Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 18

    సర్టిఫికేట్స్ పోగొట్టుకున్న సిటీబస్సు రూట్ లో మొత్తం మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిని తీసుకున్న వ్యక్తి సర్టిఫికెట్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలంటే ఏదో దాంట్లో ఇస్తాడు. అందుకే రామకృష్ణ గాజువాక వచ్చాడు. వాటిని తిరిగి సంపాదించాలనే పట్టుదల సడలటం లేదు.
    ఒక సందులో రంగు వెలసిన భవనంలో ఉందా స్టేషన్. రక్షకభట నిలయం అనే బోర్డు వ్రేలాడుతోంది దానికి. మాసిపోయిన వస్తువులా కనిపిస్తున్న ఆ స్టేషన్ లోకినడిచాడు రామకృష్ణ.
    "ఏం కావాలి?" అడిగాడు సెంట్రీ.
    "రైటర్ గారు ఉన్నారా?"
    "దేనికి?"
    "గతనెల పాత పోస్టాఫీసు నుండి గాజువాక వచ్చే సిటీ బస్సులో నా సర్టిఫికేట్లు పోయాయి. స్టేషనులో ఎవరైనా ఇచ్చారేమో కనుక్కోవడానికి వచ్చాను."
    అతను రైటర్ రూం చూపించాడు. యూనిఫాం వేసుకున్న ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని  టేబుల్ పైన రకరకాల కాగితాలు ఉన్నాయి. రామకృష్ణ తను వచ్చిన పని చెప్పాడు. సర్టిఫికెట్లు ఎవరూ తెచ్చి ఇవ్వలేదని చెప్పాడతను. అక్కడ నుంచి మల్కాపురం స్టేషన్ కి వెళ్ళాడు. తరువాత సింధియా పోలీస్ స్టేషన్ కి చివరగా వెళ్ళాడు. వాటిల్లో కూడా సర్టిఫికెట్లు దొరకలేదు. సింధియా సెంటర్ లో సిటీ బస్ ఎక్కాడు. జనం ఎక్కువగా ఉండటంతో వాళ్ళని తప్పించుకుని ముందుకి వెళ్ళాడు.
    "కళ్ళు కనిపించడం లేదా?" ఓ స్త్రీ గట్టిగా అరిచింది.
    రామకృష్ణ తన ప్రక్కనే నిలబడ్డ ఆమె వంక చూశాడు. ఆమె తన వంక తీవ్రంగా చూడటం గమనించాడు. ఆమెకు ముప్పై సంవత్సరాలు ఉంటుంది వయసు. తనవైపు ఎందుకలా చూస్తున్నదో అర్ధం కాలేదు అతనికి.
    "నిన్నే....కళ్ళు కనిపించడం లేదా?" రెట్టించి అడిగింది.
    బస్సులోని ప్రయాణీకులు మొత్తం వాళ్ళనే చూస్తున్నారు.
    "కనిపిస్తున్నాయి." చెప్పాడు రామకృష్ణ.
    "నీలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి...." పెట్రేగిపోయి అరిచింది.
    ఆమె ఎందుకు రెచ్చిపోతున్నదో తెలియక రామకృష్ణ విస్తుపోయాడు.
    "విషయం చెప్పకుండా పెద్దగా అరవడం దేనికి?" శాంతంగా అన్నాడు.
    "నీకు విషయం చెప్పాలా? బస్సులో ఆడవాళ్ళు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా శరీరానికి తగిలి విషయం చెప్పమంటావా?" అరుస్తున్నట్టు అడిగింది.
    "ఎంత దారుణం...." ఎవరో ప్రయాణీకుడు తన సానుభూతి వ్యక్తం చేశాడు.
    రామకృష్ణ మనసు తేలిక పడింది. ఆమె అంత గట్టిగా అరుస్తుంటే తనవల్ల పెద్ద తప్పు జరిగిపోయిందని కంగారుపడ్డాడు.
    "నేను కావాలని మీ శరీరానికి తగులుతూ లోపలకు వచ్చానని అనుకుంటున్నారు. అయితే అలా తగలటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటని మీ ఉద్దేశ్యం?" ఆమెను సూటిగా అడిగాడు.
    ఆమె ఏదో అనబోయింది. ఎందుచేతనో గొంతునుండి మాట బయటకు రాలేదు. విసురుగా తల తిప్పుకుంది. ప్రయాణీకుల నుంచి ముందుగా ఓ నవ్వు వినిపించింది. ఓ క్షణం తరువాత కొన్ని గొంతులు ఒకేసారి నవ్వాయి.
    వాళ్ళతో పాటు తను కూడా నవ్వింది కిటికీ ప్రక్క కూర్చున్న ఒక అమ్మాయి. ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది వయసు. అప్పుడే విరిసిన గులాబీలోని స్వచ్ఛత ఆమె మొహంలో కనిపిస్తోంది. చూడగానే ధనవతుల అమ్మాయి అనే భావం కలుగుతుంది. ఆమె రామకృష్ణ మొహం చూడటానికి ప్రయత్నించింది. అతను అటువైపు తిరిగి వుండటం వల్ల సాధ్యం కాలేదు. తల వెంట్రుకలు వెనక్కి దువ్వడం వల్ల మెడని తాకుతున్నాయి.
    రామకృష్ణ తన స్టాఫ్ తో బస్సు దిగాడు. ఆ అమ్మాయి ముందు నుంచి దిగి, అతను ఒక వీధివైపు వెళ్ళడం చూసి ఆశ్చర్యపడి తను కూడా అటే నడిచింది.
    ఆలోచించుకుని వెళుతున్న రామకృష్ణ చప్పున ఆగాడు. ఎడమప్రక్క ఒకామె బిగ్గరగా అరుస్తోంది. ఆమె సమీపంలో ఒక నేల బావి ఉంది.
    "అయ్యా! నా బిడ్డని రక్షించండి..."
    రామకృష్ణ అటువైపు పరుగెత్తాడు. బావి దగ్గర బిందె, చేద ఉన్నాయి. ఆమె అరుపులకు నలుగురూ ప్రోగయ్యారు.
    "ఎలా పడ్డాడు?" ఆమెను ప్రశ్నించాడు ఒకతను.
    బావిలోకి చూశాడు రామకృష్ణ. నీళ్ళ నుంచి బుడగలు వస్తున్నాయి. అతను వెనుకా ముందు చూడకుండా బావిలోకి దూకాడు. కొద్ది క్షణాల పాటు నీళ్ళు అల్లకల్లోలం అయ్యాయి. ఓ నిముషం తరువాత నాలుగు సంవత్సరాల పిల్లోడ్ని తీసుకుని నీటిపైకి తేలాడు.
    రామకృష్ణ వెనుక వచ్చిన అమ్మాయి బావి చుట్టూ  నిలబడ్డ వాళ్ళకి చెప్పింది.
    "వాళ్ళు పైకి రావడానికి నిచ్చెన ఒకటి తీసుకురండి...."
    ఒకతను పరుగెత్తుకెళ్ళి నిచ్చెన తెచ్చాడు. కొన్ని నిముషాల్లో రామకృష్ణ పిల్లాడిని తీసుకుని పైకి వచ్చి చెప్పాడు.
    "ఆసుపత్రికి తీసుకెళ్ళండి."
    దగ్గరలోని ఆసుపత్రి వైపు పరిగెత్తింది తల్లి బిడ్డని గుండెలమీద హత్తుకుని. నీళ్ళు కారుతున్న బట్టలతో తన రూమువైపు నడిచాడు రామకృష్ణ.
    ఆ యువతి మెరుస్తున్న కళ్ళతో అతనివైపు చూస్తుండిపోయింది.
                                                                *    *    *    *
    లోడింగ్, అన్ లోడింగ్ లేకపోవడంవల్ల నైట్ డ్యూటీకి వచ్చిన కూలీలు పూలి-మేక ఆడుతున్నారు. కొంతమంది వాళ్ళ చుట్టూ చేరి చూస్తున్నారు. తమ శ్రమ మర్చిపోయినట్టు వాళ్ళు ఆటలో మునిగిపోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది ఆట.
    కాస్త ఎడంగా గోడని ఆనుకుని కూర్చున్నాడు రామకృష్ణ అతని బుర్రలో ఆలోచనలు కదులుతున్నాయి.
    సర్టిఫికెట్లు పోలీస్ స్టేషన్ లో ఇవ్వలేదనే విషయం తెలుసుకోవడంతో వెదకడం పూర్తయింది. సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి మొహం లీలగా కూడా గుర్తు లేదు డిగ్రీ సర్టిఫికెట్స్ అయితే యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు. కాని హైస్కూలు నుండి పొందిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తిరిగి సంపాదించడం సాధ్యం కాదు.
    ఉదయం బస్సులో జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
    బస్సు జనంతో నిండినప్పుడు ఒకరికొకరు తగలకుండా నిలబడటం సాధ్యం కాదు. తన వెనుక బస్సు ఎక్కుతున్న వాళ్ళకి చోటివ్వాలనే స్పృహతో ముందుకెళ్ళాడు. నిజానికి అక్కడా ఆమె ఉందనే విషయం ఆమె అరిచేదాకా గమనించలేదు. చిన్న విషయం గురించి పెద్ద రాద్దాంతం చేసింది. కొందరి మనస్తత్వం అంతే. ఏమీ లేనిచోట ఏదో ఉన్నట్టు హడావిడి సృస్టిస్తారు.
    చదువుకునే రోజుల్లో అమ్మాయిలంటే ఆసక్తి చూపేవాడు కాదు. మిగతా విద్యార్ధుల ఆడపిల్లల గురించి ఎన్నో విషయాలు చెప్పుకునేవారు. రామకృష్ణ వాళ్ళతో చేరకుండా దూరంగా ఉండేవాడు. అందుకే అతన్ని మితబాషి అనే పేరుతో పిలిచేవారు.
    ఇంట్లో తల్లిలేని సమయంలో ప్రక్కింటి అమ్మాయి వచ్చి పలకరించేది. రామకృష్ణ మాట్లాడుతున్నాడా లేదా అనే విషయం పట్టించుకోకుండా ఎన్నో కబుర్లు చెప్పేది. తనకి తెలియకుండానే ఆమె కబుర్లు ఆసక్తిగా వినేవాడు. ఒక రోజు మాట్లాడుతూ హఠాత్తుగా ముందుకు జరిగి ముద్దు పెట్టుకుంది. ఆ రోజు రాత్రి అతనికి జ్వరం వచ్చింది. తరువాత వాళ్ళ మధ్య చనువు పెరిగింది. రోజూ అతన్ని కలుసుకోవడానికి వచ్చేది అతని తల్లి రాకముందే అక్కడ నుంచి వెళ్ళిపోయేది.
    ఆమె ఎక్కువగా ప్రేమ గురించి మాట్లాడేది.
    "ప్రేమించడం, ప్రేమించబడడం మనిషి జన్మ హక్కు. ప్రేమించడానికి కులం, మతం అడ్డు కాదు. మనకి నచ్చిన వాళ్ళని నిస్సందేహంగా ప్రేమించవచ్చు. ప్రేమ కోసం ఏమైనా చెయ్యగలగడమే ప్రేమకి మనమిచ్చే కానుక. ప్రేమ ఒకరి సొత్తు కాదు. ఎప్పటికీ తరిగిపోని యువతీ యువకుల ఉమ్మడి ఆస్తి ప్రేమ." ఆమె ఉద్వేగంగా చెప్పేది.
    ఆమె మాటలు శ్రద్దగా వినేవాడు రామకృష్ణ. ప్రేమ గురించి ఆమె చెప్పే విషయాలు అద్భుతంగా ఉండేవి. ఆమె వచ్చినప్పుడు కాలం పరిగెత్తేది. జీవితంలో ఆమెనే పెళ్ళి చేసుకోవాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు.
    ఒకరోజు కిరసనాయిలు దీపపు కాంతిలో నేలమీద కూర్చుని చదువుకొంటున్న రామకృష్ణ చిరపరిచితమైన అడుగుల చప్పుడుకి తలెత్తాడు. ఆమె నిలబడి ఉంది.
    "రావచ్చు....రేపు ఎగ్జామ్ ఉంది." అన్నాడు.
    ఆమె మౌనంగా అతని చేతికి ఒక కవరు ఇచ్చింది. కవరుపైన తనపేరు ఉండటం చూసి తెరిచి లోపలనుండి మందపాటి కార్డు బయటకు, తీశాడు. అది శుభలేఖ. వధూవరుల పేర్లు చదివాడు. పాలిపోయిన తన మొహం పైకెత్తి ఆమె వంక చూశాడు.
    క్షణాలు నెమ్మదిగా గడవసాగాయి.
    రామకృష్ణ తేరుకుని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS