయింది. నేను ఆవిడ దుఃఖం చూడలేక అన్నానూ_"సరేలెండి ఎందుకూ ఇహ తెలిసింది."
నా మాటకు అడ్డొచ్చి ఆవిడ మళ్ళీ అన్నదీ_"చెపుతా, చెపుతా నాయినా. అంతా వినుమరీ, నన్ను ఎగాదిగా చూస్తారు. పోనీ అని ఊరుకుంటా, అయిందా, మడికట్టు కట్టుకున్నా సరే వచ్చి ముట్టుకుంటారు, ముట్టుకుని నీ శరీరం శిరీష కోమలమే అంటారు, నన్ను తగలెయ్య!"
ఆ తరువాత రెండు నిమిషాలదాకా ఆవిడ కంఠం పెగలలేదు, మేము ముగ్గురం కూడా నిశ్శబ్దంగా నంచున్నాము. కాసేపటికి ఆవిడ బుజంమీద చెయ్యివేసి "కాంతమ్మతల్లీ నేను చెప్పలేను ఆ మాటలన్నీ నన్ను బట్టుకుని ఇల్లాంటి మాటలు అంటూ ఉంటే నిలువుగా నీరైపోతున్నాను. కాంతమ్మతల్లీ, ముప్పై ఏళ్ళు సుఖంగా కాపరం చేశాను. ఎప్పుడూ ఇల్లాంటి పిచ్చి మాటలు ఆయన అనగా నేవినలేదు" అని చెప్పుకొన్నది. చివరకు మళ్ళీ అన్నది_ఏం తల్లీ, ఎవరో కిరస్తానీలూ అప్రాచ్యులూ అనుకుంటారటగా అల్లాగ! ఏమోలే ఎల్లా ఏడిస్తే మన కెందుకు ? మా గతి ఇల్లా అయినది గదా?" అని దుఃఖ పడ్డది ఆవిడ.
