Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 18


    ఆయనకు నాయందు విశ్వాసము పూర్తిగా ఉంది. నేను చెప్పినట్లు ప్రవర్తించటానికి ఆయన నిశ్చయించుకోనూ నిశ్చయించుకొన్నాడు. కాని "పొగడటం నాకు అలవాటూ లేదు, తెలియనూ తెలియదు, మరి ఏమిటండీ కీలకం?" అని ఆయన నిట్టూర్పు విడిచాడు.

    "తెలియటాని కేముందండీ? చూశారూ ఆవిడ పేరే మన్నారూ?" అన్నాను.

    "చంద్రమ్మగారూ" అన్నాడు.

    "అయితే...మీరు ఆమెను చంద్రా అని....పిలుస్తారా?"

    ఎబ్బే, అసలు పేరుపెట్టి పిలవనండి."

    "అవును లెండి. పేరుతో పిలవకూడదు కాబట్టి, జటాజూట శిరోమణీ అని పిలవండి,"

    "చిత్తం"

    "పిల్చీ అపళంగా పొగిడేసెయ్యండి. ముందు ముఖం తీసుకోండి. నీ ముఖారవింద అవలోకి తాపేక్ష..."

    "ఉండండి_ఉండండి, లాభం లేదు. కాస్త తగ్గుస్థాయిలో ఉండాలె. రాసుకోమని సెలవా?"

    "ఆఁహా! పోనీ, ఇల్లాగ అనండి, "నీ శరీరం పదారువాన్నె పసిమితో మిస_మిసలాడుతూ ఉంది. నీ మధురాధరం బింబ ఫలారుణిమను సేకరించికొన్నది. నీ నాసికాపుటాలు. నువ్వు పువ్వులను పోలియున్నవి. తెలిసిందా? యేమంటారు? ఈ ధోరణిలో వెళ్ళిపోండి. ఆమె సౌదర్యాన్ని వర్ణించటానికి మీకు మాటలు దొరక్కపోతే  ఏ మనుచరిత్రో, పారిజాతాపహరణమో తిరగెయ్యండి" అని సలహా చెప్పాను.

    నా మాటలన్నీ విని బిక్కముఖంతో ఆయన సెలవు అని వెళ్ళిపోయినాడు.

                                                                          2

    ఆయన మేడమెట్లు దిగి వెళ్ళిపోవటంతోనే మా కాంతం వచ్చినా ఎదట నిలబడి చురచురాచూస్తూ "పాపం, పెద్దవాడ్ని పట్టుకొని ఏమిటా వేళాకోళం?" అన్నది. నిజానికి ఆయనను వేళాకోళం చేయాలని నాకు ఏకోశానా లేదు నేను సిన్ సియర్ గానే చెప్పాను.

    "లేదు కాంతం! నేను వెక్కిరింతకూ, వేళాకోళానికీ అన్న మాటలు కావు అవి, అట్లా ప్రవర్తిస్తే గృహకలహాలు ఎప్పుడూ ఉండవని నా నమ్మకం. నేను అల్లాగ ప్రవర్తిస్తున్నానా...నేజేస్తున్న పనినే ఇంకొకర్ని చేయమన్నాను, ఇందులో నేను ఒకరిని ఫూల్ చేసిందెక్కడా?" అన్నాను.

    "అయితే మీరు చేసే పిచ్చి చేష్ట లన్నింటినీ అందరినీ చేయమంటారేం ఖర్మం! నేనింకా భరించి ఊరుకొంటున్నాగాని ఏ ఇల్లాలు ఊరుకొంటుందండీ" అంటూ ఆమె నవ్వసాగింది.

    "నీవు పొరపడు తున్నావు. భర్త అల్లాగ ప్రవర్తించడము భార్య అయిన ప్రతి స్త్రీకి యిష్టమే. ఇప్పుడు, నెజెప్పినదంతా కూడా అనుభవంమీద ఆధారపడి వుంది. అంతే కాకుండా ఒప్పుకొన్నదే, పొగిడితే ఎంత వాడైనా మెత్తపడతాడు, ఇక ఆడదానిమాట చెప్పనక్కర్లేదు. ఏమంటావు?"

    కాంతం ఏమీ మాట్లాడలేదు. ఆమెగారికి నా మాటలయందు ఏమీ విశ్వాస మున్నట్లు కనపడలేదు. అందుకని మళ్ళీ అన్నాను..."నీకు తెలియదు. చాలా పరమరహస్యాలను ఆయనకు బోధించాను. చూస్తావుగా, ఇంకో వారం రోజులకు ఆయన మళ్ళీ నాదగ్గరకొచ్చి బాబూ మీదయవల్ల నా కస్టాలు గట్టెక్కినై, మా భార్యాభర్తల మద్య పోట్లాటలు అంతరించినై, స్వర్గసౌఖ్యం అనుభవిస్తున్నాము. అంటూ చెప్పకపోతేనూ" అన్నాను గర్వంగా.

    "అయ్యో! అయ్యో!" అంటూ మా ఆవిడ మూతీ ముక్కూ విరిచింది పతాకహస్తాన్ని అధో ముఖంగా పెట్టి అటూ_ఇటూ ఆడిస్తూ,

    ఆవిడ అల్లాగ అన్నా నా మటుకు తృప్తిగానే ఉంది. నిజానికి నేను ఏం జేశానూ! భార్యను కొట్టమనలేదు. తిట్టమనలేదు, భార్యను ముద్దెట్టుకోమన్నాను. ఇందులో తప్పు ఏమిటో నాకు తోచలేదు. అయినా ఆవిడ అల్లాగ విరుపుగా మాట్లాడటం నాకు కష్ట మేసింది.

    అందుకని కాంతాన్ని పిలిచి మళ్ళీ అన్నానూ "చూడూ, నే చెప్పిందాంట్లో తప్పు ఏమీలేదు. తప్పు అని ఎవరు అంటారో అనమను. నీవు ఒక్క దానివి బయలుదేరావు ఇవి పిచ్చి చేష్టలని చెప్పటానికి అదీగాక ఇవి నీకు తెలియని విషయాలు. వీటిని సైకలాజికల్ ఎక్స్ పెరిమెంట్స్ అంటారు. మనస్సులో అద్భుతమైన మార్పులు వస్తవి" అని ఆవిడకు నా మనస్థితిని విపులంగా చెప్పాను.

    అప్పటికి ఆవిడ కేమాత్రం నమ్మకం కలుగలేదు గాని నేను మాత్రం, ఒక్క కుటుంబాన్ని గృహచ్చిద్రవంకంలో నుంచి పై కెత్తగలిగాననీ, నరకసదృశ్యమైన ఒక ప్రదేశాన్ని స్వర్గ ఖండంగా మార్చగలిగాననీ, ఒక దంపతి పూజ చేయగలిగాననీ, ఒక జోడు ఆత్మలకు తృప్తినీ, ఆనందాన్నీ ఇయ్యగలిగాననీ వాలో నేను ఉప్పొంగి పోయినాను.

    ఆయన మళ్ళీ వచ్చి, తాను నేజెప్పినట్లు ప్రవర్తించిన మీదట తన భార్యలో కలిగిన అద్భుతమైన మార్పును గూర్చి నాకు చెప్పి కృతజ్ఞతతో నమస్కరిస్తాడని నాకు ఘట్టి నమ్మకం. కంటక పరివృతమైన తన జీవితపథము ఎట్లా మృదుమనోహర కుసుమ విరాజితమైందో, ఇతః పూర్వం అపశ్రుతి రాగ కఠోరమైన వృద్ధదంపతుల జీవితరాగం ఇప్పుడు ఎల్లాగ మనోహరైకి, శ్రుతిని మేళవించిందో, వికల శిలాశకల భయంకరమైన వారి కఠిన జీవితశయ్య ఏ రీతిని మృదుమనోహర సుమశయ్య అయిందో, కాకఝాంకారవవ్యాకులమయిన ఘోర జీవిత కాంతారము ఎంత చిత్రంగా, శుకపిక కోకిలారవసంద నోద్యానంగా మారిందో, ఝంఝామారుతోద్దూతోత్తుంగ తరంగములచే చీకాకుపడిన తన సంసారసాగరం ఎల్లాగ వైకుంఠ వాసావాసవటపయః శయ్యా పయః పయోధిగా మారిందో ఆయన నోటితో ఆయనే చెపుతూవుంటే వినాలని నేను కుతూహల పడ్డాను.

    అందుకని ఆరోజు సాయంత్రం స్కూలు నుంచి రావటంతోనే "ఏం కాంతం, ఆయనేమన్నా వచ్చాడా" అనేవాడ్ని ఆమెగారు ముక్కువిరిచి "ఇంకా రావలసిందే" అంటూ వెక్కిరించేది.

                                         3

    ఇల్లాగ నాలుగురోజులు గడిచినై. అయిదోరోజున ప్రొద్దున్నే కాంతం నా దగ్గరకొచ్చి "మీకోసం ఎవరో అవ్వగారు వచ్చా" రంటూ నన్ను నిద్రలేపింది. నేను కళ్ళు నలుపుకొంటూ లేచి క్రింది కెళ్ళాను. హాల్లో నుంచి వంటింటికి పోయే గుమ్మంలో నుంచుని వుంది ఒకావిడ.

    యాభై యేండ్ల వయసులో వున్న మనిషిలాగా కనిపించింది ఆవిడ, శరీరం దబ్బపండుఛాయ, ముఖాన కానీ డబ్బంత కుంకపుబొట్టుంది. మామిడిచిగురు జరీచీర కట్టుకొంది. కొప్పులో మందారపువ్వు వుంది కొద్దిగా, ముఖ్యముగా ముఖంపైన నిరసింది. నలబై ఏండ్ల క్రింద నన్ను భూమి మీద పడేసి వెళ్ళిపోయిన మా అమ్మే మళ్ళీ మా ఇంటి కొచ్చినట్లుంది. లోపల ఈ మాతృమూర్తికి నమస్కరిస్తూ నిలుచున్నాను.

    "ఈ ముసలమ్మగారే మీకోసం వచ్చారండీ" అన్నది కాంతం, ఏమండీ పిన్నిగారూ" అన్నా నేను ఆమె నన్ను జూచి "ఏం నాయనా, నువ్వేనా మా కాంతం మొగుడివీ" అంది.

    "నేనేనండీ" అన్నాను నవ్వుతూ.

    "ఏం నాయనా, నీవు...మా ఆయనకేదో ఉపదేశం చేశావు కాదూ?" అన్నది ఆవిడ.

    నేనేమిటి! ఉపదేశం చేయటమేమిటి! మీరు...నేను ఎవరని భ్రమపడుతున్నారోనూ" అన్నాను. కాదు నాయనా నువ్వే చేశావు" అన్నది ఆవిడ  మళ్ళీనూ,


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS