Previous Page Next Page 
యువత నవత పేజి 18

 

     ఇక ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు సుధకు. ఈ గ్రామస్తులకు ముఖ్యంగా గృహిణులకు ఏదైనా ఒక మంచి పనిచెప్పి చేయించాలంటే టక్కున ఏదో వొక జవాబు చెప్పేస్తారు.

    "తోట వేయకపోతే వేయకపోయారు గానీ ఆ చెత్త డిటిక్టివ్ పుస్తకాలు చదవకండి. స్త్రీ సమాజంలో ఎక్కడ చిన్నచుపు చూడబడుతుంది?" తన హక్కులేమిటి? తను ఎక్కడ అన్యాయం చేయబడుతూంది? తను ఎక్కడ దోపిడీకి గురి అవుతూంది? అన్న చైతన్యాన్ని కలిగించని పుస్తకాలు చదవడం అనవసరమంటాను! ఈ డిటెక్టివ్ పుస్తకాలు కాలాన్ని హరించేవితప్ప మెదడుకి కాస్తకూడా వికాసం కలిగించవు."

      "మాకు ఇవే దొరుకుతాయి ఇక్కడ!"

    "మీరు మంచి పుస్తకాలు చదవాలనే అనుకొంటే మీరు పదిమంది, ఇరవై మంది కలిపి వొక మహిళా మండలిగా ఏర్పడింది మంచి లైబ్రరీ కావాలని మీ సర్పంచ్ ని డిమాండ్ చేయండి! గవర్నమెంటు కొంత ఇస్తుంది. మీరు కొంత వేసుకోండి! వొక లైబ్రరీ తెచ్చుకోండి ఊరికి! అంతేకాని, ఏ చెత్త అంటే ఆ చెత్త చదవొద్దండి. మనషికి చదువు రావడం అనేది వొక గొప్పవరం అనుకొంటే ఇలాంటి చెత్త పుస్తకాలను చదివి ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు."

    సుధ ఎన్నో విధాలుగా చెప్పి చివరికి వొక మహిళా మండలి ఏర్పాటు చేయగలిగింది.

     ఆరోజు మహిళామండలి ప్రారంభోత్సవం.

    సత్యవతి మహిళామండలి కోసం యిచ్చిన గదికి రంగుకాగితాలతో అలంకరించారు. దుర్గాబాయి దేశ్ ముఖ్, ఇందిరాగాంధీ చిత్రపటాలు గోడలకి తగిలించారు. గదిలో, గది బయటా చక్కటి ముగ్గులు వేశారు. ఆ ఊరి సర్పంచ్ భార్యతో రిబ్బను కట్ చేయించి అందరికీ బిస్ కెట్లు టీలు ఇచ్చారు.

     ఈ సందర్భంగా చిన్న ఉపన్యాసం ఇచ్చింది సుధ.

    "మహిళా మండలి అంటే కుట్లు, కోళ్లు, పందుల పెంపకం- వీటి వరకే పరిమితం కాదని ఇదివరకు చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను.    

    చాలామంది స్త్రీలకు ఆలోచించడం తెలియదు. ఉదాహరణకు. మగడు రోజూ తాగొచ్చి భార్యను కొడుతున్నాడనుకోండి! ఆభార్య ఏమనుకొంటుంది? నా ఖర్మకాలి ఈ తాగుబోతు పాలబడ్డాను. నా బతుకింతే! దెబ్బలతో తెల్లారి పోవలసిందే అనుకొని, రోజూ దెబ్బలు తినడానికి ఓపిక కూడదీసుకొంటుందేగాని, వీడు రోజూ ఎందుకు తాగుతాడు! తాగకుండా కట్టుదిట్టంచేద్దాం! అలా కట్టుబడనివాడయితే  వాడిని వదిలేసి నా దారిన నేను వెళ్లిపోయి ఈ దెబ్బలు లేని జీవితం, హాయి అయిన జీవితం గడుపుదామని మాత్రం ఆలోచించదు. ఎందుకంటే ఒకసారి కట్టుకొన్న మగడిని వదిలేయడానికి మన సంప్రదాయం ఒప్పుకోదు సంప్రదాయం, సమాజం అనుకొంటుందేగాని అసలు యీ సంప్రదాయం యెవరు సృష్టించారు? నా జీవితం యీ సంప్రదాయానికి ఎందుకు బలిపెట్టాలి? రోజూ మగడిచేతిలో తన్నులు తింటున్న నా గురించి ఈ సమాజం ఏం చేసింది?  ఈ సంప్రదాయం ఏం ఆదుకొంది! నా దారిన నేను వెడితే యీ సమాజానికి అనే హక్కు ఎక్కడిది? ఇలా ఆలోచించడం నేర్చుకోలేదన్నమాట! అంటే మగళ్లని వదిలిపెట్టెయ్యడమే స్త్రీ చైతన్యమని చెప్పడం లేదు! రోజూ ఒక మగవాడి చేతిలో నీచంగా తన్నులుతింటూ ఆత్మ గౌరవంలేని బ్రతుకు బ్రతకవద్దనే నేను చెప్పేది!

    "ప్రకృతి స్త్రీని బలహీనురాలినిగా సృష్టించింది. ఈ బలహీనత కారణంగానే పురుషుడు ఆమెమీద ఆధిపత్యం వహించి ఆమెను దోచుకో గలుగుతున్నాడు. వంటకూ, పంటకూ శాశ్వతంగా కొనుక్కున్న బానిసగా చేస్తున్నాడు! "ఇంటికి దీపం ఇల్లాలు" , "ఇల్లుని చూసి ఇల్లనే చెరసాలనుండి  బయట పడకుండా ఇల్లు దేవాలయమన్నాడు, స్వర్గసీమ అన్నాడు. నోములు, వ్రతాలు అనే సాలెగూడు అల్లాడు, పసుపు కుంకుమలే జీవిత పరమార్దమన్నాడు. మొత్తానికి ఆమెను నూతిలో కప్పలా జీవించేట్టు చేశాడు.

     నూతిలో కప్పల్లా యింకా ఎంతకాలమంటారు?

    ఈ అజ్ఞానాంధకారంలో యింకా ఎంతకాలముంటారు?

    ఈ  అంధకారం చీల్చుకొని  బయటకి రండి! విద్య అనే కరదీపిక పట్టుకోండి. చదువురాని వాళ్లందరి కోసం ప్రభుత్వం అనియత విజ్య కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాలు నడుపుతోంది! ప్రభుత్వ పథకాలను మీరు సక్రమంగా ఉపయోగించుకోండి.

    మీ కోసం గవర్నమెంట్ చవక ధరల దుకాణాలు నడుపుతూంది. కాని, అందులోని వస్తువులు మీకు సక్రమంగా పంపిణీకావు! చక్కెర,గోధుమలు, బియ్యం, నూనె బ్లాక్ లోకి వెళ్లిపోతుంటాయి. ఈ అన్యాయం గురించి మీకు తెలుసు! వీధి అరుగులమీద కూర్చొని చర్చించుకొంటూనే వుంటారు వీధి అరుగు చర్చలవల్ల  ఈ అన్యాయం అరికట్టబడదు."

    "చూడడానికి గడ్డిపరక! గడ్డిపరకలు కొన్ని కలిపి పేనితే మోకు అవుతుంది. ఆ మోకు ఏనుగునుకూడా బందించగలగిన  శక్తి కలదౌతుంది. ఆ మోకుతో సమానమయింది మహిళామండలి! ఊళ్ళో జరిగే ఏ అన్యాయమయినా ప్రతిఘటించవచ్చు మీ మహిళామండలి ద్వారా మీకు కలిగే ఏ అసౌకర్యమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు.

    మహిళామండలి అని పెట్టుకోగానే సరికాదు. మీలో ఐక్యత వుండాలి. పట్టుదల వుండాలి. ఐక్యతగా సాధించుకోవాలి! ఎవరికి వాళ్లు ఆత్మవికాసం పెంపొందించుకోవాలి...." ఇలా సాగింది సుధ ఉపన్యాసం.

    సుధ మాటలు యెంతవరకు అర్దమయాయోగాని, సభ్యులందరి ముఖాల్లో ఒక విభ్రాంతి నిండిపోయింది.    

    "శాన మంచిగ చెప్పినవ్, దొరసానీ? మాకిట్ల చెప్పేటోళ్లు లేకనే ఇట్ల చీకట్ల వున్నం! ఇదే బతుకనుకొంటున్నం!" అంది ఒక వయసు మళ్లినామె.    

    "మీరు వినాలేకాని ఎన్నిమాటలయినా చెప్పగలను?" అంది సుధ తృప్తిగా.

                                                      *    *    *    *    *

    ఆగస్ట్ పదిహేను వారంరోజుల్లో వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS